Thursday, March 10, 2011

Prof RVR Chandrasekhar Rao's Philosophy of History (Charitra Tatvam) in Telugu

చరిత్ర తత్వం
(Philosophy of History)

- ప్రొఫెసర్ ఆర్. వి. ఆర్. చంద్రశేఖర రావు.

చరిత్ర అనేది చాల చిత్రమైన విషయం. కాలప్రవాహంతో కూడుకుని వుంటుందికాబట్టి చరిత్ర - కాలం ఒకదానితో ఒకటి ముడిపడి వున్నాయని, ఈ ప్రపంచంలో ప్రతి విషయానికీ చరిత్ర వుందనీ చెప్పవచ్చు. అయితే మానవుని మనుగడనుమాత్రమే చరిత్రగా భావించడం జరిగింది. మానవుని మనుగడలో ఇతర జీవరాసులతోనూ, భౌతిక వస్తువులతోనూ సంపర్కం సహజం. ఈ సంపర్కాల కారణంగా సంభవించే పెను పరిణామాలు, మార్పులు-చేర్పులనే చరిత్రగా భావిస్తాము.

పరిణామ గమనాన్ని గ్రహించి, దాన్ని అవగాహన చేసుకొని, సంగ్రహించుకొనడంతోనే చరిత్రను సృష్టించడమైనదని చెప్పవచ్చు. ఇలాంటి గ్రహింపు, అవగాహన, విశ్లేషణలు ఒక్క మానవునికే సాధ్యం. మేధాశక్తి మానవేతర జీవకోటిలో వుందా, లేదా వుంటే ఎంతమట్టుకు వుంది అనే విషయం ఇంకా వివాదాస్పదమే. కొన్ని ఇతర జంతువుల్లో అంతో ఇంతో కొంత మేధాశక్తి వుందని అంగీకరించినా, ప్రస్తుత పరిజ్ఞానాన్నిబట్టి మానవునికున్న తెలివితేటలు ఇతర జంతువులకు లేవనే నిశ్చయమైంది. ఇక ఇతర గ్రహాల్లో ప్రాణికోటి వుందా, వుంటే వాటి మేధాశక్తి మానవమేధాశక్తిని మించి వుండవచ్చా అనే విషయమై కొంతకాలంగా ఖగోళశాస్త్ర పరిశోధనలు, ఊహాగానాలు జరుగుతూనే వున్నాయి. కాని అవి ఊహాగానాలుగానే చలామణీ అవుతున్నాయి. అయితే ఇప్పటికి ఇదమిత్తమని భావింపబడుతున్న పరిజ్ఞాన పరిమితుల్లోమట్టుకు మానవ మేధాశక్తిని మించిన శక్తి లేదనే చెప్పవచ్చు. ఈ సందర్భంలో దైవం, దైవశక్తుల ప్రసక్తిని మన విశ్లేషణ పరిథిలోనికి తీసుకురావడం సమంజసం కాదు. కాదూ కూడదంటే, అభూతమైన దైవశక్తి ప్రసాదమే మానవ మేధాశక్తి అని అనుకుంటూ, మానవీయ పరిథిలో ఆధ్యాత్మిక ప్రేరణను సమన్వయం గావించుకోవడం సాధ్యమే. అయితే, నాస్తికులూ, భౌతికవాదులూ ఈ ప్రేరణ అనేదే అసత్యమనీ, అజ్ఞానంవల్ల వచ్చిన ఊహేననీ భావిస్తారనుకోండి.

మానవుడు తన మనుగడ క్రమంలో చరిత్రను సృష్టించుకుంటాడని చెప్పవచ్చు. పైన చెప్పినట్లు తన అనుభవాలను తన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలతోసహా కలిగిన అనుభవాలను క్రమబద్ధంగా అవగాహన చేసుకొనడంతోనే చరిత్ర సృష్టి జరుగుతుంది. ఈ విశాల దృక్పథంప్రకారం ప్రతి మానవ సమాజానికీ దానిదంటూ ఒక చరిత్ర వుండే తీరుతుంది. అంటే అన్ని సమాజాలకూ సహజసిద్ధంగా కాలగమనంతోబాటే చరిత్ర నడుస్తూనే వుంటుందన్న మాట. కాని చరిత్ర రచన సాంప్రదాయంలో కొన్ని ప్రత్యేక పోకడలు చరిత్ర బోధనాక్రమంలో సంక్రమించిన పూర్వ నిశ్చితాభిప్రాయాల (prejudices) తో యుక్తంగా కనిపిస్తాయి. వాటిని స్థూలంగా ఇలా విశదీకరించవచ్చు:

1. చరిత్ర అనేది హెచ్చుమేరకు నాగరికతనూ, సంస్కృతినీ సంతరించుకున్న మానవ సమాజాలకే వుంటుందిగానీ, అనాగరిక సమాజాలకు వుండదని.

2. మానవ సంబంధాల నడుమ జరిగే వ్యవహారాల వర్ణన, విశ్లేషణలకే చరిత్ర రచన పరిమితం అయివుంటుందనేది [అలా అయివుండాలనేది] ఒక పోకడ. ఈ పోకడనుండే జనించిన ఒక కొత్త పోకడప్రకృతిపై మానవుని ప్రభావం, అలాగే మానవునిపై ప్రకృతి ప్రభావాల, అంటే ప్రకృతికీ, మానవులకూ నడుమ పరస్పర ప్రభావాలు, ప్రతిచర్యల గురించిన వర్ణన, విశ్లేషణలుకూడ చరిత్ర రచనలో చోటుచేసుకొనడం.

3. పైన చెప్పిన ప్రకృతికీ, మనిషికీ నడుమ పరస్పర సంబంధాల వర్ణన, విశ్లేషణల నేపథ్యంలో అసలు ప్రకృతిచరిత్ర గురించే వక్కాణింపు పెట్టే పోకడ. ఇలా ప్రకృతిచరిత్రపై దృష్టి సారించడం ఆధునిక యుగంలోనే హెచ్చుగా సంభవిస్తున్నది. ఉదాహరణకు, విజ్ఞానశాస్త్ర చరిత్ర, అలాగే అందులో భాగంగా వేర్వేరు విజ్ఞానశాస్త్ర తరగతుల [భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, భూగర్భవిజ్ఞానం, ఖగోళశాస్త్రం వగైరాల] చరిత్రలు రాయబడుతున్నాయి. తోడ్తోడుగా వివిధ సామాజిక శాస్త్రాల చరిత్రలుకూడ చోటు చేసుకుంటున్నాయి.

4. యథాతథ ఘటనాచరిత్ర రచనావిధానం (historiography), అంతర్నిహిత ప్రభావాలు, తత్వవిచారణల వెలుగులో చరిత్ర రచనా విధానం టూకీగా చరిత్ర తత్వచింతనావిధానం (philosophy of history) అనే రెండు పోకడల నడుమ ఘర్షణ. మొదటి విధానానికి ప్రత్యక్ష ఆధారాలు, సాక్ష్యాల సేకరణ, వర్ణనలు అత్యావశ్యకం కాబట్టి, వాటి పునాదిపై నెలకొన్న ఆ పోకడే శాస్త్రీయమైందనీ, కాగా చరిత్ర తత్వచింతన అనేది జరిగిన పరిణామాల వ్యక్తిమానసిక శల్యపరీక్ష ఆధారంగా జరిగేదికాబట్టి ఫక్తు ఊహాత్మకమైందనీ విమర్శలు లేకపోలేవు.

మరిప్పుడు పై పోకడలనుగురించి కొంత వివరంగా విశ్లేషించుదాం:

1. ఉన్నత నాగరికతా ప్రమాణాలనందుకొన్న సమాజాలకే చరిత్రను వర్తింపజేయడం యిదివరలో పరిపాటే కాని ఇప్పుడా వరుసకు కాలం చెల్లింది. నాగరిక, అనాగరిక సమాజాలనే తేడా చూపడాన్నే ఇప్పుడు విజ్ఞులు అంగీకరించరు. ఇలాంటి విచక్షణ చాలవరకు జాత్యహంకారభూయిష్టమని ఆధునికులు గర్హిస్తారు. ఈ విమర్శ సమంజసమైందే మరి.

అయినప్పటికీ, చరిత్ర రచనలో అనాగరిక సమాజాలను నిర్లక్ష్యం చేయడానికీ కొన్ని కారణాంశాలు లేకపోలేవు. చరిత్ర రచనకు లిఖిత ఆధారాలు, పటిష్టమైన సాక్ష్యాధారాలు అవసరం. ఇవేకాకుండా పురావస్తు సంపదల్ని పరిరక్షించుకోవడం, వాక్మయ పరిజ్ఞానంద్వారా చరిత్రను ఏదోవిధంగా సాంఘిక జ్ఞాపకాల సమాహారంలోంచి సేకరించడం చరిత్ర రచనకు ఎంతైనా అవసరం. అనాగరిక సమాజాల్లో యిలాంటి ఆధారాలు తక్కువ.

ఈ నాగరిక, అనాగరిక అంతరం చిరకాలంనుండీ సాగివచ్చిన దుస్సాంప్రదాయం. ఇతర సమాజాలను చిన్నచూపు చూడడం పురాతన నాగరిక సమాజాలవిషయంలోనూ పరిపాటే. ఉన్నత నాగరికతా స్థాయికి ఎదిగిన చైనీయులు ఇరుగుపొరుగు వారిని అత్యల్ప దృష్టితో చూచేవారు. అలాగే గ్రీకులు ఇతరుల్ని ‘barbarians’ (కిరాతులు - అనాగరికులు) అంటూ పరిహసించేవారు. మన భారత నాగరికులుకూడ ఇతరుల్నిలా బార్బేరియన్లని పిలవడం పరిపాటే. 'మ్లేచ్ఛులు' అంటూ దూషించడం భారతీయ భాషల్లో వాడుకే. ఖండాంతర వాసుల్నేకాక మనదేశంలోని గిరిజనుల్ని సైతం అనాగరికులుగా దూషించే సంప్రదాయం ఇప్పటికీ మన దేశ సమైక్యతకు అడ్డంకిగా నిలిచివుంది.

ఈ వివక్షా దృక్పథంకారణంగా ఆఫ్రికా, అమెరికా ఖండాల ఆదివాసుల్ని అనాగరికులుగా పరిగణించడం ఆధునికయగపు వలసవాద సామ్రాజ్యవాద మనుగడల్లో స్పష్టంగా చోటుచేసుకుంది. అయితే విశేషమేమంటే, ఆధునిక కాలంలోనే నాగరిక, ' అనాగరిక' సమాజాల మధ్య పరస్పర సంబంధాలు విస్తృతంగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా క్రీ.. 15 శతాబ్దాంతంనుండీ నాలుగు శతాబ్దాల కాలంపాటు పాశ్చాత్యుల నావికాయాత్రల మూలంగా పూర్వం ఎరుగని ఖండాలు, ప్రాంతాలను కనుగొనడం, ఆక్రమించడాల వల్ల, వలసవెళ్లడం, సామ్రాజ్యాలు స్థాపించడాలవల్ల నాగరిక, 'అనాగరిక' సమాజాలమధ్య సంబంధాలు ఏర్పడ్డాయి.[1] పాశ్చాత్యులూ యితరుల్ని హేయభావంతో చూచినా, భౌతికంగా దగ్గరకావడం, వ్యాపారవ్యవహారాలు జరపడాల కారణంగా క్రమంగా పరస్పర అవగాహనకు అవకాశాలు వచ్చాయి. పురాతన సమాజాల్ని హేయభావంతో చూస్తూకూడ ఈ పాశ్చాత్యులు అనాగరికులుగా భావించబడే ప్రజల సామాజిక విధానాలు, సాంప్రదాయాలను, ఆ సమాజాలలోని విలువల్నీ, న్యాయపర, ఆధ్యాత్మిక భావనల్నీ కొంతవరకైనా అర్థంచేసుకోవడం జరిగింది. పాశ్చాత్య ప్రజా సామాన్యంలో వీరిపట్ల చిన్నచూపులో మార్పు లేకపోవచ్చుగానీ, సానుభూతిగల కొందరు పాశ్చాత్య విజ్ఞానవేత్తలు, పరిపాలకులు, చరిత్రకారుల దృక్పథంలోనైతే ఈ ' అనాగరిక ' సమాజాల విషయంలో నూతన అవగాహన ఏర్పడింది.

సమాజాలు అన్నిటిలోనూ ఆధునిక యుగంలో, అంటే క్రీ.. 18 వ శతాబ్దినుండీ, క్రమంగా నాగరికతాభివృద్ధి జరుగుతున్నదనేది ఈ దృక్పథంలో ముఖ్యాంశం. తదనుగుణంగా ప్రగతి భావన (Idea of Progress) ప్రాబల్యం పెరిగింది. అందుమూలంగా నాగరిక, 'అనాగరిక' సమాజాల భావనాపరంపరల్లో అనేక మలుపులు, మార్పులు వచ్చాయికూడ.

20 శతాబ్దికి అసలు జాతివివక్షాభావనకే పూర్తిగా కాలం చెల్లింది. వలసవాద, సామ్రాజ్యవాద విధానాలకు ప్రజలు స్వస్తి చెప్పడంతో ఈ వివక్షాభావనలు దీటైన సవాలు నెదుర్కొన్నాయి. ఇదివరలో 'అనాగరికం' అని చిన్నచూపు చూడబడ్డ సమాజాలు సగర్వంగా తలయెత్తి కొత్త ఆత్మగౌరవంతో వాటి వాటి చరిత్రల్ని పునరావలోకనం, పునరవగాహనలు చేసుకొనడంతో, పాశ్చాత్యుల పూర్వనిశ్చిత దుర్భావనల్ని సవాలు చేయడంతో చరిత్ర రచనలో అంతదాకా అనుసరించిన విశ్లేషణా, వర్గీకరణా విధానాలు లోపభూయిష్టమని గ్రహించే విప్లవాత్మక పరిణామాలు సంభవించాయి.

దానితో చరిత్ర రచనలో ఒక నూతన అధ్యాయం సృష్టయింది. తమ పూర్వనిశ్చిత సంకుచిత భావనల్ని (prejudices) దూరం పెట్టి చరిత్ర రచనకు పూనుకోవాలనే నిర్బంధ విలక్షణ వైఖరి తప్పనిసరి అయింది. యథార్థపరిశీలన, నిష్పాక్షికతలు – objectivism – అత్యవసరమని గుర్తించడం జరిగింది.

చరిత్రాత్మక దృక్పథం వున్న [ఆ దృక్పథం] లేని సమాజాలనే భావన:

నాగరిక, అనాగరిక సమాజాలనే విభేదభావమేగాక చరిత్ర రచన విషయంలో ఇంకొక భావనకూడనాగరిక సమాజాల్లోసైతం చరిత్రరచనా సాంప్రదాయంలేని, అది వున్న సమాజాలనే భేదభావం కూడ చోటు చేసుకుంది. ఈ విషయమై భారతదేశాన్ని ప్రస్తావిస్తూ యిక్కడి సంప్రదాయంలో చరిత్రరచనకు ప్రాధాన్యం లేదనే విమర్శను పాశ్చాత్యులు చేసారు. మరి ఈ విమర్శ ఎంతవరకు సమర్థనీయమో కొంత విశ్లేషణ అవసరం.

నిజమే, ప్రాచీన భారత సమాజంలో ప్రస్తుతం మనమెరిగిన చరిత్ర రచన అంతగా కనబడదు. రాజరికం సాధారణ పాలనా వ్యవస్థగా వున్నప్పుడు రాజ్యాలమధ్య సంబంధాలు, యుద్ధాలు, ఒప్పందాల గురించి రాయడం అన్ని సమాజాల్లోనూ జరిగిన వ్యాసంగమే. అయితే భారత సాంప్రదాయంలో ఈ విధానంకూడ కనబడదు.[2] చరిత్ర రచన రూపంలోగానీ, సాహిత్యాలలోగానీ ఇది అరుదే. శాసనాలు మొదలైన సాక్ష్యాధారాలలో సైతం చరిత్రవివరాల కంటే రాజుల ప్రశంసలు, స్తుతి-పొగడ్తలే హెచ్చుగా కనబడతాయి. కళింగ యుద్ధానంతరం [మానసిక పరివర్తన పొందిన] అశోక చక్రవర్తి ఆర్యావర్తమంతా స్తూపాలలోనూ, స్తంభాలలోనూ చాటింపు చేసిన శాసన సంపుటిలోకూడా ఇంచుమించు ఈ ధోరణే గోచరిస్తుంది. ప్రజా బాహుళ్యానికి తనలో వచ్చిన మానసిక పరివర్తననూ, తన శోక తాపాన్నీ తెలియజేయడంలో యథార్థ చరిత్ర రచన కొంతమేరకు కనపడినా, ఈ తీరు ఆ తర్వాత కొనసాగకపోవడంకూడ గమనిస్తాము. వివిధ రాజుల విజయాల్ని అతిశయంగా శ్లాఘించడం, వాళ్ల గుణగణాల్ని గోరంతలు కొండంతలు చేసి పొగడడమే నాటి శాసనాలు, ఇతర సాహిత్యాధారాల సారాంశం. అందునా వీటిలో అనేకవాటిని తర్వాతి రాజులు, ముఖ్యంగా మహమ్మదీయ దురాక్రమణదారులు, స్వాధీనం చేసుకోవడమేగాక విధ్వంసాలకుకూడ ఒడిగట్టారు. కాని, అంతకు పూర్వపు హిందూ యుగంలోనైనా పురావస్తు పరిరక్షణ జరిగిన దాఖలాలేవీ కనబడవు.

అయితే, శిలాశాసనాలు, తామ్రపత్రాలలోనూ, సాహిత్యాలలోనూ యిలాంటి [పాలకులు, రాజులనుగురించిన] పొగడ్తల పరంపర వుండడం ఒక్క భారతీయ సాంప్రదాయానికే పరిమితమైందేమీ కాదు. పాశ్చాత్య సాంప్రదాయంలోసైతం యిది విరివిగా చోటు చేసుకున్నది. ఆధునిక చరిత్ర రచనకు నాంది పలికిన మాకియవెల్లీ, గుయిచార్డినీలలోకూడ ఇది స్పష్టంగా కనబడుతుంది. ఫ్రెంచి, ఇంగ్లీషు చరిత్రకారులలోకూడ ఈ సాంప్రదాయం పరిపాటే. కనుక ఇందుకుగాను భారత సాంప్రదాయాన్ని విమర్శించడం అసమంజసం.

అయితే హిందూ సాంప్రదాయంలో వున్న ఒక మతతాత్విక పర విశేషాన్నిగురించి ఇక్కడ ప్రస్తావించాలి. మానవుని ఉనికే బుద్బుద ప్రాయమనే భావన బహుశా చరిత్ర రచనకు అవాంతరమైందేమో!? భావి తరాలకోసమని వర్తమాన, భూతాల ప్రస్తావన తాత్విక చింతననూ, కర్మసిద్ధాంత ధోరణినీ ప్రోత్సహించి వుండక పోవచ్చునేమో. కారణాలేమైతేనేమి, ప్రాచీన భారత సమాజాలలో చరిత్ర రచనలాంటి ప్రక్రియలు అతి తక్కువేననడం సత్యదూరం కాదు.

ఈ విషయమై సమకాలీన చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు తలయెత్తడం సహజమే. పాశ్చాత్య భావాల ప్రభావంవల్లనే ఆధునిక చరిత్రకారులు భారతీయ చరిత్రాదృక్పథాన్ని చిన్నచూపు చూస్తున్నారని ప్రాచీన భారత సంస్కృతీ అభిమానుల వాదన. ఏమైతేనేం ఈ అంశం అతి వివాదాత్మకమైంది.

2. చరిత్ర మానవసంబంధాలకే పరిమితమనే పోకడ గురించి

చరిత్ర కాలభావనను పున: సృష్టిగావించడం అంటే ఒక్క మానవ సంబంధాలను చిత్రీకరించడంమాత్రమే కాదుగదా. కాని చరిత్ర రచనలో హెచ్చు మేరకు మానవ సంబంధాలకే ప్రాధాన్యం యివ్వడం, అందులోనూ రాజులమధ్య జరిగిన వ్యవహార బాంధవ్యాలకే పెద్దపీట వేయడం జరిగింది. ఈ పోకడనే రాజకీయ చరిత్రా సాంప్రదాయం (political history tradition) అంటారు.

ఈ పోకడ సమాజాలలో జరిగిన ఇతర అంశాలపై చూపు సారించలేదు. మానవ జీవనంలో సంభవించిన, సంభవిస్తూన్న అనేక ఇతర పోకడల్ని విసర్జించి, రాచరికపు భేషజాలపైనే మోజు చూపడం ఈ విధానంలో ముఖ్యలోపం. అందుకే మహాకవి శ్రీ శ్రీ ఈ పోకడను తనదైన శైలిలో " ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? " అంటూ దుయ్యబట్టారు.

సామాన్య ప్రజాజీవనాన్నీ, వారి అవసరాలు-అవస్థలనూ పరిగణనలోకి తీసుకోవడం, అందువల్ల క్రమంగా ప్రజాస్వామ్య భావనలు చాలవరకు పాదుకొనడంతో పై పోకడపై విమర్శలు మెండైనాయి; రాజకీయ చరిత్రకు గౌరవమర్యాదలు కొంతవరకు సన్నగిల్లాయి. ఐరోపీయ సాంప్రదాయంలో ఈ మార్పు హెచ్చుగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య చింతనా ప్రాబల్యంలో అక్కడ సాంఘిక చరిత్ర (social history) ప్రాధాన్యత సంతరించుకున్నది. విప్లవాత్మక ప్రజాస్వామ్య ధోరణులవల్ల అట్టడుగు సామాజిక వర్గాల స్థానిక పోరాటాల, ముఖ్యంగా భూస్వామ్య వర్గాలకూ, శ్రామిక వర్గాలకూ మధ్య జరిగిన పోరాటాల ప్రచ్ఛన్న చరిత్ర రచనకు అంకురార్పణ జరిగింది. దీన్నే subaltern history (అధోవర్గ చరిత్ర అనొచ్చేమో –subaltern అంటే సైన్యంలో కింది స్థాయిలో వుండే సైనికుడు అని అర్థం) అని పిలవడం, ఆ పేరు స్థిరపడి, ఈ పోకడ చరిత్ర రచనలో గౌరవస్థానం పొందగలగడం జరిగింది.

3. ఘటనాపర చరిత్రరచన (Historiography), చరిత్ర తత్వచింతన (Philosophy of History):

మొదటగా గ్రహించాల్సిందేమంటే భారతీయులకు చరిత్రపర భావన లేదనేది పాశ్చాత్య రచయితల ఊహే. బ్రిటిషు పాలన వచ్చిన తర్వాతనే భారత ప్రాచీన చరిత్ర క్రమంగా బయట పడిందన్న మాట వాస్తవమే. కొన్ని మరుగుపడిన పురాతన భాషలు, లిపులు తిరిగి వెలుగులోకి వచ్చాయి. ప్రాచీన గ్రంథాలు ఆంగ్లంలోకి తర్జుమా కాబడి తద్వారా ఆధునిక యుగానికి తెలియవచ్చాయి. పురావస్తు సంపదకూడ క్రమేపీ బహిర్గతమైంది. ఆంగ్లేయ ప్రాచ్యవిజ్ఞులు (British Orientalists) 18 శతాబ్దం చివరినుండీ 20 శతాబ్దారంభందాకా చేసిన కృషి ఎంతైనా శ్లాఘనీయమైందే. మాక్స్ముల్లర్ మహాశయుడు [మోక్షమూలుడు] అతి ప్రాచీన భారత తత్వచింతనా సాహిత్యాన్ని సేకరించి, ఆంగ్లంలో తర్జుమా చేసి/చేయించి మన తరాలవారికి అందించాడు. ఒక్క మాటలో, గత ప్రాచీన భారత చరిత్ర వైభవాన్ని క్రమబద్ధంగా ఆధునిక తరాలవారికి అందించింది పాశ్చాత్య రచయితలే.

పై కారణంగానే అసలు భారతీయ సాంప్రదాయంలోనే చరిత్రపర దృక్పథం లేదనే అభియోగం మోపబడింది. కాగా ముస్లిం యుగ చరిత్రకు కొంతమేరకు నిర్ధారిత రీతి వుంది. రాజవంశ పరంపరలు, ఆయా కాలాల పరిణామాలు, వాటివెనుకనున్న కారణాలను గురించి ఆనాటి ముస్లిం చరిత్రకారులు రచించారు. ఈ చరిత్ర రచన పోకడ ప్రాచీన హిందూయుగంలో అంతగా కనబడదు. అజ్ఞాత సమకాలీన చరిత్రలూ లేవు. ఉన్న ఆధారాలన్నీ ముఖ్యంగా శిలాశాసనాలు, తామ్రపత్రాల (epigraphical sources) కూ, నాణాల (numismatic sources) కూ పరిమితం. ఇక సాహిత్య ఆధారాల మాటకొస్తే, అవీ చాలవరకు అతిశయోక్తియుక్తంగానూ, రాజప్రశస్తికే ప్రాధాన్యత నిచ్చే రూపంలోనే వుండేవి. ఇంకా, ఎంత వెనక్కుపోతే, చరిత్ర అంత ఆధారరహితంగా అవుతుంది. ఇది ప్రపంచ మానవ చరిత్రకంతటికీ వర్తించే అంశమే అయినా, ప్రాచీన భారత చారిత్రక ఆధారాల విషయంలో ఈ లోపం మరింత హెచ్చుగా వుంది.

వేదాలు, ఉపనిషత్తులలోని తాత్విక జిజ్ఞాస ఎంత ఉత్కృష్టమైందైనా వాటిని చారిత్రక ఆధారాలుగా పరిగణించలేము. ఇక ఇతిహాసాలని పిలవబడినా, రామాయణ, మహాభారతాలు మనం నేడు ప్రస్తావిస్తున్నటువంటి ఇతిహాసాలు (చరిత్రలు) కావు. అయితే కొంత మేరకు పురాణాలుమాత్రం ప్రాచీన భారత చరిత్రకు మూలాధారాలయ్యాయి. ఉదాహరణకు, ఆంధ్ర-శాతవాహన చరిత్ర పునర్నిర్మాణ కృషిలో పురాణాల్ని కొంతవరకైనా మూలంగా పరిగణించడం జరుగుతున్నది. కాని వీటిని ఖచ్చతమైన ఆధారాలుగా భావించరు. పురావస్తు ఆధారాలు, శాసనాలే శాతవాహన చరిత్రకు ముఖ్యమూలాలై వున్నాయి. అలాగే అశోకుని కాలంనాటి స్తూపాలు, శాసనాలు అతి ముఖ్యమైన చారిత్రక ఆధారాలు. అవి విశ్వచరిత్రకే ప్రముఖ, ఆదర్శప్రాయ ఆధారాలు. అంతటి ఉదాత్తమైన పరివర్తన పొందడం, పైగా ఆ పరివర్తనను రాజకీయాల్లోకీ అనువర్తింప జేయడం చరిత్రలోనే అతి విలక్షణ పరిణామమనీ, అలాంటి అశోక చక్రవర్తి ఒక అద్వితీయ మహోన్నత వ్యక్తి అనీ ప్రపంచవ్యాప్తంగా పరిగణించబడుతున్నది. ఆ కాలానికి సంబంధించిన చరిత్ర పునర్నిర్మాణంలో అశోకుని కాలపు శిలాశాసనాల సంపద ఎంతో దోహదపడింది. అందువల్ల ప్రాచీన భారతీయ యుగానికి చారిత్రక దృష్టి లేదనడం ఎంత వరకు సమర్థనీయం?

శిలాశాసనాలు, అవి పొందుపరిచిన రాజపరిపాలనాంశాలు, అతిశయోక్తులతో, ఆయా రాజుల స్వయం-ప్రశంసలతో కూడుకుని వున్నవన్న మాట వాస్తవమే. కాని ఈ విమర్శ పాశ్చాత్య చరిత్రకూ వర్తిస్తుంది. అస్సీరియన్, గ్రీకు, రోమన్ చారిత్రకాధారాలుకూడ ఈ విమర్శను ఎదుర్కొనక తప్పనిదే.

అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గుర్తించాలి. పాశ్చాత్య సాంప్రదాయంలో చరిత్ర రచన ఒక వృత్తిపరంగా కొనసాగింది. కాని ఆ సాంప్రదాయం ప్రాచీన భారతంలో లేదు. సాహిత్యంలో కొంత ఇలాంటి పోకడ కనపడినా, చరిత్రరచనా ప్రక్రియమాత్రం కనపడదు. ఎక్కడో కల్హణుని ' రాజతరంగిణి ' వంటి రచనలు తప్పితే ప్రాచీన భారత సాంప్రదాయంలో చరిత్రరచనా ప్ర్ర్రక్రియ మృగ్యమే. గ్రీకు చరిత్ర లిఖించిన పారోడాస్, థుసిడైడిస్లు, రోమన్ చరిత్రను రాసిన ప్లూటార్క్, లెవీలవంటి చరిత్రకారులు మన సాంప్రదాయంలో లేరు. మరి వాళ్లయితే ప్రాచీన పాశ్చాత్య చరిత్రను వారి వారి స్వీయ భావనలప్రకారంగా, పాశ్చాత్య నాగరికతా, సంస్కృతుల్ని అత్యున్నతమైనవిగానూ, కాగా ప్రాక్ సాంప్రదాయాలను అతి హీనమైనవిగానూ చిత్రించారు. ఆసియా ఖండం అనే భూభాగాన్నే హేయంగా, ఆసియా సమాజాన్ని అతి నిరసన భావాలతో వర్ణించారు; ఇక భారత చరిత్ర, సంస్కృతీ సాంప్రదాయాలైతే వీరి అవగాహనకు బహు దూరంగా వుండినాయి. గ్రీకు చరిత్రకారుడు హెరెడోటస్ పర్షియన్ నాగరికతను, మనస్తత్వాలను అతి హేయ భావంతో వర్ణించాడు. పర్షియాపై గ్రీకు యుద్ధాలను ఘనంగా కీర్తిస్తూ చరిత్రకారుడు హెరెడోటస్ చేసిన రచనలు, మరో వైపు గ్రీకు సాహిత్యవేత్త అషైలస్ (Aeschylus) రాసిన ' ది పర్షియన్స్' అనే నాటకం, పాశ్చాత్య నాగరికతకు అత్యున్నత విలువలు ఆపాదించాయి. వీరు ప్రాక్ సంస్కృతిపట్ల హీనభావంతో, ప్రాక్ సాంప్రదాయాల్ని శత్రు సాంప్రదాయాలుగా పరిగణిస్తూ రచనలు చేసారు. గ్రీకు భావనలే అత్యున్నతమైనవి, పర్షియన్ చరిత్ర అమానుషమన్నట్లుగా చిత్రీకరించారు. కేవలం సంకుచిత నాగరికతా దృక్పథంతో ప్రాక్-పశ్చిమ విభేదాన్ని వక్రీకరించారని చెప్పక తప్పదు.

ఇంకా, ప్రాచీన భారత సంబంధాలు ముఖ్యంగా భారత ఉపఖండానికే పరిమితమైవుండడం ఒక కారణమైతే, ప్రాచీన భారత సాంప్రదాయంలో చరిత్రరచనా ప్రక్రియ లోపించడం మరొక కారణం [మన సాంప్రదాయాల్ని పాశ్చాత్యులు సరిగా అవగాహన చేసుకోలేక తప్పుగా, హేయభావంతో చిత్రీకరించడానికి]. [అలా కాక] మనకూ ఈ [చరిత్ర రచనా] సంప్రదాయం వుండివుంటే బహుశా మన చరిత్రపై వారి [పాశ్చాత్యుల] అవగాహన మరోలా వుండి వుండేదేమో.

అలెగ్జాండర్యొక్క ఆసియా దండయాత్రలతో మరో మలుపు వచ్చింది. పర్షియా, ఇండియాలపై అలెగ్జాండర్ చేసిన దండయాత్రలను ప్రాచ్యంపై పాశ్చాత్యపు ఆధిపత్య నిరూపణ జరిగిందనడానికి తార్కాణంగానూ, యూరపు ఖండాన్నంతటినీ పాశ్చాత్యంగా చిత్రీకరిస్తూనూ పాశ్చాత్య చరిత్రకారులు చరిత్ర రచనలు చేసారు. అయితే, మరో వైపున, ఈ దండయాత్రల పర్యవసానంగా సువిశాల ప్రాచ్య ప్రాంత సంస్కృతీ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక ధోరణుల ప్రభావం స్వయంగా అలెగ్జాండర్పైనే పడడం, వాటినిగురించి అతడి మనస్సులో కొంత సదుద్దేశ్యం ఏర్పడడంకూడ జరిగిందని గమనించాలి. అలెగ్జాండర్ తన రాజప్రతినిధుల్ని ఈ ప్రాచ్య దేశాల్లో నియమించిన పిదప గ్రీకు, భారతీయ సంస్కృతీసంగమంకూడ సంభవించింది. శిల్ప కళల్లోనూ, దౌత్య, రాజకీయ విషయాల్లోనూ ఈ సంగమం ప్రత్యేకించి ప్రస్ఫుటమైంది. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లోని గాంధార (కాందహార్) ప్రాంతంలో ఒక వినూత్న మిశ్రమ శిల్పకళావిధానం అంకురించి భారతీయ శిల్పకళాలోకంలో విప్లవాత్మక మార్పుల్ని కొనివచ్చింది. ప్రాచీన భారతానికీ, పాశ్చాత్య సామ్రాజ్యానికీ సరిహద్దుల్లోని తక్షశిలలో ప్రబలంగావున్న బౌద్ధ మత భావనల లోనూ ముఖ్యమార్పులు వచ్చాయి. ఆచార్య నాగార్జునుని మాధ్యమిక సిద్ధాంతం ఊపందుకున్నది. ఈ మార్పులు చేర్పులను గురించి మనకు తెలిసిందికూడ పాశ్చాత్య చరిత్రకారులు, శిల్పకళా విశ్లేషకులవల్లనే. కౌటిల్యుని ' అర్థ శాస్త్రం' కూడ కొంతమేరకు ఈ [మారిన/మారుతున్న] పరిస్థితులకు అద్దంపట్టినా, ఆనాడు చరిత్ర రచనాప్రక్రియలు లోపించివుండడంవల్ల వాటిపై సమకాలీన భారతీయ భావనలెలా వుండేవో మనకు తెలియదు.

తదుపరి నాగరికతల పరస్పర పరిచయాలు విరివిగా, అన్ని దిశలనుండీ జరుగుతూనే వచ్చింది. కాని ఈ పరిణామాల్ని భారతీయ విశ్లేషకులెవరైనా ఏ విధంగా అవగాహన చేసుకొన్నారనే విషయంలో సమాచారం మృగ్యం. ఉదాహరణకు, బౌద్ధ మత ప్రసారంకారణంగా భారత, చైనా సంబంధాలు ఎంతో పెంపొందినా అసలుకు భారతదేశ నాగరికతా ఔన్నత్యస్థితినిగురించి సమాచారం సైతం మన దేశానికివచ్చిన చైనా దేశ పర్యాటకులమూలంగానే మనకు లభించింది. ఫాహియాన్, హ్యుయాన్సాంగ్ రచనలవల్లే మనకు మన నాగరికతా ఔన్నత్యంగురించి, నాటి నలందా విశ్వవిద్యాలయ ప్రతిభావైభవాలగురించీ మనకు తెలిసివచ్చింది. కాగా ఆనాటి భారతీయ మత వాదనలు, గ్రంథాలలో అక్కడక్కడా ఉత్తర భారతంలోని మహత్తర విశ్వవిద్యాలయాలగురించీ, అక్కడి ఆధ్యాత్మిక, భౌతిక శాస్త్ర పరిజ్ఞానంగురించీ ప్రస్తావనలున్నా, వాటిలో మనకు యథార్థ సమాచారంగానీ, వాస్తవిక దృక్పథం గానీ కనబడవు.

ఇంకొక లోపం ఏమిటంటే, ఇదివరకే ప్రస్తావించినట్లు, భారత దేశానికీ విదేశాలకూ వుండిన పరిచయాల సమాచారం మనకు ఆధునిక కాలంలోనే అందుబాటులోనికి వచ్చింది. వివిధ మహమ్మదీయ సంస్కృతుల పరిచయం, వాటి రాజకీయ ఆధిపత్యం సుమారు ఎనిమిది శతాబ్దాలు కొనసాగినా, కొద్దిమంది ఇస్లామిక్ చరిత్రకారులచేతనే కొ్న్ని చరిత్రలు (బాబర్నామా, ఐనీ అక్బర్ వంటివి) చెప్పబడ్డాయి. అయితే దాని [మహమ్మదీయ పాలనయొక్క] రాజకీయ ప్రభావానికి తలవంచినవారి వైపునుండి ఆ కాలపు పరిస్థితులగురించి, పరస్పర భావనా సరళుల్లో కలిగిన మార్పుల గురించి రచనలు అంతగా లేవు. ఒక్క కల్హణుడుమాత్రమే కాశ్మీరు రాజుల చరిత్రను తన ' రాజతరంగిణి' లో చరిత్రరచన నమూనాకు అనుగుణంగా లిఖించాడు. అయితే చరిత్ర రచనగా లేకపోయినా, ప్రాచీనకాలంలోని మన సాహిత్యాలలో కొంతమేరకు చారిత్రక విషయాల ప్రస్తావనైతే వుంది. తమిళ నాగరికతా చరిత్రలో ఒక పురాతన రచనయైన 'శిలప్పాదికారం' ఎంతో ఉత్కృష్టమైనది. దీనిలో ఆనాటి దక్షిణ భారత దేశపు, ముఖ్యంగా మధుర సామ్రాజ్యపు స్థితిగతులు, సాంఘిక ఆచార వ్యవహారాలు, హిందూ, జైన సంస్కృతుల పరస్పర ప్రతిస్పందనా సరళి, విదేశాలతో వ్యాపార వాణిజ్యాల వ్యవస్థలగురించి చిత్రీకరించబడింది. ఈ గ్రంథం ఒక చరిత్రగా పరిగణించబడక పోయినా మనకిది ఒక సాహిత్యపర చరిత్ర లంకెను సమర్పిస్తుంది. కాని ఇలాంటి ఉదాహరణలు మనకు కొన్ని మాత్రమే లభిస్తాయి.

అయితే ప్రాచీన భారతీయ చరిత్ర రచనా సరళిని, పాశ్చాత్య, మహమ్మదీయ చరిత్రరచనలతో పోల్చలేమని తెలియాలి. ఇందుకు కొన్ని కారణాలు లేకపోలేదు. మొదటగా, ప్రాచీన భారత, ముఖ్యంగా హిందూ, ఆధ్యాత్మిక చింతనలో సామ్రాజ్యాల జననం, మరణాలవంటి విషయాలు బుద్బుదప్రాయాలుమాత్రమేనన్న భావన అంతర్వాహినిలా ప్రసరిస్తూండడం [ఉదా: "కారే రాజులు? రాజ్యముల్ కలుగవే? గర్వోన్నతిన్ బొందరే, వారేరీ? సిరి మూటగట్టుకుని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే?...," "...రాజ్యమున్‌ గీజ్యమున్‌ సతతమే?..." – హాభాగవతంలో బలి చక్రవర్తి ఉవాచ] ఒక ముఖ్య కారణం. అయితే మరో వైపున రాజ ప్రశస్తులు విరివిగా కనిపిస్తాయికూడ. సాహిత్యంలో అతిశయోక్తిరచనలు పరిపాటైనా ఎందుకో చరిత్ర రచనపై [మనవాళ్ల] దృష్టి మళ్లలేదు.

మరొక విషయమేమంటే, ప్రాచీన భారత సాంప్రదాయంలో భౌతిక, లోహ, రసాయన మొదలైన శాస్త్ర విజ్ఞానం సాధనంగా నాగరికతాభివృద్ధి అంతగా జరిగినట్లు, వాటిపై సిద్ధాంత పర రచనలు అంతగా వున్నట్లు కనబడదు. ఒక్క ఖగోళ విజ్ఞానంలోమట్టుకు [అదీ హెచ్చుగా జ్యోతిష్యవిజ్ఞాన రూపేణా] ఇందుకు భిన్నంగా కొంత ప్రగతి వున్నట్లు అగుపిస్తుంది. మన ప్రాచీన సంస్కృతిపై వచ్చిన ప్రధాన విమర్శ ఏమంటే ప్రక్రియా రూపాలు, ఉపయోగాలు వివిధం వున్నా వాటిని విశ్లేషించి, సిద్ధాంతకల్పన చేయడం అంతగా జరగలేదనే. ఆధ్యాత్మిక చింతనా ప్రక్రియ ఎంత విరివిగా జరిగినా, భౌతిక శాస్త్ర పరంగా ఒక అనుగమననిగమన విధానం (deduction-induction) లోపించిందనడమూ సత్యదూరం కాదు.

ఈ సందర్భంలో పాశ్చాత్య చరిత్రరచనలోని ఊహాగానాలను కూడ గుర్తించాలి. గ్రీకు, రోమన్ చరిత్రకారుల్నిగానీ, గిబ్బన్వంటి ఆధునిక చరిత్రకారుల్నిగానీ వాస్తవిక చరిత్రరచనకు నమూనాలుగా తీసుకోవడం అంత సమంజసం కాదు. ఎందుకంటే, వాళ్లు నిరాధారంగానే పాశ్చాత్యచరిత్రా ఔన్నత్యాన్ని చాటింపు వేస్తూ వచ్చారు గాని అసలు వాస్తవాల్లోకి వెళ్లి శోధించలేదు. ఐరోపా, ఆసియా ఖండాల సరిహద్దుల్ని తమ వీలుప్రకారం భౌగోళికంగా నిర్ణయించడం, సాంస్కృతిక సాంప్రదాయాలకూ, రాజనీతి సాంప్రదాయాలను ముడిపెట్టడం వారికి పరిపాటైంది. ప్రజాస్వామ్య నీతి (democratic ethic), మానవతా దృక్పథం (humanitarian outlook), వ్యక్తిత్వతావాదం (individualism) మొదలైన లక్షణాలు, లక్ష్యాలు కేవలం ఐరోపీయ సాంప్రదాయాలే గానీ, ఆసియా (ప్రాచ్య) నాగరికతా సంస్కృతుల్లోనూ, ఆధ్యాత్మిక చింతనలోనూ లేనే లేవనే అనేక ఉద్ఘాటనల్ని మనం ఈ గ్రీకు, రోమన్ చరిత్రలనుండి ఉదహరించవచ్చు. పర్షియా, అరేబియా, టర్కీ, ఇండియాలపై పాశ్చాత్య దండయాత్రల్ని నాగరికతల సంఘర్షణ (clash of civilizations) గా చిత్రించడం ఐరోపీయ నాగరికతా వైచిత్రిగా నిలిచింది. ప్రాచీన గ్రీకు సాంప్రదాయంనుండీ తర్వాతి రోమన్, ఆపై నేటి ఆధునిక ఐరోపీయ సాంప్రదాయాలంతటా ఈ విచిత్ర పోకడ శారీరకంగా, అణువణువునా అన్నట్లుగా జీర్ణించుకుపోయింది. అక్కడక్కడా ఈ కృత్రిమ, విపరీతపు చారిత్రక దృష్టిపై నిశిత విమర్శలు జరుగుతున్నా, 2000 ఏళ్లకుపైబడిన ఈ సాంప్రదాయం అలా కొనసాగుతూనేవుంది. మచ్చుకు ఒక ముఖ్య పాశ్చాత్య రచన గతిని ఉదహరిద్దాం. బెర్నాల్ అనే భాషావిజ్ఞానవేత్త ఎంతో పరిశోధన చేసి చివరకు ప్రాచీన గ్రీకు సంస్కృతికి మూలాలు ఆసియా, ఆఫ్రికా ఖండ నాగరికతలేనని తన Black Athena అనే 1989 నాటి రచనలో నిర్దిష్ట సాక్ష్యాధారాలతో విశ్లేషించి చెప్పాడు. కాని ఈ అసాధారణ ఆవిష్కరణా దృక్పథాన్ని సాధారణ జాతి రచయితలు పట్టించుకోవడం జరుగలేదు. ఆనక 2008 లో ప్రచురించబడ్డ Worlds at War: The 2500-year Struggle between East and West అనే భారీ పుస్తకంలో ఆంథోనీ పాగ్డెన్ మళ్లీ పాత పాటే పాడాడు. అందులో పాండిత్య ప్రకర్షకూ, [అక్కడక్కడా] విశాల దృక్పథానికీ కొరత లేదుగానీ ఇంత ఉత్కృష్టమైన అత్యాధునిక ప్రచురణలో ఇంకా పాత ధోరణిలో గ్రీకు, రోమన్ ఆధారాలతోనే ప్రాక్ పశ్చిమ విభజనను, వైరుధ్యాన్ని, రాజకీయ వ్యవస్థల్లో పాశ్చాత్య ప్రజాస్వామ్య ఔన్నత్యం, ప్రాక్ ప్రాంతాల నిరంకుశ రాజరిక నిమ్నత్వం వంటి వాదనలతోనే చరిత్ర వర్ణన జరిగింది. అసలుకు గ్రీకు సంస్కృతీ విజ్ఞానాల ప్రాభవానికి గణిత, ఖగోళ విజ్ఞానాల్లో తన అభివృద్ధిఫలాలను అందజేయడంద్వారా ఈజిప్టు నాగరికత ఎంతో దోహదపడిన విషయాన్ని కేవలం పరిమితంగా [అయిష్టంగా] అంగీకరిస్తూ, కాని మొత్తానికిమాత్రం పాశ్చాత్య నాగరికతా ఔన్నత్యమే ముఖ్యం, యథార్థమమని ఈ పాశ్చాత్య చరిత్రకారులు తమకు తామే నిర్ణయించేసారు.

చరిత్రను నిర్లక్ష్యం చేయడానికి ప్రాచ్య ప్రాంతాల ఆధ్యాత్మిక భావనల్లోని విధివ్రాత, కర్మ సిద్ధాంతాల ప్రబల ప్రభావమే కారణమనే విశ్లేషణకూడ ఒకటుంది. అతి ఉత్కృష్ట దశకు చేరుకున్న ప్రాచీన నైలునదీ, మెసొపొటేమియా, పర్షియా, భారతీయ నాగరికతా యుగాల [మహత్తు, ప్రభావాల] ను ఆధునిక తరాలవారు ఎలా మరువగలిగారన్న ప్రశ్నకు జవాబుగా అనాగరికులలో కరడుగట్టిన కర్మ సిద్ధాంతాలు, విధివ్రాత భావనలే కారణమనని చెప్పి నెట్టివేయడంపై ఈ [ఐరోపీయ సాంప్రదాయ ప్రభావంలోని ఆధునిక] చరిత్రకారులు తమ దృష్టి కేంద్రీకరించారు.

ఈ విశ్లేషణల్లో కొంత నిజం వున్నా, పాశ్చాత్య చరిత్రకారుల ప్రధాన వ్యాసంగం స్వీయ-కపోలకల్పిత భావనలతో చరిత్రను బనాయించడం (fabrication of history) గా అయింది. వారి వలసవాద సామ్రాజ్యవాద విధానానికి ఇది చేదోడువాదోడుగా నిలిచింది. అయితే ఈ చరిత్ర బనాయింపుపై దీటుగా ఎదురుదాడి చేసేంత చైతన్యం ప్రాక్ దేశాల మేధావులకు వెంటనే కలగలేదు. పాశ్చాత్య భాషా విజ్ఞానాల పరిచయం కలిగిన పిదప ఈ ఎదురుదాడి కొంతవరకు మొదలైంది. కాని, విశేషమేమంటే, చరిత్ర రచనను నిశితంగా పరిశీలించి, విమర్శనాత్మక దృష్టితో ఖండించడంకూడ చాల వరకు పాశ్చాత్య ప్రభావంవల్లే కలిగింది. వీటన్నింటికారణంగా భారతీయ చరిత్ర రచనా దృక్పథంలో లోటు ఏర్పడింది.

ఇంకో విషయమేమంటే, పాశ్చాత్య చరిత్రరచనా చరిత్రను పరిశీలిస్తే, అసలా చరిత్ర రచనలో శాస్త్రీయ దృక్పథం చాలవరకు లోపించిందనే విమర్శ వుంది. సాంప్రదాయిక చరిత్ర రచనపై కార్ల్ మార్క్స్ ధ్వజమెత్తం ఇందుకు ఒక ఉదాహరణ. చరిత్రను ఫక్తు రాజకీయపరంగానే వర్ణించడం, దాన్ని వాస్తవిక, భౌతిక పునాదులపై నిర్మించకపోవడాలను భౌతికవాదం ప్రతిఘటించింది. అయితే ఈ [భౌతికవాద] భావంలోకూడ లోపాలు లేకపోలేదు. ఏదెలాగైతేనేం, చరిత్ర రచన మానవ సృష్టిపై ఆధారపడినది కాబట్టి కొంతవరకు దాన్ని చరిత్రకారుల స్వీయభావనలనుండి వేరు చేయడం అసాధ్యం. కేవలం వాస్తవిక దృక్పథం (pure objectivity) తో చూడడమన్నదే భ్రమ అనే సిద్ధాంతం సాధారణ అంగీకారాన్ని పొందింది. భౌతికశాస్త్ర విశ్లేషణవంటి ప్రక్రియ చరిత్రరచనలో సాధ్యం కాదనే భావనే అసలు వాస్తవికమైంది.

సరే, చరిత్రరచనా వ్యాసంగాలలో చెలరేగే వాద-ప్రతివాదాల కారణంగా అసలుకు చరిత్రరచనపట్లే నిస్పృహ కలగాల్సిన అవసరం లేదు. వివిధ ప్రాంతాలనూ, సంస్కృతులనూ వెనకేసుకుని రావడాలు వుండకతప్పవు. అలాగే కొన్ని సందర్భాల్లో అది ప్రాంతీయ అభిమానమనండి, దురభిమానమనండి అలాంటి స్పందనలు ఆవశ్యకంగానే తలయెత్తుతాయి. అయితే క్రమేపీ ఈ సంకుచిత దృష్టి లోపాన్ని సరిదిద్దే అవకాశం సహజసిద్ధంగానే అవతరిస్తుంది. మార్క్స్, ఏంగెల్స్లు తమ సిద్ధాంతంలో వివరించిన గతితార్కిక గతి (dialectical movement) తనంతట తానుగానే చోటు చేసుకొని, ఇలాంటి వాద-ప్రతివాద మెలిక అంకురిస్తుంది.

అయితే పై భావనతో ఏకాభిప్రాయంకూడ చేకూరదు. కాని, ఆధునిక విజ్ఞానం, మేధోశక్తుల వినియోగ ప్రభావంవల్ల చరిత్రలోని తత్సంబంధిత సిద్ధాంతాలవల్ల జాగృతి కలిగిందనే చెప్పాలి. ఘటనాపర చరిత్రరచన (historiography) అంటే ఫక్తు యథార్థఘటనల వాస్తవాలపై ఆధారపడి సాగే చరిత్రరచనా విధానమని చెప్పవచ్చు. ఉన్న సాహిత్య సంపదను నిశితంగా పరీక్షించి, కేవల ఊహాత్మక రచనల్ని వేరుచేసి, పూర్వ ఘటిత విషయాలను ప్రాచీన పురావస్తు పరిశీలనతో మదింపుచేసి యథార్థతను నిశ్చయంగా తేల్చిచెప్పే సాక్ష్యాధారాలపైనే చరిత్రకారుని లేఖనం సాగిపోవాలి. పూర్వ ఘటిత విషయాలు, వ్యవహారాలను శల్యపరీక్ష రీతిలో పరిశీలించి పోగు చేయాలి. ఇలాంటి చరిత్రరచనా ప్రక్రియను తక్కువ కాలావధులకే పరిమితం చేయాలి. చరిత్ర ప్రవాహగతిలో వ్యక్తిత్వాల ప్రభావం ఎంత, ఎలా వుంటుందో చెప్పడం చాల కష్టం. ఇక చరిత్ర సృష్టిలో ప్రముఖ వ్యక్తుల పాత్ర ఏమిటో, వారెందుకలా ప్రవర్తించారో విశదీకరించడం ఇంకా క్లిష్టతరం. కనుక చరిత్రరచనాకారులు ఇటువంటి విషయాలను ఎంత దూరం పెడితే అంత మంచిదని భావిస్తాను.

కాని, విశాల కాలపరిథిని తీసుకొని చరిత్రరచన చేయడంలో పైన చెప్పిన రచనాప్రక్రియ సాధ్యం కాదేమో అనే సందేహం రావడం సహజమే. ఉదాహరణకు ఆంగ్లేయ రచయిత ఎడ్వర్డ్ గిబ్బన్ అతి విశాలమైన కాలపరిథిలోని సుమారు 1000 ఏళ్ల - రోమన్ నాగరికతా చరిత్రను ఉత్కృష్టమైన శైలిలో రచించాడు. 'రోమన్ సామ్రాజ్యపు క్షీణత, పతనం' [Decline and Fall of the Roman Empire] అనే ఆ మహాగ్రంథం ఒక అద్భుత చరిత్రరచనగా చెలామణీ అయింది. అలాగని దాన్ని ఘటనపర చరిత్రరచన (historiography) కాదంటామా? ఎందుకంటే సమకాలీన సాహిత్య, పురావస్తు ఆధారాలను విమర్శనాత్మక దృక్పథంతో నిశితంగా పరిశీలించి అనేక సాక్ష్యాధారాలతో ఆ చరిత్రగ్రంథం రాసాడు గిబ్బన్. అయితే అదే సమయంలో తన సొంత ఊహాగానాలనూ కాస్త మోతాదుకు మించే జతపర్చాడుకూడ. ముఖ్యంగా రోమన్ సామ్రాజ్య పతనానికి క్రైస్తవ [కాథలిక్] మత ప్రభావమే కారణమని అతి తీవ్రంగా దుయ్యబట్టాడుకూడ. అందువల్ల ఈ రచన ఎంతో వివాదాస్పదమైంది.

ఘటనాపర చరిత్రరచన (historiography) ను రెండు విధాలుగా నిర్వచించవచ్చు. సూక్ష్మంగా అది చరిత్రల అధ్యయనమేనని నిర్వచించవచ్చు. లేదా ఇంకొక దృక్పథంలో నిశితమైన పరిశీలనలో నిగ్గుతేలిన సాక్ష్యాధారాల పునాదులపై, చరిత్రకారుని స్వీయ భావనల్ని మిళితం చేయకుండా, నిర్మించిన చరిత్రల్నే ఘటనాపర చరిత్రరచనా ప్రక్రియలుగా భావించడమూ కద్దు. ఈ రెంటిమధ్య తేడా బహు జటిలమైంది.

ఈ నిర్వచనంప్రకారం ఏ చరిత్రరచననైనా ఘటనపర చరిత్రరచన (historiography) గా పరిగణించవచ్చు. అదొక ప్రత్యేక ప్రాంతం లేక రాజ్యానికి చెందిందైనా, అదెంత విశాల కాలపరిథిని తీసుకున్నా ఆ చరిత్రరచనను ఈ పేరుతో పిలవవచ్చు. ఉదాహరణకు క్రీ. పూ. 5 శతాబ్దినాటి గ్రీకు రచయిత హెరెడోటస్ సంగతే తీసుకుంటే ఆయన్ను చరిత్రరచనా పిత అని అనడం కద్దు. చరిత్రలో మొట్టమొదటిసారిగా వాస్తవ విషయాల్ని ఆధార ప్రమాణాలుగా తీసుకుని, తప్పులూ, అవాస్తవాలను వేరుచేసి, ఒక క్రమపద్ధతిలో, చక్కటి సరళిలో చరిత్రరచన చేసినందువల్లే ఆయనకు ఈ గౌరవ నామం సంక్రమించిందంటారు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే గ్రీసు, పర్షియాల మధ్య వైరపూరిత ఘర్షణలు జరిగిన కాలం కేవలం ఒక దశాబ్దికిమాత్రమే పరిమితమై వున్నా, దాన్ని గత 25 శతాబ్దాల నుండీ సాగుతూన్న ప్రాక్-పశ్చిమ సంఘర్షణగా చిత్రించడం పాశ్చాత్య చరిత్రకారులకు అలవాటై పోయిందంటే, మొదటగా ఆ భావనకు అంకురార్పణ చేసింది ఈ హెరొడోటస్సే. ఎంతగా వాస్తవికతను వీడకుండా రాయాలని చెప్పినా, చేసినా ఆయన దృక్పథంలో కొట్టవచ్చినట్లు కనబడే గ్రీకులపై అభిమానం, పర్షియాపై హేయభావాలనుబట్టి ఆయన రచన పక్షపాత రహితమైనదని చెప్పలేము. అదీగాక ఆయన అసత్యవాది అనే ఒక విమర్శ ఆదినుండీ వుందికూడ. సుప్రసిద్ధ గ్రీకో రోమన్ రచయిత ప్లూటార్క్ అయితే, "హెరెడోటస్ చరిత్రకే కాదు, అబద్ధాలకూ తండ్రే," నని హేళన చేసాడు.

హెరెడోటస్కు సమకాలీనుడైన థుసిడైడ్స్ (Thucydides – 460-395 B.C.) గ్రీకు నాగరికతా పతనానికి ఒక ముఖ్య కారణమైన పెలొపొన్నేసియా యుద్ధ చరిత్రను తన పెలొపొన్నేసియన్ యుద్ధం (The Peloponnesian War) అనే గ్రంథంలో లిఖించాడు. అది గ్రీకు నగర రాజ్యాల మధ్య జరిగిన అంతర్యుద్ధమని చెప్పవచ్చు. ఈ రచనలో ఆయన హెరొడోటస్ కంటే హెచ్చుగా యథార్థ వాస్తవ విషయాల్ని రచించాడు. కాని ఇందులోని చరిత్రవిశ్లేషణలోకూడ ఏథెన్స్ నగరవాసియైన థుసిడైడ్స్ పక్షపాత వైఖరి స్పష్టంగా కనబడుతుంది. ఏథెన్స్ నగర ప్రజాస్వామ్యమే మెరుగైందనీ, సైనిక నిరంకుశత్వ రాజ్యంకాబట్టే దాని ప్రతిద్వంద్వి స్పార్టా నగర రాజ్యం చివరకు ఓటమి పాలైందనీ ఈ చరిత్రకారుడు పదే పదే వక్కాణించడం గమనిస్తాము. దీని అంతరార్థమేమంటే ఎంత వాస్తవిక దృక్పథం అవలంబించ యత్నించినా ప్రాంతీయ చరిత్రా రచనలో ఎంతో కొంత ప్రాంతీయాభిమానం చోటుచేసుకోవడం సహజమేమో. ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు థుసిడైడ్స్ రచించిన ఈ పెలెపొన్నేసియన్ యుద్ధం (Peloponnesian War) ను ఆధునిక చరిత్రకారులు సైతం ఘటనాపర చరిత్రరచన (Hisotriography) కు ఒక నిర్దిష్ట నమూనాగా భావిస్తారు.

అయితే, 18-19 శతాబ్దాలనాటికి సత్యాన్వేషణా ప్రక్రియలో అత్యుచ్చ స్థాయిని విజ్ఞానశాస్త్ర విధానం పొందడంతో, చరిత్రరచనపైకూడ దాని ప్రభావం పడింది. ఇదివరకటికంటే ఎంతో నిశితమైన వాస్తవికతా ప్రమాణాలతో విజ్ఞానశాస్త్రవిధాన నమూనాలో రచన చేయాలనే గీటురాయి చరిత్రరచనకే సవాలైంది. ఇలాంటి ఉన్నత ప్రమాణాల్ని పాటించిన చరిత్రకారుల్లో మిచ్లెట్, లియొపాల్డ్ రాంకె, జేకబ్ బుర్కుహార్ట్వంటి వాళ్లు అగ్రగణ్యులు. ఈ ప్రమాణాల్ని 'చరిత్రకు సుదృఢ ఆధార భూమి' అని రాంకె అభివర్ణిస్తాడు. కాని, ఇది సాధ్యమా? స్వీయమానసిక భావనల్ని వెనక్కునెట్టి, స్వచ్ఛమైన వాస్తవికతా దృష్టితో పరిశీలించడం మానవ శాస్త్రాల్లో ఎంతవరకు సాధ్యం? ఈ ప్రశ్న ఘటనాపర చరిత్రరచనా (historiography) ప్రక్రియకుకూడ ఒక పెద్ద సవాలే.

ఘటనాపర చరిత్రరచనా (Historiography) విధానానికి వేరుగా చరిత్రరచనకున్న మరో మనుగడ రూపం చరిత్ర తత్వచింతనా (Philosophy of History) విధానమని చెప్పవచ్చు. సాధారణంగా ఈ రెండు ప్రక్రియలనూ పరస్పర విరుద్ధాలనైతే అనలేము. చరిత్రను నడిపించడంలో ఏవైనా అభూతమైన, లేదా పైకి కనబడని శక్తులున్నాయని విశ్లేషించి చెప్పడమే ఈ చరిత్ర తత్వ చింతనా ధోరణి అని చెప్పవచ్చు. దీనినే చరిత్ర తత్వశోధన అనికూడ పేర్కొనవచ్చు. కాని, ఈ చరిత్రను నడిపించే [అజ్ఞాత] శక్తులు ఏమిటనే విషయంలోమాత్రం పరస్పర విరుద్ధ సూచనలూ, అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఉదాహరణకు, క్రైస్తవ చరిత్రతత్వాన్ని సెయింట్ అగస్టిన్ క్రీ. . 4 శతాబ్దిలో వివరించాడు. తన ప్రప్రథమ పాపకార్య (Original Sin) కారణంగా భగవంతుని సన్నిధానంనుండి పతనమై మానవుడు ఈ భూమిపై నివసించడం జరుగుతున్నదని ఆయన వివరిస్తాడు. దైవం, క్రీస్తు దయ, సంకల్పబలం, ఆశీర్వాదాల ద్వారా తిరిగి దైవ సన్నిధి ప్రాప్తిస్తుంది; దైవనిర్ణయమే చరిత్రగమనానికి మూల కారణం అని ఆయన ప్రకటిస్తాడు.

అయితే గ్రీకు చరిత్రరచనా వ్యాసంగంలో ఇలాంటి దైవనిర్ణయ భావనల ప్రభావం మనకు కనబడదు. కేవలం లౌకిక కారణాలే చరిత్ర గమనానికి చోదక శక్తులనే ధోరణిలో గ్రీకు చరిత్రరచనలు సాగుతాయి. అంతర్లీనమైవుండే, లోలోపలగా ప్రభావం చూపించే కారణాలను విశ్లేషించినా, అవన్నీ మానవ నైజానికి, ప్రత్యేక వ్యక్తుల నాయకత్వ ప్రతిభాసామర్థ్యాలకు, రాజ్యకాంక్ష, మతపర, ఆధ్యాత్మిక చింతనాపర భావనాస్ఫూర్తులకు సంబంధించిన అనేక [లౌకిక] రీతులే అయివుండడం గమనార్హం.

చరిత్ర దైవనిర్ణయమనే భావనా ప్రభావం పాశ్చాత్య సాంప్రదాయంలో ప్రముఖంగా వున్నది. ముఖ్యంగా యూదు మత సాంప్రదాయంలోనూ, అలాగే దానినుండి వచ్చిన క్రైస్తవ సాంప్రదాయాలలోనూ ఈ [దైవనిర్ణయ భావనా] ప్రభావం హెచ్చు. ఆదిమానవులైన అదామూ, అవ్వల (Adam and Eve) ప్రథమ పాపం (Original Sin) వల్ల మనిషి భూమిపై తన పాపభూయిష్ట జీవనం సాగిస్తూంటాడు. దైవకృపవల్ల ఈ విషవలయంనుండి తప్పించుకోవడంలోనే మానవునికి పుణ్యలోక ప్రాప్తి అవకాశం వుంటుందనే భావన [మతధర్మపర చరిత్రరచనకు] మూలమైనది గదా

4. అభౌతిక కారణాలే చరిత్రకు చోదకాలు:

క్రైస్తవ మతప్రభావం ఆధునిక యుగంలో సన్నగిల్లుతూ వచ్చినప్పటినుండీ ' స్వచ్ఛమైన భగవద్ ప్రేరిత ప్రభావాల' ను చరిత్రకారులు విస్మరించ సాగారు. క్రీ. . 15-16 శతాబ్దాల్లో ఐరోపాలో ఉదయించిన పునరుజ్జీవన యుగం (Renaissance) లోని చరిత్రకారులైన మాకియవెల్లీ, గుయచియార్డినీల వంటి రచయితలు మతచరిత్ర, నీతిశాస్త్రపర శక్తుల ప్రభావాన్ని వెనక్కునెట్టి, రాజకీయ అధికారశక్తి పెంపొందించుకోవడమే సమాజంలో చరిత్ర రీతిగతుల్ని నిర్ణయించేదని ఉద్ఘాటించారు. ఈ తాపత్రయంలో పాలకుల వ్యక్తిగత నాయకత్వ తృష్ణ, అది తీర్చుకోవడానికి ఆయా వ్యక్తులు పట్టిన పంతాలే చరిత్రగమనానికి కారకాలన్నట్లు చెప్పారు.

ఇలాంటి వ్యాసంగాన్ని లౌకికపర చరిత్రరచన అనొచ్చు. అయితే ఈ లౌకిక జిజ్ఞాసలోకూడ అభౌతిక కారణాల ప్రసక్తి రావడం సహజమే. దైవంపై దాడి చేసినా, కేవలం దైనందిన ఘటనల వర్ణనతోనే చారిత్రక విశ్లేషణల్ని సరిపెట్టుకోవడం అసంతృప్తికరం. అందువల్ల జరిగే కాలానుగత చరిత్ర వెనుక అంతర్గత, అభౌతిక కారణాలేమైనా పొంచివున్నాయో అన్వేషించాలి, వాటి స్వరూప స్వభావాల్ని తేల్చాలన్న జిజ్ఞాస కొంతమంది చరిత్రకారుల్ని ప్రేరేపించింది. అది చరిత్రతత్వ శోధనకు ఇంకొక కారణం అయింది. ఈ కోవకుచెందిన హెగెలియన్ సిద్ధాంతవాదంగురించి మనమిక్కడ స్థూలంగా తెలుసుకుందాం:

చరిత్ర ఏదో అభౌతిక శక్తి ప్రేరితం: చరిత్ర తత్వచింతనా (Philosophy of History) సాంప్రదాయంలో ఇది అతి ముఖ్యమైనది; ప్రధానంగా 19 శతాబ్దపు జర్మన్ తత్వవేత్త జార్జ్ విల్హెల్మ్ ఫ్రెడరిక్ హెగెల్ పేరుతో ఇది ముడిపడి వుంది. ఈయన అభౌతిక ఆదర్శభావ వాదన (metaphysical idealism) దైవం అనే భావనస్థానే ఒక పరాశక్తి భావనను దీన్నే అఖండ భావన (Absolute) అని అంటాడు ప్రవేశపెడుతుంది. [మన శంకరాచార్యుని ' బ్రహ్మ' పదార్థంలాగా].

అయితే ఈ అఖండభావనా శక్తే చరిత్రగతిని నిర్ణయిస్తుంది అన్నట్లు కాదని హెగెల్ వాదన. చరిత్ర గమనం ఒక గతితార్కిక సరళిలో సాగిపోతుందనే భావనను విస్తృతంగా విశ్లేషించి చెబుతాడు హెగెల్. ఒక భావన మొదట చరిత్రలో (లేక సమాజంలో) వున్న పరిస్థితుల్లోని భావసముదాయానికీ, వ్యవస్థలకూ కారకమైన ప్రతిపాదనావాదం (thesis) గా వుంటుంది. ఈ ప్రతిపాదనావాదాన్ని సవాలుచేస్తూ ఒక విరుద్ధవాదం (anti-thesis) తరచూ చోటుచేసుకుంటూంటుంది. ఈ రెంటి వైరుధ్య ప్రభావంలో రెండు వాదాల పోకడల్ని ఆంతరంగికం చేసుకొని, కొంతవరకు రెంటిమధ్య సమన్వయాన్నికూడ సాధించే సిద్ధవాదం (synthesis) ఉద్భవిస్తుంది. అంటే ప్రతిపాదనావాదం, విరుద్ధవాదాల పోకడల ముఖ్యాంశాలను మేళవించిన ఒక సమన్వయస్థితే ఈ సిద్ధవాదం అనీ గతితార్కిక గమన విధానం ఈ విధంగానే వుంటుందనీ, చరిత్రతత్వ సారాంశం ఇదేనని హెగెల్ ప్రకటిస్తాడన్న మాట.

అంటే, ఆదర్శ భావనాప్రేరిత గతితార్కిక గమన చరిత్ర స్వభావ చిత్రణే హెగెల్ చరిత్రతత్వ సారాంశమన్న మాట. దీని స్థూల సందేశం ఏమంటే చరిత్ర గతి ముందే నిర్దేశించబడిందని. దీన్నే చారిత్రక విధినిర్ణీత వాదం (historical determinism) అంటారు. ఈ బృహత్ సిద్ధాంతపరంగా చరిత్ర గమనాన్ని నిర్ణయించేది మానవుని మేధా శక్తియుక్తులే గాని, సమాజంలో నెలకొనివుండే భౌతిక పరిస్థితులు (material conditions) అయితే కావని హెగెల్ దృఢాభిప్రాయం. ఈయన తత్వసిద్ధాంతాన్ని [ఆదర్శ]భావవాదం (Idealism) అనడానికి ఇదే ముఖ్యకారణం.

హెగెల్ సిద్ధాంతం మానవ ఆలోచనలకూ, భావనలకూ చరిత్ర చోదక శక్తులుగా స్థానాన్ని యిస్తుంది. ఇది దీనిలో ముఖ్య లోపమే నని చెప్పవచ్చు. మానవ మేధస్సు, భావనల ప్రభావం మానవుల్ని ఆవరించుకుని వుండే సాంఘిక, భౌతిక శక్తులతో సమ్మిళితమై వుంటుందని మరువరాదు. ఈ పరస్పర పెనవేతవల్ల భావనా శక్తి ఒక అఖండ (absolute) శక్తిగా ఏ విధంగా పరిణమిస్తుందో, ఆ అభూత శక్తి చరిత్ర జాతీయ స్పందనతో అంతమైందని హెగెల్ చెబుతాడు. కనుక ఈ అఖండ భావనాశక్తి అంతిమంగా జాతి-రాజ్యం (nation-state) గా, అంటే జాతీయభావంతోకూడిన రాజ్యావతరణగా, పరిణమిస్తుందని హెగెల్ సిద్ధాంతీకరించాడు; అంతే కాదు, అలా నిర్ణయించాడు కూడ. కాని ఇంతటి చరిత్ర గమనాన్ని ఆయన సమకాలీన భావనలతో ముడివేయడం సంకుచితంకాదా? సరే, ఏదేమైనా హెగెల్యొక్క చరిత్రరచనావిధానం పూర్తిగా భావవాద పూరితం; కాగా, దాని ప్రత్యర్థి సిద్ధాంతమే వాస్తవిక భౌతిక వాదం (materialism).

5. చారిత్రక భౌతికవాదం - మార్క్స్:

హెగెలియన్ గతితార్కిక సిద్ధాంతంతో ఎంతో ప్రభావితుడైనా, ఆయనయొక్క ఆదర్శభావవాదాన్నిమాత్రం తిరస్కరిస్తూ అందుకు వ్యతిరేకంగా భౌతికవాద సిద్ధాంతాన్ని సమర్థిస్తూ, దానికి గతితర్కాన్ని జోడించి ఒక చారిత్రక భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు హెగెల్ శిష్యుడైన కార్ల్ మార్క్స్. భావనలు, ఆదర్శాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగివున్నట్లు పైకి కనిపించినా నిజానికి వాటి వెనుక భౌతిక పరిస్థితుల ప్రభావం, నియంత్రణలు వుంటాయని ఎత్తిచూపుతూ, చరిత్రను నడిపిస్తుందని చెప్పబడే మానవ భావనా పరంపర కేవలం భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటుందని మార్క్స్ వాదిస్తాడు.

మనిషి తన దైనందిన జీవితం గడపడానికి, ఉదాహరణకు ఆహార సేకరణకూ, యితర అవసరాలు సమకూర్చుకొనడానికీ ఇతరులతో అనేక ఉత్పత్తి సంబంధాలు (Relations of Production) ఏర్పరుచుకుంటాడు; ఇంకా ఈ ఉత్పత్తి సంబంధాల ఆధారంగానే సమాజంలో ఇతరులతో ఇంకా అనేక వ్యవహార సంబంధాలు పెట్టుకుంటాడు. అంటే భౌతిక సంబంధాలే ఇతర ఆచార వ్యవహారాలకు దారి తీస్తాయి ఉదాహరణకు, సమాజంలోని సాంస్కృతిక, నైతిక, న్యాయపర సంబంధాల సముదాయం అంతా మనిషి ఆహార సేకరణ, తదితర అవసరాలగురించిన ఉత్పత్తి సంబంధాలపై ఆధారపడి వుంటుంది. అందువల్ల మార్క్స్ ఈ ఉత్పత్తి సంబంధాలను సమాజ నిర్మాణానికి పునాది (basis) లో భాగంగానూ, దీనిపై నిర్మించబడ్డ ఇతర అంశాల వ్యవస్థల్ని ఉపరి నిర్మాణం (superstructure) గానూ పేర్కొంటాడు. ఈ విశ్లేషణప్రకారం మతవిషయిక భావనలు, సాంస్కృతిక విలువలు, నీతి, న్యాయ వ్యవస్థలు మొదలైనవన్నీ ఆర్థిక సంబంధాలనుండి జనించినవేననీ, వాటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదనీ తేలుతుంది.

ఈ విధంగా మార్క్స్, ఇంకా ఆయన స్నేహితుడైన ఫ్రెడరిక్ ఏంగెల్స్లు కేవల ఆలోచనారీతుల, భావనల ప్రాధాన్యాన్ని సవాలు చేసి, హెగెల్యొక్క ఆదర్శ భావనావాదం (idealism) స్థానే యథార్థ భౌతికవాదాన్ని (materialism) ప్రతిష్టించారు.

అయితే, గతితార్కిక గమనమే చరిత్రకు చోదక శక్తి అనే హెగెల్ ప్రతిపాదననుమాత్రం మార్క్స్ పూర్తిగా అంగీకరించి, ధ్రువించి, తన సిద్ధాంత నిర్మాణంలో మిళితం చేసాడు. హెగెల్ది గతితార్కిక [ఆదర్శ] భావవాదమైతే, మార్క్స్ రూపొందించింది గతితార్కిక భౌతికవాదమని చెప్పవచ్చు. భావవాద ప్రాతిపదికపై నిర్మించడం ద్వారా హెగెల్ గతితర్కాన్ని తల్లకిందులుగా నిలబెడితే, తాను భౌతికవాద ప్రాతిపదిక తీసుకురావడంద్వారా దాన్ని తిప్పి మళ్ళీ నిటారుగా నిలబెట్టాననీ మార్క్స్ సగర్వంగా చెప్పుకున్నాడుకూడ.

మార్క్స్ భౌతికవాదం ఆయనతోనే ఆరంభం అయిందని పొరపడరాదు. విజ్ఞానశాస్త్ర వికాసం, దానిపై పెరిగిపోయిన విశ్వాసాల మూలంగా క్రీ.. 18 శతాబ్దంనుండే ఐరోపాలో భౌతికవాదం ప్రబలుతూ వచ్చింది.[3] ఫ్రాన్స్లో ఇది విజ్ఞానవికాస యుగం (Age of Enlightenment) గా రూపొందింది. ఆ యుగంలో ప్రబలిన సిద్ధాంతాన్ని ప్రగతిభావనావాదం అని ప్రస్తావించడం పరిపాటి. మానవుని భౌతిక, మానసిక శక్తులు ఆదినుండీ క్రమక్రమంగా ఉన్నత స్థాయిలకు అభివృద్ధి చెందుతూవస్తున్నాయనీ, అందువల్ల సదా గతించిన యుగంలోకన్నా దానితర్వాత వచ్చే యుగంలోని వ్యవస్థలు, నాగరికతా విలువలు, లక్ష్యాలు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతాయనేదే ఈ ప్రగతి భావన (Idea of Progress) యొక్క సారాంశం అని చెప్పవచ్చు.

ఈ విశ్లేషణే ఆధునిక యుగాలు పూర్వ నాగరికతల స్థాయిల్ని అధిగమించాయనీ, మానవ మేధోశక్తులూ, శారీరక [బలం, ఆరోగ్యం] వగైరా విషయాల్లో నైపుణ్యం [ఎంతో] పెంపొందిందనే సిద్ధాంతానికి మూలం. ఈ చరిత్ర గమనం గతితార్కిక రీతిలో జరిగింది. ఏదైనా ఒక నాగరికతా వ్యవస్థలో క్రమక్రమంగా [అంతర్గత] వైరుధ్యాలు చోటు చేసుకుంటాయి. అవి తీవ్రతరమై అంతదాకా స్థిరపడివున్న ఆ నాగరికతా వ్యవస్థలో ఇతరేతర అంశాల్లోకూడ గుణాత్మక మార్పులు వచ్చి ఆ పాత వ్యవస్థా స్వరూపమే పూర్తిగా మారిపోతుంది.

నాగరికతా సంక్షోభం, తదనంతరం నూతన నాగరికతావతరణల వెనుకవుండే ఆ మార్పు సిద్ధాంతంలోని విశేషమైన కారణాంశం భౌతికపరమైన మానవ ఉత్పత్తి సంబంధాల (production relations) లో సాంకేతిక (technological) మార్పులు రావడమే. యథార్థమైన భౌతిక మానవ అస్తిత్వం పరిణామక్రమంలోనే ఈ మార్పులు కలుగుతాయి గాని ప్రత్యేకించి మానవ ఆలోచనాశక్తి ప్రేరణ ప్రభావాలతో సంభవించేవైతే కావు. ఇక్కడే మార్క్స్యొక్క భౌతికవాద సిద్ధాంత ప్రభావం తేటతెల్లమవుతుంది. మానవుని మనుగడకు అత్యవసరమైన పరిస్థితుల ఉత్పత్తి క్రమంలో, ఆ కారణంగానే మానవుల ఆలోచనలుకూడ స్పందిస్తాయనేది ఆ [మార్క్సియన్] భౌతికవాదంలోని ఒక ముఖ్య ప్రతిపాదన.

గత చరిత్ర రీతి, గమనాల పరిణామక్రమాన్ని ఈ సిద్ధాంతంతో విశ్లేషిస్తూ మార్క్స్, ఏంగెల్స్లు రాబోయే చరిత్ర రీతి, గతుల్ని సూచించారు. మానవ నాగరికతలో [ఆదిమ తెగపర సమష్టి సాముదాయిక వ్యవస్థల పరిణామక్రమంలో] మొట్టమొదట బానిస వ్యవస్థాపరమైన సమాజం ఏర్పడింది. దానితర్వాత వచ్చిన భూసేద్యం, వ్యవసాయవ్యవస్థా నిర్మాణ పరిణామాలద్వారా నేలలు సాగు చేయబడడం, తద్వారా ఆహారోత్పత్తి సుగమం కావడం జరిగింది. ఈ పరిణామాలవల్ల మానవ సమాజాల్లో ఫ్యూడల్ వ్యవస్థలు (feudal social orders) అవతరించాయి. ఈ సామాజిక నిర్మాణ క్రమంలో నాగరికతావ్యవస్థ మొత్తంలో నీతి, న్యాయాల విలువలూ, సమాజంలోని వివిధ వర్గాల నడుమ సంబంధాలూ తదనుగుణంగా మార్పుచెందుతాయి. సాంఘిక వర్గాలో హెచ్చు, తగ్గుల శ్రేణులు రూపు దిద్దుకుంటాయి. క్రమక్రమంగా ఈ నూతన [ఫ్యూడల్] వ్యవస్థలోసైతం మౌలిక సంబంధాల్లో తిరిగి మార్పులు కలగడంవల్ల సామాజిక సంక్షోభం సంభవిస్తుంది. సమకాలీన వర్గాల మధ్య అంతరాలు పెచ్చరిల్లి, ఆ వర్గాలకు మద్దతుగావుండే సాంఘిక నిర్మాణాలూ, సముదాయాలమధ్య వైరుధ్యాలు తీవ్రతరమై, క్రమంగా పోరాటస్థాయికి చేరుకుంటాయి. ఈ వైరుధ్యాల స్వరూప స్వభావాలు మొదట్లో అంత కఠినంగా వుండకపోయినా, క్రమేపీ అవి వర్గ పోరాటాలుగానూ, సమాజంలోని సంపన్న వర్గాలకూ, పీడిత బడుగు వర్గాలకూ నడుమ వైరపూరిత ఘర్షణలుగా రూపొందుతూ, చివరకు విప్లవ పోరాట గతికి చేరుతాయి. వెనుకబడ్డ వర్గాలను దోచుకునే సంపన్న వర్గాల చేతుల్లో రాజకీయ గుత్తాధికారం స్థిరపడి, తద్వారా వర్గ పోరాటాలలో [మొదట్లో] ఉన్నత వర్గాలదే పైచేయి అయినా, సంక్షోభం, ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యే కొద్దీ, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు ఐక్యతతో పట్టుదలగా పోరడంవల్ల వర్గ పోరాటంలో అంతిమ విజయం ఈ వర్గాలకే దక్కుతుంది. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థయిన ఫ్యూడల్ వ్యవస్థ ఈ విధంగానే విప్లవాత్మక మార్పు చెంది [దానిస్థానే ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొన్నది].

ఈ ఫ్యూడల్ వ్యవస్థలో మార్పులకు మూలకారణం క్రమేణా దానిలోనుంచే ఉత్పన్నమైన పెట్టుబడిదారీ వ్యవస్థే. పెట్టుబడిదారీ వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ గర్భంలోనే బీజావాప్తమై క్రమక్రమంగా పెరిగి బయటపడి సుమారు 18 శతాబ్దంనుండీ స్థిరపడుతూ వచ్చిన ఆధునిక సాంఘిక-ఆర్థిక వ్యవస్థ. దానితో ఫ్యూడల్ వర్గంలోని సంపన్నవర్గాల స్థానే [వాటిని తలదన్నే] కొత్త సంపన్న వర్గాలు ఏర్పడ్డాయి. దీనికంతటికీ వెనుకవున్న అసలు కారణం పారిశ్రామిక సాంకేతిక విప్లవమే. వ్యవసాయ ఉత్పత్తులు ఆ కాలాల్లోని శ్రమ ఎక్కువ-ఫలితం తక్కువ పరిస్థితులకారణంగా క్షీణించిపోతూండడంతో, అది లాభసాటికాదని సమాంతర రీతిలో వర్తక-వాణిజ్యాలు చేపట్టి పెంపొందించే ప్రయత్నాలు ముమ్మరంగా జరగడం, అందుకుగాను సముద్రాలు దాటే సాహసయాత్రల క్రమంలో పశ్చిమ ఐరోపా దేశాలవారు నూతన ఖండాలనూ, [చైనా, ఇండియాలకు] కొత్త మార్గాలనూ కనుగొనడం, క్రమంగా ఆ ఖండాల్లో-దేశాల్లో వలసల్ని స్థాపించి సామ్రాజ్యవాద విధానాలతో వాటిని కొల్లగొట్టి అశేష సంపదలు తరలించుకునిపోయి స్వదేశాల్లో పారిశ్రామిక విప్లవాల్ని ఉధృతం గావించడం ఈ ఇంకొక దోపిడీ వ్యవస్థ (పెట్టుబడిదారీ వ్యవస్థ) ఏర్పాటునూ, అభివృద్ధినీ సుగమం చేసింది.

ఇంకా కొత్తగా 'కనుగొన్న' ప్రాంతాల ఆర్థిక వనరుల్ని పాశ్చాత్యులు తమ కైవసం చేసుకొనడమేకాక అక్కడి ఆదివాసుల్ని చాలవరకు నిర్మూలించడమో లేక బానిసలుగా మార్చడమో జరిగింది. అలాగే ఇతర దేశాలపై సైతం సామ్రాజ్యాధికారం సాధించడంతో పెట్టుబడిదారీ విధానం అంతర్జాతీయంగా వలసవాద సామ్రాజ్యవాద విధానంగా ఎదిగిపోయింది.

ఈ కీలక చారిత్రక పరిణామాలు సహజంగానే నూతన వర్గాల సృష్టికి దారి తీసాయి. పెట్టుబడిదారీ దేశాలలోని కార్మికవర్గాలూ, పెట్టుబడిదారీ వర్గాలమధ్య వైరుధ్యాలు బాగా పెచ్చరిల్లక తప్పలేదు. శ్రామికవర్గాల శ్రమశక్తుల్ని దారుణంగా దోచుకుంటూ, ఉత్పత్తుల్ని గుత్తగా సొంతంచేసుకుంటూ పెట్టుబడిదారీ వర్గాలు బాగా బలిసిపోయాయి. పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రభుత్వాలుకూడ [పైకి ప్రజాస్వామికరూపం ధరించినా] పెట్టుబడిదారీ వర్గాల చేతుల్లో కీలుబొమ్మలుగానే మనుగడ సాగించక తప్పలేదని మార్క్స్, ఏంగెల్స్లు విశ్లేషించి చెప్పారు. కనుక ఈ పెట్టుబడిదారీ పాలనను కూల్చివేసే, దానిస్థానే సంపదలూ, సాధనాలన్నిటినీ సమాజపరం చేసి సర్వజన సంక్షేమ లక్ష్యంతో సోషలిజం నెలకొల్పే కార్మిక విప్లవాల ఆవశ్యకత, అనివార్యతలగురించికూడ వాళ్లు నొక్కి చెప్పారు. ఆనక సంభవించిన కొన్ని శ్రామిక తిరుగుబాట్లగురించీ, లెనిన్, మావో తదితరుల నాయకత్వాలకింద జయప్రదమైన సోషలిజం ఆశయసాధనా విప్లవాలు, నెలకొన్న వ్యవస్థలగురించీ, కాని కాలక్రమాన ఆ విప్లవాలు, వ్యవస్థల్లోని తీవ్ర లోపాలవల్ల అవి పతనమై మళ్లీ అభివృద్ధిచెందిన పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థల ప్రాబల్యం నెలకొనడం, భౌగోళీకరణ, విపణివ్యవస్థ (market economies) వికాసం ప్రపంచమంతటా జరుగుతూండడం కూడ మనకు తెలుసు. మరోవైపున ఈ సోషలిస్టు ఆశయాలు, విప్లవాల పరిణామ క్రమ ప్రభావంవల్లనూ, విద్యావికాసం, నైతిక విలువల స్ఫూర్తితోనూ కొంతమేరకు ఆదర్శవాద, ఉదారవాద మధ్యతరగతి వర్గాలుసైతం ఈ పెట్టుబడిదారీ విధాన దోపిడీ నైజాన్ని మానవతా దృక్పథానికి అనువుగా కొంతవరకైనా మార్చడానికి ప్రయత్నాలు జరిపినా, ఇంకా జరుపుతున్నా ఈ ప్రక్రియకూడ అంతగా ఫలించడం లేదు.

* * * * *



[1] ఇవి ఆ ఆదివాసులకు ఎంతో విషాదకరంగా, మరణాంతకంగా పరిణమించాయనేది వాస్తవమే. చరిత్రలో కనీవినీ ఎరుగని నరమేధాలు, ఆదివాసుల్ని మృగాల్లా వేటాడి నౌకల్లో పడేసి వేలమైళ్ల దూరంలోని ఖండాల్లో, దేశాల్లో బంధించి నూతన బానిస విధానం అమలుద్వారా సామ్రాజ్యవాద ఆర్థిక దోపిడీ, లాభార్జనలు, ఆదివాసుల భూములన్నీ లాక్కుని వారి చరిత్ర, సంస్కృతుల్ని కాలరాస్తూ బలవంతంగా క్రైస్తవమతంలోకి మార్చడాలు [ 'మొదట్లో భూములు మావి; బైబిళ్లు [క్రైస్తవమత పవిత్రగ్రంథాలు] వాళ్ల చేతుల్లో పెట్టుకునివచ్చారు. ఆనక భూములన్నీ లాక్కుని బైబిళ్లు మాత్రం మా చేతుల్లో పెట్టారు!'], అనాదిగా ప్రకృతిమిత్రులుగా వర్తించే ఆదివాసులవల్ల పరిరక్షితమైన ప్రకృతిపరిసరాల దారుణ వినాశం మొదలైన ఘోరపరిణామాలెన్నో సంభవించాయి.

[2] ఒక్క కల్హణుని 'రాజతరంగిణి' (కాశ్మీర చరిత్ర) (క్రీ.. ~1149 ) ఒక్కటిమాత్రం ఇందుకు మినహాయింపుగా కనిపిస్తుంది కాని దానిపైకూడ అప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో జరిగివున్న, జరుగుతూండిన ముస్లిం దాడులు, ఫలితంగా కొన్ని చోట్ల నెలకొన్న ముస్లిం సంస్కృతీ సాంప్రదాయాలు, వాటిలో ప్రస్ఫుటంగా కనిపించే మహమ్మదీయ చరిత్ర రచనా ఆచారాల ప్రభావం ఏమైనా వుందా అనేదీ చర్చనీయాంశమే.

[3] గతితర్కం విషయంలో హెగెల్ మార్క్స్కు గురువైతే, అసలుకు మౌలిక తాత్విక, ప్రాపంచిక దృక్పథం విషయంలో జర్మన్ భౌతికవాద భీష్మునిగా చెప్పదగిన
ఫ్యుయర్బాక్ మార్క్స్కు అసలు గురువని చెప్పవచ్చు. కనుకే మార్క్స్ తాత్విక వివరణల్లోకెల్లా అత్యంత విలువైన, తత్వార్థసూచకమైన, మర్మగర్భమైన రచన ఆయన లిఖించిన 'ఫ్యుయర్బాక్పై శోధనావాదాలు (Theses on Feuerbach)' అనే 11 వాదనలతోకూడుకున్న సంక్షిప్త రచన అంటారు.