Wednesday, September 23, 2009

శ్రమ - మార్క్స్‌ (1)

శ్రమ
మానవుని స్వయంసృష్టికి సాధనం శ్రమ అనేది మార్క్స్‌ అభిప్రాయం. వైకోను ఉల్లేఖిస్తూ ఆయన యిలా అంటాడు: "మానవ చరిత్రకూ ప్రకృతి చరిత్రకూ తేడా ఏమిటంటే మనం మొదటిదాన్ని [అంటే మానవ చరిత్రను] సృష్టించాముగాని రెండోదాన్నిమాత్రం కాదు [అంటే ప్రకృతి చరిత్ర మనం సృష్టించింది కాదు] అనేదే." ఈ క్రమాన్ని పెట్టుబడి లో మార్క్స్‌ యిలా చక్కగా సంగ్రహించి చెబుతాడు: "శ్రమ అనేది, మొదటగా, మనిషీ, ప్రకృతీ ఉభయులూ పాల్గొనే ఒక ప్రక్రియ; దానిద్వారా మనిషి తన సొంత సంకల్పంతో తనకూ, ప్రకృతికీ మధ్య భౌతిక (లేక పాదార్థిక) ప్రతిచర్యల్ని ప్రారంభించి, క్రమబద్ధం చేస్తూ, అదుపులోవుంచుకుంటూ వుండేటటువంటి ప్రక్రియ అది… ఈ విధంగా బాహ్య ప్రపంచంపై చర్యలు జరుపుతూ, దాన్ని మార్చడం ద్వారా, అతడు [మనిషి] తన సొంత నైజాన్నే (స్వభావాన్ని లేక ప్రకృతిని - nature) మార్చివేసుకుంటాడు. తనలో నిద్రాణమైవున్న శక్తుల్ని తట్టిలేపి, వాటిని వికసింపజేసి, తన శాసనానికి విధేయకంగా అవి వర్తించుకునేటట్లు [వాటిని] బలవంతపెడతాడు. "
ఈ భావన మార్క్స్‌లో ఆయన తొలి రచనల కాలంనుండే ఉనికిలో వుండింది. నిజానికి, పాక్షికంగానైనా, ఈ భావనను ఆయన హెగెల్‌ నుండి తీసుకొచ్చుకొన్నాడు; తన పారిస్‌ రాతప్రతులు లో ఆయన హెగెల్‌తో సమ్మతించింది ఈ కీలకాంశంపైనే. "ఆయన (హెగెల్‌) శ్రమయొక్క స్వభావాన్ని గ్రహిస్తాడు; కర్మపర (objective) మానవుడు – నిజమైన మనిషిగనుక యథార్థమైన మనిషి – తన సొంత శ్రమయొక్క ఫలితమేనని అర్థం చేసుకొంటాడు," అని మార్క్స్‌ హెగెల్‌ను ప్రశంసిస్తాడు. మరో వైపున, "కాని, హెగెల్‌ శ్రమ యొక్క ధనాత్మక పక్షాన్నే [సుగుణాన్నే – positive side] చూస్తాడు గాని దాని రుణాత్మక పక్షాన్ని గమనించడు. ఒక బాహ్యీకరణలో మనిషి తనకైన తానుగా రూపొందేది అంటే బాహ్యీకృత మానవుడు అయ్యేది శ్రమ సాధనంద్వారానే. హెగెల్‌కు తెలిసిన, ఆయన గుర్తించే ఏకైక శ్రమ అనిర్దిష్ట మానసిక శ్రమమాత్రమే," ననికూడ విమర్శిస్తాడు.
మొదట్లో మార్క్స్‌ పరాయీకరణకు సంబంధించి అత్యంత ముఖ్యమైన రంగం మతమో లేక రాజకీయాలో అని భావిస్తూండే వాడుగాని 1844లోనే ఆయన మనిషి పరాయీకరణకు సంబంధించి అతిప్రాథమిక క్షేత్రం శ్రమ క్రమమేననే నిర్ణయానికి వచ్చాడు; అప్పటి నుండీ ఆ అభిప్రాయాన్ని మరి వదిలిపెట్టలేదు. తన శ్రమ ఫలం తనకు చెందడంలేదనేగాక, అసలుకు తన ప్రయోజనాలకే విరుద్ధమైన శక్తిని అది (శ్రమఫలం) కలిగివుంటుందని కార్మికుడు ఎలా అనుభూతి చెందుతాడో వివరిస్తూ, పెట్టుబడిదారీ సమాజంలోని పరాయీకృత శ్రమ స్థితిగతుల్ని పారిస్‌ రాతప్రతులు లో చక్కగా వర్ణించి చెబుతాడు మార్క్స్‌. అంటే, ఉత్పత్తి కార్యకలాపంలో కార్మికుడు సుఖశాంతులేవీ పొందడం లేదు; ఇతర మనుషులతో బాటు అతడు పాలు పంచుకొనే సహజ [ప్రాకృతిక] ప్రపంచం,
ప్రతిభాయుక్తులు అన్నీ అతడికి పరాయివై పోయినాయి; చివరకు మనుషులు తమ సాటి మనుషులనుండి పరాయి కావడమేగాక, వైరులుకూడ అయిపోయారనే [తదనుసారంగా] గ్రహించాల్సివుంటుంది అని అంటాడు. ఆ పిదప తన జేమ్స్‌ మిల్‌పై వివరణా వ్యాఖ్యలు లో మార్క్స్‌ పరాయీకరణ చెందని [అపరాయీకృత] శ్రమ ఎలా వుంటుందో నాలుగు అంశాలుగా – ఒక కవితావేశ శైలిలో – వివరించి చెబుతాడు; శ్రమ అనేది మానవ సారాన్ని సృష్టించి, సుసంపన్నం గావించే ఒక కేంద్ర కార్యకలాపంగా ఎలా రూపొందగలదో చక్కగా వర్ణించి చెబుతాడు.
భావి కమ్యూనిస్టు సమాజంలో శ్రమ స్వభావం ఎలా వుండ గలదనే విషయమై మార్క్స్‌యొక్క అతి స్పష్టమైన ప్రకటనలు, వ్యాఖ్యలు మనకు [ఆయన రాసిన] గ్రండ్‌రిస్సేలో కనిపిస్తాయి. ఇక్కడ మార్క్స్‌ తన వైఖరిని ఆడం స్మిత్‌, ఫొరియర్‌ల తీవ్ర భావనలకు మధ్యేమార్గంగా సమర్పిస్తాడు. ఆడం స్మిత్‌ ప్రకారమైతే శ్రమ అనేది అవశ్యం ఒక భారంగా, ఒక త్యాగంగా వుంటుంది; తీరికే [విశ్రాంతిగా వుండడమే] మనిషికి సుయుక్తమైన [తగిన] స్థితి. కాగా ఫొరియర్‌ తన భావి ఆదర్శసమాజ చిత్రణలో పని అంటే ఒక ఆటలా, ఒక వినోదంగా వుండగలదని వర్ణిస్తాడు. ఆడం స్మిత్‌కు ప్రతిగా మార్క్స్‌ ఏ మనిషి కైనా ఒక మామూలు మొత్తం శ్రమ చేయక తప్పదనీ [చేయాల్సిన అవసరం వుంటుందనీ], మరి [యిలాంటి] సముచిత సందర్భంలో శ్రమ యొక్క ఫలితం - "కర్తయొక్క స్వయంసాధనగా, పదార్థీకరణగా, కనుక నిజమైన స్వతంత్రంగా వుంటుందనీ, ఈ నిజమైన స్వతంత్రపు కార్యకలాపం సరిగ్గా ఈ శ్రమే [నని తెలియాలి]" అని అంటాడు. కాని, అదే ఫొరియర్‌కు విరుద్ధంగా మాట్లాడుతూ, "నిజంగా స్వతంత్రమైన శ్రమ, ఉదాహరణకు సంగీతం కూర్పునే తీసుకొంటే, అది [ఆట, వినోదాలకు సమంగా వుండొచ్చుగానీ] అదే సమయంలో అతి గంభీరమైన పని అనీ [అంటే అల్లాటప్పా, లేక ఆషామషీ వ్యవహారమేమీ కాదనీ - అను.], అత్యంత మహత్తర [లేక భారీ] కృషి అందుకు అవసరం పడుతుందనీ గమనించాలి. మరి భౌతిక ఉత్పత్తి క్రమంలోని శ్రమ – 1. ఒక సాంఘిక స్వభావం కలిగివుంటేనే, 2. ఒక శాస్త్రీయ స్వభావం వుంటేనే, ఈ స్వభావాన్ని [అంటే గహనమైనా వినోదంలా వుండే స్వభావాన్ని] కలిగి వుండగలదని గ్రహించాలి," అని అంటాడు.
మరి శ్రమకు కేటాయించబడ్డ ఖచ్చితమైన విధి ఏమిటో అన్ని వేళలా స్పష్టంగా వుండదు [మార్క్స్‌ రచనల్లో]: - పారిస్‌ రాతప్రతులు లోనైతే శ్రమ – కనీసం ఆదర్శప్రాయ రూపంలోనేగానీ – మనిషి యొక్క సకల కార్యకలాపాలతోనూ సహవ్యాప్తమై వుంటుంది. అయితే, ఈ విషయమై గ్రండ్‌రిస్సే లోని ముఖ్య సిద్ధాంతవాదాల్లో ఒకటేమంటే యంత్రాల అభివృద్ధీ, స్వయం-చలనీకరణ (ఆటొమేషన్‌) లు మనుషులకు ఎంతో తీరిక సమయాన్ని సమర్పిసాయి; ఎంతగా తీరికనిస్తాయంటే, అంతదాకా ఒక పరాయీకరణగావించే స్థితి గతుల్లో అధిక గంటలు పనిచేయక తప్పని ఆవశ్యకతవల్ల మొద్దు బారిన [గిడసబారిన - stunted] అనేక శక్తిసామర్థ్యాలను వాళ్లు ఒక కమ్యూనిస్టు సమాజంలోనైతే వికసింపజేసుకోగలుగుతారు [అనేది]. ఇదే అంశాన్ని పెట్టుబడిలో మరింతగా నొక్కిచెప్పబడుతుంది. అందులో మార్క్స్‌ ఆవశ్యకతా రాజ్యానికి భిన్నంగా ఒక స్వేచ్ఛా రాజ్యం వుంటుందని [రంగప్రవేశం చేయగలదని] వివరించి చెబుతాడు. స్వేచ్ఛారాజ్యం "నిజానికి, అవసరంకోసం, బాహ్య ఉద్దేశ్యాలకోసం నిర్ణయించబడే శ్రమ అంతరించినప్పుడే ప్రారంభమౌతుంది. కనుక అది దాని స్వీయనైజం రీత్యానే, యథార్థ భౌతిక [పాదార్థిక] ఉత్పత్తి క్షేత్రానికి బాహ్యంగానే వుంటుంది," అని అంటాడు. ఇంకా, ఒక కమ్యూనిస్టు• (సంఘవాద) ఉత్పత్తి వ్యవస్థలో సైతం మనిషి ప్రకృతితో చేసే పోరాటం [మట్టుకు] "సదా ఆవశ్యకతా రాజ్యం [పరిథుల] లోనే నిలిచివుంటుంది. దానికి ఆవల [మాత్రమే] ఆ తనకోసం తానేగా మానవ అంతస్థశక్తులు వికసించడమనేది – నిజమైన స్వేచ్ఛారాజ్యం అనేది – మొదలవుతుంది; కాని అది [స్వేచ్ఛారాజ్యం] ఆ ఆవశ్యకతా రాజ్యం ప్రాతిపదికనమాత్రమే వర్ధిల్లగలుగుతుంది. పనిదినం తగ్గింపు (కురచసేత) ఇందుకు మౌలికమైన ముందుషరతు అయి వుంటుంది." అనికూడ చేర్చి చెబుతాడు మార్క్స్‌.
ఏదేమైనా, భావి కమ్యూనిస్టు సమాజంలో శ్రమ స్వభావం మౌలికంగా మారిపోతుందని మార్క్స్‌ యోచించాడనేది స్పష్టమే. తుదకు 'శ్రమ రద్దు' సంభవించవచ్చనికూడ ఆయన అంటాడు మరి. గ్రుండ్‌రిస్సే లోనైతే 'సాధారణరూపంలోని సిరిసంపదలు గడించాలనే దాని అవిశ్రాంత ప్రయత్నంతో' 'శ్రమను దాని సహజ అవసరాల పరిథికి ఆవలగా తోలుకుపోయి, ఆ విధంగా ఒక సుసంపన్న వ్యక్తిత్వం – అది చేసే ఉత్పత్తిలో ఎలాగో అది గావించే వాడకంలో కూడ అలాగే సార్వత్రికంగా వుండే, ఆ విధంగా స్వయానా అది చేసే శ్రమ సైతం మరెంతమాత్రం ఒక శ్రమ [చాకిరీ] గాకాక దానిలోని ప్రత్యక్షరూపపు ప్రాకృతిక ఆవశ్యకత అనేది పూర్తిగా అదృశ్యమైవుండే మానవ కార్యకలాప సంపూర్ణ వికాసంగా అగుపించేటటువంటి [సంపన్న] వ్యక్తిత్వం – సృష్టికి [లేక వికాసానికి] వలసిన భౌతిక (పాదార్థిక) అంశాలను జనింపజేసే" పెట్టుబడి సామర్థ్యాన్నిగురించి మార్క్స్‌ ప్రస్తావిస్తాడుకూడ. పోతే జర్మన్‌ భావజాలం లోనైతే మార్క్స్‌, "శ్రమ నాగరిక దేశాలన్నింటిలోనూ స్వతంత్రంగానే వుంది; కనుక కావలిసింది [లేదా చర్చించాల్సింది] శ్రమను స్వతంత్రం చేయడంగురించి కాదు, దాని రద్దును గురించే," నని సంక్షేపంగా ప్రకటిస్తాడుకూడ.
శ్రమనుగురించి మార్క్స్‌కున్న భావనలో ఒక ప్రాథమిక అంశం శ్రమవిభజనయొక్క అతిదుర్మార్గమైన ప్రభావంగురించిన ఆయన అభిప్రాయమే. ఈ [అంటే శ్రమవిభజన ప్రభావం అతిదుర్మార్గమైనదనే] భావన చరిత్రనుగురించిన మార్క్స్‌ తత్వచింతనకే మౌలికమైనది. శ్రమవిభజన సాక్షాత్కరించిన ఫలితంగానే రాజ్యయంత్రాంగం యావత్తూ అవతరిస్త; అది [శ్రమ విభజన] అదృశ్యమవడంతోటే రాజ్యమూ విలుప్తమై పోతుంది. శ్రమ విభజన అంతర్ధానం శారీరక శ్రమకూ, మానసిక శ్రమకూ మధ్యగల అంతరాన్నిసైతం రూపు మాపుతుంది. ఈ విధంగా ఏ వ్యక్తి అయినా "పొద్దున్నే వేటకు, మధ్యాహ్నం చేపలు పట్టడానికి, సాయంత్రం పశుపాలనకు [యిలా తనకిష్టమైన వివిధ వ్యాపకాలకు] వెళ్లివచ్చి, రాత్రి భోజనంతర్వాత [తీరిగ్గా] చర్చలు-విమర్శల్లో నిమగ్నమవగలిగేటటువంటి" ఒక [నవ] సమాజం ఆవిర్భవించగలదు. ఈ వ్యాఖ్య ఒక చాల గ్రామీణ స్వభావం గల సమాజానికే వర్తిస్తుందనేది సుస్పష్టమే. దీన్ని మరీ అంత గంభీరమైందిగా తీసుకుని యోచించాల్సిన అవసరంకూడ లేదు. అయితే సాంకేతిక పరిజ్ఞానం, స్వయంచలనీకరణ (ఆటొమేషన్) ల అభివృద్ధితో మనుషులు చేయాల్సివచ్చే కర్తవ్యాలు సులభసరళం అవుతాయి, అందువల్ల వాళ్లు అతివేగంగా ఒక పనినుండి మరొక పనికిగా మార్చుకుంటూ [అనేక పనులు] చేయగలుగుతారు అని మార్క్స్‌ అభిప్రాయపడిన మాటమాత్రం నిజమే. "కమ్యూనిస్టు సమాజంలో చిత్రకారులు (పెయింటర్లు) అని ప్రత్యేకంగా ఎవరూ వుండరుగానీ అత్యధిక జనం తమ ఇతరేతర కార్యకలాపాలతోబాటు చిత్రరచన (పెయింటింగు) కూడ చేస్తుంటారు," అని సైతం మార్క్స్‌ అంటాడు. ఇక పోతే, పురోగమిత సాంకేతిక పరిజ్ఞానయుత సమాజం తెచ్చిపెట్టే సమస్యలేవైనాగానీ, శ్రామికునికి సంబంధించిన మార్క్స్‌ ఆదర్శంమాత్రం పారిస్‌ రాతప్రతులు లోని 'సర్వతోముఖ ప్రతిభా వంతుడు (all-round man)' గానూ, గ్రుండ్‌రిస్సే లోని 'సామాజిక వ్యక్తి' గానే నిలిచివుండిందని గమనిస్తాము.

* * * * *

2 comments:

Praveen Sarma said...
This comment has been removed by the author.
Praveen Sarma said...

చాలా మంది శ్రమ విలువని గుర్తించరు. చారిత్రక భౌతికవాద నియతి సూత్రం (historical materialistic terminology) ప్రకారం శ్రమ లేకపోతే పరిణామం అనేది ఉండే అవకాశం లేదు.