Wednesday, September 23, 2009

శ్రమ - కార్ల్‌ మార్క్స్‌ (2)

మూలపాఠాలు:

కనుక శ్రమకు ముఖ్యమైన [ప్రధానంగా ఆవశ్యకమైన] సంబంధం ఏమిటి అని ప్రశ్నించేటప్పుడు, [నిజానికి] మనం కార్మికునికీ, ఉత్పత్తికీ నడుమ వుండే సంబంధంగురించి అడుగుతున్నామన్న మాట.
ఇంతదాకా మనం కార్మికుడి పరాయీకరణకు – లేక అతడి బాహ్యీకరణ [externalization] కు – సంబంధించి ఒక కోణంగురించి మాత్రమే, తన శ్రమజన్య ఉత్పత్తులతో అతడికుండే సంబంధం గురించిమాత్రమే, యోచించాము. కాని పరాయీకరణ అనేది కేవలం [ఉత్పత్తిక్రమం] ఫలితంలోనేగాక, స్వయంగా ఉత్పత్తి క్రియలో సైతం – ఉత్పత్తి కార్యకలాపం లోపలే కూడ – తన్ను ప్రకటించుకొంటుంది. తాను గనుక ఉత్పత్తి కార్యప్రక్రియలోనే తన్ను తాను పరాయి గావించుకొని వుండని పక్షంలో శ్రామికుడు [లేదా కార్మికుడు] తన ఉత్పత్తి ఫలాన్ని ఒక అన్య [పరాయి] వస్తువుగా ఎదుర్కొనడం ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఉత్పత్తి ఫలం కేవలం ఉత్పత్తి కార్య కలాపంయొక్క సంగ్రహపాఠంవంటిదే కదా. కనుక శ్రమజన్య ఫలం ఒక బాహ్యీకరణ అయిన పక్షంలో, అసలుకు ఉత్పత్తే ఒక క్రియాశీల బాహ్యీకరణగా, కార్యకలాపపు బాహ్యీకరణగా, బాహ్యీకరణయొక్క కార్యకలాపంగా అయివుండాలి. [కనుక] శ్రమలక్ష్య వస్తువుయొక్క పరాయీకరణ కేవలం [మొత్తం] పరాయీకరణయొక్క సంగ్రహం మాత్రమేనని, స్వయానా శ్రమ కార్యకలాపంలోనే సంభవించే బాహ్యీకరణేనని గ్రహించాలి.
మరప్పుడు శ్రమయొక్క బాహ్యీకరణ అంటే ఏమిటి? [అది (శ్రమ బాహ్యీకరణ) దేన్ని కలిగివుంటుంది?]
మొదటగా, శ్రమ కార్మికునికి బాహ్యం [వెలుపల] గా వుంటుందని గమనించాలి. అంటే అది అతడి సారాంశానికి చెందనిదై వుంటుంది. అందువల్ల శ్రామికుడు తన పనిలో తనను ధ్రువపరుచుకోలేక పోతాడు; తన్ను తాను నిరాకరించుకుంటుంటాడు; సంతోషంగా వుండడానికి బదులు దైన్యతానుభూతి చెందుతూ వుంటాడు; స్వేచ్ఛగా ఏ శారీరక, బౌద్ధిక శక్తినీ ప్రయాగించడు సరిగదా తన శరీరాన్ని శోషింపజేసుకుంటూ, తన మనస్సు పాడు చేసుకుంటూ వుంటాడు. ఈ విధంగా కార్మికుడు కేవలం తన పనికి వెలుపల మట్టుకే ఇంటిసుఖంగా వుండగల్గుతాడుగాని, తన పనిలో మాత్రం తానొక పరాయివానిలా అనుభూతి చెందుతుంటాడు. తాను పని చేయనప్పుడే అతడు ఇంటిసుఖంగా వుంటాడుగాని పని చేస్తున్నప్పుడు అలా ఇంటిసుఖంగా వుండలేకపోతాడు. కనుక అతడి శ్రమ స్వచ్ఛందమైందికాక నిర్బంధమైనదై వుంటుంది – వెట్టి చాకిరీ [బలవంతపు శ్రమ] గా వుంటుంది. కనుక అది ఏదైనా ఒక అవసరాన్ని సంతృప్తిపరుచుకోవడంగాకాక, స్వయానా దానికి బయట వుండే అవసరాలను సంతృప్తి పరుచుకొనేందుకు ఒక సాధనంగా మాత్రమే వుంటుంది. ఏదైనా శారీరక లేక యితర తప్పనిసరి [నిర్బంధ] పరిస్థితి లేనప్పుడు దాన్ని [శ్రమను] ఒక మహమ్మారి [ప్లేగు] లా భావించి ఎలా విడిచి పెడుతుంటారో [అంటే శ్రమ చేయకుండా తప్పించుకుంటారో] ! – ఆ [ఒక్క] వాస్తవం నుండే అది [శ్రమ] నిజంగా ఎంత పరాయిదిగా [అయి] వున్నదో బాగా స్పష్టమైపోతుంది. బాహ్య శ్రమ, దేనిలోనైతే మనిషి తన్ను బాహ్యీకరించుకుంటాడో ఆ శ్రమ, ఆత్మత్యాగం, అమితశోషణలతో కూడుకున్న శ్రమగా వుంటుంది. అంతిమంగా, అది (తాను చేసే శ్రమ) తన సొంతం కాదు, మరెవరికో చెందినదనీ, అది తనకు (శ్రామికునికి) చెందదనీ, ఇంకా స్వయంగా అతడు (శామికుడు) సైతం తాను శ్రమ చేసేటప్పుడు తనకు తాను చెందివుండడు, మరెవరికో చెంది వుంటాడనే వాస్తవంలో కార్మికునికి సంబంధించి శ్రమయొక్క బాహ్య స్వభావం స్వయంప్రకటమవుతుంది. [ఉదాహరణకు] మతంలోనైతే మానవ కల్పనాశక్తియొక్క స్వీయ కార్యకలాపం – మనిషి తలా, గుండెకాయల [అంటే మనసూ, హృదయాల] కార్యకలాపం, ఏదో దేవుళ్ల లేక దెయ్యాల, [అంటే] పరాయిదైన, కార్యకలాపంలా ఆ వ్యక్తిపై ఎలా స్వతంత్రంగా ప్రతిచర్య జరుపుతుందో [లేక, ప్రభావం చూపుతుందో], అదే విధంగా, కార్మికుని కార్యకలాపంకూడ అతడి సొంత అయత్న పూర్వక కార్యకలాపమై వుండదు. అది మరొకరికి చెందివుంటుంది; అతడి [శ్రామికుడి] తన్నుతాను నష్టపోవడంగా వుంటుంది. - 1844 రాత ప్రతులు, ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 80.
జంతువుకూడ సృష్టిస్తుంది [ఉత్పత్తి చేస్తుంది] గదా అంటే అది నిజమే. అది తనకోసం ఒక గూడునో, ఒక పట్టునో, ఒక పుట్టనో – పక్షిలాగా, తేనెటీగలాగా, లేక చీమ లాగా – కట్టుకుంటుందికూడ. అయితే అది తనకోసం లేదా తన సంతానంకోసం తక్షణమే కావల్సిందేదో [, కావల్సినంత] మాత్రమే ఉత్పత్తి గావిస్తుంది; అది ఏకపక్షంగా మాత్రమే ఉత్పత్తి గావిస్తుంది, కాగా మనిషి మాత్రం సార్వత్రికం [విశ్వవ్యాప్తం] గా ఉత్పత్తి గావిస్తాడు. అది [జంతువు] తక్షణ శారీరక అవసరాల వత్తిడిలో ఉత్పత్తి గావిస్తుంది; కాగా, మనిషి మాత్రం శారీరకావసరానికి స్వతంత్రంగా ఉత్పత్తిగావిస్తాడు, అసలుకి తాను అలా [అంటే శారీరక అవసరాల నిమిత్తంలేకుండా] స్వతంత్రంగా వున్నప్పుడే మనిషి నిజంగా ఉత్పత్తి చేయగలుతాడు కూడ. అది (జంతువు) తన్ను తానుమాత్రమే ఉత్పత్తి చేసు కొంటుంది; కాగా మనిషి యావత్‌ ప్రకృతినే పునరుత్పత్తి [పున:సృష్టి] గావిస్తాడు. జంతువు చేసే ఉత్పత్తి తక్షణంగా దాని శరీర అంగానికే [అవయవాలకే] చెందుతుంది; కాగా మనిషిమట్టుకు తన ఉత్పత్తినుండి తాను సులభ స్వతంత్రంగా వేరు గావించుకోగలుగుతాడు. జంతువైతే తానే జీవజాతికి చెందుతుందో దాని అవసరాలు, ప్రమాణాలకు తగ్గట్లు మాత్రమే ఉత్పత్తుల్ని మలుచుకోగలుగుతుంది; కాగా మనిషికి మాత్రం ప్రతి ఒక్క జీవజాతి అవసరాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఎలా ఉత్పత్తి చేయాలో తెలిసివుంటుంది; అలాగే ప్రతి చోటా ఏ [ఉత్పత్తైన] వస్తువుకైనా దాని స్వతస్సిద్ధ ప్రమాణాలు ఎలా వర్తింప జేయాలోకూడ తెలిసివుంటుంది; [కనుక] మనిషి సౌందర్యసూత్రాలకు అనుగుణంగా వస్తువుల్ని రూపొందించగల్గుతాడు.
ఈ విధంగా, భౌతిక ప్రపంచాన్ని మలుస్తూ ఉత్పత్తిపని చేయడంద్వారానే మనిషి తన్నుతాను ఒక జీవజాతి అస్తిత్వంగా మొట్టమొదటగా, నిజంగా ధ్రువపర్చుకుంటాడు. ఈ ఉత్పత్తే అతడి క్రియాశీల జీవజాతిపర జీవితంఅని చెప్పవచ్చు. దాని [ఉత్పత్తి] ద్వారా ప్రకృతి మనిషియొక్క కృషి [క్షేత్రం, ఫలితం] గా, అతడి వాస్తవికతగా అగుపిస్తుంది. అందుచేత [అతడి] పని లక్ష్యవస్తువు, మనిషియొక్క జీవజాతిపర జీవితపు కర్మపదార్థీకరణ (objectification) గా వుంటుంది; ఎందుకంటే, అతడు కేవలం బౌద్ధికంగా, తన మనసు లోపలగా మాత్రమేగాక, క్రియాశీలంగా వాస్తవికతలో సైతం తన్ను తాను తిరిగి సృష్టించుకో (duplicate) గల్గుతాడు; మరి ఆ విధంగా, తానే సృష్టించిన ఒక ప్రపంచంలో తన ప్రతిబింబాన్ని తానే చూచుకో గల్గుతాడు. – 1844 రాతప్రతులు, ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 82.
కాని శ్రమశక్తి ప్రయోగం (లేదా వినిమయం) – అంటే శ్రమ – కార్మికుని సొంత జీవిత కార్యకలాపంగా, అతని సొంత జీవితపు అభివ్యక్తీకరణగా వుంటుంది. మరి ఈ జీవిత కార్యకలాపాన్ని అతడు తనకు అవసరమైన బతుకుతెరువు సాధనాలు చేకూర్చుకోవడం కోసం మరో వ్యక్తికి అమ్ముకుంటాడు. ఈ విధంగా తన జీవిత కార్య కలాపం అతడికి తన మనుగడ సాగించేందుకు వీలు కల్పించే ఒక సాధనంగామాత్రమే వుంటుంది. బతకడానికిగాను అతడు పని చేస్తాడు. అతడు శ్రమను కనీసం తన జీవితంలో ఒక భాగంగానైనా పరిగణించడు; కాగా అతడికి అది (శ్రమ) తన జీవితంలో ఒక త్యాగంగా అనిపిస్తుంది. [అతడికిసంబంధించినంత వరకూ] తాను ఇంకొకళ్లకు అప్పగించివేసిన ఒక వర్తకపు సరుకు అది. అందువల్ల కూడ అతడి క్రియాకలాపపు ఉత్పత్తిఫలం అతడి క్రియాకలాపపు లక్ష్యవస్తువు (object) అయివుండదు. తాను నేసే పట్టుబట్టలు, తాను గనినుండి తవ్వితీసే బంగారం, తాను నిర్మించే రాజభవనం – యివేవీ అతడు తనకోసం సృష్టించుకొనేవి కావు. అతడు తనకోసం సృష్టించుకొనేది వేతనాలు మాత్రమే; పట్టు బట్టలు, బంగారం, రాజభవనం అన్నీ అతడికి సంబంధించినంత వరకూ ఒక నిశ్చిత మొత్తపు బతుకుగడుపు సాధనాలుగా, బహుశా ఒక నూలుచొక్కా, కొన్ని రాగి కాసులు, ఏదైనా నేల మాళిగలో కాసింత ఉండేచోటుగా పరిష్కారమై వుంటాయి. మరి పన్నెండు గంటలపాటూ నేత నేసే, దారం వడికే, తొలిచే, తరిమెన పెట్టే, కట్టకం పనిచేసే, పారపని చేసే, రాళ్లు కొట్టే, బరువులు మోసే, వగైరా వగైరా పనులు చేసే కార్మికుడో – అతగాడు ఈ పన్నెండు గంటల నేతపనిని, వడకడాన్ని, తొలవకాన్ని, తరిమెన పనిని, పారపనిని, రాళ్లు కొట్టడాన్ని, వగైరా వగైరా పనుల్ని తన జీవితపు అభివ్యక్తీకరణగా, తన జీవితంగా పరిగణిస్తాడా? [లేదు.] పైగా, అసలుకు ఈ కార్యకలాపం ముగిసినంకనే – భోజనాల బల్ల వద్ద, సారా అంగట్లో, పడుకొనే పరుపు వద్ద – ప్రారంభమౌతుంది జీవిత కలాపం అతడికి సంబంధించినంతవరకూ. కాగా, అతడికి సంబంధించి ఈ పన్నెండు గంటల పనికి, ఒక నేతగానో, ఒక వడుకుడుగానో, ఒక తొలుచుడుగానో, యిలా యిలా [ఆయా పనిస్వభావాలరీత్యా] అర్థమేమీ వుండదు; కేవలం తనను భోజనం బల్లవద్దకు, సారా అంగడికి, పరుపువద్దకు తీసుకెళ్లే ఒక సంపాదన [గడించిపెట్టేది] గామాత్రమే దాన్ని [తన పన్నెండు గంటల శ్రమను] అతడు అర్థంచేసుకుంటాడు. – కూలి పని - పెట్టుబడి (1849), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 250 నుండీ. (వక్కాణింపు మాది)
ఒకే కార్మికుడు ఐదుగురు, పదుగురు, లేక ఇరవైమంది చేసే పనిని చేసేలా సశక్తం గావిస్తుంది ఈ ఇతోధిక శ్రమవిభజన. అందుచేత అది కార్మికుల నడుమ పోటీనికూడ ఐదు రెట్లు, పది రెట్లు, లేక ఇరవై రెట్లుగాకూడ హెచ్చుగావిస్తుంది. కార్మికుల మధ్య పోటీ కేవలం ఒక కార్మికుడు మరొకరికన్నా తనను చౌకగా అమ్ముకొనేవిధంగామాత్రమేకాక, ఐదుగురు, పదుగురు లేక ఇరవై మంది చేసే పనిని ఒకళ్లే చేసే రూపేణాకూడ వుంటుంది. ఇక పెట్టుబడిచే ప్రవేశపెట్టబడి, [ఆనక దానిచే] నిరంతరం పెంపుగావించ బడుతూండే శ్రమ విభజన కార్మికులు తమలోతాము ఈ [రెండవ] విధంగా పోటీపడేట్లు బలవంతపెడుతుంది.
ఇంకా, శ్రమ విభజన పెరిగేకొద్దీ, శ్రమకూడ సులభసామాన్యమై పోతూంటుంది. కార్మికుని ప్రత్యేక నిపుణత అనేదానికి విలువ లేకుండా పోతూంటుంది. తీవ్రమైన శారీరక లేక బౌద్ధిక ప్రతిభా యుక్తుల్ని వినియోగించాల్సిన అవసరంలేని ఒక సులభసామాన్య, విసుగుపుట్టించే ఏకరీతి ఉత్పాదక శక్తిగా అతడు మార్పుగావించ బడతాడు. అతడి శ్రమ ఎవరేగానీ చేయగల [సులభసామాన్య] శ్రమగా మారి పోతుంది…
కనుక, శ్రమ మరింత అసంతృప్తికరంగా, మరింత వెగటుగా అయేకొద్దీ పోటీ పెరిగిపోతూంటుంది, వేతనాలు తరిగిపోతూంటాయి. దానితో కార్మికుడు ఇతోధికంగా పనిచేయడంద్వారా – ఎక్కువ పని గంటలు పనిచేయడంద్వారాగానీ, లేదా ఒకే పనిగంటలో ఇతోధిక ఉత్పత్తి తీయడంద్వారాగానీ – తన వేతనాల మొత్తం పడిపోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే దారిద్ర్యం తనను తరుముతుండడంతో అతడు శ్రమ విభజన వలని చెడు ఫలితాలను ఇంకా ఎక్కువగావిస్తూ పోతుంటాడన్నమాట. ఫలితంగా తాను ఎంత ఎక్కువగా పని చేస్తే అంత తక్కువగా జీతాలు పొందుతుంటాడు – ఇదంతా ఒక సులభసామాన్య కారణంగానే – అంటే ఏ మేరకు తన వేతనాలు తగ్గిపోతాయో ఆ మేరకు అతడు తన తోటి కార్మికులతో పోటీ పడుతూండడంవల్ల, అందుమూలంగా ఆ సహకార్మికుల్ని తనలాగే తానెంత కనాకష్టపు షరతులకు పని చేయడానికి ఒప్పుకుంటాడో, వాళ్లూ అంతే నికృష్ట షరతులకు తమ శ్రమను సమర్పించడానికి ముందుకువస్తూ తనకు ఎందరోమంది పోటీ దారుల్లా అయేట్లు తానే చేయడంవల్ల, కనుక అంతిమ పరిశీలనలో తాను తనతోనే - అంటే కార్మికవర్గంలో ఒక సభ్యునిగా వుండే తనతోనే – పోటీచేస్తున్న స్థితిలో పడిపోవడంవల్లే.
పోతే యంత్రాలుకూడ [వాటిని నడపడానికి] నిపుణ కార్మికులకు బదులు నిపుణతలేని కార్మికుల్ని, మగవాళ్ల స్థానంలో ఆడవాళ్లను, వయోజనులకు బదులు పిల్లలను తెచ్చిపెట్టడంద్వారా అవే [పైన పేర్కొన్న విధమైన] ఫలితాల్నే కలగజేస్తాయి. వాటిని కొత్తగా ప్రవేశ పెట్టిన చోట్ల చేతిపని కార్మికుల్ని సామూహికంగా వీధుల్లోకి నెట్టి వేయడంద్వారా, మరి వున్న యంత్రాలను మెరుగుచేయడమో, వికసింపజేయడమో, లేక వాటిస్థానే [కొత్త] మరింత ఉత్పాదక యంత్రాలను తెచ్చిపెట్టడమో జరిగే చోట్ల అప్పటికున్న కార్మికుల్ని [మొదటిలా సామూహికంగాకాక అంతకంటే] చిన్న చిన్న జట్లుగా పని నుండి తొలగించడంద్వారా అవి [యంత్రాలు] అవే [పైన పేర్కొన్నట్టివే] ఫలితాల్ని కలగజేస్తాయి. - కూలిపని-పెట్టుబడి (1849), ఎంపికచేయబడ్డ
కార్ల్ మార్క్స్ రచనలు, పు. 265 నుండీ.
శ్రమ ఏ ప్రత్యేక రకానికి చెందిందనే విషయంగురించి అలక్ష్యం (పట్టింపులేని తత్వం - indifference) వుందంటే, నిర్దిష్ట శ్రమకుచెందిన కోవ [తరగతు] లలో ఏదీ మరెంతమాత్రం ఆధిపత్యంలో [మిగతా అన్నింటికంటే ప్రబలంగా] లేదనీ, అటువంటి వివిధ కోవలు సమ్మిశ్రితమైన, బాగా అభివృద్ధిచెందిన ఒక [శ్రమ] మొత్తంవుందనీ దాని అంతరార్థం అవుతుంది. కనుక అత్యున్నతమైన నిర్దిష్ట అభివృద్ధి వున్నచోట మాత్రమే – అనేక పరిణామాలు ఒకే లక్షణాన్ని సంయుక్తంగా కలిగివున్నట్లూ, ఆ లక్షణం వాటన్నింటికీ సామాన్య అంశంగా వున్నట్లూ కనిపించే సందర్భంలోమాత్రమే అత్యంత సాధారణ అనిర్దిష్టీకరణలు (abstractions – అమూర్తీకరణలు) తల యెత్తుతూ వుంటాయి [అని గమనించాలి]. ఈ [అన్నింటికీ సామాన్యంగా వుండే] లక్షణాన్ని ఇంకెంతమాత్రం ఒక ప్రత్యేక రూపంలో ఊహించుకుని ఆలోచించలేము. కాగా [మరో వైపున] ఈ శ్రమ అనిర్దిష్టీకరణ [లేదా అమూర్తీకరణ] అనేది వివిధ రకాల శ్రమల నిర్దిష్ట మొత్తంగావుండే ఫలితంగానే [అని గమనించాలి]. ఇలా ఒక ప్రత్యేక శ్రమ రకం గురించిన అలక్ష్యం అనేది వ్యక్తులు తేలిగ్గా [అల్కగా] ఒక రకం పనినుండి మరొక రకం పనికి సాగిపోగల ఒకానొక సమాజ రూపానికి అనుగుణంగా వుంటుంది; అందువల్ల తమవంతుకు ఏ ప్రత్యేక రకం పని పడుతుందనే విషయమై వారికి పట్టింపు లేకుండా పోతుంది. ఇక్కడ శ్రమ అనేది విస్పష్టంగానేకాక వాస్తవంగాకూడ సంపదను సాధారణంగా సృష్టించే సాధనంగా రూపొందింది; అది ఇంకెంత మాత్రం ఏదో ఒక వ్యక్తితో, ఏదో ఒక ప్రత్యేక తరహాలో అలుముకొని వుండే విధంగా లేదు. బూర్జువా సమాజాలన్నింటి లోకీ అత్యంత అధునాతనమైన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ వ్యవహార స్థితి అత్యున్నత వికాసం చెందింది. ఇక్కడ (అమెరికాలో) మాత్రమే 'శ్రమ' కోవయొక్క అమూర్తీకరణ – అంటే 'సాధారణత్వంలోని శ్రమ', విశేషణ పదజాలం వెంటలేని శ్రమ (labour sans phrase) వ్యవహారాచరణలో సాధించబడుతుంది. ఈ విధంగా ఆధునిక రాజకీయార్థశాస్త్రం తన ఆరంభ అంశంగా నిలిపే అత్యంత సులభసామాన్య అనిర్దిష్టీకరణ, పురాతన సమాజ కాలంనుండీ వస్తూ, నేటిదాకాకూడ అన్ని సమాజ రూపాల్లోనూ ప్రచలితమైవున్న ఒక సంబంధాన్ని వ్యక్తీకరించే ఈ అమూర్త అస్తిత్వం చివరకు అత్యంత ఆధునిక సమాజానికి చెందిన ఒక కోవ (తరగతి - category) గా మాత్రమే ఈ అమూర్తీకరణలో నిజంగా సాధించ బడినట్లు అగుపిస్తుంది. అయితే అమెరికాలో ఒక చారిత్రక ఫలంగా అగుపించేదే – అంటే శ్రమ ఏ ప్రత్యేక రకానికి చెందినది అనే విషయంపట్ల అలక్ష్యం - రష్యన్లకు సంబంధించైతే, ఉదాహరణకు, ఒక అయత్నపూర్వక, సహజసిద్ధ చిత్తవృత్తిగా అగుపిస్తుందిగదా అనొచ్చు. అయితే, అనాగరికులకు ప్రతిదానికీ ఒకేలా వర్తింపజేయ గల్గేటటువంటి ఒక సహజసిద్ధ పూర్వాభిమానం (predisposition) వుండొచ్చు; అలాగే మరి నాగరిక ప్రజలుకూడ తమను ప్రతి విషయానికీ వర్తింపజేసుకొనవచ్చు – కానీ రెంటికీ నడుమ బ్రహ్మాండమంత తేడా వుండదూ? పైగా, తాము ఏ రకం పని చేస్తున్నామనే విషయమై రష్యన్లకుండే అలక్ష్యానికి (పట్టింపులేని తత్వానికి) ఏదో ఒక అతికచ్చితమైన వృత్తియొక్క గాడిలోనే, తుదకు ఏవో బాహ్యశక్తులవల్ల అందునుండి బలవంతంగా బయటకు విసిరి వేయబడితే తప్ప, [సాంతం] కొట్టు మిట్టాడుతూ పడివుండే వాళ్ల సాంప్రదాయిక వ్యవహారాచరణే కారణమని [ఈ అలక్ష్యం ఆ వ్యవహారాచరణకు అనుగుణంగానే వుంటుందని] గమనించాలి. - గ్రండ్రిస్సే (1857-8), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 354 నుండీ.
భారీ పరిశ్రమ వికాసం అంటే అర్థం, అది ఏ ఆధారంగా నిలిచి వుంటుందో ఆ ప్రాతిపదిక – ఇతరుల శ్రమ కాలం భుక్తం చేసుకొనడం – మరెంతమాత్రం సంపదను ఏర్పరచడంగానీ, లేక సృష్టించడంగానీ వుండదు. అదే సమయంలో అసలుకు ప్రత్యక్ష శ్రమ అనేదే ఉత్పత్తికి ప్రాతిపదికగా వుండడం మానేస్తుంది, ఎందుకంటే అది [ప్రత్యక్ష శ్రమ] మరింత మరింతగా ఒక పర్యవేక్షక లేక క్రమబద్ధీకరణా కార్య కలాపంగా మారిపోతూంటుంది గనుక; అంతేగాక ఉత్పత్తి ఫలం [ఉత్పత్తయ్యే సరుకు] వ్యక్తిగత ప్రత్యక్ష శ్రమ జనితం కావడం మానేసి, మరింత మరింతగా సాంఘిక కార్యకలాప జనితమై వుంటుంది గనుక. "శ్రమ విభజన అభివృద్ధి చెందే కొద్దీ ఏ వ్యక్తి యొక్క పని అయినా దాదాపు పూర్తిగా ఒక మొత్తానికిచెందిన ఒక భాగంగా మాత్రమే, స్వయంగా దానికి సంబంధించి దానికి ఏ ప్రయోజనం లేక విలువ లేకుండా వుంటుంది. శ్రామికుడు [సగర్వంగా] 'ఇదిగో, ఇది నేను (ఉత్పత్తి) చేసింది, [ఇది నాది గనుక] దీన్ని నాకోసమే అట్టిపెట్టి వుంచుకుంటాను!' అని పట్టుకుని చూపించేందుకు అసలేమీ వుండదు." ఉత్పత్తిదారులమధ్య ప్రత్యక్ష పోటీలో ప్రత్యక్ష వ్యక్తిగత శ్రమ ఏదైనా ఒక ప్రత్యేక ఉత్పత్తిఫలంలో, లేక అలాంటి ఫలానికి చెందిన ఒక భాగంలోనే గానీ, సాధించబడినట్లు కనిపిస్తుంది; ఇక దాని ఉమ్మడి సాంఘిక స్వభావం – సాధారణ శ్రమయొక్క కర్మ పదార్థీకరణ (objectification) గా, ఇంకా సాధారణ అవసరాల సంతృప్తీకరణగా [వుండే శ్రమయొక్క సామాన్య సాంఘిక స్వభావం] – మారకంద్వారా మాత్రమే నెలకొల్పబడుతుంది. కాగా భారీ పరిశ్రమ యొక్క ఉత్పత్తిక్రమంలో [సరిగ్గా] ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది: ఒక వైపున, ఒకసారి శ్రమ సాధనాల ఉత్పాదక శక్తులు [పెరిగిపోయి] ఒక స్వయంచలిత క్రమంస్థాయికి చేరుకున్నప్పటినుండీ, యిక సమాజపు బౌద్ధికశక్తికి సహజ [ప్రాకృతిక] శక్తుల దాసోహం అనేది ఒక [తప్పనిసరి] ముందుషరా స్థితి [prerequisite] అయివుంటుంది. కాగా, మరోవైపున, దాని ప్రత్యక్ష రూపంలో వుంటూవచ్చే వ్యక్తిగత శ్రమ సాంఘిక శ్రమగా పరివర్తితమై వుంటుంది. ఈ విధంగా ఈ ఉత్పత్తి విధానపు ఇంకో ప్రాతిపదిక [అంటే ప్రత్యక్ష వ్యక్తిగత శ్రమ] అదృశ్యమై పోతుంది. – గ్రండ్రిస్సే (1857-8), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 382.
(ఇంకా వుంది)

No comments: