Monday, May 19, 2008

ON INDO-NEPAL TREATY AND SPECIAL RELATIONSHIP WITH INDIA

ON INDO-NEPAL TREATY

I think the open borders should continue and it is the Nepalese who benefit most from it. Introducing visa by Prachanda will also mean Nepalese have to get visa from India too and that will affect the livelihoods of millions of Nepalese who periodically come to India to make some money and go back home. Prachanda should not be swept by national chauvinism. Likewise India and China cannot be equated. Nepal had, has and will have a special relationship with India. It is almost like a border state of India and the people there I found to be so comfortable with Hindi and relations with Indians (except of course any exploiters among them). If there are any other specific clauses and instances of injustice to Nepal those should be discussed threadbare and sorted out in a spirit of friendship and mutual cooperation. Of course a review of the treaty and subsequent arrangements there should be.

పరాయీకరణగురించి మార్క్స్‌-4

పరాయీకరణగురించి మార్క్స్‌-4
[మార్క్స్‌] మూలపాఠాలు
పెట్టుబడిదారు వ్యక్తిమూర్తీభవిత [వ్యక్తిగా మూర్తీభవించిన] పెట్టుబడిలాగామాత్రమే తన విధి నిర్వర్తిస్తాడు [నిర్వర్తించ గలుగుతాడు]. వ్యక్తిగా మార్చబడ్డ పెట్టుబడే అతడని చెప్పవచ్చు. అలాగే, కార్మికుడు [కూడ] వ్యక్తిమూర్తీభవిత శ్రమ మాత్రమే… కనుక సరిగ్గా భావజాలరంగంలో మతం విషయంలో మనకు లభించే సంబంధంలాంటిదే భౌతిక (పాదార్థిక) ఉత్పత్తిలోకూడా మనకు లభిస్తుంది – కర్త (పరమైన అంశాలు) కర్మ (పర వస్తువులు) గానూ, దీనికి వ్యతిక్రమం (తలకిందులు) గానూ మారడం గమనిస్తాము.

చారిత్రక దృష్టికోణంనుండి చూస్తే ఈ వ్యతిక్రమం (తలకిందుల ప్రక్రియ) బలప్రయోగంద్వారా, అత్యధిక సంఖ్యాకులకు నష్టదాయకంగా అసలు సంపద అనేదాని సృష్టికి – అంటే ఏది మాత్రమేనైతే ఒక స్వతంత్ర మానవసమాజానికి పాదార్థిక ప్రాతిపదిక ఏర్పాటు చేయగలదో అలాంటి అపరిమిత సాంఘిక శ్రమ ఉత్పాదకతను సృష్టించడానికి – అవసరమైన ఒక పరివర్తనాదశగా అగుపడుతుంది. మరి మనిషి తన స్వీయ ఆధ్యాత్మిక శక్తులనే తనకు వేరైన ఏవో స్వయం-స్వతంత్ర శక్తులుగా తనకే ఎదురు నిలుపుకొనడంద్వారా వాటికి ఒక మత రూపాన్ని ప్రసాదించడమనేది ఎలా అనివార్య ఆరంభమో, అలాగే పైనచెప్పిన తలకిందుల (వ్యతిక్రమ) క్రమంగుండా సాగిపోవడంకూడ ఆవశ్యకమే అవుతుంది.
ఇది మనిషి సొంత శ్రమయొక్క పరాయీకరణ క్రమం. [అయితే ఇందులో] మొదటినుండీ కార్మికుడు పెట్టుబడిదారుకంటే శ్రేష్ఠుడై వుంటాడు – ఎందుకంటే, పెట్టుబడిదారు తన పరాయీకరణ క్రమంలో తాను వేళ్లూనుకుని పోయి, దానితో పూర్తిగా సంతుష్టి చెందివుంటాడుగాని దానిచే బాధితుడై వుండే కార్మికుడుమాత్రం మొదటినుండీ దానికి [ఆ పరాయీకరణ క్రమానికి] వ్యతిరేకంగా తిరుగుబాటు మనస్తత్వంతో వుంటాడు; అది తన్ను దాస్యంలోకి తోసివేసే (బానిసను గావించే) ఒక క్రమంగా స్వీయానుభవం పొందుతూంటాడు. పెట్టుబడియొక్క స్వయం-విలువీకరణ – అంటే అదనపు విలువ సృష్టే – పెట్టుబడిదారుకు నిర్ణయాత్మకమైన, సర్వ శ్రేష్టమైన, ఆధిపత్య లక్ష్యంగా, అతడి క్రియాకలాపాలకు సంపూర్ణ చోదకోద్దేశ్యం, సారాంశాలుగా వుంటుంది; ఒక లోభియొక్క హేతుబద్ధ సహజానుభూతిగా, లక్ష్యంగా వుంటుంది. మరి ఈ సారాంశం చాల నాసిరకంది – పెట్టుబడిదారుకూడ కార్మికునికిలాగే పెట్టుబడికింద ఒకేవిధమైన బానిసత్వ సంబంధంలో మగ్గుతుంటాడని, కాకుంటే అతడు కార్మికునికి వ్యతిరేక ధ్రువంలో నిలిచివుంటాడంతమాత్రమే నని [ఈ నాసి సారాంశం] ప్రదర్శిస్తుంది. – తక్షణ ఉత్పత్తి క్రమపు ఫలితాలు (1865), ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పుట 508 నుండి…
బాగా పరీక్షిస్తే, దోపకంచేయడానికి దానికుండే అవసరం ప్రకారం (ఆ మేరకు) పెట్టుబడి, శ్రమ [శ్రామిక] బలగం ఉత్పత్తినే, అంటే దోపకం చేయబడవల్సిన (దోపకం చేయబడే) మానవ సమూహాల సృష్టినే క్రమబద్ధం గావిస్తుందని మనం గమనిస్తాము. ఈ విధంగా పెట్టుబడి సృష్టించేది ఒక్క పెట్టుబడినిమాత్రమే కాదు; అంతకంతకూ వృద్ధి చెందే కార్మిక సందోహాన్ని కూడ – ఈ సారపదార్థం (పెరిగిపోయే కార్మికుల) ధర్మమా అనే అది ఒంటరిగా అదనపు పెట్టుబడిగా పని చేయగలుగుతుందని గమనించాలి – సృష్టిస్తుంది. పర్యవసానంగా, శ్రమ [లేక శ్రామికులు] అంతకంతకూ విస్తృత ప్రమాణంలో, అదీ స్వయంగా తనకే విరుద్ధంగా, శ్రమ పరిస్థితుల్ని పెట్టుబడి రూపంలో సృష్టించడమొక్కటే కాదు; పెట్టుబడికూడ అంతకంతకూ అధిక స్థాయిలో తనకు అవసరమైన ఉత్పాదక వేతన-శ్రామికుల్ని సృష్టిస్తూంటుంది. శ్రమ తన ఉత్పత్తి పరిస్థితుల్ని పెట్టుబడిగా సృష్టిస్తుంది; కాగా పెట్టుబడి శ్రమను ఒక పెట్టుబడి సాధక సాధనంగా, అంటే వేతన శ్రమగా సృష్టిస్తుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి ఈ సంబంధపు మామూలు (సామాన్య) పునరుత్పత్తి కాదు, అది అంతంతకూ ఇతోధిక ప్రమాణంలో సాగే పునరుత్పత్తి అని గ్రహించాలి. ఇక పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంవల్ల శ్రమయొక్క సామాజిక ఉత్పాదకత పెరిగిపోయే కొద్దీ, ఖచ్చితంగా ఆ పెరుగుదల మేరకు కార్మికుని పైన [సవారీ చేస్తూ నిలిచి] వుండే సంపదకూడ పెరిగిపోతూ పెట్టుబడిగా అతడిపై ఆధిపత్యం చెలాయిస్తూంటుంది. అతడి కట్టెదుట ఒక సుసుంపన్న ప్రపంచం – అతడికి పరాయిదైన, అతడ్ని అణచివేసే ప్రపంచం – [సుఖవిలాసాలతో అతడ్ని వెక్కిరిస్తూ] నెలకొల్పబడి వుంటుంది; అదే అనుపాతంలో అతడి పేదరికం, అవమానాలు, వ్యక్తిగత దాస్యం పెరిగిపోతుంటాయి. అతడి 'దిగంబరత్వం' ఈ విస్తృతికి సాపేక్ష ప్రమాణంగా వుంటుంది. అదే సమయంలో పెట్టుబడియొక్క సజీవ ఉత్పత్తి సాధనాల మొత్తం, అంటే శ్రమచేసే అధోకార్మికవర్గం పెరిగిపోతూంటుంది. – తక్షణ ఉత్పత్తి క్రమం ఫలితాలు (1865), ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 518.

కనుక వర్తకపు సరుకు ఒక విచిత్ర నిగూఢ వస్తువు; కేవలం మనుషుల శ్రమయొక్క సాంఘిక స్వభావం ఆ శ్రమోత్పత్తిపై ముద్రించబడిన ఒక వస్తుగత స్వభావంగా వారికి అగుపించడం వల్ల, ఈ ఉత్పత్తిదారులకు తమ సొంత శ్రమల వెరసిమొత్తంతో వుండే సంబంధం నిజానికి వాళ్ల నడుమ వుండే సంబంధంగాకాక ఏదో వాళ్ల శ్రమోత్పత్తులమధ్య గల సంబంధంగా వాళ్లకు ప్రదర్శింపబడడంవల్ల అదిలా (మాయావి వస్తువుగా) వుంటుందని చెప్పవచ్చు. శ్రమోత్పత్తులు వర్తకపు సరుకులుగా – ఒకే సమయంలో ఇంద్రియగ్రాహ్యంగా [కొంత] నూ, అలాగే ఇంద్రియాలకు అగ్రాహ్యంగా [కొంత] కూడానూ వుండే ధర్మాలుగల సామాజిక వస్తువులుగా – రూపొందడానికి కారణం యిదే. దీనికి సమ ఉదాహరణకోసం మనం మతప్రపంచపు పొగమంచు కమ్మిన ప్రాంతాల్లో వెదకాల్సి వుంటుంది. ఆ ప్రపంచంలో మానవ మేధో సృజనలే స్వతంత్ర జీవులుగా ఊపిరి పోసుకుని పరస్పరమున్నూ, అలాగే మానవజాతితోనూ సంబంధాలు పెట్టుకోవడం మనం చూస్తాము. మరి వర్తకపు సరుకుల ప్రపంచంలో మనుషుల చేతి తయారీల విషయంలోకూడ సరిగా యిలాగే వుంటుంది. దీన్నే నేను అవి వర్తకపు సరుకులుగా ఉత్పత్తి చేయబడడంతోటే శ్రమోత్పత్తులకు అంటుకునే, అందుచేత వర్తకపు సరుకుల ఉత్పత్తినుండి విడదీయ శక్యం కాకుండా వుండే చిత్రమహిమ (లేక సరుకుల మాయ - Fetishism) అంటాను.
ఇంతవరకు జరిపిన విశ్లేషణలో ఈ వరకే వెల్లడయినట్లు, ఈ వర్తకపు సరుకుల చిత్రమహిమ (సరుకుల మాయ) కు పుట్టుక వాటిని ఉత్పత్తిగావించే శ్రమయొక్క విలక్షణ సాంఘిక స్వభావంలోనే వున్నది. – పెట్టుబడి, సంపుటం 1 (1867), ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 436.

ఇంకా చదవడానికి …
1. డి. బెల్‌, 'పరాయీకరణపై వాదోపవాదాలు', ఎల్‌. లాబెజ్‌ (సం.), రివిజనిజం పుస్తకం (లండన్‌, 1962) లోంచి.
2. డి. బ్రేబ్రూక్‌, ' మార్క్స్‌యొక్క పరాయీకరణ సిద్ధాంతంలోని [రోగ]పరీక్ష, పరిహారసూచన', సోషల్‌ రిసర్చ్‌ (శరత్కాలం, 1958).
3. డి. బ్రేబ్రూక్‌, అవసరాలు కలవడం (ప్రిన్స్‌టన్‌, 1987).
4. ఎ. బుకానన్‌, మార్క్స్‌ మరియు న్యాయధర్మం: ఉదారవాదంపై సమూలమార్పు విమర్శ (టొటోవా, 1982), అధ్యాయం 3.
5. ఎల్‌. ఈస్టన్‌, 'తొలికాలపు (యువ) మార్క్స్‌లో పరాయీకరణ, చరిత్రలు', తత్వచింతన-ఘటనావిజ్ఞాన పరిశోధన (ఫిలాసఫీ అండ్‌ ఫెనామెనాలాజికల్‌ రిసర్చ్‌), డిసెంబర్‌, 1961.
6. ఎల్‌. ఈస్టన్‌, 'మార్క్స్‌ ఆలోచనలో పరాయీకరణ, అనుభవవాదాలు', సోషల్‌ రిసర్చ్‌ (శరత్కాలం, 1970).
7. ఎ. హెల్లర్‌, మార్క్స్‌లో్ని ఆవశ్యకతా సిద్ధాంతం, లండన్‌, 1976.
8. కె. లోవిత్‌, 'మార్క్స్‌ తొలి రచనల్లోని స్వీయ-పరాయీకరణ', సోషల్‌ రిసర్చ్‌, 1954.
9. ఎస్‌. లూక్స్‌, 'పరాయీకరణ, అనామకత్వం', ఫిలాసఫీ, పాలిటిక్స్‌ అండ్‌ సొసైటీ లో, 3వ పరంపర, సం. పి. లాస్లెట్‌- డబ్ల్యూ. జి. రన్సిమన్, ఆక్స్‌ఫర్డ్‌, 1967.
10. ఇ. మాండెల్‌-జి. నొవాక్‌, పరాయీకరణగురించిన మార్క్సిస్టు సిద్ధాంతం, రెండవ ప్రతి, న్యూయార్క్‌, 1973.
11. ఎమ్‌. మార్కోవిక్‌, 'పరాయీకరణపై మార్క్స్‌ విమర్శ, దాని విమోచనాత్మక పర్యవసానాలు', మార్క్స్‌ ఎన్‌ పర్స్పెక్టివ్‌, సం. బి. చవాన్స్‌, పారిస్‌, 1985, లో.
12. డి. మెక్‌లెలాన్‌, 'అపరాయీకృత సమాజంగురించి మార్క్స్‌ అభిప్రాయాలు', రివ్యూ ఆఫ్‌ పాలిటిక్స్‌, అక్టోబర్‌, 1969.
13. బి. ఓల్‌మన్‌, పరాయీకరణ: పెట్టుబడిదారీ సమాజంలోని మనిషిపై మార్క్స్‌ విమర్శన, కేంబ్రిడ్జ్‌, 1971.
14. జె. ఒనీల్‌, 'పరాయీకరణ, వర్గ పోరాటం, మార్క్సియన్‌ రాజకీయవ్యతిరేకతలు', రివ్యూ ఆఫ్‌ మెటాఫిజిక్స్‌, 1964.
15. జె. ఒనీల్‌, 'కార్ల్‌ మార్క్స్‌ తొలి, మలి రచనల్లోని ఎడబాటు భావన (concept of estrangement) గురించి', ఫిలాసఫీ అండ్‌ ఫెనామెనాలాజికల్‌ రిసర్చ్‌, సెప్టెంబర్‌ 1964.
16. జె. ప్లామెనాట్జ్‌, మనిషినిగురించిన కార్ల్‌ మార్క్స్‌ తత్వచింతన, ఆక్స్‌ఫర్డ్‌, 1975, భాగాలు 1 & 2.
17. పి. రాబర్ట్స్‌-ఎమ్‌. స్టీఫెన్సన్‌, మారకం, పరాయీకరణ, సంక్షోభాలను గురించిన మార్క్స్‌ సిద్ధాంతం, స్టాన్‌ఫర్డ్‌, 1973, అధ్యాయం 6.
18. ఎన్‌. రోటెన్‌స్ట్రీక్‌, పరాయీకరణ: ఆ భావన, దానికి లభించిన స్వాగతం, లైడెన్‌, 1989.
19. ఆర్‌. షాక్ట్‌, పరాయీకరణ, లండన్‌, 1971.
20. ఎల్‌. సెవే, మార్క్సిస్టు సిద్ధాంతంలో మనిషిగురించి, హాసక్స్‌, 1978, భాగం 2.
ఇంకా మార్క్సిజానికి సంబంధించిన అవినేరీ, ఫ్రామ్‌, మెక్‌లెలాన్‌, టక్కర్‌ల యితర పుస్తకాలు.
* * * * *

పరాయీకరణగురించి మార్క్స్‌-3

పరాయీకరణగురించి మార్క్స్‌-3
[మార్క్స్‌] మూలపాఠాలు - 2

సజీవ శ్రమశక్తికి ప్రతిగా [విరుద్ధంగా] విలువ స్వతంత్రంగా, స్వయం-ప్రతిపత్తితో మని వుండడం –
అందుచేత అది పెట్టుబడిగా మని వుండడం –
వస్తుగత [కర్మపదార్థగత], స్వయంకేంద్రీకృత అలక్ష్యం, సజీవ శ్రమశక్తికి ప్రతిగా భౌతిక [పాదార్థిక] శ్రమ పరిస్థితుల పరాయి స్వభావం [ఈ రెండూ] ఎంత [హెచ్చు] స్థాయికి చేరుకున్నాయంటే –
(1) ఈ పరిస్థితులు ఒక వ్యక్తిగా కార్మికునికి ఎదురుగా పెట్టుబడి దారుని వ్యక్తి రూపంలో [తమ సొంత సంకల్పం, ప్రయోజనాలతో కూడుకున్న వ్యక్తిఅవతారాలుగా] తారసపడుతాయి; ఈవిధంగా ఒక సంపూర్ణమైన వేర్పాటు, యాజమాన్య విచ్ఛిత్తి [అంటే, సజీవ శ్రమశక్తినుండి భౌతిక శ్రమ పరిస్థితులకు] సంభవిస్తాయి; ఈ పరిస్థితులు ఏదో ఒక పరాయి ఆస్తిగా, ఎవరో మరొక చట్టపర వ్యక్తియొక్క వాస్తవికతగా, అలాంటి వ్యక్తుల సంకల్పపు అఖండ ఆధిపత్య క్షేత్రంగా కార్మికున్ని ఎదిరిస్తూ ప్రత్యక్షమవుతాయి – ఇంకా కూడ,
(2) [దానివల్ల] శ్రమ అంతా పెట్టుబడిదారు రూపంలో వ్యక్తి అవతారం పొందిన విలువకూ, శ్రమ పరిస్థితులకూ విరుద్ధమైన ఏదో ఒక పరాయిశ్రమగా గోచరిస్తుంది.
మరి ఇలా ఆస్తికీ, శ్రమకూ నడుమ; సజీవ శ్రమశక్తికీ, దాని సాధనకు (యథార్థీకరణకు) వలసిన పరిస్థితులకూ నడుమ; సజీవ శ్రమకూ, వస్తుగత (పదార్థీకృత) శ్రమకూ నడుమ; విలువకూ, విలువను సృష్టించే కార్యకలాపానికీ నడుమ జరిగిన పూర్తి వేర్పాటు – అందుచేత స్వయంగా కార్మికునికే ఎదురుగా [అతడి] శ్రమ సారాంశం ఒక పరాయి ప్రకృతిని (స్వభావాన్ని) సంతరించుకోవడం – ఈ వేర్పాటిప్పుడు స్వయంగా శ్రమ (ఉత్పత్తి) ఫలంగానే, దాని [శ్రమ ఫలపు] స్వీయమూలాంశాల పదార్థీకరణగానే కనిపిస్తుందికూడ.
ఎందుకంటే, అసలుకు నూతన ఉత్పతి క్రియాచర్యనే [అది (నూతన ఉత్పత్తి క్రియాచర్య) కేవలం పెట్టుబడికీ, దానిపూర్వం వుండిన సజీవశ్రమకూ మధ్య మారకాన్ని ధ్రువీకరించిందంత మాత్రమే], ఇంకా అదనపు శ్రమా, కనుక అదనపు విలువా, అదనపు ఉత్పత్తీ [మిగులు ఉత్పత్తీ], టూకీగా మొత్తం శ్రమ (అంటే ఆవశ్యక శ్రమయొక్క, అలాగే అదనపు శ్రమయొక్కకూడ) ఫలితమంతా పెట్టుబడి గా, ఇటు సజీవ శ్రమశక్తికీ, అటు దాని కేవల ఉపయోగపు విలువకూ రెంటికీ విరుద్ధంగా స్వతంత్రంగా, అలక్ష్య పూరితంగా [వాటినేమీ లెక్కచేయని విధంగా] మనివుండే మారకపు విలువగా వ్యవస్థాపితమవుతుంది.
శ్రమశక్తి ఆవశ్యక శ్రమయొక్క స్వీయమానసిక [లేదా కర్తృపర] పరిస్థితులను మాత్రమే అవలంబించింది – అంటే ఉత్పాదక శ్రమ శక్తికి అత్యాజ్యఅవసరమైన బతుకుగడుపునుమాత్రమే అంటే కేవలం శ్రమశక్తిగా పునరుత్పత్తికావడానికి అవసరమైన మొత్తాన్నిమాత్రమే – ఆ శ్రమశక్తి సాధన (యథార్థీకరణ) కు సంబంధించిన పరిస్థితులతో నిమిత్తం లేకుండా, వాటికి వేరుగా – అవలంబించింది. అంతేకాక అదే (శ్రమశక్తే) ఈ పరిస్థితుల్ని లక్ష్యాలు, విలువలుగా నెలకొల్పింది; అవి ఒక పరాయి, అధికారనిరంకుశవాద వ్యక్తిమూర్తీభావంగా దానికి (శ్రమశక్తికి) విరుద్ధంగా ఎదురుపడుతుంటాయి.
ఈ క్రమంనుండి అది (శ్రమశక్తి) మరింత సంపన్నమై కాదుగదా, నిజానికి అది ఈ క్రమంలో ప్రవేశించినప్పటికంటే మరింత పేదదై వెలికి వస్తుంది. ఎందుకంటే అది [శ్రమశక్తి] ఉత్పత్తి చేసిన ఆవశ్యక శ్రమ పరిస్థితులు పెట్టుబడికి చెందివుండడమే కాదు; ఇప్పుడు శ్రమ శక్తిలో అంతస్థమైవున్న విలువల్ని సృష్టించే సంభావ్యత (సాధ్యత - possibility) కూడ అదే విధంగా అదనపు విలువగా, అదనపు ఉత్పత్తిగా, ఒక్క మాటలో, పెట్టుబడిగా – సజీవ శ్రమశక్తిపై ఆధిపత్యంగా, శ్రమశక్తియొక్క అనిర్దిష్టమైన, ఉద్దేశ్యరహితమైన, శుద్ధ స్వీయమానసికమైన [లేక కర్తృపరమైన - subjective] పేదరికానికి విరుద్ధంగా తన సొంత బలం, సంకల్పాలతో తులతూగే విలువగా మనివుంటుంది. శ్రమశక్తి పరాయి[దైన] సంపదనూ, తన సొంత పేదరికాన్నీ సృష్టించడం మాత్రమే కాదు; ఈ అంతర్గత సంపదకు పేదరికమైవున్న తన స్వీయ అస్తిత్వంతో (అంటే శ్రమశక్తితో) ఒక సంబంధాన్నికూడ సృష్టించింది. ఈ [పేదరికమైవుండే] శ్రమశక్తిని వినిమయంచేసుకోవడంద్వారా, ఆ సంపద తనలోతాను కొత్త ఊపిర్లు నింపుకొంటుంది; తద్వారా తన్నుతాను మళ్లీ సఫలం గావించు కొంటుంది. ఇదంతాకూడ శ్రమశక్తి దాని సజీవ శక్తిని ఒక నిశ్చిత మొత్తపు పదార్థీకృత శ్రమరాశికిగాను మారకం చేసుకోవడంనుండి తలయెత్తింది. కాకపోతే, [మినహాయింపు లేక అపవాదం ఏమంటే,] ఈ పదార్థీకృత శ్రమ (objectified labour) – శ్రమకు బాహ్యంగా మనివుండే దాని అస్తిత్వకారక పరిస్థితులూ, ఈ భౌతిక (లేక పాదార్థిక) పరిస్థితులయొక్క స్వతంత్ర బాహ్య స్వభావమూ రెండూనూ – దాని [శ్రమయొక్క] సొంత ఉత్పత్తి ఫలంగా అగుపిస్తుంది. వాటిని స్వయంగా శ్రమశక్తే నెలకొల్పినట్లు – దాని సొంత పదార్థీకరణగానూ, ఇంకా, దానికి స్వతంత్రంగా మనివుంటూ, పైగా దానిపై శాసనం చేసే, తన సొంతకృషితో దానిపై పాలన చేసే దాని స్వీయశక్తి పదార్థీకరణ గానూ రెండువిధాలా నెలకొల్పబడినట్లు – ఈ పరిస్థితులు గోచరిస్తాయి. - గ్రండ్‌రిస్సే (1857-58), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 366 నుండి…

ఇప్పటికే దాని సులభసామాన్య రూపంలో ఈ సంబంధం ఒక విలోమం (తలకిందుల ప్రక్రియ) గా – వస్తువుయొక్క వ్యక్తి రూపీకరణ లేదా వ్యక్తియొక్క పదార్థీకరణగా వుంది. ఎందుకంటే దీనికి పూర్వపు సకల రూపాలకూ దీనికీ అంతరమేమంటే పెట్టుబడిదారు కార్మికునిపై శాసనం (ఆధిపత్యం) చెలాయించేది ఏదో అతడికుండే ఏవైనా వ్యక్తిగత గుణాలు, లక్షణాలద్వారాకాక, కేవలం తాను 'పెట్టుబడి' గా వుండడంవల్ల, అలా వున్నంతవరకుమాత్రమే. అతడి ఆధిపత్యం కేవలం సజీవ శ్రమపై పదార్థీకృత శ్రమకుండే, స్వయంగా శ్రామికుడిపైన అతడి శ్రమ [ఉత్పత్తి] ఫలానికుండే ఆధిపత్యంమాత్రమే.
ఈ సంబంధం యింకా మరింత సంక్లిష్టంగా, మరింత నిగూఢం (మార్మికం - mysterious) గా వృద్ధి చెందుతూంటుందికూడ - ఎందుకంటే, ప్రత్యేకించి పెట్టుబడిదారీతరహాలో ఉత్పత్తివిధానం వికసించేకొద్దీ, ఈ ప్రత్యక్షంగా పాదార్థికమైన (భౌతికమైన) వస్తువులు (అంటే శ్రమ ఉత్పత్తిఫలాలన్నీ; ఉపయోగపు విలువలుగా పరిగణించబడే టప్పుడు అవి ఇటు శ్రమయొక్క భౌతిక (పాదార్థిక) పరిస్థితులుగానూ, అటు శ్రమఫలాలుగానూ రెండు విధాలా వుంటాయి; మారకపు విలువలుగా పరిగణించబడేటప్పుడు అవి పదార్థీకృత సాధారణ శ్రమ కాలం లేదా డబ్బుగా వుంటాయి) మాత్రమే తమ వెనక్కాళ్లపై నిలబడి శ్రామికుడ్ని [వెక్కిరిస్తూ లేక ధిక్కరిస్తూ] ' పెట్టుబడి' గా ఎదిరిస్తాయి అన్నట్లేమీ [పరిమితమై] వుండదు; [అవి మాత్రమేకాక] ఇంకా సామాజికంగా వికసించిన [ఇతర] శ్రమ రూపాలు - సహకారం, తయారీ (ఒక శ్రమ విభజన రూపంగా), ఫాక్టరీ (కర్మాగారం - యంత్రాల పాదార్థిక ప్రాతిపదికపై వ్యవస్థీకృతమైన ఒక సాంఘిక శ్రమ రూపం) – కూడ, ఇవన్నీకూడ పెట్టుబడి అభివృద్ధి [వికాసక్రమ] రూపాలుగా అగుపిస్తాయి; అందువల్ల ఈ సామాజిక శ్రమరూపాల [పునాదులపై] నిర్మించబడ్డ శ్రమ ఉత్పాదక శక్తులన్నీకూడ – పర్యవసానంగా శాస్త్రవిజ్ఞానం, ప్రకృతిశక్తులుకూడ – పెట్టుబడియొక్క ఉత్పాదక శక్తులుగా అగుపిస్తాయి. నిజానికి, సహకారంలో [శ్రమ యొక్క] ఐక్యత, శ్రమ విభజనద్వారా శ్రమ సమ్మేళనం, యంత్ర పరిశ్రమలో ఉత్పాదక లక్ష్యాలకుగాను శ్రమ ఉత్పత్తుల సరసనే ప్రకృతి శక్తుల్నీ, శాస్త్ర విజ్ఞానాన్నీ ఉపయోగించడం - ఇవన్నీ స్వయానా వ్యష్టిశ్రామికులకు తమకు బాహ్యంగా, పదార్థీకృతంగా వుండే ఏదో ఒక పరిణామంగా, కేవలం తమకు స్వతంత్రంగావుంటూ, తమను అదుపాజ్ఞల్లో వుంచు కొనే శ్రమ సాధనాల అస్తిత్వ రూపంగా మాత్రమే ఎదురు పడుతుంటాయి; అసలుకు స్వయంగా ఆ శ్రమ సాధనాలే వాటి సులభసామాన్య గోచరరూపంలో, అంటే పదార్థాలూ, పరికరాలూ మొదలైనవాటిగా, నిజానికి పెట్టుబడియొక్క విధులుగా, పర్యవసానంగా పెట్టుబడిదారుని విధులుగా వారికెలా ఎదురు పడుతూంటాయో యివీ అంతే.
ఈ క్రమంలో వాళ్ల శ్రమయొక్క సాంఘిక స్వభావమే వాళ్లకు కొంత మోతాదులో పెట్టుబడీకృతం అయినట్లు (ఉదాహరణకు యంత్రాలనే గనుక తీసుకుంటే శ్రమోత్పత్తులుగా అగుపించే వస్తువులే శ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు కనిపిస్తాయి) ఎదురు పడుతూంటుంది. మరి ప్రకృతిసంబంధ, విజ్ఞానశాస్త్రసంబంధ శక్తుల విషయంలోకూడ సహజంగా ఈవిధంగానే జరుగుతుంది; వాటి అఖండ సారాంశంలో అవి ఒక సాధారణ చారిత్రక వికాసోత్పత్తులై వుంటాయి; అలా వుంటూనే, అవి [యథార్థంలో] పెట్టుబడియొక్క శక్తులుగా శ్రామికులకు ఎదురుపడుతుంటాయి. నిజానికి అవి వ్యష్టి కార్మికుని నేర్పు (నిపుణత), పరిజ్ఞానాలకు వేరుగా నిలిచి వుంటాయి. పుట్టుకలో అవి [ప్రకృతిజన్య, వైజ్ఞానిక శక్తులు] కూడ శ్రమోత్పత్తులే అయినప్పటికీ, అవి ఎక్కడేగానీ శ్రమక్రమంలో ప్రవేశించినప్పుడల్లా పెట్టుబడిలో [భాగాలుగా] మూర్తీభవించినట్లే కనిపిస్తుంటాయి. ఏదైనా యంత్రాన్ని వాడే పెట్టుబడిదారుకు దాన్ని గురించి అర్థంచేసుకోవల్సిన అవసరం ఏమీ వుండదు. కాని ఆ యంత్రంలో రూపుదాల్చిన (యథార్థీకరించబడ్డ, సాధించబడ్డ - realized) విజ్ఞానశాస్త్రం మట్టుకు కార్మికులకు సంబంధించినంత వరకూ పెట్టుబడి గానే అగుపిస్తుంది. ఇంకా నిజానికి ఈ వైజ్ఞానిక (విజ్ఞాన శాస్త్రజన్య) అనువర్తణలు (అన్వయాలు - applications) అన్నీ, పెద్ద యెత్తున సృష్టయ్యే శ్రమోత్పత్తులు, ప్రాకృతిక శక్తులన్నీ, సాంఘిక శ్రమ ప్రాతిపదికన నెలకొనివుండే ఈ అన్వయాలన్నీ స్వయంగా శ్రమ దోపకానికి సాధనాలుగామాత్రమే, అదనపు విలువను భుక్తం చేసుకొనే సాధనాలుగానే అగుపడుతాయి. కనుక అవి పెట్టుబడికి చెందిన శక్తులుగా శ్రమకు (శ్రామికులకు) ఎదురుపడుతుంటాయి. మరి సహజంగానే పెట్టుబడి కూడ ఈ సాధనాలన్నింటినీ శ్రమను దోపకం చేయడానికే ఉపయోగిస్తుంది గదా. కాని దాన్ని దోపకం చేయాలంటే, అది (పెట్టుబడి) వాటిని ఉత్పత్తి [క్రమం] లో అన్వయించాల్సి వుంటుంది. అందుచేత శ్రమయొక్క సామాజిక ఉత్పాదక శక్తుల వికాసం, ఈ వికాసానికి వలసిన షరాస్థితులూ పెట్టుబడి యొక్క చర్యలు గా అగుపిస్తాయి. ఈ పెట్టుబడి చర్యలపట్ల వ్యష్టి శ్రామికుడు ఒక అనాసక్త (నిష్క్రియాపర) వైఖరి నవలంబించడమే కాదు; అసలుకు ఈ పరిణామాలన్నీ అతడికి విరుద్ధంగానే సంభవిస్తూంటాయి. - అదనపు విలువ సిద్ధాంతాలు (1862), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 393 నుండి.

పెట్టుబడి అంతకంతకూ అధికంగా తన్ను ఒక సాంఘిక శక్తిగా ప్రదర్శించుకొంటుంది; పెట్టుబడిదారు ఈ సామాజిక శక్తి (పెట్టుబడి) కి ఏజంటుగా వుంటాడు. ఇంకా అది (పెట్టుబడి), విడిగా ఏ వ్యక్తియొక్క శ్రమయినా సృష్టించగల వస్తువులతో ఎలాంటి సంబంధమైనా కలిగి వుండే అవకాశమే వుండదుకూడ. పెట్టుబడి ఒక వింతైన, స్వతంత్ర మైన, సామాజిక శక్తిగా రూపొందుతుంది; అది ఒక వస్తువులా సమాజాన్ని ఎదిరిస్తూ నిలిచివుంటుంది; ఇలా వస్తువులా వుండడంతో అది పెట్టుబడిదారుల చేతి అధికారశక్తిలా వుంటుంది. ఒక సాధారణ సాంఘిక శక్తిగా పెట్టుబడికీ, సామాజిక ఉత్పత్తి పరిస్థితులపై ప్రైవేటు పెట్టుబడిదారుల అధికారశక్తిలా వుండే పెట్టుబడికీ మధ్య వైరుధ్యం అంతకంతకూ రాజీలేని ఘర్షణగా పరిణమిస్తూంటుంది. పర్యవసానంగా, ఈ [ఉత్పత్తి] పరిస్థితులు రద్దు అయిపోయి, అవి [ఉత్పత్తి పరిస్థితులు] సవిస్తారంగా సార్వత్రిక, ఉమ్మడి, సామాజిక పరిస్థితులుగా రూపు దిద్దుకొంటాయని దీని అంతరార్థం అవుతుంది. మరి పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానంలో జరిగే ఉత్పాదక శక్తుల వృద్ధి చేత, ఈ అభివృద్ధి జరిగే క్రమంమీద ఆధారపడి ఈ సవివర పరిణామం సంభవిస్తుంది. – పెట్టుబడి, సంపుటం 3 (1864-5), పు. 310.
పెట్టుబడి ఒక వస్తువు కాదు. సమాజపు ఒక నిశ్చిత చారిత్రక నిర్మాణానికి చెందిన ఒక నిశ్చిత అంతర సంబంధం అది…. సమాజంలోని ఒక నిశ్చిత భాగంచే గుత్తాధిపత్యంలో వుంచుకోబడ్డ ఉత్పత్తి సాధనాలను, సజీవ మానవ వ్యక్తులయొక్క శ్రమశక్తినుండి స్వతంత్రంగా, వాళ్లకు వైరపూర్వకంగా చేయబడిన శ్రమయొక్క పాదార్థిక అవసరాలను, శ్రమోత్పత్తులను, ఈ వైరంచేతనే పెట్టుబడిలో మూర్తీభవించబడిన [ఉత్పత్తి] సాధనాలను పెట్టుబడి సూచిస్తుంది. పెట్టుబడి అంటే శ్రామికులనుండి స్వతంత్రం గావించ బడి సామాజిక శక్తులుగా మార్చబడిన ఉత్పత్తులు – తమ స్వీయ స్రష్టలనే (ఉత్పాదకులనే) శాసిస్తూ, వాళ్లనే కొనివేస్తూండే ఉత్పత్తులు అని మాత్రమేకాదు అర్థం; ఉత్పాదకుల్ని వాళ్ల ఉత్పత్తుల గుణాల రూపంలో విరుద్ధంగావించుకొనే శక్తులు, సాంఘిక సంబంధాలు – ఈ శ్రమయొక్క రూపాలు – అని కూడ అర్థం వస్తుంది. కనుక, యిక్కడ మనకు ఒక చారిత్రకంగా సృష్టించబడిన (ఉత్పత్తి చేయబడిన) సాంఘిక ఉత్పత్తిక్రమ కారణాంశాల్లో ఒకదానియొక్క నిశ్చితమైన, మొదటి చూపుకు చాలా మాయాభరితమైన (నిగూఢమైన - mystical), సామాజిక రూపం అగుపిస్తుంది [లేక లభిస్తుంది]. – పెట్టుబడి, సంపుటం 3 (1864-5), ఎంపిక చేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 492.

పరాయీకరణగురించి మార్క్స్‌-2

పరాయీకరణగురించి మార్క్స్‌-2

[మార్క్స్‌] మూలపాఠాలు

అమ్మకం అనేది బాహ్యీకరణ (externalization) యొక్క ఆచారం [ఆచరణ]. మనిషి మతంలోపల బందీ అయివున్నంతకాలం తన సారాంశాన్ని ఒక ఊహాత్మక, పరాయి అస్తిత్వంగా మార్చడంద్వారా దాన్ని వస్తుగతం (పదార్థీకృతం) గావించడమొక్కటే అతనికి తెలిసివుంటుంది. అదే విధంగా, స్వార్థపర అవసరాల ఆధిపత్యంలో [వున్నంతకాలం] అతడు తన ఉత్పత్తులను, తన కార్యకలాపాల్ని ఒక పరాయి అస్తిత్వపు ఆధిపత్యంలో వుంచి, వాటికి ఒక పరాయి అస్తిత్వపు – అంటే డబ్బుయొక్క ప్రాముఖ్యతను కలగజేయడం ద్వారామాత్రమే వ్యవహారికంగా, అంటే వ్యవహారాచరణద్వారా వస్తువులను సృష్టిస్తూ వుండగలుగుతాడు. – యూదుల సమస్యపై (1843), ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌రచనలు, పు. 61 పాదవివరణ.
ఈ వాస్తవం వ్యక్తీకరించేది కేవలం ఇది మాత్రమే: [మనుషుల] శ్రమ ఉత్పత్తి చేసే వస్తువులు, అంటే దాని ఉత్పత్తి [ఫలం], ఒక పరాయి అస్తిత్వంగా దాన్ని [ఆ శ్రమను] ఎదురుకొంటుంది; ఉత్పత్తి దారుకు స్వతంత్రంగా వుండే ఒక శక్తిగా ఎదురుపడుతుంది. శ్రమ యొక్క ఉత్పత్తిఫలం అంటే ఒక వస్తువు (లేక పదార్థం) గా ఘనీ భవించిన శ్రమ; తన్ను తాను ఒక వస్తువుగా, శ్రమయొక్క వస్తుగత రూపంగా చేసుకున్న శ్రమే. శ్రమయొక్క వాస్తవీకరణ (సాధన - realization) దాని వస్తుగతీకరణే (పదార్థీకరణే - objectification). రాజకీయార్థ రంగంలో ఈ శ్రమసాధన కార్మికునికి సంబంధించి వాస్తవికతను [యథార్థతను] కోల్పోవడంగా, వస్తుగతీకరణ అనేది అసలుకు [ఆ] వస్తువునే కోల్పోవడం లేక దానికి దాసోహమవడం [బానిసత్వం చేయడం] గా, దాని భుక్తం [భోగ వినియోగం - appropriation] ఒక పరాయీకరణగా, ఒక బాహ్యీకరణగా… వుంటుంది.
తన సొంత శ్రమ ఉత్పత్తిఫలాన్ని ఏదో ఒక పరాయి వస్తువుగా చూచేలాంటి బాంధవ్యం కార్మికుడు పెట్టుకొంటాడనే వాస్తవంనుండే ఈ పర్యవసానాలన్నీ ఉబికివస్తున్నాయి. ఎందుకంటే, కార్మికుడు తన పని [క్రమం] లో తన్నుతాను మరింతగా బాహ్యీకరించుకొనే కొద్దీ, అతడు తన కట్టెదుట సృష్టించుకొనే పరాయి, భౌతిక (వస్తుగత) ప్రపంచం మరింత శక్తివంతంగా అయేకొద్దీ, తన అంతరంగ జీవితంలో అతడు మరింత పేదగా మారిపోతుంటాడు; తనకు సొంతమని [భావించుకుని] అతడు పిలుచుకోగలిగేది మరింత తక్కువ అయి పోతూంటుంది. మతం [విషయం] లోకూడ సరిగ్గా యింతే. మనిషి దేవుడిలో మరింత మరింత [శక్తి, భక్తులు] వుంచేకొద్దీ తనలో తాను అతడు అట్టిపెట్టివుంచుకొనేది అంతకంతకూ తక్కువైపోతూ వుంటుంది. కార్మికుడు తన జీవితాన్ని వస్తువులో పోసి వుంచుతాడు; [కాని] దీనర్థం [చివరకు] అది [జీవితం] తనకు మరెంత మాత్రం చెందనట్లు, ఆ వస్తువుకే చెందుతుందన్నట్లు అయి పోతుంది. కనుక, ఈ కార్యకలాపం మరింత అధికంగా సాగేకొద్దీ, కార్మికుడు మరింత హెచ్చుగా వస్తువు లేకుండా [లక్ష్యవస్తువును కోల్పోతూ] వుంటాడు. తన శ్రమయొక్క ఉత్పత్తిఫలం ఏదో, అదైతే అతడు కాడు [కాజాలడు]. కనుక ఈ ఉత్పత్తిఫలం ఎంత అధిక తరమైతే అతడు స్వయానికి అంత అల్పతరమైపోతుంటాడు. [ఇలా] కార్మికుడు తన ఉత్పత్తిఫలంలో [ఉత్పత్తిక్రమంలో ఆ ఉత్పత్తినుండి] బాహ్యీకరణకు గురికావడమంటే దాని అంతరార్థం అతడి శ్రమ ఒక వస్తువు [కర్మ పదార్థం] గా, ఒక బాహ్య అస్తిత్వంగా అవుతుందనే కాక అది అతడికి వెలుపల స్వతంత్రంగా, పరాయిదిగా మని వుంటుందనీ, అతడికి ఎదురుగా ఒక స్వయంసమృద్ధ శక్తిగా రూపు ధరిస్తుందనీ, అతడు ఆ వస్తువుకు అందజేసిన జీవితం ఒక పరాయి, విరోధపూరిత శక్తిగా [అస్తిత్వంగా] అతడ్ని ధిక్కరిస్తుందనీ కూడానూ. - 1844 నాటి రాతప్రతులు, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 78 పాదవివరణ.

మతం, కుటుంబం, రాజ్యం, న్యాయం, నీతివిజ్ఞానం, విజ్ఞానశాస్త్రం, కళలు యివన్నీ ప్రత్యేక ఉత్పత్తి రూపాలుమాత్రమే; ఇవన్నీ దాని (ఉత్పత్తి) సాధారణ న్యాయంకిందకు వస్తాయి. అందుచేత ప్రైవేటు ఆస్తియొక్క నిశ్చయాత్మక రద్దు, మానవజీవితపు భుక్తా (భోగ సాధన) లు మొత్తం పరాయీకరణయొక్క నిశ్చయాత్మక రద్దుగా, ఈ విధంగా మనిషి మతపర, కుటుంబ, రాజ్యపర, వగైరా అస్తిత్వాల నుండి తన మానవ అస్తిత్వానికి, అంటే సాంఘిక అస్తిత్వానికి వాపసు రావడంగా వుంటుంది. పోతే మతపరమైన పరాయీకరణ అనేది మనిషియొక్క అంతరంగ చైతన్యంలోమట్టుకే సంభవిస్తుంది గానీ ఆర్థిక పరాయీకరణ అనేది యథార్థ జీవితానికి సంబంధించి వుంటుంది; కాబట్టి దాని రద్దు ఉభయ కోణాల్నీ [అంటే అంతరంగ, బాహ్య చైతన్యాలు రెంటినీ] ఆవరిస్తుంది. [కాకపోతే] ప్రజలయొక్క వాస్తవిక చైతన్యయుత జీవితం వాళ్ల మనస్సుల్లో గడపబడుతూందా (జీవించబడుతూందా) లేక బాహ్య ప్రపంచంలో గడపబడుతూందా, అంటే అది ఒక ఆదర్శ [కల్పనాపర] జీవితమా లేక యథార్థ జీవితమా అనేదాని ప్రకారం ఈ గమనం వేర్వేరు జనాల్లో వేర్వేరు విధాలుగా ప్రారంభమౌతుందనేదిమాత్రం స్పష్టమే.
- 1844 నాటి రాతప్రతులు, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 89 పాదవివరణ.

బాహ్యీకరణను లీనంచేసుకొనే (పీల్చివేసుకొనే) భౌతిక చలనం (లేక గమనం) గా పురోధిగమనం (supersession): ఒక భౌతిక (వస్తుగత) అస్తిత్వాన్ని దాని పరాయీకరణయొక్క పురోధిగమనం ద్వారా పున: భుక్తంగావించుకొనే ప్రక్రియకుసంబంధించిన, పరాయీకరణ లోపలే వ్యక్తీకరించబడే ఒక లోచూపు (అంతర్దృష్టి insight) యిది. మనిషియొక్క యథార్థ వస్తుగతీకరణ (కర్మపదార్థీకరణ) లోనికి, భౌతిక (పదార్థీకృత objectified) ప్రపంచపు పరాయీకృత స్వభావపు వినాశనంద్వారానూ, భౌతిక ప్రపంచపు పరాయీకృత స్వభావాన్ని అది పురోధిగమించడం ద్వారానూ, తన పరాయీకృత అస్తిత్వాన్ని అది పురోధిగమించడం ద్వారానూ, అతడి (మనిషియొక్క) భౌతిక (వస్తుగత) సారాంశపు యథార్థ భుక్తం (భోగవినియోగం) లోనికి సారించబడే ఒక పరాయీకృత అంతర్దృష్టి (లోచూపు) అది. అదే విధంగా, దేవుడి పురోధిగమనంగా వుండే నాస్తికవాదం ఒక సైద్ధాంతిక మానవతా వాదపు ఆవిర్భావంగానూ, ప్రైవేటు ఆస్తి పురోధిగమనంగా వుండే కమ్యూనిజం మనిషి ఆస్తి యథార్థ మానవీయ జీవితమేననే సూచనగానూ, అంటే అది వ్యవహారిక (ఆచరణాత్మక) మానవతా వాదపు ఆవిర్భావంగా కూడానూ వుంటుంది [అని గ్రహించాలి]. మరో విధంగా చెబితే, నాస్తికత్వం అనేది మతపు పురోధిగమనంద్వారా తన్నుతాను సమాధానపరుచుకొనే మానవతావాదంగానూ, పోతే కమ్యూనిజం అనేది ప్రైవేటు ఆస్తి పురోధిగమనంద్వారా తన్నుతాను సమాధాన పరుచుకొనే మానవతావాదంగానూ వుంటాయి. మరి ఈ సమాధాన ప్రక్రియ (mediation) యొక్క పురోధిగమనంద్వారా మాత్రమే – అయితే ఈ సమాధానప్రక్రియ ఒక ఆవశ్యక ముందుషరతుగానైతే వుంటుందనుకోండి – తనతోతానుగా (స్వయంభువుగా) ప్రారంభం అయ్యే నిశ్చయాత్మక మానవతావాదం ఉనికిలోకి వస్తుంది.
- 1844 నాటి రాతప్రతులు, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 108.
[కా. RK మూర్తికి, పై పేరా చాల జటిలంగా వుంది. కనుక ఈ అనువాదాన్ని మీరు పలుమార్లు తిరిగి రాయాల్సి, మార్చాల్సి వుంటుందేమోకూడ. బాగా ఎడిట్‌ చేసినతర్వాతే ప్రచురించండి – IMS.]

నేను ఉత్పత్తిచేసింది నా కోసం, నీకోసం కాదు; అలాగే నీవుకూడ నీకోసమే ఉత్పత్తిచేసుకొన్నావుకాని నాకోసం కాదు. కనుక నా ఉత్పత్తి స్వయానా ఎలావున్నా నీకేమంత పట్టింపు లేదు; అలాగే నాకూ నీ ఉత్పత్తి సొంతతీరుతెన్నులగురించి ప్రత్యక్షంగా పట్టింపేమీ లేదు. అంటే, మన ఉత్పత్తి మనుషులు మనుషుల కోసమని చేసే ఉత్పత్తి అయితే, అంటే సాంఘిక ఉత్పత్తి అయితే కాదు. కనుక, ఈ విధంగానైతే, ఒక మనిషిగా మరొకరి ఉత్పత్తిని ఆనందంతో అనుభవించగలిగే స్థితిలో మనం ఎవ్వరమూ లేము. మన పరస్పర ఉత్పత్తులకుసంబంధించి మనం వాటి ఎదుట మనుషులుగా [నిల్చుని] లేము. కనుక, మనమధ్య మారకం అయినా నా ఉత్పత్తి నీకోసమేలే అని ధ్రువీకరించే ఒక సమాధాన కారక (mediating) గమనం (లేక ప్రక్రియ) గా వుండజాలదు; ఎందుకంటే అది నీ సొంత సారాంశపు, నీ అవసరపు వస్తుగతీకరణ (కర్మపదార్థీకరణ) మాత్రమే గనుక. ఎందుకంటే మన ఉత్పత్తుల్ని లంకెవేసివుంచేది మానవ సారాంశంకాదు గనుక. మారకం అనేది మనలో ప్రతి ఒక్కరికీ తన సొంత ఉత్పత్తి పట్ల వుండే దృక్పథాన్ని, తద్విధంగా మనకు యితరుల ఉత్పత్తుల పట్ల వుండే దృక్పథాన్ని చలనంలోకి తెచ్చి, క్రియాశీలంగావించగలదు అంతమాత్రమే. మనలో ప్రతి ఒక్కరూ తన సొంత ఉత్పత్తి [ఫలం] లో తన సొంత స్వార్థ ప్రయోజనాలు (అవసరాలు) వస్తుగతం (పదార్థీకృతం) అయి వుండడాన్నిమాత్రమే చూస్తాము; ఈ విధంగా [కనుక] మనలో ప్రతి ఒక్కరం మరొకరి ఉత్పత్తి [ఫలం] లో మనకు స్వతంత్రంగా, పరాయిదిగా వుండే మరొక స్వార్థ ప్రయోజనం (అవసరం) పదార్థీకరించబడి వుండడాన్ని మాత్రమే వీక్షిస్తాము.
అయితే ఒక మనిషిగా నీకు నా ఉత్పత్తి [ఫలం] తో ఒక మానవీయ సంబంధం వుంటుందనుకో – నా ఉత్పత్తియొక్క అవసరం నీకు వుంటుంది. కనుక అది నీ కోరికల, నీ సంకల్పపు లక్ష్యవస్తువుగా నీ ఎదుట హాజరైవుంటుంది. అయితే నా ఉత్పత్తికి సంబంధించినంత వరకూ నీ అవసరం, నీ కోరికలు, నీ సంకల్పం అన్నీ అశక్తమైనవిగా వుంటాయి. కనుక నీ మానవ సారాంశం - తద్విధంగా నా ఉత్పత్తితో ఒక అంతరంగిక సంబంధం అవశ్యంగా కలిగివుండే నీ ఆ మానవ సారాంశం, నా ఉత్పత్తిపై ఎలాంటి అధికారంగాని, ఆస్తిగాని సముపార్జించుకొని వుండజాలదు; ఎందుకంటే, మానవ సారాంశపు విలక్షణతత్వాన్నీ, శక్తి-అధికారాల్నీ నా ఉత్పతి గుర్తించదు గనుక. [కాకపోగా] అవి నీవు నాపై ఆధార పడి వుండేలా చేసే సంకెళ్లవంటివని చెప్పడమే మరింత సజావుగా వుంటుంది; ఎందుకంటే అవి నా ఉత్పత్తిపై ఆధారపడి వుండాల్సివచ్చే స్థితిలోకి నిన్ను ఒడుపుగా నెట్టివేస్తాయిగనుక. నా ఉత్పత్తిపై నీకు అదుపు-అధికారాలిచ్చే సాధనాలుగా వుండడం అటుంచి [అది కాదు సరిగదా] నిజానికి అవి [నీ అవసరాలు, కోరికలు, సంకల్పం, మానవ సారాంశపు విలక్షణత్వాలు] నీ పై నాకు అధికారం ప్రసాదించే సాధనాలై వుంటాయి.
- 1844 నోటుపుస్తకాలు, కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 119 పాదవివరణ.

ఆస్తిపర వర్గం, అలాగే అధోకార్మికవర్గం రెండూకూడ ఒకే మానవ పరాయీకరణను సమర్పిస్తాయి. కాని వీటిల్లో మొదటి వర్గం తన ఈ స్వీయ పరాయీకరణలో తన సొంత ధ్రువీకరణనూ, తన మంచినీ – అంటే తన అధికారశక్తిని కనుగొంటుంది; అందులో [స్వీయ పరాయీకరణలో] దానికి [ఆస్తిపర వర్గానికి] ఒక మానవ అస్తిత్వపు పోలిక వుంటుంది. కాగా అధోకార్మిక వర్గం [మట్టుకు] తన స్వీయ పరాయీకరణలో తాను నిర్మూలమైపోతున్నట్లు అనుభూతి చెందుతుంది. దానిలో [తన స్వీయ పరాయీకరణలో] అది తన సొంత అశక్తతనూ, ఒక అమానుష అస్తిత్వపు వాస్తవికతనూ చూచుకొంటుంది. హెగెల్‌ మాటల్లో అధోకార్మిక వర్గం అవమానితమై (దిగజార్చబడి abased) ఆ అవమానం (దిగజార్చబడడం abasement) పట్ల ఆగ్రహోదగ్రమై వుంది; దాని (అధోకార్మిక వర్గపు) మానవస్వభావానికీ, ఆ స్వభావానికి నేరుగా, నిర్ణయాత్మకంగా, సంపూర్ణంగా అభావీకరణ (నిరాకరణ - negation) గా వుండే దాని జీవన పరిస్థితులకూ నడుమ గల వైరుధ్యం దాన్ని అనివార్యంగా ఇలాంటి ఆగ్రహోదగ్రతకు నెట్టివేస్తుంది.
కనుక ఈ ప్రతివాదం (లేక విరుద్ధవాదం - antithesis) లో ప్రైవేటు యజమాని యథాతథవాద (పూర్వాచార) పక్షంలోనూ, అధో కార్మికుడు విధ్వంసక పక్షంలోనూ వుంటారు. మొదటి వర్గం (ప్రైవేటు యజమాని) నుండి ఈ విరుద్ధవాదస్థితిని పరిరక్షించే, [కాగా] రెండవ వర్గం (అధోకార్మికుని) నుండి ఆ స్థితిని నిర్మూలించే కార్యాచరణలు పుట్టుకొస్తాయి. – పవిత్ర కుటుంబం (1845), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 134.

కార్యకలాపాల సాంఘిక లక్షణం, ఉత్పత్తియొక్క సాంఘిక రూపం, అలాగే ఉత్పత్తిలో వ్యక్తికుండే వాటా యివన్నీ ఇక్కడ ఏవో పరాయివైనట్లు, కేవలం పాదార్థికమైనవైనట్లు వ్యక్తులకు ఎదురు పడుతుంటాయి. కొంతమంది వ్యక్తులు వేరే యితర వ్యక్తులతో నెరిపే ప్రవర్తనలా యిది వుండదు; కాగా, తమకు స్వతంత్రంగా మనివుండే, ఎవరో ఏమీ పట్టనట్లుండే వ్యక్తులు ఒకరితో మరొకరు ఢీకొట్టుకొనే పరిణామంవల్ల జనించే సంబంధాలకు వాళ్లు అధీనులయ్యేలా వుంటుంది. ప్రతి వ్యక్తికీ ఒక జీవన షరాస్థితిగా వుంటూ, వ్యక్తుల నడుమ ఒక లంకెగా రూపొందినటువంటి కార్యకలాపాలు, ఉత్పత్తుల సాధారణ మారకం వాళ్లకు ఏదో పరాయిదిగా, స్వతంత్రమైనదిగా, ఏదో ఒక వస్తువులా అనిపిస్తుంది (లేక అగుపడుతుంది).
మారకపు విలువలో వ్యక్తుల మధ్యని సాంఘిక సంబంధాలు భౌతిక (పాదార్థిక) వస్తువుల నడుమలి సాంఘిక బంధాలుగా పరివర్తన చెందుతాయి; వ్యక్తిగత అధికారశక్తి భౌతిక అధికార శక్తిగా మారిపోతుంది. మారకపు సాధనాలకుండే సాంఘిక అధికారశక్తి ఎంత తక్కువగా వుండి, ప్రత్యక్ష శ్రమ (ఉత్పత్తి) ఫలపు నిజ స్వభావంతోనూ, మారకం చేసుకునే వాళ్ల తక్షణ అవసరాలతోనూ అవి (మారకం సాధనాలు) యింకా ఎంత సన్నిహితంగా పెన వేసుకుని వుంటే, అప్పుడు వ్యక్తులను కలగలపడానికి (సన్నిహితంగా కట్టివేయడానికి) సంఘసముదాయానికి వుండే అధికారశక్తికూడ అంత హెచ్చుగానే వుండితీరుతుంది: [ఉదాహరణకు,] పితృస్వామిక సంబంధాలు, ప్రాచీన జనసముదాయాలు, ఫ్యూడలిజం, గిల్డు వ్యవస్థలు. ప్రతి వ్యక్తీ సాంఘిక అధికారశక్తిని ఒక భౌతిక వస్తువు రూపంలో కలిగివుంటాడు. [కనుక మరి] ఆ [భౌతిక] వస్తువుయొక్క సాంఘిక [అధికార] శక్తి హరించబడితే, అప్పుడు ఈ [సాంఘిక అధికార] శక్తిని ప్రజలే ప్రజలపైనేగా చెలాయించవల్సి వుంటుంది.
వ్యక్తిగత అధీనతా (లేక ఆశ్రయ) సంబంధాలు [ఇవి మొదట్లో పూర్తిగా అయత్నపూర్వకమైనవి (వాటంతటవే పుట్టుకొచ్చినవి) గా వుండినాయి] మానవ ఉత్పాదకత అభివృద్ధిచెందే – ఆ అభివృద్ధి స్వల్పమైన మేరకు, ఎక్కడో చెదురు తావుల్లో మాత్రమే జరిగినా – తొలి సమాజ రూపాలుగా వుండినాయి. పోతే పాదార్థిక (భౌతిక) పరాధీనత పునాదిపై వ్యక్తిగత స్వాతంత్ర్యం నెలకొనడమనేది రెండవ పెద్ద (సమాజ) రూపంగా వుండింది – ఈ రూపంలోనే మొట్టమొదటి సారిగా ఒక సాధారణ సాంఘిక ఇచ్చిపుచ్చుకోలు (మారకం - interchange) అభివృద్ధి చెందింది. దాని ఫలితంగా సార్వత్రిక సంబంధాలు, వైవిధ్యతాపూర్వక అవసరాలు, సార్వత్రిక సామర్థ్యాలు పుట్టుకొచ్చాయి. పోతే వ్యక్తుల సార్వత్రిక వికాసం, వారి సంఘశక్తిగా రూపొందిన వారి సాముదాయిక, సాంఘిక ఉత్పాదకతల యొక్క ఆధిపత్యాల పునాదిపై నెలకొన్న స్వేచ్ఛా వ్యక్తిత్వం అనేది మూడవ దశగా వుండగలదు. వ్యాపారం, విలాసాలు, డబ్బు, మారక విలువలు వృద్ధిచెందే కొద్దీ, వాటి సరసనే ఏకకాలంలో ఆధునిక సమాజం ఎలా పుట్టిపెరుగుతూ వస్తున్నదో సరిగ్గా అదే విధంగా పితృస్వామిక, పురాతన సమాజాలూ (ఫ్యూడల్‌ సమాజంకూడ) క్షీణించిపోతాయి. - మార్క్స్‌, గ్రండ్‌రిస్సే (1857-58), పు. 66 నుండి...

పరాయీకరణ గురించి మార్క్స్‌-1

పరాయీకరణ గురించి మార్క్స్‌ - 1
పరాయీకరణ
వ్యాఖ్యానం
పరాయీకరణగురించిన మార్క్స్‌ భావన అత్యంత ప్రత్యక్షంగా హెగెల్‌నుండి వచ్చిందే (తెచ్చుకొన్నదే). అయితే ఈ పరాయీకరణ భావనకు మూలాలుమాత్రం అంతకు చాలపూర్వంనుండే ఊనుకుని వున్నాయనుకోండి. వాస్తవికత అంటే మనోబలం లేక లోసత్తువ (స్పిరిట్ – 'ఉసురు' అనికూడ అనవచ్చా?) తన్ను తాను సాధించు కోవడమే (యథార్థీకరించుకోవడమే) అని హెగెల్‌ భావిస్తాడు. తర్వాత తర్వాత ఈ లోసత్తువ ఈ ప్రపంచాన్ని తన స్వీయసృష్టిగా పరిగణించడం మొదలుపెట్టింది. తన ఉత్పాదక కార్యకలాపంలో, ఆ కార్యకలాపంద్వారామాత్రమే ఉనికిలోకి వచ్చివుండిన లోసత్తువ క్రమక్రమేపీ తన్ను తాను బాహ్యీకరించుకొంటున్నట్లు లేక పరాయీ కరించుకొంటున్నట్లు చైతన్యం సంతరించుకోసాగింది. హెగెల్‌కు సంబంధించి పరాయీకరణ అనేది ఈ ప్రపంచం లోసత్తువకు వెలుపలవుండేదేమీ (బాహ్యమైనదేమీ) కాదనే విషయాన్ని గుర్తించ విఫలమవడంలో యిమిడివుంది. కనుక తమ ప్రకృతిపరిసరాలు, తమ సంస్కృతి ఈ లోసత్తువయొక్క సృజనలని మనుషులు గ్రహించినప్పుడు ఈ పరాయీకరణ మటుమాయమౌతుంది (ముగిసి పోతుంది). ఇది గ్రహించినప్పుడు మనుషులు స్వతంత్రులవుతారు; మరి మానవుని స్వాతంత్ర్యమేగదా చరిత్ర ధ్యేయం (లక్ష్యం). హెగెల్‌ భావన అంటే తాను (అర్థం చేసుకుని) భావించేది యిదని మార్క్స్‌ యిలా సంగ్రహీకరించి చెబుతాడు:
హెగెల్‌కు సంబంధించి మానవసారం – మనిషి – అన్నా, స్వీయ (ఆత్మ) చైతన్యమన్నా ఒకటే. కనుక మానవ సారపు పరాయీకరణ అంటే ఆత్మచైతన్యపు పరాయీకరణేతప్ప మరొకటి కాదు. ఈ ఆత్మ చైతన్యపు పరాయీకరణ అనేదాన్ని, ఎరుక (జ్ఞానం) లోనూ, ఆలోచనలోనూ ప్రతిఫలించబడే మానవ సారపు యథార్థ వ్యక్తీకరణగా భావించరాదు. తత్వవిజ్ఞానం మొట్టమొదటగా వెలుగులోకి తెచ్చిన, దాని అంతర్గత గుప్త సారాంశంలోని నిజమైన పరాయీకరణ (లేదా అలా నిజంగా అగుపించే పరాయీకరణ) అనేది యథార్థ మానవ సారపు – అంటే ఆత్మచైతన్యపు పరాయీకరణ యొక్క ప్రస్ఫుట రూపం తప్ప మరేమీ కాదు.[1]
అయితే హెగెల్‌పై మార్క్స్‌ చేసే కేంద్ర (ప్రధాన) విమర్శ అంతా ఈ పరాయీకరణ అనేది బాహ్య ప్రపంచపు రద్దు అనుకోబడే పరిణామంతో ఆగిపోయేదేమీ కాదనే. మార్క్స్‌ ప్రకారం బాహ్య ప్రపంచం మనిషి ప్రకృతిలో ఒక భాగమే; కనుక మనిషికీ అతడి పరిసరాలకూ (పర్యావరణానికీ) నడుమ ఒక సజావైన సంబంధం నెలకొల్పడమే అతి ముఖ్యమైన (కావల్సిన) విషయం.
[మార్క్స్‌ రాస్తాడుగదా] ఏదైనా ఒక భౌతిక అస్తిత్వానికి (objective being) ఒక భౌతిక ప్రభావం వుంటుంది. మరి ఆ అస్తిత్వపు ఉనికిలో గనుక ఒక భౌతిక మూలాంశం చేరిలేకుంటే దానికి అలాంటి భౌతిక ప్రభావం వుండజాలదు. అది వస్తువులచే స్థితినిశ్చయం గావించ బడుతుంది గనుకనే, ఎందుకంటే అది పుట్టుకతో సహజసిద్ధమై వుంటుంది గనుకనే, అది వస్తువుల్ని సృష్టించగలుగుతుంది; స్థితి నిశ్చయం చేయగలుగుతుంది. కనుక యిలా స్థితినిశ్చయం గావించే చర్యలో అది ఒక వస్తువును సృష్టించే 'శుద్ధ కార్యకలాపం' నుండి ఏమీ దిగజారడం లేదు; దాని భౌతిక (ఉత్పత్తి) ఫలం కేవలం దాని భౌతిక కార్యకలాపాన్ని – ఒక భౌతిక, సహజసిద్ధ అస్తిత్వపు కార్య కలాపంగా వుండే దాని కార్యకలాపాన్ని – ధ్రువీకరిస్తున్నదంత మాత్రమే.[2]
ఈ విధంగా మార్క్స్‌ లోసత్తువ అనే భావననే తిరస్కరిస్తాడు; అలాగే బాహ్య ప్రపంచానికి విరుద్ధంగా ఈ లోసత్తువకు వుంటుందని భావించబడే ప్రతివాదం స్థానే మనిషికీ, అతడి సాంఘిక అస్తిత్వానికీ నడుమ వుండే ప్రతివాదాన్ని తెచ్చిపెడతాడు.
ప్రత్యేకించి తన తొలి రచనల్లో మార్క్స్‌ వివిధ రకాల పరాయీకరణలగురించి చర్చిస్తాడు. యువ హెగెలియన్‌లందరికీ సామాన్యంగా వుండే ఒక ఉధృతమైన లౌకికీకరణ క్రమంలో సాగిపోతూ మొదట మతపరమైన పరాయీకరణనుండి తాత్విక పరాయీకరణకూ, ఆపై అటునుంచి రాజకీయ పరాయీకరణకూ, అంతిమంగా ఆర్థిక పరాయీకరణకూ పయనిస్తాడు. పని చేయడం (శ్రమ) అనేది మనిషి యొక్క మౌలిక కార్యకలాపంగా వుండడంవల్ల, ఆ మేరకు ఈ చివరిదాన్ని – అంటే ఆర్థిక పరాయీకరణను – మౌలికమైందిగా పరిగణిస్తాడు మార్క్స్‌. ఈ అన్ని రంగాల్లోనూ సామాన్యమైన భావన ఏమంటే తన ప్రకృతికి (సహజ స్వభావానికి) ప్రధానావశ్యకమైన అంశాన్ని – అంటే తన సొంత కార్యకలాపాలపై అదుపాజ్ఞలు తానే ప్రముఖంగా కలిగివుండడం, చారిత్రక క్రమానికి ఆవిష్కర్త తానుగా వుండడం అనే అంశాన్ని మనిషి మరెవరికో లేక మరేదానికో (మరే అంశానికో) కోల్పాయాడనేదే. ఈ వివిధ పరాయీ కరణ రూపాల్లో జరిగిందేమంటే, అసలు మనిషికి సముచితంగా చెందవల్సిందాన్ని వేరే మరే అస్తిత్వమో పొందడమే (కొట్టేయడమే).
ఉదాహరణకు మతంలోనైతే మనిషి (కి చెందవల్సిన) స్వీయ స్థితిని దేవుడు ఆక్రమించుకున్నాడు; బరువు బాధలకు పరిహారం గానూ, అలాగే మనిషియొక్క అత్యంత ప్రగాఢమైన కోరికల అభివ్యక్తీకరణకు మాధ్యమంగానూ ఒక ద్వంద్వ (రెండందాల) విధిని మతం నిర్వర్తిస్తుంది. మతమంటే 'మానవ సారపు (మానవ సారాంశం యొక్క) ఊహాత్మక సాధన – ఎందుకంటే మానవ సారాంశానికి అసలు నిజమైన వాస్తవికత ఏదీ వుండదుకాబట్టి,'[3] అంటాడు. ఇక మార్క్స్‌ చెప్పిన తీర్పు: "ప్రజలయొక్క భ్రమాత్మక ఆనందంగా వుండే మతాన్ని రద్దు చేయడం (మతం రద్దు) అంటే వాళ్ల వాస్తవిక ఆనందంగురించి డిమాండు చేయడమే. తమ పరిస్థితులగురించిన భ్రమల్ని వాళ్లు వదులుకోవాలని గట్టిగా అడగడమంటే అలాంటి భ్రమను ఆవశ్యకంగావించే పరిస్థితిని విసర్జించాలని (రూపు మాపాలని) డిమాండు చేయడమే."[4]
మరి తత్వచింతన (తత్వవిజ్ఞానం - philosophy) కూడ (ఇక్కడ మార్క్స్ ప్రత్యేకించి హెగెల్‌ తత్వచింతనను మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడని గమనించాలి) పరాయీకరణని కలగజేయ (ఏర్పరచ) వచ్చు. ఊహాగానాల తత్వచింతన (speculative philosophy) చరిత్రనూ, మనిషినీ ఒక మానసిక క్రమంగా కుదించివేసింది. దేవుని స్థానే 'భావన' (idea) ను తెచ్చిపెట్టిన అది (ఊహాగాన తత్వచింతన) లౌకికీకృత మతవిజ్ఞానం (secularized theology) కంటే ఏమాత్రం మెరుగుకాదు. "ఈ విధంగా, మనిషియొక్క కర్మపదార్థీకృత (objectified), పరాయీకృత ప్రతిభాశక్తుల (లేక యుక్తుల faculties) భుక్తం (appropriation వినియోగం) హెగెల్‌ చెప్పేప్రకారమైతే మొదటగా మనసులో సంభవించే, శుద్ధ ఆలోచనలో సంభవించే అంటే ఒక అనిర్దిష్టతలో సంభవించే ఒక భుక్తం (లేక వినియోగం) గా మాత్రమే వుంటుంది,"[5] అంటాడు మార్క్స్‌.
యిదే విశ్లేషణను మార్క్స్‌ రాజకీయ పరాయీకరణకూ అన్వయించాడు. రాజ్యం అనేది ఒక మానవస్వభావ వర్ణనను కలిగివుంటుంది (నిజమే) గానీ అదే సమయంలో అది (రాజ్యం) మనషి దాన్ని (అంటే ఆ మానవ ప్రకృతిని) సాధించుకొనే అవకాశాన్ని హరించివేస్తుంది.
పూర్వం (మొదట్లో) మతపర రంగమే రాజకీయ రాజ్యాంగమై వుండింది. అంటే ప్రజాజీవనపు మతం, దాని వాస్తవిక, ఐహిక మనుగడకు విరుద్ధంగా, అతీతంగా దాని (ప్రజాజీవితపు) సార్వత్రికత (లేక విశ్వ జనీనత)కుసంబంధించిన స్వర్గంగా [ఈ రాజకీయ రాజ్యాంగం] వుండింది. ఈ రంగం ఒక్కటే రాజ్యంలోని ఏకైక రాజ్య రంగంగా వుండింది; తెగ జాతికి, సిసలైన సార్వత్రికతకూ సంబంధించిన సారాంశమే దాని సారంగానూ, అలాగే రూపంగానూ కూడ వుండిన ఏకైక రంగంగా వుండింది. అదే సమయంలో యితర రంగాలకు పైగా, విరుద్ధంగా నిలిచి వుండడంచేత తన సారాంశంకూడ ఒక ప్రత్యేకమైందిగా, లాంఛనమైందిగా రూపొందిన చందంగా ఈ రంగం నిలిచివుండింది. [కాగా] ఆధునిక రాజ్యంలో రాజకీయ రంగం ప్రజాజీవితపు పాండిత్య తత్వం (పాండిత్యప్రకర్ష) గా వుంటుంది. రాచరికం ఈ పరాయీకరణకు ఒక సమగ్రీకృత వ్యక్తీకరణై వుండగా, గణతంత్రవాదం (రిపబ్లికనిజం) దాని స్వీయక్షేత్రంలోనే దాని రుణాత్మక అంతర్గతంగా వుంటుంది."[6]
పరాయీకరణగురించి మార్క్స్‌ అత్యంత సంపూర్ణంగా చర్చించే రచనాభాగాలు మనకు పారిస్‌ రాతప్రతులు లో కనిపిస్తాయి. ఇక్కడ మార్స్క్‌ మొట్టమొదటిసారిగా ఈ (పరాయీకరణ) భావనను ఆర్థిక శాస్త్రానికి అన్వయించడం గమనిస్తాము. ఇక్కడ 'పరాయీకృత శ్రమ' అనే ఉపశీర్షికకింద పెట్టుబడిదారీ విధానంలో కార్మికుని పరాయీకృత పరిస్థితిని మార్క్స్‌ నాలుగు రకాలుగా విభజించి వ్యవహరిస్తాడు:
[మార్క్స్‌ రాస్తాడుగదా,] తన స్వీయ శ్రమోత్పత్తితో కార్మికునికి వుండే సంబంధం [సైతం] ఏదో ఒక పరాయి వస్తువుతో వుండే సంబంధంలాగే వుంటుంది. అతడు సృష్టించే వస్తువు అతడికి చెందకపోగా, అతడిపై ఆధిపత్యం చెలాయిస్తుంది; ఇంకా దీర్ఘకాలంలో అతడి పేదరికాన్ని పెంచడానికే దోహదపడుతుందికూడ. ఈ పరాయీకరణ [తుది] ఫలంలోనేగాక దాని ఉత్పత్తిక్రమంలోనూ, అసలు స్వయంగా ఆ ఉత్పత్తికార్యకలాపంలో సైతం కనబడుతుంది. కార్మికుడు తన పనిలో ఇంటికుదురుగా వుండలేకపోతాడు. ఎందుకంటే ఆ పని కేవలం తన యితర అవసరాలు తీర్చు కొనేందుకుమాత్రమేనన్నట్లు భావిస్తాడుగనుక. అదేదో తనకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడిన కార్యకలాపంగా, అంటే తనకు స్వతంత్రమైన, తనకు చెందని కార్యకలాపంగా చూస్తాడు. మూడవ దేమంటే పరాయీకృత శ్రమ మనిషిని అతడి తెగజాతినుండి వేరుగావించడం (పరాయి చేయడం) లో కృతకృత్యమవుతుంది. తెగ జీవితం, ఉత్పాదక జీవితం, జీవితాన్ని సృష్టించే జీవితం అన్నీ కేవలం కార్మికుని వైయక్తిక మనుగడను పోషించి సాగించే ఒక సాధనంగా మారిపోతాయి; మనిషి తన సాటి మనుషులనుండి పరాయి (వేరుగా) అయిపోతాడు. అంతిమంగా స్వయంగా ప్రకృతి సైతం మనిషినుండి పరాయిగా అయిపోతుంది; కనుక మనిషి తన సొంత అకర్బన శరీరాన్ని కోల్పోతాడు.
ఈ పై రచనాభాగాలలో పెట్టుబడిదారీ సమాజంలో స్పష్టంగా అత్యంత పరాయీకృత భాగమైవుండే కార్మికులగురించే ప్రస్తావించ బడి వుండడం నిజమే అయినా మార్క్స్‌ భావన ప్రకారం ఈ పరాయీకృత స్థితి అనేది ఆ సమాజంలోని సభ్యులందరికీకూడ సామాన్యంగా వర్తించేదే. ఆయన తన పవిత్ర కుటుంబం లో యిలా అంటాడు:
"యాజమాన్య వర్గమూ, అధోకార్మిక వర్గమూ రెండూ ఒకే మానవ స్వీయపరాయీకరణకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కాకపోతే మొదటి వర్గం (అంటే యజమాని వర్గం) ఆత్మ-పరాయీకరణలో మరింత సౌకర్యవంతం (సుఖం) గా అనుభూతి చెందుతూ దాన్ని ధ్రువీకరిస్తుంది; అదే తన స్వీయాధికారానికి మూలమని గుర్తెరిగి, ఆ పరాయీకరణలోనే ఒక మానవ అస్తిత్వపు పై పై రూపాన్ని కలిగి వుంటుంది. కాగా రెండవ వర్గం (అంటే అధోకార్మిక వర్గం) ఈ పరాయీకరణలో తన వినాశాన్ని అనుభూతి చెందుతూ, దానిలో తన అశక్తతనూ, తన అమానవ అస్తిత్వ వాస్తవికతనూ చూస్తుంది."[7]
మార్క్స్‌ రచనల్లో పరాయీకరణ భావనకు కేంద్ర ప్రాధాన్యం వుంది. కాకుంటే, బహుశా దాని పూర్ణ తాత్విక అర్థసూచన మూలంగా కావచ్చు ఆయన ఆ పదాన్ని యథార్థంగా అలాగే వాడడం తక్కువ చేసే ధోరణి కనబరుస్తాడు. నిజానికి కమ్యూనిస్టు ప్రణాళిక లోనైతే ఆయన "డబ్బుయొక్క ఆర్థిక విధులపై సాగిన ఫ్రెంచి విమర్శ కింద మానవత్వపు పరాయీకరణ"[8] అని [శీర్షిక పెట్టి] రాసిన జర్మన్‌ సాహిత్యవేత్తలపై అవహేళన గుమ్మరిస్తాడు. అయితే ఈ [పరాయీకరణ] భావన మార్క్స్‌యొక్క గ్రండ్‌రిస్సే కు సంబంధించినంతవరకు మౌలికమైనదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో, "కర్మపదార్థీకరణ స్థితిని గాక పరాయీకరణ, ఎడబాటు, విసర్జనల స్థితిని, సామాజిక శ్రమ తన మూలకాంశాల్లో ఒకటిగా తనకు తానే ఎదురు తెచ్చిపెట్టుకొన్న బ్రహ్మాండమైన భౌతికీకృత (లేదా కర్మపదార్థీకృత) శక్తి కార్మికునికిగాక పెట్టుబడిలో భౌతికీకృతమైన ((కర్మపదార్థీకృతమైన) ఉత్పత్తి పరిస్థితులకు చెందుతుందనే వాస్తవాన్ని"[9] మార్క్స్‌ నొక్కిచెబుతాడు.
ఇదే భావన పెట్టుబడి గ్రంథ ప్రారంభంలోనే 'వర్తకపు సరుకుల చిత్రమహిమ' (Fetishism of Commodities - సరుకుల మాయ అని మరో అనువాదం) అనే శీర్షికన పునరుక్తమౌతుంది. మార్క్స్‌ అంటాడు గదా:
"అందుచేత వర్తకపు సరుకు ఒక నిగూఢ (విచిత్ర, మార్మిక - mysterious) వస్తువుగా వుంటుంది – ఎందుకంటే దానిలో మనుషుల శ్రమయొక్క సాంఘిక స్వభావం ఒక శ్రమోత్పత్తి ఫలంపై ముద్రింపబడిన భౌతిక స్వభావంగా వాళ్లకు గోచరిస్తుందిగనుక, తమ సొంత శ్రమయొక్క వెరసిమొత్తంపట్ల ఉత్పత్తిదారులకు వుండే సంబంధం [వ్యక్తులుగా] వారి మధ్యవుండే బంధంగాకాక వాళ్ల శ్రమోత్పత్తి ఫలాలనడుమ నుండే ఒక సామాజిక సంబంధంగా వాళ్లకు సమర్పించబడుతుంది గనుక (అదిలా చిత్రమహిమాన్విత వస్తువై వుంటుంది). ఇందుకే శ్రమోత్పత్తి ఫలాలు వర్తకపు సరుకులుగా – ఒకే సమయంలో ఇంద్రియాలకు గ్రాహ్యం గానూ, అగ్రాహ్యంగానూ రెండందాలా వుండే గుణాలుగల సామాజిక వస్తువులుగా అవుతాయి… అంటే యిక్కడ మనుషుల మధ్య నిశ్చితమైన ఒక సాంఘిక సంబంధం వున్నా అది వారి కళ్లకు వస్తువులమధ్య నుండే ఒక విడ్డూరపు సంబంధంగా గోచరిస్తుంది… దీన్నే నేను చిత్రమహిమ (మాయ) అంటాను; శ్రమోత్పత్తి ఫలాలు వర్తకపు సరుకులుగా ఉత్పత్తి కావడంతోటే ఈ చిత్రమహిమ (మాయ) వాటిని ఆవరిస్తుంది."[10]
పరాయీకరణ అనేది మార్క్స్‌ ఏదో తన తాత్విక పసితనంలో వాడిన పదంమాత్రమే అని అనేకమంది రచయితలు అనివుండడం వల్ల, [అది సరికాదు!] ఆ పదం పెట్టుబడి లో పదే పదే మనకు కని పిస్తుందని గమనించడం యిక్కడ చాల ముఖ్యం.[11] నిజానికి దాని (పరాయీకరణ భావన) అంతరార్థం ప్రజలమధ్య సంబంధాల స్థానే వస్తువుల మధ్య సంబంధాలు చోటుచేసుకొంటాయి (తెచ్చిపెట్ట బడుతాయి) అన్నట్లయితే అది అసలుకు పెట్టుబడియొక్క ప్రాథమిక ఇతివృత్తాల్లోనే ఒకటని చెప్పవచ్చు. ఉదాహరణకు మార్క్స్‌ యిలా రాస్తాడు: "పనివ్యక్తికి విరుద్ధంగా శ్రమ పరికరాలు (సాధనాలు - instruments), ఉత్పత్తులకు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాలు మొత్తంగా సమర్పించే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు, ఎడబాటుల స్వభావం [ఆధునిక] యంత్రాలద్వారా ఒక సమగ్ర వైరం (శత్రుత్వం) గానే మార్చివేయబడుతుంది."[12] అయితే యిదంతా కేవలం ఏదో పరిభాష గురించిన సమస్యమాత్రమే కాదు; పెట్టుబడి యొక్క సారాంశంకూడ మార్స్క్‌ తొలి (పూర్వ) ఆలోచనలకు కొనసాగింపేనని చెప్పవచ్చు. పెట్టుబడి 1 వ సంపుటంలో ప్రధాన చర్చ అంతా పని (శ్రమ) కీ, విలువకూ మధ్యనుండే సమీకరణంపై ఆధారపడి వుంటుంది; అంటే అది మళ్లీ వెనక్కు – తన్ను తానూ, అలాగే తన జీవిత పరిస్థితులనూ రెంటినీ సృష్టించుకొనే జీవి మానవుడంటూ పారిస్‌ రాతప్రతులు లో రేఖాచిత్రణ చేయబడ్డ భావనకు – తిరిగి వెళ్లడం అవుతుందన్న మాట. పారిస్‌ రాతప్రతులు రాసిననాటి మార్క్స్‌ ప్రకారమైతే, తన తోటి యితర మానవుల సహకారంతో తననూ తనచుట్టూవున్న ప్రపంచాన్నీ నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పోవడం మనిషి నిజస్వభావం. మరి (ఈ) చారిత్రక క్రమాన్ని ప్రారంభించి అదుపుచేసే వ్యక్తిగా మనిషి వహించే ఈ మౌలిక పాత్రను ఎలా బదిలీ చేయబడిందో, లేదా పరాయీకృతం గావించబడిందో, [ఇప్పుడు] అది పెట్టుబడియొక్క అమానవ అధికారశక్తికి ఎలా చెందివుందో మార్క్స్‌ తన పెట్టుబడి లో వర్ణించి చెబుతాడు. అలాగే ఈ పరాయీకృత మానవుడి ప్రతిరూపం (counterpart), అంటే రాతప్రతులులో పేర్కొన్న అపరాయీకృత, 'పూర్ణ' మానవుడు కూడ పెట్టుబడి లో మనకు అగుపిస్తాడు. పెట్టుబడి, సంపుటం 1 లోని 'యంత్రాలు - ఆధునిక పరిశ్రమ' పైని అధ్యాయంలో మార్క్స్‌, పరాయీకృత, అపరాయీకృత ఉత్పత్తి విధానాలు మానవ అంతస్థ శక్తుల వికాసంపై నెరిపే ప్రభావాల్లో అంతరాల్ని అదే మాదిరి (అంటే రాతప్రతులు లోలాగే) వివరించి చెబుతాడు. ఆయన అంటాడుగదా:
"నిజానికి ఆధునిక పరిశ్రమ ఈ నాటి ముక్కపని-కార్మికుడికి – అంటే, ఒకే అల్పమైన పనిముక్కను జీవితాంతం పునర్నిర్వర్తిస్తూ (మళ్లీ మళ్లీ చేస్తూ) [ఒక విధంగా] వికలాంగునిలా అయిపోయిన, ఆ విధంగా ఒక మనిషిముక్కగా కుదించుకుపోయిన నేటి ముక్కపని-కార్మికుడికి (detail-worker) - బదులుగా నానారకాల పనులు చేసే స్తోమతగల, ఏ ఉత్పత్తి మార్పుల్నయినా ఎదుర్కోవడానికి సంసిద్ధమై వుండే, తాను నిర్వర్తించే విభిన్న సాంఘిక విధులు తన సొంత సహజసిద్ధ, ఇంకా సముపార్జిత శక్తియుక్తులకు స్వేచ్ఛావికాస అవకాశం సమర్పించే వివిధ విధానాలుగామాత్రమే వుండే ఒక సంపూర్ణ వికసిత వ్యక్తిని తెచ్చిపెట్టేట్లు, ఒక మృత్యుదండనాభయం కల్పిస్తూ, బలవంతం (వత్తిడి) చేస్తుంది."[13]
ఈ తుది అభిప్రాయాన్ని (conclusion) పెట్టుబడి [గ్రంథం] లో పురోగమిత సాంకేతిక విజ్ఞాన ప్రభావాల సవివర విశ్లేషణద్వారా సమర్థించబడిందనే వాస్తవం [ఆ తుది అభిప్రాయానికిసంబంధించి] అంతకు ముందున్న [అంటే రాతప్రతులు నాటినుండేవున్న] నిరంతరాయతను కప్పిపుచ్చరాదు.
అయితే మార్క్స్‌ ఆలోచనల్లో పరాయీకరణ భావనకున్న కేంద్ర ప్రాముఖ్యం మనకు గ్రండ్‌రిస్సే(Grundrisse)§ లో కనిపిస్తుంది; అది 1941 దాకా అప్రచురితంగా వుండిన మార్క్స్‌యొక్క ముసాయిదా రాతప్రతి; దాని ఆధారంగానే మార్క్స్‌ ఆ తర్వాత తన పెట్టుబడి గ్రంథం రచించాడు. తర్వాతి రాజకీయార్థ శాస్త్ర విమర్శ, పెట్టుబడి గ్రంథాలు గ్రండ్‌రిస్సే కు పాక్షికమైన వివరణలుమాత్రమే; అది మార్క్స్‌ రచనల్లోకెల్లా కేంద్రప్రాధాన్యం గల రచన అని చెప్పవచ్చు. రాజకీయార్థశాస్త్ర విమర్శ కు రాసిన ప్రత్యేక పీఠికలో మార్క్స్‌ చేసిన సాధారణీకరణలకు ఆధారమైన మూల రచన అదే. పెట్టుబడి ద్వారా, రాజ్యంద్వారా జరిగిన మనిషి పరాయీకరణ క్రమంగురించి మార్క్స్‌ 'అర్థశాస్త్రం' అనే శీర్షికన ఒక ఆరు సంపుటాల మహాగ్రంథం (magnum opus) రాయ సంకల్పించాడనీ, అందులో పెట్టుబడి ఒక [మొదటి] సంపుటంమాత్రమేననీ మనమిక్కడ తెలుసుకోవాలి.
గ్రండ్‌రిస్సేయొక్క యోచనాపరిథి పెట్టుబడి [గ్రంథ] పరిథికంటే విస్తృతమైంది. కనుక మార్క్స్‌ 1844 లోనే ప్రారంభించిన ధ్యాన ప్రక్రియను అలా కొనసాగిస్తూపోయాడనీ, 1857-58 ప్రాంతాల్లో ఈ ధ్యానం పరాకాష్టకుచేరుకొందనీ గమనించడంద్వారా మనం మార్క్స్‌ఆలోచనావిధానాన్ని అత్యుత్తమంగా అవగతం చేసుకోగలం. రాత ప్రతులు కూ, గ్రండ్‌రిస్సే కూమధ్య నున్న నిరంతరాయత స్పష్టంగానే అగుపడుతుంది. స్వయంగా మార్క్సే తన ఒక లేఖలో, 'నేను పదిహేనేళ్లుగా చేసిన పరిశోధన ఫలితం గ్రండ్‌రిస్సే; ఈవిధంగా అది నా జీవితంలోనే అత్యుత్తమ కాలావధిలో రాయబడింది' అని చెప్పి వున్నాడుకూడ. ఆ లేఖ 1858 నవంబరులో, అంటే 1843 నవంబరులో మార్క్స్‌ పారిస్‌కు వచ్చిన ఘటనకు సరిగ్గా 15 ఏళ్ల తర్వాత రాయబడింది. ఇంకా తన 1859 నాటి పీఠికలో మార్క్స్‌, “[ఇందుకుసంబంధించిన] మూల సమాచారం మొత్తమూ నావద్ద ఏకాంశరచనల రూపంలో పడివుంది; అవన్నీ ప్రచురణకోసం గాక స్వీయవివరణకోసమని వేర్వేరు విశాల కాలాంతరాల్లో రాయబడ్డవి. వాటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా, సుసంగతంగా రూపొందించి వివరంగా రాయాలంటే అదంతా [అనేక] బాహ్యపరిస్థితులపై ఆధార పడివుంటుంది మరి,"[14] అని అంటాడుకూడ. ఇది కేవలం 1844 నాటి రాతప్రతులు, ఆ తర్వాతి ఆయనయొక్క 1850-52 లండన్‌ నోటుపుస్తకాల కు సంబంధించిన ప్రస్తావనే అయివుండగలదు. తాను అంతకు ముందు రాసుకున్న విషయసమాచారాల్ని మార్క్స్‌ నిరంతరం ఉపయోగించుకోవడమేగాక, అదే సమయంలో వాటిని సరిచూచుకుంటూకూడ వచ్చేవాడని మనమిక్కడ గమనించాలి. ఉదాహరణకు పెట్టుబడి రాసేటప్పుడు ఆయన తన 1843-45 నాటి నోటుపుస్తకాల్ని [సైతం] వాడుకున్నాడు.
ఈ గ్రండ్‌రిస్సే లోని విషయాల్ని గమనిస్తే బాహ్య సాక్ష్యాధారాల వల్ల స్పష్టంగా కనిపించే విషయాలు ధ్రువీకరించబడుతాయి: అందులో పెట్టుబడిపై రాసిన అధ్యాయం మొదట్లో మానవ అవసరాలు, ఒక తెగజీవిగా మనిషి, ఒక సంఘజీవిగా వ్యక్తి, ప్రకృతిని ఒక విధంగా మనిషి దేహంతో పోల్చి చూసే భావన, మతపర, ఆర్థిక పరాయీకరణల మధ్య సామ్యాలు, ఊహాస్వర్గవాద, స్వర్ణయుగవాద అంశాలు వగైరాలకు సంబంధించి రాసిందంతా రాతప్రతులు లోని రచనాభాగాలనుండి దాదాపు ముక్కస్య ముక్కగా తీసుకున్నదేనని గమనిస్తాము. ప్రత్యేకించి ఒక అంశం ఈ నిరంతరాయతను నొక్కి చెబుతుంది – అదేమంటే, పారిస్‌ రాతప్రతులు ఎలాగో, ఎంతగానో గ్రండ్‌రిస్సేకూడ అలాగే, అంతగానూ హెగెల్‌వాదపూరితంగా వుంటుంది; రెంటిలోనూ పరాయీకరణ అనేదే కేంద్ర భావనగా వుంటుంది.[15]
[1] కారల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 102.
[2] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 103 పాదవివరణ.
[3] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 63.
[4] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 64.
[5] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 100.
[6] కార్ల్‌ మార్క్స్, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 29 పా.వి.
[7] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 134 పా. వి.
[8] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 241.
[9] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 384.
[10] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 435 పా. వి.
[11] ఉదాహరణకు పెట్టుబడి, 1937 లండన్‌ ఎడిషన్‌కు సూచికను చూడండి. మార్క్స్‌ ఆలోచనలో పరాయీకరణ భావన కొనసాగుతూండడం గురించి ఆర్‌. దునయేవ్‌స్కయా, మార్క్సిజం – స్వాతంత్ర్యం, న్యూయార్క్‌, 1968, పు. 103 నుండి కొన్ని పుటలు, ఎరిక్‌ ఫ్రామ్‌, మనిషి గురించి మార్క్స్‌ భావన, న్యూయార్క్‌, 1961, పు. 50 నుండి కొన్ని, పు. 69 నుండి కొన్ని పుటల్లో చెప్పబడింది. అలాగే ఓల్‌మన్‌, సీగెల్‌ల పుస్తకాలుకూడ చూడండి.
[12] పెట్టుబడి, 1 వ సంపుటం, పు. 432.
[13] పై గ్రంథమే, పు. 488.
§ గ్రండ్‌రిస్సే - Grundrisse der Kritik der Politischen Ökonomie (German: Outlines of the Critique of Political Economy) రాజకీయార్థశాస్త్ర విమర్శయొక్క రేఖాచిత్రణ.
[14] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 388.
[15] ప్రత్యేకించి చూడు: కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పుట 305 తర్వాతనుండీ, ఇంకా పుట 371 తర్వాతనుండీ.