Monday, May 19, 2008

పరాయీకరణగురించి మార్క్స్‌-3

పరాయీకరణగురించి మార్క్స్‌-3
[మార్క్స్‌] మూలపాఠాలు - 2

సజీవ శ్రమశక్తికి ప్రతిగా [విరుద్ధంగా] విలువ స్వతంత్రంగా, స్వయం-ప్రతిపత్తితో మని వుండడం –
అందుచేత అది పెట్టుబడిగా మని వుండడం –
వస్తుగత [కర్మపదార్థగత], స్వయంకేంద్రీకృత అలక్ష్యం, సజీవ శ్రమశక్తికి ప్రతిగా భౌతిక [పాదార్థిక] శ్రమ పరిస్థితుల పరాయి స్వభావం [ఈ రెండూ] ఎంత [హెచ్చు] స్థాయికి చేరుకున్నాయంటే –
(1) ఈ పరిస్థితులు ఒక వ్యక్తిగా కార్మికునికి ఎదురుగా పెట్టుబడి దారుని వ్యక్తి రూపంలో [తమ సొంత సంకల్పం, ప్రయోజనాలతో కూడుకున్న వ్యక్తిఅవతారాలుగా] తారసపడుతాయి; ఈవిధంగా ఒక సంపూర్ణమైన వేర్పాటు, యాజమాన్య విచ్ఛిత్తి [అంటే, సజీవ శ్రమశక్తినుండి భౌతిక శ్రమ పరిస్థితులకు] సంభవిస్తాయి; ఈ పరిస్థితులు ఏదో ఒక పరాయి ఆస్తిగా, ఎవరో మరొక చట్టపర వ్యక్తియొక్క వాస్తవికతగా, అలాంటి వ్యక్తుల సంకల్పపు అఖండ ఆధిపత్య క్షేత్రంగా కార్మికున్ని ఎదిరిస్తూ ప్రత్యక్షమవుతాయి – ఇంకా కూడ,
(2) [దానివల్ల] శ్రమ అంతా పెట్టుబడిదారు రూపంలో వ్యక్తి అవతారం పొందిన విలువకూ, శ్రమ పరిస్థితులకూ విరుద్ధమైన ఏదో ఒక పరాయిశ్రమగా గోచరిస్తుంది.
మరి ఇలా ఆస్తికీ, శ్రమకూ నడుమ; సజీవ శ్రమశక్తికీ, దాని సాధనకు (యథార్థీకరణకు) వలసిన పరిస్థితులకూ నడుమ; సజీవ శ్రమకూ, వస్తుగత (పదార్థీకృత) శ్రమకూ నడుమ; విలువకూ, విలువను సృష్టించే కార్యకలాపానికీ నడుమ జరిగిన పూర్తి వేర్పాటు – అందుచేత స్వయంగా కార్మికునికే ఎదురుగా [అతడి] శ్రమ సారాంశం ఒక పరాయి ప్రకృతిని (స్వభావాన్ని) సంతరించుకోవడం – ఈ వేర్పాటిప్పుడు స్వయంగా శ్రమ (ఉత్పత్తి) ఫలంగానే, దాని [శ్రమ ఫలపు] స్వీయమూలాంశాల పదార్థీకరణగానే కనిపిస్తుందికూడ.
ఎందుకంటే, అసలుకు నూతన ఉత్పతి క్రియాచర్యనే [అది (నూతన ఉత్పత్తి క్రియాచర్య) కేవలం పెట్టుబడికీ, దానిపూర్వం వుండిన సజీవశ్రమకూ మధ్య మారకాన్ని ధ్రువీకరించిందంత మాత్రమే], ఇంకా అదనపు శ్రమా, కనుక అదనపు విలువా, అదనపు ఉత్పత్తీ [మిగులు ఉత్పత్తీ], టూకీగా మొత్తం శ్రమ (అంటే ఆవశ్యక శ్రమయొక్క, అలాగే అదనపు శ్రమయొక్కకూడ) ఫలితమంతా పెట్టుబడి గా, ఇటు సజీవ శ్రమశక్తికీ, అటు దాని కేవల ఉపయోగపు విలువకూ రెంటికీ విరుద్ధంగా స్వతంత్రంగా, అలక్ష్య పూరితంగా [వాటినేమీ లెక్కచేయని విధంగా] మనివుండే మారకపు విలువగా వ్యవస్థాపితమవుతుంది.
శ్రమశక్తి ఆవశ్యక శ్రమయొక్క స్వీయమానసిక [లేదా కర్తృపర] పరిస్థితులను మాత్రమే అవలంబించింది – అంటే ఉత్పాదక శ్రమ శక్తికి అత్యాజ్యఅవసరమైన బతుకుగడుపునుమాత్రమే అంటే కేవలం శ్రమశక్తిగా పునరుత్పత్తికావడానికి అవసరమైన మొత్తాన్నిమాత్రమే – ఆ శ్రమశక్తి సాధన (యథార్థీకరణ) కు సంబంధించిన పరిస్థితులతో నిమిత్తం లేకుండా, వాటికి వేరుగా – అవలంబించింది. అంతేకాక అదే (శ్రమశక్తే) ఈ పరిస్థితుల్ని లక్ష్యాలు, విలువలుగా నెలకొల్పింది; అవి ఒక పరాయి, అధికారనిరంకుశవాద వ్యక్తిమూర్తీభావంగా దానికి (శ్రమశక్తికి) విరుద్ధంగా ఎదురుపడుతుంటాయి.
ఈ క్రమంనుండి అది (శ్రమశక్తి) మరింత సంపన్నమై కాదుగదా, నిజానికి అది ఈ క్రమంలో ప్రవేశించినప్పటికంటే మరింత పేదదై వెలికి వస్తుంది. ఎందుకంటే అది [శ్రమశక్తి] ఉత్పత్తి చేసిన ఆవశ్యక శ్రమ పరిస్థితులు పెట్టుబడికి చెందివుండడమే కాదు; ఇప్పుడు శ్రమ శక్తిలో అంతస్థమైవున్న విలువల్ని సృష్టించే సంభావ్యత (సాధ్యత - possibility) కూడ అదే విధంగా అదనపు విలువగా, అదనపు ఉత్పత్తిగా, ఒక్క మాటలో, పెట్టుబడిగా – సజీవ శ్రమశక్తిపై ఆధిపత్యంగా, శ్రమశక్తియొక్క అనిర్దిష్టమైన, ఉద్దేశ్యరహితమైన, శుద్ధ స్వీయమానసికమైన [లేక కర్తృపరమైన - subjective] పేదరికానికి విరుద్ధంగా తన సొంత బలం, సంకల్పాలతో తులతూగే విలువగా మనివుంటుంది. శ్రమశక్తి పరాయి[దైన] సంపదనూ, తన సొంత పేదరికాన్నీ సృష్టించడం మాత్రమే కాదు; ఈ అంతర్గత సంపదకు పేదరికమైవున్న తన స్వీయ అస్తిత్వంతో (అంటే శ్రమశక్తితో) ఒక సంబంధాన్నికూడ సృష్టించింది. ఈ [పేదరికమైవుండే] శ్రమశక్తిని వినిమయంచేసుకోవడంద్వారా, ఆ సంపద తనలోతాను కొత్త ఊపిర్లు నింపుకొంటుంది; తద్వారా తన్నుతాను మళ్లీ సఫలం గావించు కొంటుంది. ఇదంతాకూడ శ్రమశక్తి దాని సజీవ శక్తిని ఒక నిశ్చిత మొత్తపు పదార్థీకృత శ్రమరాశికిగాను మారకం చేసుకోవడంనుండి తలయెత్తింది. కాకపోతే, [మినహాయింపు లేక అపవాదం ఏమంటే,] ఈ పదార్థీకృత శ్రమ (objectified labour) – శ్రమకు బాహ్యంగా మనివుండే దాని అస్తిత్వకారక పరిస్థితులూ, ఈ భౌతిక (లేక పాదార్థిక) పరిస్థితులయొక్క స్వతంత్ర బాహ్య స్వభావమూ రెండూనూ – దాని [శ్రమయొక్క] సొంత ఉత్పత్తి ఫలంగా అగుపిస్తుంది. వాటిని స్వయంగా శ్రమశక్తే నెలకొల్పినట్లు – దాని సొంత పదార్థీకరణగానూ, ఇంకా, దానికి స్వతంత్రంగా మనివుంటూ, పైగా దానిపై శాసనం చేసే, తన సొంతకృషితో దానిపై పాలన చేసే దాని స్వీయశక్తి పదార్థీకరణ గానూ రెండువిధాలా నెలకొల్పబడినట్లు – ఈ పరిస్థితులు గోచరిస్తాయి. - గ్రండ్‌రిస్సే (1857-58), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 366 నుండి…

ఇప్పటికే దాని సులభసామాన్య రూపంలో ఈ సంబంధం ఒక విలోమం (తలకిందుల ప్రక్రియ) గా – వస్తువుయొక్క వ్యక్తి రూపీకరణ లేదా వ్యక్తియొక్క పదార్థీకరణగా వుంది. ఎందుకంటే దీనికి పూర్వపు సకల రూపాలకూ దీనికీ అంతరమేమంటే పెట్టుబడిదారు కార్మికునిపై శాసనం (ఆధిపత్యం) చెలాయించేది ఏదో అతడికుండే ఏవైనా వ్యక్తిగత గుణాలు, లక్షణాలద్వారాకాక, కేవలం తాను 'పెట్టుబడి' గా వుండడంవల్ల, అలా వున్నంతవరకుమాత్రమే. అతడి ఆధిపత్యం కేవలం సజీవ శ్రమపై పదార్థీకృత శ్రమకుండే, స్వయంగా శ్రామికుడిపైన అతడి శ్రమ [ఉత్పత్తి] ఫలానికుండే ఆధిపత్యంమాత్రమే.
ఈ సంబంధం యింకా మరింత సంక్లిష్టంగా, మరింత నిగూఢం (మార్మికం - mysterious) గా వృద్ధి చెందుతూంటుందికూడ - ఎందుకంటే, ప్రత్యేకించి పెట్టుబడిదారీతరహాలో ఉత్పత్తివిధానం వికసించేకొద్దీ, ఈ ప్రత్యక్షంగా పాదార్థికమైన (భౌతికమైన) వస్తువులు (అంటే శ్రమ ఉత్పత్తిఫలాలన్నీ; ఉపయోగపు విలువలుగా పరిగణించబడే టప్పుడు అవి ఇటు శ్రమయొక్క భౌతిక (పాదార్థిక) పరిస్థితులుగానూ, అటు శ్రమఫలాలుగానూ రెండు విధాలా వుంటాయి; మారకపు విలువలుగా పరిగణించబడేటప్పుడు అవి పదార్థీకృత సాధారణ శ్రమ కాలం లేదా డబ్బుగా వుంటాయి) మాత్రమే తమ వెనక్కాళ్లపై నిలబడి శ్రామికుడ్ని [వెక్కిరిస్తూ లేక ధిక్కరిస్తూ] ' పెట్టుబడి' గా ఎదిరిస్తాయి అన్నట్లేమీ [పరిమితమై] వుండదు; [అవి మాత్రమేకాక] ఇంకా సామాజికంగా వికసించిన [ఇతర] శ్రమ రూపాలు - సహకారం, తయారీ (ఒక శ్రమ విభజన రూపంగా), ఫాక్టరీ (కర్మాగారం - యంత్రాల పాదార్థిక ప్రాతిపదికపై వ్యవస్థీకృతమైన ఒక సాంఘిక శ్రమ రూపం) – కూడ, ఇవన్నీకూడ పెట్టుబడి అభివృద్ధి [వికాసక్రమ] రూపాలుగా అగుపిస్తాయి; అందువల్ల ఈ సామాజిక శ్రమరూపాల [పునాదులపై] నిర్మించబడ్డ శ్రమ ఉత్పాదక శక్తులన్నీకూడ – పర్యవసానంగా శాస్త్రవిజ్ఞానం, ప్రకృతిశక్తులుకూడ – పెట్టుబడియొక్క ఉత్పాదక శక్తులుగా అగుపిస్తాయి. నిజానికి, సహకారంలో [శ్రమ యొక్క] ఐక్యత, శ్రమ విభజనద్వారా శ్రమ సమ్మేళనం, యంత్ర పరిశ్రమలో ఉత్పాదక లక్ష్యాలకుగాను శ్రమ ఉత్పత్తుల సరసనే ప్రకృతి శక్తుల్నీ, శాస్త్ర విజ్ఞానాన్నీ ఉపయోగించడం - ఇవన్నీ స్వయానా వ్యష్టిశ్రామికులకు తమకు బాహ్యంగా, పదార్థీకృతంగా వుండే ఏదో ఒక పరిణామంగా, కేవలం తమకు స్వతంత్రంగావుంటూ, తమను అదుపాజ్ఞల్లో వుంచు కొనే శ్రమ సాధనాల అస్తిత్వ రూపంగా మాత్రమే ఎదురు పడుతుంటాయి; అసలుకు స్వయంగా ఆ శ్రమ సాధనాలే వాటి సులభసామాన్య గోచరరూపంలో, అంటే పదార్థాలూ, పరికరాలూ మొదలైనవాటిగా, నిజానికి పెట్టుబడియొక్క విధులుగా, పర్యవసానంగా పెట్టుబడిదారుని విధులుగా వారికెలా ఎదురు పడుతూంటాయో యివీ అంతే.
ఈ క్రమంలో వాళ్ల శ్రమయొక్క సాంఘిక స్వభావమే వాళ్లకు కొంత మోతాదులో పెట్టుబడీకృతం అయినట్లు (ఉదాహరణకు యంత్రాలనే గనుక తీసుకుంటే శ్రమోత్పత్తులుగా అగుపించే వస్తువులే శ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు కనిపిస్తాయి) ఎదురు పడుతూంటుంది. మరి ప్రకృతిసంబంధ, విజ్ఞానశాస్త్రసంబంధ శక్తుల విషయంలోకూడ సహజంగా ఈవిధంగానే జరుగుతుంది; వాటి అఖండ సారాంశంలో అవి ఒక సాధారణ చారిత్రక వికాసోత్పత్తులై వుంటాయి; అలా వుంటూనే, అవి [యథార్థంలో] పెట్టుబడియొక్క శక్తులుగా శ్రామికులకు ఎదురుపడుతుంటాయి. నిజానికి అవి వ్యష్టి కార్మికుని నేర్పు (నిపుణత), పరిజ్ఞానాలకు వేరుగా నిలిచి వుంటాయి. పుట్టుకలో అవి [ప్రకృతిజన్య, వైజ్ఞానిక శక్తులు] కూడ శ్రమోత్పత్తులే అయినప్పటికీ, అవి ఎక్కడేగానీ శ్రమక్రమంలో ప్రవేశించినప్పుడల్లా పెట్టుబడిలో [భాగాలుగా] మూర్తీభవించినట్లే కనిపిస్తుంటాయి. ఏదైనా యంత్రాన్ని వాడే పెట్టుబడిదారుకు దాన్ని గురించి అర్థంచేసుకోవల్సిన అవసరం ఏమీ వుండదు. కాని ఆ యంత్రంలో రూపుదాల్చిన (యథార్థీకరించబడ్డ, సాధించబడ్డ - realized) విజ్ఞానశాస్త్రం మట్టుకు కార్మికులకు సంబంధించినంత వరకూ పెట్టుబడి గానే అగుపిస్తుంది. ఇంకా నిజానికి ఈ వైజ్ఞానిక (విజ్ఞాన శాస్త్రజన్య) అనువర్తణలు (అన్వయాలు - applications) అన్నీ, పెద్ద యెత్తున సృష్టయ్యే శ్రమోత్పత్తులు, ప్రాకృతిక శక్తులన్నీ, సాంఘిక శ్రమ ప్రాతిపదికన నెలకొనివుండే ఈ అన్వయాలన్నీ స్వయంగా శ్రమ దోపకానికి సాధనాలుగామాత్రమే, అదనపు విలువను భుక్తం చేసుకొనే సాధనాలుగానే అగుపడుతాయి. కనుక అవి పెట్టుబడికి చెందిన శక్తులుగా శ్రమకు (శ్రామికులకు) ఎదురుపడుతుంటాయి. మరి సహజంగానే పెట్టుబడి కూడ ఈ సాధనాలన్నింటినీ శ్రమను దోపకం చేయడానికే ఉపయోగిస్తుంది గదా. కాని దాన్ని దోపకం చేయాలంటే, అది (పెట్టుబడి) వాటిని ఉత్పత్తి [క్రమం] లో అన్వయించాల్సి వుంటుంది. అందుచేత శ్రమయొక్క సామాజిక ఉత్పాదక శక్తుల వికాసం, ఈ వికాసానికి వలసిన షరాస్థితులూ పెట్టుబడి యొక్క చర్యలు గా అగుపిస్తాయి. ఈ పెట్టుబడి చర్యలపట్ల వ్యష్టి శ్రామికుడు ఒక అనాసక్త (నిష్క్రియాపర) వైఖరి నవలంబించడమే కాదు; అసలుకు ఈ పరిణామాలన్నీ అతడికి విరుద్ధంగానే సంభవిస్తూంటాయి. - అదనపు విలువ సిద్ధాంతాలు (1862), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 393 నుండి.

పెట్టుబడి అంతకంతకూ అధికంగా తన్ను ఒక సాంఘిక శక్తిగా ప్రదర్శించుకొంటుంది; పెట్టుబడిదారు ఈ సామాజిక శక్తి (పెట్టుబడి) కి ఏజంటుగా వుంటాడు. ఇంకా అది (పెట్టుబడి), విడిగా ఏ వ్యక్తియొక్క శ్రమయినా సృష్టించగల వస్తువులతో ఎలాంటి సంబంధమైనా కలిగి వుండే అవకాశమే వుండదుకూడ. పెట్టుబడి ఒక వింతైన, స్వతంత్ర మైన, సామాజిక శక్తిగా రూపొందుతుంది; అది ఒక వస్తువులా సమాజాన్ని ఎదిరిస్తూ నిలిచివుంటుంది; ఇలా వస్తువులా వుండడంతో అది పెట్టుబడిదారుల చేతి అధికారశక్తిలా వుంటుంది. ఒక సాధారణ సాంఘిక శక్తిగా పెట్టుబడికీ, సామాజిక ఉత్పత్తి పరిస్థితులపై ప్రైవేటు పెట్టుబడిదారుల అధికారశక్తిలా వుండే పెట్టుబడికీ మధ్య వైరుధ్యం అంతకంతకూ రాజీలేని ఘర్షణగా పరిణమిస్తూంటుంది. పర్యవసానంగా, ఈ [ఉత్పత్తి] పరిస్థితులు రద్దు అయిపోయి, అవి [ఉత్పత్తి పరిస్థితులు] సవిస్తారంగా సార్వత్రిక, ఉమ్మడి, సామాజిక పరిస్థితులుగా రూపు దిద్దుకొంటాయని దీని అంతరార్థం అవుతుంది. మరి పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానంలో జరిగే ఉత్పాదక శక్తుల వృద్ధి చేత, ఈ అభివృద్ధి జరిగే క్రమంమీద ఆధారపడి ఈ సవివర పరిణామం సంభవిస్తుంది. – పెట్టుబడి, సంపుటం 3 (1864-5), పు. 310.
పెట్టుబడి ఒక వస్తువు కాదు. సమాజపు ఒక నిశ్చిత చారిత్రక నిర్మాణానికి చెందిన ఒక నిశ్చిత అంతర సంబంధం అది…. సమాజంలోని ఒక నిశ్చిత భాగంచే గుత్తాధిపత్యంలో వుంచుకోబడ్డ ఉత్పత్తి సాధనాలను, సజీవ మానవ వ్యక్తులయొక్క శ్రమశక్తినుండి స్వతంత్రంగా, వాళ్లకు వైరపూర్వకంగా చేయబడిన శ్రమయొక్క పాదార్థిక అవసరాలను, శ్రమోత్పత్తులను, ఈ వైరంచేతనే పెట్టుబడిలో మూర్తీభవించబడిన [ఉత్పత్తి] సాధనాలను పెట్టుబడి సూచిస్తుంది. పెట్టుబడి అంటే శ్రామికులనుండి స్వతంత్రం గావించ బడి సామాజిక శక్తులుగా మార్చబడిన ఉత్పత్తులు – తమ స్వీయ స్రష్టలనే (ఉత్పాదకులనే) శాసిస్తూ, వాళ్లనే కొనివేస్తూండే ఉత్పత్తులు అని మాత్రమేకాదు అర్థం; ఉత్పాదకుల్ని వాళ్ల ఉత్పత్తుల గుణాల రూపంలో విరుద్ధంగావించుకొనే శక్తులు, సాంఘిక సంబంధాలు – ఈ శ్రమయొక్క రూపాలు – అని కూడ అర్థం వస్తుంది. కనుక, యిక్కడ మనకు ఒక చారిత్రకంగా సృష్టించబడిన (ఉత్పత్తి చేయబడిన) సాంఘిక ఉత్పత్తిక్రమ కారణాంశాల్లో ఒకదానియొక్క నిశ్చితమైన, మొదటి చూపుకు చాలా మాయాభరితమైన (నిగూఢమైన - mystical), సామాజిక రూపం అగుపిస్తుంది [లేక లభిస్తుంది]. – పెట్టుబడి, సంపుటం 3 (1864-5), ఎంపిక చేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 492.

No comments: