పరాయీకరణగురించి మార్క్స్-4
[మార్క్స్] మూలపాఠాలు
పెట్టుబడిదారు వ్యక్తిమూర్తీభవిత [వ్యక్తిగా మూర్తీభవించిన] పెట్టుబడిలాగామాత్రమే తన విధి నిర్వర్తిస్తాడు [నిర్వర్తించ గలుగుతాడు]. వ్యక్తిగా మార్చబడ్డ పెట్టుబడే అతడని చెప్పవచ్చు. అలాగే, కార్మికుడు [కూడ] వ్యక్తిమూర్తీభవిత శ్రమ మాత్రమే… కనుక సరిగ్గా భావజాలరంగంలో మతం విషయంలో మనకు లభించే సంబంధంలాంటిదే భౌతిక (పాదార్థిక) ఉత్పత్తిలోకూడా మనకు లభిస్తుంది – కర్త (పరమైన అంశాలు) కర్మ (పర వస్తువులు) గానూ, దీనికి వ్యతిక్రమం (తలకిందులు) గానూ మారడం గమనిస్తాము.చారిత్రక దృష్టికోణంనుండి చూస్తే ఈ వ్యతిక్రమం (తలకిందుల ప్రక్రియ) బలప్రయోగంద్వారా, అత్యధిక సంఖ్యాకులకు నష్టదాయకంగా అసలు సంపద అనేదాని సృష్టికి – అంటే ఏది మాత్రమేనైతే ఒక స్వతంత్ర మానవసమాజానికి పాదార్థిక ప్రాతిపదిక ఏర్పాటు చేయగలదో అలాంటి అపరిమిత సాంఘిక శ్రమ ఉత్పాదకతను సృష్టించడానికి – అవసరమైన ఒక పరివర్తనాదశగా అగుపడుతుంది. మరి మనిషి తన స్వీయ ఆధ్యాత్మిక శక్తులనే తనకు వేరైన ఏవో స్వయం-స్వతంత్ర శక్తులుగా తనకే ఎదురు నిలుపుకొనడంద్వారా వాటికి ఒక మత రూపాన్ని ప్రసాదించడమనేది ఎలా అనివార్య ఆరంభమో, అలాగే పైనచెప్పిన తలకిందుల (వ్యతిక్రమ) క్రమంగుండా సాగిపోవడంకూడ ఆవశ్యకమే అవుతుంది.
ఇది మనిషి సొంత శ్రమయొక్క పరాయీకరణ క్రమం. [అయితే ఇందులో] మొదటినుండీ కార్మికుడు పెట్టుబడిదారుకంటే శ్రేష్ఠుడై వుంటాడు – ఎందుకంటే, పెట్టుబడిదారు తన పరాయీకరణ క్రమంలో తాను వేళ్లూనుకుని పోయి, దానితో పూర్తిగా సంతుష్టి చెందివుంటాడుగాని దానిచే బాధితుడై వుండే కార్మికుడుమాత్రం మొదటినుండీ దానికి [ఆ పరాయీకరణ క్రమానికి] వ్యతిరేకంగా తిరుగుబాటు మనస్తత్వంతో వుంటాడు; అది తన్ను దాస్యంలోకి తోసివేసే (బానిసను గావించే) ఒక క్రమంగా స్వీయానుభవం పొందుతూంటాడు. పెట్టుబడియొక్క స్వయం-విలువీకరణ – అంటే అదనపు విలువ సృష్టే – పెట్టుబడిదారుకు నిర్ణయాత్మకమైన, సర్వ శ్రేష్టమైన, ఆధిపత్య లక్ష్యంగా, అతడి క్రియాకలాపాలకు సంపూర్ణ చోదకోద్దేశ్యం, సారాంశాలుగా వుంటుంది; ఒక లోభియొక్క హేతుబద్ధ సహజానుభూతిగా, లక్ష్యంగా వుంటుంది. మరి ఈ సారాంశం చాల నాసిరకంది – పెట్టుబడిదారుకూడ కార్మికునికిలాగే పెట్టుబడికింద ఒకేవిధమైన బానిసత్వ సంబంధంలో మగ్గుతుంటాడని, కాకుంటే అతడు కార్మికునికి వ్యతిరేక ధ్రువంలో నిలిచివుంటాడంతమాత్రమే నని [ఈ నాసి సారాంశం] ప్రదర్శిస్తుంది. – తక్షణ ఉత్పత్తి క్రమపు ఫలితాలు (1865), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పుట 508 నుండి…
బాగా పరీక్షిస్తే, దోపకంచేయడానికి దానికుండే అవసరం ప్రకారం (ఆ మేరకు) పెట్టుబడి, శ్రమ [శ్రామిక] బలగం ఉత్పత్తినే, అంటే దోపకం చేయబడవల్సిన (దోపకం చేయబడే) మానవ సమూహాల సృష్టినే క్రమబద్ధం గావిస్తుందని మనం గమనిస్తాము. ఈ విధంగా పెట్టుబడి సృష్టించేది ఒక్క పెట్టుబడినిమాత్రమే కాదు; అంతకంతకూ వృద్ధి చెందే కార్మిక సందోహాన్ని కూడ – ఈ సారపదార్థం (పెరిగిపోయే కార్మికుల) ధర్మమా అనే అది ఒంటరిగా అదనపు పెట్టుబడిగా పని చేయగలుగుతుందని గమనించాలి – సృష్టిస్తుంది. పర్యవసానంగా, శ్రమ [లేక శ్రామికులు] అంతకంతకూ విస్తృత ప్రమాణంలో, అదీ స్వయంగా తనకే విరుద్ధంగా, శ్రమ పరిస్థితుల్ని పెట్టుబడి రూపంలో సృష్టించడమొక్కటే కాదు; పెట్టుబడికూడ అంతకంతకూ అధిక స్థాయిలో తనకు అవసరమైన ఉత్పాదక వేతన-శ్రామికుల్ని సృష్టిస్తూంటుంది. శ్రమ తన ఉత్పత్తి పరిస్థితుల్ని పెట్టుబడిగా సృష్టిస్తుంది; కాగా పెట్టుబడి శ్రమను ఒక పెట్టుబడి సాధక సాధనంగా, అంటే వేతన శ్రమగా సృష్టిస్తుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి ఈ సంబంధపు మామూలు (సామాన్య) పునరుత్పత్తి కాదు, అది అంతంతకూ ఇతోధిక ప్రమాణంలో సాగే పునరుత్పత్తి అని గ్రహించాలి. ఇక పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంవల్ల శ్రమయొక్క సామాజిక ఉత్పాదకత పెరిగిపోయే కొద్దీ, ఖచ్చితంగా ఆ పెరుగుదల మేరకు కార్మికుని పైన [సవారీ చేస్తూ నిలిచి] వుండే సంపదకూడ పెరిగిపోతూ పెట్టుబడిగా అతడిపై ఆధిపత్యం చెలాయిస్తూంటుంది. అతడి కట్టెదుట ఒక సుసుంపన్న ప్రపంచం – అతడికి పరాయిదైన, అతడ్ని అణచివేసే ప్రపంచం – [సుఖవిలాసాలతో అతడ్ని వెక్కిరిస్తూ] నెలకొల్పబడి వుంటుంది; అదే అనుపాతంలో అతడి పేదరికం, అవమానాలు, వ్యక్తిగత దాస్యం పెరిగిపోతుంటాయి. అతడి 'దిగంబరత్వం' ఈ విస్తృతికి సాపేక్ష ప్రమాణంగా వుంటుంది. అదే సమయంలో పెట్టుబడియొక్క సజీవ ఉత్పత్తి సాధనాల మొత్తం, అంటే శ్రమచేసే అధోకార్మికవర్గం పెరిగిపోతూంటుంది. – తక్షణ ఉత్పత్తి క్రమం ఫలితాలు (1865), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 518.
కనుక వర్తకపు సరుకు ఒక విచిత్ర నిగూఢ వస్తువు; కేవలం మనుషుల శ్రమయొక్క సాంఘిక స్వభావం ఆ శ్రమోత్పత్తిపై ముద్రించబడిన ఒక వస్తుగత స్వభావంగా వారికి అగుపించడం వల్ల, ఈ ఉత్పత్తిదారులకు తమ సొంత శ్రమల వెరసిమొత్తంతో వుండే సంబంధం నిజానికి వాళ్ల నడుమ వుండే సంబంధంగాకాక ఏదో వాళ్ల శ్రమోత్పత్తులమధ్య గల సంబంధంగా వాళ్లకు ప్రదర్శింపబడడంవల్ల అదిలా (మాయావి వస్తువుగా) వుంటుందని చెప్పవచ్చు. శ్రమోత్పత్తులు వర్తకపు సరుకులుగా – ఒకే సమయంలో ఇంద్రియగ్రాహ్యంగా [కొంత] నూ, అలాగే ఇంద్రియాలకు అగ్రాహ్యంగా [కొంత] కూడానూ వుండే ధర్మాలుగల సామాజిక వస్తువులుగా – రూపొందడానికి కారణం యిదే. దీనికి సమ ఉదాహరణకోసం మనం మతప్రపంచపు పొగమంచు కమ్మిన ప్రాంతాల్లో వెదకాల్సి వుంటుంది. ఆ ప్రపంచంలో మానవ మేధో సృజనలే స్వతంత్ర జీవులుగా ఊపిరి పోసుకుని పరస్పరమున్నూ, అలాగే మానవజాతితోనూ సంబంధాలు పెట్టుకోవడం మనం చూస్తాము. మరి వర్తకపు సరుకుల ప్రపంచంలో మనుషుల చేతి తయారీల విషయంలోకూడ సరిగా యిలాగే వుంటుంది. దీన్నే నేను అవి వర్తకపు సరుకులుగా ఉత్పత్తి చేయబడడంతోటే శ్రమోత్పత్తులకు అంటుకునే, అందుచేత వర్తకపు సరుకుల ఉత్పత్తినుండి విడదీయ శక్యం కాకుండా వుండే చిత్రమహిమ (లేక సరుకుల మాయ - Fetishism) అంటాను.
ఇంతవరకు జరిపిన విశ్లేషణలో ఈ వరకే వెల్లడయినట్లు, ఈ వర్తకపు సరుకుల చిత్రమహిమ (సరుకుల మాయ) కు పుట్టుక వాటిని ఉత్పత్తిగావించే శ్రమయొక్క విలక్షణ సాంఘిక స్వభావంలోనే వున్నది. – పెట్టుబడి, సంపుటం 1 (1867), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 436.
ఇంకా చదవడానికి …
1. డి. బెల్, 'పరాయీకరణపై వాదోపవాదాలు', ఎల్. లాబెజ్ (సం.), రివిజనిజం పుస్తకం (లండన్, 1962) లోంచి.
2. డి. బ్రేబ్రూక్, ' మార్క్స్‌యొక్క పరాయీకరణ సిద్ధాంతంలోని [రోగ]పరీక్ష, పరిహారసూచన', సోషల్ రిసర్చ్ (శరత్కాలం, 1958).
3. డి. బ్రేబ్రూక్, అవసరాలు కలవడం (ప్రిన్స్‌టన్, 1987).
4. ఎ. బుకానన్, మార్క్స్ మరియు న్యాయధర్మం: ఉదారవాదంపై సమూలమార్పు విమర్శ (టొటోవా, 1982), అధ్యాయం 3.
5. ఎల్. ఈస్టన్, 'తొలికాలపు (యువ) మార్క్స్‌లో పరాయీకరణ, చరిత్రలు', తత్వచింతన-ఘటనావిజ్ఞాన పరిశోధన (ఫిలాసఫీ అండ్ ఫెనామెనాలాజికల్ రిసర్చ్), డిసెంబర్, 1961.
6. ఎల్. ఈస్టన్, 'మార్క్స్ ఆలోచనలో పరాయీకరణ, అనుభవవాదాలు', సోషల్ రిసర్చ్ (శరత్కాలం, 1970).
7. ఎ. హెల్లర్, మార్క్స్‌లో్ని ఆవశ్యకతా సిద్ధాంతం, లండన్, 1976.
8. కె. లోవిత్, 'మార్క్స్ తొలి రచనల్లోని స్వీయ-పరాయీకరణ', సోషల్ రిసర్చ్, 1954.
9. ఎస్. లూక్స్, 'పరాయీకరణ, అనామకత్వం', ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ సొసైటీ లో, 3వ పరంపర, సం. పి. లాస్లెట్- డబ్ల్యూ. జి. రన్సిమన్, ఆక్స్‌ఫర్డ్, 1967.
10. ఇ. మాండెల్-జి. నొవాక్, పరాయీకరణగురించిన మార్క్సిస్టు సిద్ధాంతం, రెండవ ప్రతి, న్యూయార్క్, 1973.
11. ఎమ్. మార్కోవిక్, 'పరాయీకరణపై మార్క్స్ విమర్శ, దాని విమోచనాత్మక పర్యవసానాలు', మార్క్స్ ఎన్ పర్స్పెక్టివ్, సం. బి. చవాన్స్, పారిస్, 1985, లో.
12. డి. మెక్‌లెలాన్, 'అపరాయీకృత సమాజంగురించి మార్క్స్ అభిప్రాయాలు', రివ్యూ ఆఫ్ పాలిటిక్స్, అక్టోబర్, 1969.
13. బి. ఓల్‌మన్, పరాయీకరణ: పెట్టుబడిదారీ సమాజంలోని మనిషిపై మార్క్స్ విమర్శన, కేంబ్రిడ్జ్, 1971.
14. జె. ఒనీల్, 'పరాయీకరణ, వర్గ పోరాటం, మార్క్సియన్ రాజకీయవ్యతిరేకతలు', రివ్యూ ఆఫ్ మెటాఫిజిక్స్, 1964.
15. జె. ఒనీల్, 'కార్ల్ మార్క్స్ తొలి, మలి రచనల్లోని ఎడబాటు భావన (concept of estrangement) గురించి', ఫిలాసఫీ అండ్ ఫెనామెనాలాజికల్ రిసర్చ్, సెప్టెంబర్ 1964.
16. జె. ప్లామెనాట్జ్, మనిషినిగురించిన కార్ల్ మార్క్స్ తత్వచింతన, ఆక్స్‌ఫర్డ్, 1975, భాగాలు 1 & 2.
17. పి. రాబర్ట్స్-ఎమ్. స్టీఫెన్సన్, మారకం, పరాయీకరణ, సంక్షోభాలను గురించిన మార్క్స్ సిద్ధాంతం, స్టాన్‌ఫర్డ్, 1973, అధ్యాయం 6.
18. ఎన్. రోటెన్‌స్ట్రీక్, పరాయీకరణ: ఆ భావన, దానికి లభించిన స్వాగతం, లైడెన్, 1989.
19. ఆర్. షాక్ట్, పరాయీకరణ, లండన్, 1971.
20. ఎల్. సెవే, మార్క్సిస్టు సిద్ధాంతంలో మనిషిగురించి, హాసక్స్, 1978, భాగం 2.
ఇంకా మార్క్సిజానికి సంబంధించిన అవినేరీ, ఫ్రామ్, మెక్‌లెలాన్, టక్కర్‌ల యితర పుస్తకాలు.
* * * * *
No comments:
Post a Comment