Monday, May 19, 2008

పరాయీకరణ గురించి మార్క్స్‌-1

పరాయీకరణ గురించి మార్క్స్‌ - 1
పరాయీకరణ
వ్యాఖ్యానం
పరాయీకరణగురించిన మార్క్స్‌ భావన అత్యంత ప్రత్యక్షంగా హెగెల్‌నుండి వచ్చిందే (తెచ్చుకొన్నదే). అయితే ఈ పరాయీకరణ భావనకు మూలాలుమాత్రం అంతకు చాలపూర్వంనుండే ఊనుకుని వున్నాయనుకోండి. వాస్తవికత అంటే మనోబలం లేక లోసత్తువ (స్పిరిట్ – 'ఉసురు' అనికూడ అనవచ్చా?) తన్ను తాను సాధించు కోవడమే (యథార్థీకరించుకోవడమే) అని హెగెల్‌ భావిస్తాడు. తర్వాత తర్వాత ఈ లోసత్తువ ఈ ప్రపంచాన్ని తన స్వీయసృష్టిగా పరిగణించడం మొదలుపెట్టింది. తన ఉత్పాదక కార్యకలాపంలో, ఆ కార్యకలాపంద్వారామాత్రమే ఉనికిలోకి వచ్చివుండిన లోసత్తువ క్రమక్రమేపీ తన్ను తాను బాహ్యీకరించుకొంటున్నట్లు లేక పరాయీ కరించుకొంటున్నట్లు చైతన్యం సంతరించుకోసాగింది. హెగెల్‌కు సంబంధించి పరాయీకరణ అనేది ఈ ప్రపంచం లోసత్తువకు వెలుపలవుండేదేమీ (బాహ్యమైనదేమీ) కాదనే విషయాన్ని గుర్తించ విఫలమవడంలో యిమిడివుంది. కనుక తమ ప్రకృతిపరిసరాలు, తమ సంస్కృతి ఈ లోసత్తువయొక్క సృజనలని మనుషులు గ్రహించినప్పుడు ఈ పరాయీకరణ మటుమాయమౌతుంది (ముగిసి పోతుంది). ఇది గ్రహించినప్పుడు మనుషులు స్వతంత్రులవుతారు; మరి మానవుని స్వాతంత్ర్యమేగదా చరిత్ర ధ్యేయం (లక్ష్యం). హెగెల్‌ భావన అంటే తాను (అర్థం చేసుకుని) భావించేది యిదని మార్క్స్‌ యిలా సంగ్రహీకరించి చెబుతాడు:
హెగెల్‌కు సంబంధించి మానవసారం – మనిషి – అన్నా, స్వీయ (ఆత్మ) చైతన్యమన్నా ఒకటే. కనుక మానవ సారపు పరాయీకరణ అంటే ఆత్మచైతన్యపు పరాయీకరణేతప్ప మరొకటి కాదు. ఈ ఆత్మ చైతన్యపు పరాయీకరణ అనేదాన్ని, ఎరుక (జ్ఞానం) లోనూ, ఆలోచనలోనూ ప్రతిఫలించబడే మానవ సారపు యథార్థ వ్యక్తీకరణగా భావించరాదు. తత్వవిజ్ఞానం మొట్టమొదటగా వెలుగులోకి తెచ్చిన, దాని అంతర్గత గుప్త సారాంశంలోని నిజమైన పరాయీకరణ (లేదా అలా నిజంగా అగుపించే పరాయీకరణ) అనేది యథార్థ మానవ సారపు – అంటే ఆత్మచైతన్యపు పరాయీకరణ యొక్క ప్రస్ఫుట రూపం తప్ప మరేమీ కాదు.[1]
అయితే హెగెల్‌పై మార్క్స్‌ చేసే కేంద్ర (ప్రధాన) విమర్శ అంతా ఈ పరాయీకరణ అనేది బాహ్య ప్రపంచపు రద్దు అనుకోబడే పరిణామంతో ఆగిపోయేదేమీ కాదనే. మార్క్స్‌ ప్రకారం బాహ్య ప్రపంచం మనిషి ప్రకృతిలో ఒక భాగమే; కనుక మనిషికీ అతడి పరిసరాలకూ (పర్యావరణానికీ) నడుమ ఒక సజావైన సంబంధం నెలకొల్పడమే అతి ముఖ్యమైన (కావల్సిన) విషయం.
[మార్క్స్‌ రాస్తాడుగదా] ఏదైనా ఒక భౌతిక అస్తిత్వానికి (objective being) ఒక భౌతిక ప్రభావం వుంటుంది. మరి ఆ అస్తిత్వపు ఉనికిలో గనుక ఒక భౌతిక మూలాంశం చేరిలేకుంటే దానికి అలాంటి భౌతిక ప్రభావం వుండజాలదు. అది వస్తువులచే స్థితినిశ్చయం గావించ బడుతుంది గనుకనే, ఎందుకంటే అది పుట్టుకతో సహజసిద్ధమై వుంటుంది గనుకనే, అది వస్తువుల్ని సృష్టించగలుగుతుంది; స్థితి నిశ్చయం చేయగలుగుతుంది. కనుక యిలా స్థితినిశ్చయం గావించే చర్యలో అది ఒక వస్తువును సృష్టించే 'శుద్ధ కార్యకలాపం' నుండి ఏమీ దిగజారడం లేదు; దాని భౌతిక (ఉత్పత్తి) ఫలం కేవలం దాని భౌతిక కార్యకలాపాన్ని – ఒక భౌతిక, సహజసిద్ధ అస్తిత్వపు కార్య కలాపంగా వుండే దాని కార్యకలాపాన్ని – ధ్రువీకరిస్తున్నదంత మాత్రమే.[2]
ఈ విధంగా మార్క్స్‌ లోసత్తువ అనే భావననే తిరస్కరిస్తాడు; అలాగే బాహ్య ప్రపంచానికి విరుద్ధంగా ఈ లోసత్తువకు వుంటుందని భావించబడే ప్రతివాదం స్థానే మనిషికీ, అతడి సాంఘిక అస్తిత్వానికీ నడుమ వుండే ప్రతివాదాన్ని తెచ్చిపెడతాడు.
ప్రత్యేకించి తన తొలి రచనల్లో మార్క్స్‌ వివిధ రకాల పరాయీకరణలగురించి చర్చిస్తాడు. యువ హెగెలియన్‌లందరికీ సామాన్యంగా వుండే ఒక ఉధృతమైన లౌకికీకరణ క్రమంలో సాగిపోతూ మొదట మతపరమైన పరాయీకరణనుండి తాత్విక పరాయీకరణకూ, ఆపై అటునుంచి రాజకీయ పరాయీకరణకూ, అంతిమంగా ఆర్థిక పరాయీకరణకూ పయనిస్తాడు. పని చేయడం (శ్రమ) అనేది మనిషి యొక్క మౌలిక కార్యకలాపంగా వుండడంవల్ల, ఆ మేరకు ఈ చివరిదాన్ని – అంటే ఆర్థిక పరాయీకరణను – మౌలికమైందిగా పరిగణిస్తాడు మార్క్స్‌. ఈ అన్ని రంగాల్లోనూ సామాన్యమైన భావన ఏమంటే తన ప్రకృతికి (సహజ స్వభావానికి) ప్రధానావశ్యకమైన అంశాన్ని – అంటే తన సొంత కార్యకలాపాలపై అదుపాజ్ఞలు తానే ప్రముఖంగా కలిగివుండడం, చారిత్రక క్రమానికి ఆవిష్కర్త తానుగా వుండడం అనే అంశాన్ని మనిషి మరెవరికో లేక మరేదానికో (మరే అంశానికో) కోల్పాయాడనేదే. ఈ వివిధ పరాయీ కరణ రూపాల్లో జరిగిందేమంటే, అసలు మనిషికి సముచితంగా చెందవల్సిందాన్ని వేరే మరే అస్తిత్వమో పొందడమే (కొట్టేయడమే).
ఉదాహరణకు మతంలోనైతే మనిషి (కి చెందవల్సిన) స్వీయ స్థితిని దేవుడు ఆక్రమించుకున్నాడు; బరువు బాధలకు పరిహారం గానూ, అలాగే మనిషియొక్క అత్యంత ప్రగాఢమైన కోరికల అభివ్యక్తీకరణకు మాధ్యమంగానూ ఒక ద్వంద్వ (రెండందాల) విధిని మతం నిర్వర్తిస్తుంది. మతమంటే 'మానవ సారపు (మానవ సారాంశం యొక్క) ఊహాత్మక సాధన – ఎందుకంటే మానవ సారాంశానికి అసలు నిజమైన వాస్తవికత ఏదీ వుండదుకాబట్టి,'[3] అంటాడు. ఇక మార్క్స్‌ చెప్పిన తీర్పు: "ప్రజలయొక్క భ్రమాత్మక ఆనందంగా వుండే మతాన్ని రద్దు చేయడం (మతం రద్దు) అంటే వాళ్ల వాస్తవిక ఆనందంగురించి డిమాండు చేయడమే. తమ పరిస్థితులగురించిన భ్రమల్ని వాళ్లు వదులుకోవాలని గట్టిగా అడగడమంటే అలాంటి భ్రమను ఆవశ్యకంగావించే పరిస్థితిని విసర్జించాలని (రూపు మాపాలని) డిమాండు చేయడమే."[4]
మరి తత్వచింతన (తత్వవిజ్ఞానం - philosophy) కూడ (ఇక్కడ మార్క్స్ ప్రత్యేకించి హెగెల్‌ తత్వచింతనను మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడని గమనించాలి) పరాయీకరణని కలగజేయ (ఏర్పరచ) వచ్చు. ఊహాగానాల తత్వచింతన (speculative philosophy) చరిత్రనూ, మనిషినీ ఒక మానసిక క్రమంగా కుదించివేసింది. దేవుని స్థానే 'భావన' (idea) ను తెచ్చిపెట్టిన అది (ఊహాగాన తత్వచింతన) లౌకికీకృత మతవిజ్ఞానం (secularized theology) కంటే ఏమాత్రం మెరుగుకాదు. "ఈ విధంగా, మనిషియొక్క కర్మపదార్థీకృత (objectified), పరాయీకృత ప్రతిభాశక్తుల (లేక యుక్తుల faculties) భుక్తం (appropriation వినియోగం) హెగెల్‌ చెప్పేప్రకారమైతే మొదటగా మనసులో సంభవించే, శుద్ధ ఆలోచనలో సంభవించే అంటే ఒక అనిర్దిష్టతలో సంభవించే ఒక భుక్తం (లేక వినియోగం) గా మాత్రమే వుంటుంది,"[5] అంటాడు మార్క్స్‌.
యిదే విశ్లేషణను మార్క్స్‌ రాజకీయ పరాయీకరణకూ అన్వయించాడు. రాజ్యం అనేది ఒక మానవస్వభావ వర్ణనను కలిగివుంటుంది (నిజమే) గానీ అదే సమయంలో అది (రాజ్యం) మనషి దాన్ని (అంటే ఆ మానవ ప్రకృతిని) సాధించుకొనే అవకాశాన్ని హరించివేస్తుంది.
పూర్వం (మొదట్లో) మతపర రంగమే రాజకీయ రాజ్యాంగమై వుండింది. అంటే ప్రజాజీవనపు మతం, దాని వాస్తవిక, ఐహిక మనుగడకు విరుద్ధంగా, అతీతంగా దాని (ప్రజాజీవితపు) సార్వత్రికత (లేక విశ్వ జనీనత)కుసంబంధించిన స్వర్గంగా [ఈ రాజకీయ రాజ్యాంగం] వుండింది. ఈ రంగం ఒక్కటే రాజ్యంలోని ఏకైక రాజ్య రంగంగా వుండింది; తెగ జాతికి, సిసలైన సార్వత్రికతకూ సంబంధించిన సారాంశమే దాని సారంగానూ, అలాగే రూపంగానూ కూడ వుండిన ఏకైక రంగంగా వుండింది. అదే సమయంలో యితర రంగాలకు పైగా, విరుద్ధంగా నిలిచి వుండడంచేత తన సారాంశంకూడ ఒక ప్రత్యేకమైందిగా, లాంఛనమైందిగా రూపొందిన చందంగా ఈ రంగం నిలిచివుండింది. [కాగా] ఆధునిక రాజ్యంలో రాజకీయ రంగం ప్రజాజీవితపు పాండిత్య తత్వం (పాండిత్యప్రకర్ష) గా వుంటుంది. రాచరికం ఈ పరాయీకరణకు ఒక సమగ్రీకృత వ్యక్తీకరణై వుండగా, గణతంత్రవాదం (రిపబ్లికనిజం) దాని స్వీయక్షేత్రంలోనే దాని రుణాత్మక అంతర్గతంగా వుంటుంది."[6]
పరాయీకరణగురించి మార్క్స్‌ అత్యంత సంపూర్ణంగా చర్చించే రచనాభాగాలు మనకు పారిస్‌ రాతప్రతులు లో కనిపిస్తాయి. ఇక్కడ మార్స్క్‌ మొట్టమొదటిసారిగా ఈ (పరాయీకరణ) భావనను ఆర్థిక శాస్త్రానికి అన్వయించడం గమనిస్తాము. ఇక్కడ 'పరాయీకృత శ్రమ' అనే ఉపశీర్షికకింద పెట్టుబడిదారీ విధానంలో కార్మికుని పరాయీకృత పరిస్థితిని మార్క్స్‌ నాలుగు రకాలుగా విభజించి వ్యవహరిస్తాడు:
[మార్క్స్‌ రాస్తాడుగదా,] తన స్వీయ శ్రమోత్పత్తితో కార్మికునికి వుండే సంబంధం [సైతం] ఏదో ఒక పరాయి వస్తువుతో వుండే సంబంధంలాగే వుంటుంది. అతడు సృష్టించే వస్తువు అతడికి చెందకపోగా, అతడిపై ఆధిపత్యం చెలాయిస్తుంది; ఇంకా దీర్ఘకాలంలో అతడి పేదరికాన్ని పెంచడానికే దోహదపడుతుందికూడ. ఈ పరాయీకరణ [తుది] ఫలంలోనేగాక దాని ఉత్పత్తిక్రమంలోనూ, అసలు స్వయంగా ఆ ఉత్పత్తికార్యకలాపంలో సైతం కనబడుతుంది. కార్మికుడు తన పనిలో ఇంటికుదురుగా వుండలేకపోతాడు. ఎందుకంటే ఆ పని కేవలం తన యితర అవసరాలు తీర్చు కొనేందుకుమాత్రమేనన్నట్లు భావిస్తాడుగనుక. అదేదో తనకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడిన కార్యకలాపంగా, అంటే తనకు స్వతంత్రమైన, తనకు చెందని కార్యకలాపంగా చూస్తాడు. మూడవ దేమంటే పరాయీకృత శ్రమ మనిషిని అతడి తెగజాతినుండి వేరుగావించడం (పరాయి చేయడం) లో కృతకృత్యమవుతుంది. తెగ జీవితం, ఉత్పాదక జీవితం, జీవితాన్ని సృష్టించే జీవితం అన్నీ కేవలం కార్మికుని వైయక్తిక మనుగడను పోషించి సాగించే ఒక సాధనంగా మారిపోతాయి; మనిషి తన సాటి మనుషులనుండి పరాయి (వేరుగా) అయిపోతాడు. అంతిమంగా స్వయంగా ప్రకృతి సైతం మనిషినుండి పరాయిగా అయిపోతుంది; కనుక మనిషి తన సొంత అకర్బన శరీరాన్ని కోల్పోతాడు.
ఈ పై రచనాభాగాలలో పెట్టుబడిదారీ సమాజంలో స్పష్టంగా అత్యంత పరాయీకృత భాగమైవుండే కార్మికులగురించే ప్రస్తావించ బడి వుండడం నిజమే అయినా మార్క్స్‌ భావన ప్రకారం ఈ పరాయీకృత స్థితి అనేది ఆ సమాజంలోని సభ్యులందరికీకూడ సామాన్యంగా వర్తించేదే. ఆయన తన పవిత్ర కుటుంబం లో యిలా అంటాడు:
"యాజమాన్య వర్గమూ, అధోకార్మిక వర్గమూ రెండూ ఒకే మానవ స్వీయపరాయీకరణకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కాకపోతే మొదటి వర్గం (అంటే యజమాని వర్గం) ఆత్మ-పరాయీకరణలో మరింత సౌకర్యవంతం (సుఖం) గా అనుభూతి చెందుతూ దాన్ని ధ్రువీకరిస్తుంది; అదే తన స్వీయాధికారానికి మూలమని గుర్తెరిగి, ఆ పరాయీకరణలోనే ఒక మానవ అస్తిత్వపు పై పై రూపాన్ని కలిగి వుంటుంది. కాగా రెండవ వర్గం (అంటే అధోకార్మిక వర్గం) ఈ పరాయీకరణలో తన వినాశాన్ని అనుభూతి చెందుతూ, దానిలో తన అశక్తతనూ, తన అమానవ అస్తిత్వ వాస్తవికతనూ చూస్తుంది."[7]
మార్క్స్‌ రచనల్లో పరాయీకరణ భావనకు కేంద్ర ప్రాధాన్యం వుంది. కాకుంటే, బహుశా దాని పూర్ణ తాత్విక అర్థసూచన మూలంగా కావచ్చు ఆయన ఆ పదాన్ని యథార్థంగా అలాగే వాడడం తక్కువ చేసే ధోరణి కనబరుస్తాడు. నిజానికి కమ్యూనిస్టు ప్రణాళిక లోనైతే ఆయన "డబ్బుయొక్క ఆర్థిక విధులపై సాగిన ఫ్రెంచి విమర్శ కింద మానవత్వపు పరాయీకరణ"[8] అని [శీర్షిక పెట్టి] రాసిన జర్మన్‌ సాహిత్యవేత్తలపై అవహేళన గుమ్మరిస్తాడు. అయితే ఈ [పరాయీకరణ] భావన మార్క్స్‌యొక్క గ్రండ్‌రిస్సే కు సంబంధించినంతవరకు మౌలికమైనదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో, "కర్మపదార్థీకరణ స్థితిని గాక పరాయీకరణ, ఎడబాటు, విసర్జనల స్థితిని, సామాజిక శ్రమ తన మూలకాంశాల్లో ఒకటిగా తనకు తానే ఎదురు తెచ్చిపెట్టుకొన్న బ్రహ్మాండమైన భౌతికీకృత (లేదా కర్మపదార్థీకృత) శక్తి కార్మికునికిగాక పెట్టుబడిలో భౌతికీకృతమైన ((కర్మపదార్థీకృతమైన) ఉత్పత్తి పరిస్థితులకు చెందుతుందనే వాస్తవాన్ని"[9] మార్క్స్‌ నొక్కిచెబుతాడు.
ఇదే భావన పెట్టుబడి గ్రంథ ప్రారంభంలోనే 'వర్తకపు సరుకుల చిత్రమహిమ' (Fetishism of Commodities - సరుకుల మాయ అని మరో అనువాదం) అనే శీర్షికన పునరుక్తమౌతుంది. మార్క్స్‌ అంటాడు గదా:
"అందుచేత వర్తకపు సరుకు ఒక నిగూఢ (విచిత్ర, మార్మిక - mysterious) వస్తువుగా వుంటుంది – ఎందుకంటే దానిలో మనుషుల శ్రమయొక్క సాంఘిక స్వభావం ఒక శ్రమోత్పత్తి ఫలంపై ముద్రింపబడిన భౌతిక స్వభావంగా వాళ్లకు గోచరిస్తుందిగనుక, తమ సొంత శ్రమయొక్క వెరసిమొత్తంపట్ల ఉత్పత్తిదారులకు వుండే సంబంధం [వ్యక్తులుగా] వారి మధ్యవుండే బంధంగాకాక వాళ్ల శ్రమోత్పత్తి ఫలాలనడుమ నుండే ఒక సామాజిక సంబంధంగా వాళ్లకు సమర్పించబడుతుంది గనుక (అదిలా చిత్రమహిమాన్విత వస్తువై వుంటుంది). ఇందుకే శ్రమోత్పత్తి ఫలాలు వర్తకపు సరుకులుగా – ఒకే సమయంలో ఇంద్రియాలకు గ్రాహ్యం గానూ, అగ్రాహ్యంగానూ రెండందాలా వుండే గుణాలుగల సామాజిక వస్తువులుగా అవుతాయి… అంటే యిక్కడ మనుషుల మధ్య నిశ్చితమైన ఒక సాంఘిక సంబంధం వున్నా అది వారి కళ్లకు వస్తువులమధ్య నుండే ఒక విడ్డూరపు సంబంధంగా గోచరిస్తుంది… దీన్నే నేను చిత్రమహిమ (మాయ) అంటాను; శ్రమోత్పత్తి ఫలాలు వర్తకపు సరుకులుగా ఉత్పత్తి కావడంతోటే ఈ చిత్రమహిమ (మాయ) వాటిని ఆవరిస్తుంది."[10]
పరాయీకరణ అనేది మార్క్స్‌ ఏదో తన తాత్విక పసితనంలో వాడిన పదంమాత్రమే అని అనేకమంది రచయితలు అనివుండడం వల్ల, [అది సరికాదు!] ఆ పదం పెట్టుబడి లో పదే పదే మనకు కని పిస్తుందని గమనించడం యిక్కడ చాల ముఖ్యం.[11] నిజానికి దాని (పరాయీకరణ భావన) అంతరార్థం ప్రజలమధ్య సంబంధాల స్థానే వస్తువుల మధ్య సంబంధాలు చోటుచేసుకొంటాయి (తెచ్చిపెట్ట బడుతాయి) అన్నట్లయితే అది అసలుకు పెట్టుబడియొక్క ప్రాథమిక ఇతివృత్తాల్లోనే ఒకటని చెప్పవచ్చు. ఉదాహరణకు మార్క్స్‌ యిలా రాస్తాడు: "పనివ్యక్తికి విరుద్ధంగా శ్రమ పరికరాలు (సాధనాలు - instruments), ఉత్పత్తులకు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాలు మొత్తంగా సమర్పించే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు, ఎడబాటుల స్వభావం [ఆధునిక] యంత్రాలద్వారా ఒక సమగ్ర వైరం (శత్రుత్వం) గానే మార్చివేయబడుతుంది."[12] అయితే యిదంతా కేవలం ఏదో పరిభాష గురించిన సమస్యమాత్రమే కాదు; పెట్టుబడి యొక్క సారాంశంకూడ మార్స్క్‌ తొలి (పూర్వ) ఆలోచనలకు కొనసాగింపేనని చెప్పవచ్చు. పెట్టుబడి 1 వ సంపుటంలో ప్రధాన చర్చ అంతా పని (శ్రమ) కీ, విలువకూ మధ్యనుండే సమీకరణంపై ఆధారపడి వుంటుంది; అంటే అది మళ్లీ వెనక్కు – తన్ను తానూ, అలాగే తన జీవిత పరిస్థితులనూ రెంటినీ సృష్టించుకొనే జీవి మానవుడంటూ పారిస్‌ రాతప్రతులు లో రేఖాచిత్రణ చేయబడ్డ భావనకు – తిరిగి వెళ్లడం అవుతుందన్న మాట. పారిస్‌ రాతప్రతులు రాసిననాటి మార్క్స్‌ ప్రకారమైతే, తన తోటి యితర మానవుల సహకారంతో తననూ తనచుట్టూవున్న ప్రపంచాన్నీ నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పోవడం మనిషి నిజస్వభావం. మరి (ఈ) చారిత్రక క్రమాన్ని ప్రారంభించి అదుపుచేసే వ్యక్తిగా మనిషి వహించే ఈ మౌలిక పాత్రను ఎలా బదిలీ చేయబడిందో, లేదా పరాయీకృతం గావించబడిందో, [ఇప్పుడు] అది పెట్టుబడియొక్క అమానవ అధికారశక్తికి ఎలా చెందివుందో మార్క్స్‌ తన పెట్టుబడి లో వర్ణించి చెబుతాడు. అలాగే ఈ పరాయీకృత మానవుడి ప్రతిరూపం (counterpart), అంటే రాతప్రతులులో పేర్కొన్న అపరాయీకృత, 'పూర్ణ' మానవుడు కూడ పెట్టుబడి లో మనకు అగుపిస్తాడు. పెట్టుబడి, సంపుటం 1 లోని 'యంత్రాలు - ఆధునిక పరిశ్రమ' పైని అధ్యాయంలో మార్క్స్‌, పరాయీకృత, అపరాయీకృత ఉత్పత్తి విధానాలు మానవ అంతస్థ శక్తుల వికాసంపై నెరిపే ప్రభావాల్లో అంతరాల్ని అదే మాదిరి (అంటే రాతప్రతులు లోలాగే) వివరించి చెబుతాడు. ఆయన అంటాడుగదా:
"నిజానికి ఆధునిక పరిశ్రమ ఈ నాటి ముక్కపని-కార్మికుడికి – అంటే, ఒకే అల్పమైన పనిముక్కను జీవితాంతం పునర్నిర్వర్తిస్తూ (మళ్లీ మళ్లీ చేస్తూ) [ఒక విధంగా] వికలాంగునిలా అయిపోయిన, ఆ విధంగా ఒక మనిషిముక్కగా కుదించుకుపోయిన నేటి ముక్కపని-కార్మికుడికి (detail-worker) - బదులుగా నానారకాల పనులు చేసే స్తోమతగల, ఏ ఉత్పత్తి మార్పుల్నయినా ఎదుర్కోవడానికి సంసిద్ధమై వుండే, తాను నిర్వర్తించే విభిన్న సాంఘిక విధులు తన సొంత సహజసిద్ధ, ఇంకా సముపార్జిత శక్తియుక్తులకు స్వేచ్ఛావికాస అవకాశం సమర్పించే వివిధ విధానాలుగామాత్రమే వుండే ఒక సంపూర్ణ వికసిత వ్యక్తిని తెచ్చిపెట్టేట్లు, ఒక మృత్యుదండనాభయం కల్పిస్తూ, బలవంతం (వత్తిడి) చేస్తుంది."[13]
ఈ తుది అభిప్రాయాన్ని (conclusion) పెట్టుబడి [గ్రంథం] లో పురోగమిత సాంకేతిక విజ్ఞాన ప్రభావాల సవివర విశ్లేషణద్వారా సమర్థించబడిందనే వాస్తవం [ఆ తుది అభిప్రాయానికిసంబంధించి] అంతకు ముందున్న [అంటే రాతప్రతులు నాటినుండేవున్న] నిరంతరాయతను కప్పిపుచ్చరాదు.
అయితే మార్క్స్‌ ఆలోచనల్లో పరాయీకరణ భావనకున్న కేంద్ర ప్రాముఖ్యం మనకు గ్రండ్‌రిస్సే(Grundrisse)§ లో కనిపిస్తుంది; అది 1941 దాకా అప్రచురితంగా వుండిన మార్క్స్‌యొక్క ముసాయిదా రాతప్రతి; దాని ఆధారంగానే మార్క్స్‌ ఆ తర్వాత తన పెట్టుబడి గ్రంథం రచించాడు. తర్వాతి రాజకీయార్థ శాస్త్ర విమర్శ, పెట్టుబడి గ్రంథాలు గ్రండ్‌రిస్సే కు పాక్షికమైన వివరణలుమాత్రమే; అది మార్క్స్‌ రచనల్లోకెల్లా కేంద్రప్రాధాన్యం గల రచన అని చెప్పవచ్చు. రాజకీయార్థశాస్త్ర విమర్శ కు రాసిన ప్రత్యేక పీఠికలో మార్క్స్‌ చేసిన సాధారణీకరణలకు ఆధారమైన మూల రచన అదే. పెట్టుబడి ద్వారా, రాజ్యంద్వారా జరిగిన మనిషి పరాయీకరణ క్రమంగురించి మార్క్స్‌ 'అర్థశాస్త్రం' అనే శీర్షికన ఒక ఆరు సంపుటాల మహాగ్రంథం (magnum opus) రాయ సంకల్పించాడనీ, అందులో పెట్టుబడి ఒక [మొదటి] సంపుటంమాత్రమేననీ మనమిక్కడ తెలుసుకోవాలి.
గ్రండ్‌రిస్సేయొక్క యోచనాపరిథి పెట్టుబడి [గ్రంథ] పరిథికంటే విస్తృతమైంది. కనుక మార్క్స్‌ 1844 లోనే ప్రారంభించిన ధ్యాన ప్రక్రియను అలా కొనసాగిస్తూపోయాడనీ, 1857-58 ప్రాంతాల్లో ఈ ధ్యానం పరాకాష్టకుచేరుకొందనీ గమనించడంద్వారా మనం మార్క్స్‌ఆలోచనావిధానాన్ని అత్యుత్తమంగా అవగతం చేసుకోగలం. రాత ప్రతులు కూ, గ్రండ్‌రిస్సే కూమధ్య నున్న నిరంతరాయత స్పష్టంగానే అగుపడుతుంది. స్వయంగా మార్క్సే తన ఒక లేఖలో, 'నేను పదిహేనేళ్లుగా చేసిన పరిశోధన ఫలితం గ్రండ్‌రిస్సే; ఈవిధంగా అది నా జీవితంలోనే అత్యుత్తమ కాలావధిలో రాయబడింది' అని చెప్పి వున్నాడుకూడ. ఆ లేఖ 1858 నవంబరులో, అంటే 1843 నవంబరులో మార్క్స్‌ పారిస్‌కు వచ్చిన ఘటనకు సరిగ్గా 15 ఏళ్ల తర్వాత రాయబడింది. ఇంకా తన 1859 నాటి పీఠికలో మార్క్స్‌, “[ఇందుకుసంబంధించిన] మూల సమాచారం మొత్తమూ నావద్ద ఏకాంశరచనల రూపంలో పడివుంది; అవన్నీ ప్రచురణకోసం గాక స్వీయవివరణకోసమని వేర్వేరు విశాల కాలాంతరాల్లో రాయబడ్డవి. వాటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా, సుసంగతంగా రూపొందించి వివరంగా రాయాలంటే అదంతా [అనేక] బాహ్యపరిస్థితులపై ఆధార పడివుంటుంది మరి,"[14] అని అంటాడుకూడ. ఇది కేవలం 1844 నాటి రాతప్రతులు, ఆ తర్వాతి ఆయనయొక్క 1850-52 లండన్‌ నోటుపుస్తకాల కు సంబంధించిన ప్రస్తావనే అయివుండగలదు. తాను అంతకు ముందు రాసుకున్న విషయసమాచారాల్ని మార్క్స్‌ నిరంతరం ఉపయోగించుకోవడమేగాక, అదే సమయంలో వాటిని సరిచూచుకుంటూకూడ వచ్చేవాడని మనమిక్కడ గమనించాలి. ఉదాహరణకు పెట్టుబడి రాసేటప్పుడు ఆయన తన 1843-45 నాటి నోటుపుస్తకాల్ని [సైతం] వాడుకున్నాడు.
ఈ గ్రండ్‌రిస్సే లోని విషయాల్ని గమనిస్తే బాహ్య సాక్ష్యాధారాల వల్ల స్పష్టంగా కనిపించే విషయాలు ధ్రువీకరించబడుతాయి: అందులో పెట్టుబడిపై రాసిన అధ్యాయం మొదట్లో మానవ అవసరాలు, ఒక తెగజీవిగా మనిషి, ఒక సంఘజీవిగా వ్యక్తి, ప్రకృతిని ఒక విధంగా మనిషి దేహంతో పోల్చి చూసే భావన, మతపర, ఆర్థిక పరాయీకరణల మధ్య సామ్యాలు, ఊహాస్వర్గవాద, స్వర్ణయుగవాద అంశాలు వగైరాలకు సంబంధించి రాసిందంతా రాతప్రతులు లోని రచనాభాగాలనుండి దాదాపు ముక్కస్య ముక్కగా తీసుకున్నదేనని గమనిస్తాము. ప్రత్యేకించి ఒక అంశం ఈ నిరంతరాయతను నొక్కి చెబుతుంది – అదేమంటే, పారిస్‌ రాతప్రతులు ఎలాగో, ఎంతగానో గ్రండ్‌రిస్సేకూడ అలాగే, అంతగానూ హెగెల్‌వాదపూరితంగా వుంటుంది; రెంటిలోనూ పరాయీకరణ అనేదే కేంద్ర భావనగా వుంటుంది.[15]
[1] కారల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 102.
[2] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 103 పాదవివరణ.
[3] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 63.
[4] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 64.
[5] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 100.
[6] కార్ల్‌ మార్క్స్, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 29 పా.వి.
[7] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 134 పా. వి.
[8] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 241.
[9] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 384.
[10] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 435 పా. వి.
[11] ఉదాహరణకు పెట్టుబడి, 1937 లండన్‌ ఎడిషన్‌కు సూచికను చూడండి. మార్క్స్‌ ఆలోచనలో పరాయీకరణ భావన కొనసాగుతూండడం గురించి ఆర్‌. దునయేవ్‌స్కయా, మార్క్సిజం – స్వాతంత్ర్యం, న్యూయార్క్‌, 1968, పు. 103 నుండి కొన్ని పుటలు, ఎరిక్‌ ఫ్రామ్‌, మనిషి గురించి మార్క్స్‌ భావన, న్యూయార్క్‌, 1961, పు. 50 నుండి కొన్ని, పు. 69 నుండి కొన్ని పుటల్లో చెప్పబడింది. అలాగే ఓల్‌మన్‌, సీగెల్‌ల పుస్తకాలుకూడ చూడండి.
[12] పెట్టుబడి, 1 వ సంపుటం, పు. 432.
[13] పై గ్రంథమే, పు. 488.
§ గ్రండ్‌రిస్సే - Grundrisse der Kritik der Politischen Ökonomie (German: Outlines of the Critique of Political Economy) రాజకీయార్థశాస్త్ర విమర్శయొక్క రేఖాచిత్రణ.
[14] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 388.
[15] ప్రత్యేకించి చూడు: కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పుట 305 తర్వాతనుండీ, ఇంకా పుట 371 తర్వాతనుండీ.

No comments: