Thursday, July 3, 2008

వర్గం - 3

వర్గం - 3
చిన్న కమతాల రైతులంతా ఒకే విధమైన పరిస్థితుల్లో బతుకుతూ, అదే సమయంలో పరస్పరం అనేక విధ సంబంధాలు పెట్టుకోకుండా వుండే ఒక అపార జనరాశిగా వుంటారు. వాళ్ల ఉత్పత్తి విధానం వాళ్లను పరస్పర సంసర్గంలోకి తెచ్చేదిగా కాక వాళ్లను [ఒకరి నుండి మరొకర్ని] ఒంటరిగావించేదిగా వుంటుంది. కనుక, లక్షలాది కుటుంబాలు వాళ్ల జీవన సరళి, ప్రయోజనాలు, సంస్కృతుల్ని యితర వర్గాల [వాటి]నుండి వేరు చేస్తూ, తద్వారా వాళ్లను ఆ యితర వర్గాలతో శత్రుపూరిత వ్యతిరేకత (వైరుధ్యం) లో పడవేసే ఆర్థిక పరిస్థితుల్లో మనుగడ సాగించేమేరకు, [వాళ్లు] ఒక వర్గంగా ఏర్పడివున్నారు (అని చెప్పవచ్చు). కాని ఈ చిన్న కమతాల రైతులమధ్య ఏదో ఒక స్థానిక పారస్పరిక సంసర్గమే వుంటుంది తప్ప, వాళ్ల ప్రయోజనాల అభిన్నతమూలంగా ఒక సంఘ సముదాయం గాని, ఒక జాతీయ బంధంగాని, లేదా వాళ్లమధ్య ఒక రాజకీయ నిర్మాణం (వ్యవస్థీకరణ) గాని ఏవీ వాళ్లలో ఏర్పడిలేవన్న విషయాన్ని గమనిస్తే, ఆ మేరకు వాళ్లు ఒక వర్గంగా ఏర్పడిలేరు (అని చెప్పవచ్చు).
- లూయీ బోనపార్టీ యొక్క పద్దెనిమిదవ బ్రూమైర్‌ (1852), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 317.
ఆధునిక సమాజంలో వర్గాల ఉనికినిగానీ లేక వాటి మధ్య పోరాటాన్నిగానీ నేను కనుగొన్నానని చెప్పి నాకు పరపతి నివ్వాల్సిన అవసరం లేదు. నాకంటే ఎంతో ముందే బూర్జువా చరిత్రకారులు ఈ వర్గ పోరాటపు చారిత్రక వికాసాన్నిగురించి వివరించి వున్నారు; [అలాగే] బూర్జువా అర్థశాస్త్రజ్ఞులు ఈ వర్గాల ఆర్థిక అంగనిర్మాణాన్ని వర్ణించి వున్నారు. [కాకుంటే] నేను కొత్తగా చేసిందేమంటే – (1) [ఈ] వర్గాల ఉనికి ఉత్పత్తివికాసక్రమంలో కొన్ని ప్రత్యేక చారిత్రక దశలతోమాత్రమే ముడిపడివుందనీ; (2) [ఈ] వర్గ పోరాటం అవశ్యంగా ఒక [అధో]కార్మికవర్గ నియంతృత్వానికి దారి తీస్తుందనీ; (3) అసలుకు ఈ నియంతృత్వంకూడ సకల వర్గాల రద్దుకూ, ఒక వర్గరహిత సమాజానికీ పరివర్తనాదశగా మాత్రమే వుంటుందనీ రుజువు చేయడమే [లేక నిర్ధారించడమే].
- వేడిమెయర్‌కు మార్క్స్‌ లేఖ (1852), కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 341.
కేవల శ్రమశక్తి యజమానులు, పెట్టుబడి యజమానులు, భూయజమానులు (భూస్వాములు) – వీళ్లకు వరుసగా వేతనాలు, లాభం, నేల కిరాయి (కౌలు) లు ఆదాయ వనరులుగా వుంటాయి – మరో మాటలో చెబితే, వేతన శ్రామికులు (జీతపు కూలీలు), పెట్టుబడిదారులూ, భూస్వాములూ – వీళ్లు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రాతిపదికపై నెలకొన్న ఆధునిక సమాజపు మూడు మహా వర్గాలుగా ఏర్పడివున్నారు.
ఇంగ్లండులో, ఆధునిక సమాజం దాని ఆర్థిక కట్టడానికి సంబంధించి అత్యంత ఉన్నతంగా, ప్రామాణికంగా అభివృద్ధి చెందిందనేది నిర్వివాదమే. అయినప్పటికీ అక్కడైనాకూడ వర్గాల పొరవిభజన దాని పరిశుద్ధ రూపంలో అగుపించదు. ఇక్కడకూడ మధ్యంతర, పరివర్తనా దశలు ఖచ్చితమైన హద్దులన్నింటినీ చెరిపివేస్తూండడం గమనిస్తాము – కాకుంటే ఈ [చెరిపివేత] పరిణామం నగరాల్లోకంటే గ్రామీణ మండలాల్లో ఎంతో తక్కువగా వుంటుందనుకోండి. అయితే యిది మన విశ్లేషణకు అనవసరం. పెట్టుబడిదారీ ఉత్పత్తియొక్క నిరంతర ధోరణీ, దాని అభివృద్ధి సూత్రం [అంతా] ఉత్పత్తి సాధనాలను శ్రమ [అంటే శ్రామికుల] నుండి అంతకంతకూ అధికంగా వేరు చేయడం, చెదురుగా వుండే ఉత్పత్తి సాధనాలను అంతకంతకూ హెచ్చుగా మరింత పెద్ద బృందాలుగా కేంద్రీకరించడం, తద్వారా శ్రమను వేతన-శ్రమగా (కూలి శ్రమగా), ఉత్పత్తి సాధనాల్ని పెట్టుబడిగా మార్పు గావించడమనేది మనం గమనించాము. ఈ ధోరణికి అనుగుణంగా మనకు ఒక వైపున పెట్టుబడినుండీ, శ్రమనుండీ స్వతంత్రంగా ప్రైవేటు భూములు వేరు చేయబడడం, లేదా సకల భూ ఆస్తులూ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి అనుగుణంగా వుండేటటువంటి భూ ఆస్తి రూపంగా పరివర్తన చెందడం కనిపిస్తుంది.
మనం జవాబు చెప్పాల్సిన మొదటి ప్రశ్న యిది: ఒక వర్గాన్ని ఏర్పరిచేది ఏమిటి? మరి ఈ ప్రశ్న సహజంగా ఇంకొక ప్రశ్ననుండి – అంటే, వేతన శ్రామికులు, పెట్టుబడిదారులు, భూయజమానుల్ని (భూకామందుల్ని) మూడు మహా సాంఘిక వర్గాలుగా ఏర్పరిచేది ఏమిటి? అనే ప్రశ్నను అనుసరించి తలయెత్తుతుంది.
వాళ్ల ఆదాయాల యొక్క, వాళ్ళ ఆదాయవనరులయొక్క అభిన్నత్వం (అంటే ఖచ్చితంగా ఒకటే అయివుండడం) వల్లే అలా (అంటే అవి మూడు మహా వర్గాలుగా ఏర్పాటు కావడం) జరుగుతుందని, మొదటి చూపుకు మనకు అనిపిస్తుంది. అవి మూడు మహా సాంఘిక బృందాలు; వాటి అవయవ అంశాలు, అంటే, వాటిని ఏర్పరిచే వ్యక్తులు వేతనాలు, లాభాలు, నేల కిరాయిలపై ఆధారపడి, అంటే వాళ్ల శ్రమ శక్తులు, వాళ్ల పెట్టుబడులు, వాళ్ల సొంత భూములు వినియోగించుకోవడంద్వారా బతుకుతుంటారు.
అయితే, ఈ దృక్పథంనుండి చూస్తే, వైద్యులు, అధికారులు కూడ రెండు [ప్రత్యేక] వర్గాలు అవుతారు; ఎందుకంటే వాళ్లు రెండు స్పష్టంగా భిన్నమైన సాంఘిక బృందాలకు చెందివుంటారు, ఆయా బృందాల సభ్యుల ఆదాయాలు ఒకే ఉమ్మడి వనరునుండి ప్రవహిస్తూంటాయిగనుక. అంతేగాక శ్రామికులు, పెట్టుబడిదార్లు, భూకామందుల వర్గాల్లోపలే [వాళ్లమధ్య వాళ్లలోనే] సాంఘిక శ్రమ విభజనవల్ల సృష్టయ్యే అనేక (అనంతమైన) ప్రయోజనాలు, హోదాల చీలికలు, అంతరాల విషయంలోకూడ యిదే [సత్యంగా] వర్తిస్తుంది. ఉదాహరణకు భూస్వాముల్నే తీసుకుంటే వాళ్లు మళ్లీ ద్రాక్షతోటల యజమానులుగా, వ్యవసాయక్షేత్రాల యజమానులుగా, అడవుల, గనుల, చేపలకేంద్రాల (లేదా చేపలగుంటల) యజమానులుగా [యిలా యిలా] వేర్వేరు వర్గాలుగా విభజితమై వుండడం గమనిస్తాము. [ఇక్కడ రాతప్రతి తెగిపోతుంది.]
- పెట్టుబడి, సంపుటం 3 (1864-5), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 506.

కమ్యూన్‌ వర్గ పోరాటాలను విసర్జించివేయదు. వర్గ పోరాటల ద్వారానే కార్మిక వర్గాలు సకల వర్గాల రద్దుకోసం కృషి చేస్తుంటారు; కనుక కమ్యూన్‌ వర్గ పాలనను అంతటినీ విసర్జించి వేయదు. [ఎందుకంటే అది (కమ్యూన్‌) ఏ ఒక విలక్షణ ప్రయోజనానికీ ప్రాతినిధ్యం వహించడం లేదు. కాగా అది ' శ్రమ' యొక్క విమోచనకు – అంటే వైయక్తిక, సాంఘిక జీవితపు మౌలిక, సహజ (ప్రాకృతిక) పరిస్థితికి - కేవలం అక్రమ స్వాధీనం, దగా, కృత్రిమ ఎత్తులు జిత్తుల ద్వారా మాత్రమే ఎవరో కొందరి వద్దనుండి అనేకుల పైకి బదలాయించబడగల్గే పరిస్థితికి – ప్రాతినిధ్యం వహిస్తుంది. కాని అది (కమ్యూన్‌) ఆ వర్గ పోరాటం అత్యంత హేతుబద్ధ, మానవీయ పంథాలో [పద్ధతిలో] దాని వివిధ దశలగుండా సాగిపోగలిగేందుకు అనువైన ఒక సహేతుక మాధ్యమాన్ని సమర్పిస్తుంది. అది (కమ్యూన్‌) హింసాయుత ప్రతిచర్యల్ని, హింసాయుత విప్లవాలుగా ప్రారంభించగలదుకూడ. అది శ్రమ విమోచనను ప్రారంభిస్తుంది – అంటే, రాజ్య పరాన్నభుక్కుల్ని [నిర్మూలించే] గొప్ప పనిని, ఒక వైపున రాజ్యభూతానికి మేపడానికిగాను జాతీయోత్పత్తిలో ఒక విస్తార (లేక అపార) భాగాన్ని త్యాగం చేసే వనరుల పారకాల్ని తెగ గొట్టడం ద్వారానూ, మరొక వైపున కేవలం కార్మికుల వేతనాలకే స్థానిక, జాతీయ పరిపాలనలకు సంబంధించిన అసలు [నిజమైన] పనిని చేయడంద్వారానూ [అది] నిర్వర్తిస్తుంది. కనుక అది [కమ్యూన్‌] అపారమైన పొదుపుతోనూ, ఆర్థిక సంస్కరణలు, అలాగే రాజకీయ పరివర్తనలతోనూ [తన పనిని] మొదలు పెడుతుంది.
- ఫ్రాన్స్‌లో అంతర్యుద్ధం (1871) సంబంధిత ముసాయిదాలు, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 556 నుండీ.
ఇంకా చదవాలంటే …
1. ఇ. ఆండ్రూ, 'దానిలో అదైన వర్గం – పెట్టుబడికి వ్యతిరేకమైన వర్గం: కార్ల్‌ మార్క్స్‌, ఆయన వర్గీకరణదారులు', కెనడియన్‌ జర్నల్‌ ఆఫ్‌ పొలిటికల్‌ సైన్స్‌, సంపుటి 16 (1983).
2. ఇ. బలిబార్‌, జనాలు, వర్గాలు, ఆలోచనలు: మార్క్స్‌కు పూర్వపు, అనంతరపు రాజకీయాలు, తత్వశాస్త్రాలకు సంబంధించిన అధ్యయనాలు, లండన్‌, 1994.
3. ఎల్‌. బెన్సన్‌, అధోకార్మికులూ-పార్టీలూ, లండన్‌, 1978, అధ్యాయం 1.
4. ఎస్‌. బ్లూమ్‌, జాతుల ప్రపంచం, రెండవ ఎడిషన్‌, న్యూయార్క్‌, 1967, పు. 57 నుండీ.
5. ఏ. కార్టర్‌, మార్క్స్‌: ఒక మూలమార్పు విమర్శకుడు, బ్రైటన్‌, 1988, అధ్యాయం 4.
6. జి. కోహెన్‌, 'బూర్జువాలూ, అధోకార్మికులూ', జర్నల్‌ ఆఫ్‌ ది హిస్టరీ ఆఫ్‌ ఐడియాస్‌, జనవరి 1968.
7. ఆర్‌. డారెన్‌డార్ఫ్‌, 'పారిశ్రామిక సమాజంలో వర్గం - వర్గ సంఘర్షణ', లండన్‌, 1959, అధ్యాయం 1.
8. హెచ్‌. డ్రేపర్‌, 'మార్క్స్‌, ఏంగెల్స్‌ల [రచనలు లేక దృక్పథం] లో అలగా కార్మిక వర్గం భావన', కాహియర్స్‌ డీ లా ఇన్స్టిట్యూట్‌ డీ సైన్‌స్‌ ఎకనమిక్‌ అప్లికీ, డిసెంబర్‌ 1972.
9. హెచ్‌. డ్రేపర్‌, కార్ల్‌ మార్క్స్‌యొక్క విప్లవం సిద్ధాంతం, సంపుటి 2,: సాంఘిక వర్గ సంబంధిత రాజకీయాలు, న్యూయార్క్‌, 1978.
10. జె. ఎల్‌స్టర్‌, 'వర్గానికి మూడు సవాళ్లు', అనలిటికల్‌ మార్క్సిజం, సం. జె. రోమర్‌ (కేంబ్రిడ్జ్‌, 1986) లో [ప్రచురితం].
11. కె. గ్రాహం, 'వర్గం – ఒక సులభసరళ వైఖరి', ఇంక్వైరీ, సంపుటి 32, 1989.
12. డి. హాడ్జెస్‌, 'మార్క్సిస్టు సిద్ధాంతంలో మధ్యంతర వర్గాల గురించి…', సోషల్‌ రిసర్చ్‌ (1961).
13. కె. కుమార్‌, 'కార్మికులు విప్లవకరంగా వుండగలరా?', యూరపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ పొలిటికల్‌ రిసర్చ్‌, సం. 6 (1978).
14. ఎమ్‌. లెవిన్‌, 'మార్క్స్‌ – కార్మిక వర్గ చైతన్యం', హిస్టరీ ఆఫ్‌ పొలిటికల్‌ థాట్‌, సం. 1 (శరత్కాలం, 1980).
15. ఎస్‌. లిప్సెట్‌-ఆర్‌. బెండిక్స్‌, 'సాంఘిక వర్గాలగురించిన కార్ల్‌ మార్క్స్‌ సిద్ధాంతం', లిప్సెట్‌-బెండిక్స్‌ (సం.), వర్గం, హోదా, అధికారం లో, (గ్లెంకో, III, 1953).
16. హెచ్‌. మేయర్‌, ' మార్క్స్‌, ఏంగెల్స్‌, రైతాంగ రాజకీయాలు', ఎట్యూడెస్‌ డీ మార్క్సాలజీ (1960).
17. ఎమ్‌. నికొలస్‌, 'మార్క్స్‌ [రచనల] లో అధోకార్మిక వర్గం, మధ్యతరగతులు', స్టడీస్‌ ఇన్‌ ది లెఫ్‌ట్‌, 1967.
18. బి. ఓల్‌మన్‌, "'వర్గం' కుసంబంధించి మార్క్స్‌ వాడకం", అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ సోషాలజీ, 1968.
19. బి. ఓల్‌మన్‌, 'వర్గ చైతన్యం దిశగా తర్వాతి సారి; మార్క్స్‌ – వర్గ పోరాటం', పాలిటిక్స్‌ అండ్‌ సొసైటీ, 1972.
20. ఎఫ్‌. పార్కిన్‌, మార్క్సిజం – వర్గ సిద్ధాంతం, లండన్‌, 1979.
21. జె. రోమర్‌ (సం.), విశ్లేషణాత్మక మార్క్సిజం, భాగం II, కేంబ్రిడ్జ్‌, 1986.
22. హెచ్‌. రోజెన్‌బర్గ్‌, 'అధోకార్మిక వర్గపు కారుణ్యస్థితి', కెన్యాన్‌ రివ్యూ, 1949.
23. డబ్ల్యూ. వెసొలోవ్స్కీ, 'వర్గాధిపత్యంగురించిన మార్క్స్‌ సిద్ధాంతం', ఎన్‌. లోబ్కోవిక్జ్‌ (సం.), మార్క్స్‌ – పాశ్చాత్య ప్రపంచం లో, నోట్రే డేమ్‌, ఇండ్‌., 1967.
* * * * *

Wednesday, July 2, 2008

వర్గం -2

వర్గం - 2
మూలపాఠాలు (TEXTS)

ఒక సమూల విప్లవం గురించిగానీ, లేక సార్వత్రిక మానవ విమోచనగురించిగానీ జర్మనీ ఊహాస్వర్గ స్వప్నం ఏదీ కనలేదు; ఆ ఊహాస్వప్నమంతా ఒక పాక్షిక, శుద్ధ రాజకీయ విప్లవంగురించి మాత్రమే. ఇలాంటి విప్లవం [పాత] కట్టడాన్ని సమూలంగా ధ్వంసం చేసివేయదు; ఆ పాతకట్టడపు ఆధారస్తంభాలను అలాగే నిలిపి వుంచుతుంది. ఇలాంటి పాక్షిక, శుద్ధ రాజకీయ విప్లవానికి ప్రాతిపదిక ఏమిటి? పౌర సమాజంలో ఒక భాగం దాన్నది విముక్తి గావించుకుని, ఒక సార్వత్రిక ఆధిపత్యం సాధిస్తుందని [అలా సాధించడానికి గాను?], ఏదైనా ఒక ప్రత్యేక వర్గం దాని ప్రత్యేక పరిస్థితినుండి సమాజపు సాధారణ విమోచనను సాధించ పూనుకుంటుంది. ఈ వర్గం యావత్‌ సమాజాన్నీ విముక్తి [స్వతంత్రం] గావిస్తుంది గాని, అది [యిలా విముక్తి చే్యడం] ఆ సమాజం మొత్తమూ ఈ వర్గం వున్న పరిస్థితిలోనే వున్నదనీ, యింకా అది [కొన్ని లాభాల్ని,] ఉదాహరణకు, డబ్బూ, విద్యా కలిగి వుంటుంది [వుండగలదు] లేక వాటిని తేలిగ్గా సముపార్జించుకో గలదనే ముందుఊహ (presupposition) పై ఆధారపడి మాత్రమే.
పౌర సమాజంలో ఏ వర్గమైనాగానీ ఈ [విమోచక] పాత్రను దానిలో అదిగానూ, యింకా సాధారణ ప్రజానీకంలోనూ ఒక సముత్సాహిత సమయాన్ని లేక ఉద్రేక స్థితిని [a moment of enthusiasm] రెచ్చగొట్టకుండా నైతే నిర్వర్తించలేదు. ఆ వర్గం యావత్‌ సమాజంతో సోదరభావంతో మెలగుతూ, అది స్వయంగా ఆ సమాజంలో కరిగిపోయే [మహత్తర] ఘడియ అది. ఆ వర్గం [ఆ సమయంలో] తన్ను తాను సమాజంతో మమేకంగావించుకొంటుంది; అలాగే సమాజమంతాకూడ ఆ వర్గం తన సాధారణ ప్రతినిధి అని అనుభూతి చెందడమేగాక ఆ వర్గాన్ని అలా గుర్తిస్తుందికూడ. ఆ వర్గం అప్పుడు సమాజపు నిజమైన సాంఘిక అధిపతి [పెద్ద] గా, సమాజపు గుండె [హృదయం] గా వుంటుంది; కనుక ఆ వర్గపు హక్కులు, స్వామ్యాధికారాలు [rights and claims] సమాజం మొత్తపు హక్కులు, స్వామ్యాధికారాలుగా వుంటాయి. ఏదైనా ప్రత్యేక వర్గం తన సాధారణ ఔన్నత్యం [general supremacy] న్యాయసమ్మతమైందని నిరూపించుకోవాలంటే అది సమాజపు సాధారణ హక్కుల పేరిటమాత్రమే సాధ్యంకాగలదు. విమోచనకర్తగా ఈ స్థితిని సంపాదించుకొనడానికి, తద్వారా తన సొంత క్షేత్ర [వర్గ మరియు సన్నిహిత బృందాల] ప్రయోజనాలకోసమని సమాజపు సకల క్షేత్రాల్నీ [తనకనుకూలంగా] వినియోగించుకోవాలంటే, కేవలం విప్లవ శక్త్యుత్సాహాలూ, బౌద్ధిక [మేధో] ఆత్మ విశ్వాసం వున్నంత మాత్రంలో సరిపోదు. ప్రజా విప్లవమూ, పౌరసమాజపు ఏదైనా ఒక ప్రత్యేక వర్గపు విమోచనా రెండూ ఏకకాలంలో సంభవించాలంటే, మొత్తం సమాజపు ప్రతినిధిగా ఒక వర్గం నిలవగలగాలంటే, అందుకుగాను యావత్‌ సమాజపు లోటుపాట్లన్నీ ఇంకో మరే వర్గంలోనైనా కేంద్రీకరించబడి వుండాల్సివస్తుంది; ఆ మరో వర్గం సార్వత్రిక అపనిందకు గురై సమాజపు అన్ని పరిమితుల [నైతిక ఆంక్షల] కు లోనై [ఏవగించుకోబడుతూ] వుండాల్సివుంటుంది.. ఒక ప్రత్యేక సాంఘిక క్షేత్రం మొత్తం సమాజపు కుఖ్యాత నేరభరిత క్షేత్రంగా పరిగణించబడాల్సి వుంటుంది; అలాంటప్పుడే, ఆ క్షేత్రపు విమోచన ఒక సార్వత్రిక స్వీయవిమోచనగా గోచరించగలదు. అంటే, ఏదైనా ఒక వర్గం సర్వశ్రేష్టమైన విమోచక వర్గంగా గోచరించాలంటే, ఏదైనా యింకో వర్గం, అందుకు తలకిందులుగా, దోపిడీ, పీడనల కంతటికీ ఆలవాలమైన వర్గంగా అగుపించాల్సి వుంటుంది. ఫ్రెంచి కులీన ప్రభువర్గం, మతగురు వర్గాల సార్వత్రిక రుణాత్మక [వ్యతిరేక ప్రభావపు] ప్రాధాన్యం, వాటికి అత్యంత దగ్గరగావుంటూనే వాటికి విరుద్ధంగా నిలిచిన మరో వర్గపు – అంటే, బూర్జువా వర్గపు – సార్వత్రిక ధనాత్మక (నిశ్చయాత్మక) ప్రాముఖ్యతను నిర్ణయించింది [అని గమనించాలి]. - హెగెల్‌యొక్క హక్కుసంబంధ తత్వచింతనకు పరిచయం (1844), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 71.
కనుక ఒక జర్మన్‌ విమోచనకు నిజమైన అవకాశం (సాధ్యత) ఎక్కడ వుంది?
మా జవాబు: సమూలమార్పువాద సంకెళ్ల (radical chains – తీవ్ర వాద బంధాలు?) తో కూడుకున్న ఒక వర్గం ఏర్పాటులో [అనేదే మా జవాబు] – ఆ వర్గం పౌర సమాజంలోనే వుంటుంది కాని పౌర సమాజానికి చెందివుండే వర్గం అయివుండదు; అదొక సాంఘిక బృందమే గాని నిజానికి అది సకల సాంఘిక బృందాల విచ్ఛిత్తి పరిణామం; తన సార్వత్రిక బరువుబాధల మూలంగా ఒక సార్వత్రిక స్వభావాన్ని సంతరించుకొనివున్న ఒక క్షేత్రానికి చెందివుంటుందది; అది ఏదో ఒక ప్రత్యేక అన్యాయానికి గురయివుంటుందన్నట్లుగాక, సాధారణంగా సమస్త అన్యాయానికీ గురయ్యే కర్మవస్తువుగా వుంటుంది గాబట్టి అది ఏదో ఒక ప్రత్యేక హక్కు కోసమే ఆరాటం చేస్తుందన్నట్లుండదు. ఈ వర్గం మరెంతమాత్రమూ ఒక చారిత్రక హోదా [అంతస్తు - status] కోసంకాక, కేవలం ఒక మానవీయ హోదా కోసమే కృషి చేస్తుంది [గొంతెత్తుతుంది]. జర్మన్‌ రాజకీయ రాజ్యతంత్ర పర్యవసానాలకు ఏకపక్షీయ ప్రతిఘటనగామాత్రమేనైతే అది వుండదు; ఆ రాజ్యతంత్రపు ముందుఊహలన్నింటికీ పూర్తి వ్యతిరేకతతో వుంటుంది. అంతిమంగా, తన్ను తాను సమాజంలోని యితర అన్ని క్షేత్రాలనుండీ విముక్తి చేసుకోకుండా, తద్వారా స్వయంగా [అసలుకు] ఈ యితర క్షేత్రాలన్నింటినీ విముక్తం గావించకుండా తన్ను తాను సైతం విమోచనగావించుకోలేని క్షేత్రం అది. ఒక్క మాటలో, అది మానవజాతికే సంపూర్ణ విమోచన. మొత్తం సమాజం ఒక ప్రత్యేక వర్గంగా విచ్ఛిన్నమవడమే అధోకార్మిక వర్గ ఆవిర్భావం. - హెగెల్‌యొక్క హక్కుసంబంధ తత్వచింతనపై ఒక విమర్శ (1844), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 72 నుండీ.
ప్రతి యుగంలోనూ పాలక వర్గం భావనలే పాలక భావనలుగా కూడ వుంటాయి, అంటే సమాజపు భౌతిక (పాదార్థిక) శక్తిని పాలించే వర్గమే, అదే సమయంలో, దాని (సమాజపు) మేధో (బౌద్ధిక) శక్తినికూడ పాలిస్తూంటుంది. పాదార్థిక (భౌతిక) ఉత్పత్తి సాధనాలు దేని అందుబాటులో వుంటాయో ఆ వర్గం అదే సమయంలో మానసిక ఉత్పత్తి సాధనాలపైకూడ అదుపాజ్ఞలు కలిగివుంటుంది; అందువల్ల, సాధారణంగా చెబితే, మానసికోత్పత్తి సాధనాలు లేని వాళ్ల భావనలు ఆ వర్గానికి అధీనమై వుంటాయి. పాలక భావనలంటే ఆధిపత్యంలోవుండే పాదార్థిక (భౌతిక) సంబంధాల భావాత్మక వ్యక్తీకరణ తప్ప మరేమీ కావు; అంటే భావనలుగా చిక్కించుకోబడే ఆధిపత్యంలోని భౌతిక సంబంధాలు అవన్నమాట. కనుక, అవి ఒక వర్గాన్ని పాలక వర్గంగా రూపొందించే సంబంధాల భావనాపర వ్యక్తీకరణలై వుంటాయి; అందుచేత అవి ఆ వర్గపు ఆధిపత్యానికి సంబంధించిన భావనలు అని చెప్పవచ్చు. పాలక వర్గాన్ని ఏర్పరిచే వ్యక్తులు మిగతా యితర విషయాలతోబాటు చైతన్యంకూడ కలిగివుంటారు; కనుక వాళ్లు ఆలోచిస్తుంటారు. అందుచేత, వాళ్లు ఒక వర్గంగా పరిపాలిస్తూ, ఒక యుగపు విస్తృతినీ, పరిథినీ నిర్ణయిస్తూండేంతమేరకు, వాళ్లు ఆ పనిని ఆ మొత్తం వరసవ్యాప్తిలో నిర్వర్తిస్తూంటారని, కనుక యితర అంశాలకు తోడుగా చింతకులుగా- భావ స్రష్టలుగా- కూడ పాలిస్తూంటారని, తమ యుగపు భావనల ఉత్పత్తి-పంపిణీల్ని క్రమబద్ధం చేస్తుంటారని, అందువల్ల వాళ్ల భావనలు ఆ యుగపు పాలక భావనలై వుంటాయనేది స్వయంస్పష్టంగానే వుంది. - జర్మన్‌ భావజాలం (1845-46), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 176.
మధ్య యుగాల్లో ప్రతి పట్టణంలోని పౌరులూ తమ [ధన మాన] ప్రాణ రక్షణకుగాను భూస్వామ్యకులీన ప్రభువర్గానికి వ్యతిరేకంగా ఐక్యం కావలిసి వచ్చేది. వర్తకవ్యాపారాల విస్తరణ, సమాచార సంబంధాల ఏర్పాటులతో వేర్వేరు [గా వుండిన] పట్టణాలు [తమ లాగే] ఒకే శత్రువుతో అవే పోరాటప్రయోజనాలు ఉద్ఘాటించి వున్న యితర పట్టణాలగురించి తెలుసుకోవడానికి దారి తీసింది [వీలు పడింది]. అనేక స్థానిక బర్గర్ల (పురవాసుల) సంఘాల [కార్పొరేషన్‌ల] నుండి ఒక బర్గర్ల వర్గం [బూర్జువా వర్గం] ఆవిర్భవించింది – కాని, అది చాల మెల్లమెల్లగా మాత్రమే. సమాజంలో అప్పట్లో ఉనికిలో వుండిన సంబంధాలు, వాటిచే నిర్ణయింపబడే ఉత్పత్తి విధానానికి ఈ బర్గర్లు విరుద్ధంగా వుండడంచేత, విడి విడి బర్గర్ల జీవన పరిస్థితులు [క్రమక్రమంగా] వాళ్లందరికీ ఉమ్మడిగావుంటూనే, అదే సమయంలో ప్రతి వ్యష్టి బర్గరుకూ స్వతంత్రంగావుండే [సామాన్య] పరిస్థితులుగా రూపొందాయి. ఆ [సామాన్య బర్గర్ల వర్గ] పరిస్థితుల్ని, తమంత తామే ఫ్యూడల్‌ బంధనాలనుండి తెగతెంపులు చేసుకుని స్వతంత్రమైన మేరకు స్వయంగా బర్గర్లే సృష్టించుకొన్నారు; అయితే, అప్పట్లో ఉనికిలోవున్న ఫ్యూడల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా వుండే వారి శత్రుత్వం వారి అస్తిత్వాన్ని నిర్దేశించినంత మేరకు ఆ పరిస్థితులే వాళ్లను [బర్గర్లను] సృష్టించాయని చెప్పుకోవాలి. విడి విడి పట్టణాలు సంఘాలు-సమాఖ్యలుగా ఏర్పడ్డం మొదలైన కొద్దీ, ఈ ఉమ్మడి [సామాన్య] పరిస్థితులు వర్గ పరిస్థితులుగా రూపొందాయి. ఒకే విధమైన పరిస్థితులు, ఒకే విధమైన వైరుధ్యం, ఒకే విధమైన ప్రయోజనాలు ప్రతిచోటా అనివార్యంగా [అవశ్యంగా] మొత్తంమీద ఒకేలా వుండే ఆచారవ్యవహారాలను ఆహ్వానించాయి. అసలుకు బూర్జువా వర్గమే, తన యిలాంటి పరిస్థితుల్లో, అతి క్రమక్రమేపీగా మాత్రమే, అభివృద్ధి చెందుతుంది; [మొదట్లోనైతే] శ్రమ విభజన ప్రకారం నానా ముఠాలుగా చీలిపోతూంటుంది; అంతిమంగా మనుగడలోవున్న [తనకు తటస్థించే] సకల ఆస్తిపర వర్గాలనూ, తనకు కనిపించిన ఆస్తులన్నీ పారిశ్రామిక లేక వాణిజ్య పెట్టుబడిగా పరివర్తన చెందే మోతాదులో, తనలోకి పీల్చివేసుకుంటుంది; [అదే సమయంలో అంతకుపూర్వపు ఆస్తిలేని వాళ్లలో మెజారిటీని, అలాగే యిదివరకటి ఆస్తిపర వర్గాలో కొంత భాగాన్ని ఒక కొత్త వర్గంగా – అధోకార్మిక వర్గంగా రూపొందిస్తుంది ఈ బూర్జువా వర్గం]. ఇంకో వర్గంతో ఉమ్మడి పోరాటం (యుద్ధం) చేయవల్సివచ్చేంతమేరకే విడి విడిగావుండే వ్యక్తులు ఒక వర్గంగా ఏర్పడివుంటారు; అలా లేనప్పుడు వాళ్లు పోటీదారులుగా పరస్పరం శత్రుస్థితిలో వుంటారు. కాగా, మరోవైపున, ఈ వర్గం దానివంతుకు విడి వ్యక్తులకు అతీతంగా, వ్యతిరేకంగాసైతం, ఒక స్వతంత్ర అస్తిత్వాన్ని సంతరించుకొంటుంది. అందుమూలంగా ఈ విడి వ్యక్తులు తమ అస్తిత్వ పరిస్థితులు పూర్వభాగ్యనిర్ణీతమైనట్లు కనుగొంటారు. కనుక తమ జీవనస్థితీ, తమ వ్యక్తిగత వికాసమూ రెండూ వాళ్ల [తమ] వర్గంచే తమకు ప్రదానం చేయబడినట్లు కనుగొంటారు; తాము ఆ [తమ] వర్గంలో సంలీనం గావించబడుతారు. విడి వ్యక్తులు శ్రమ విభజనకు అధీనమౌతూండే పరిణామంలాంటిదే యిదికూడ. కనుక యిదికూడ ప్రైవేటు ఆస్తి రద్దుచేత, [పర్యవసానంగా సంభవించే] స్వయంగా శ్రమ రద్దు చేత మాత్రమే తొలగింపబడగలదు. పోతే యిలా వ్యక్తులు ఒక వర్గంలో సంలీనం చేయబడడం అనేది వాళ్లు నానా రకాల భావనలు, వగైరాకు అధీనం అయేట్లు ఎలా చేస్తుందో మనం యిప్పటికే అనేక సార్లు సూచించివున్నాము. - జర్మన్‌ భావజాలం (1845-46), పు. 69 నుండీ.
ఉత్పాదక శక్తుల అభివృద్ధిక్రమంలో అప్పటికి ఉనికిలోవుండే సంబంధాలలో కేవలం చెరుపును మాత్రమే కలగజేసే, మరెంత మాత్రం ఉత్పాదకంకాక కేవలం విధ్వంసకంగామట్టుకే వుండే ఉత్పాదక శక్తులు, పరస్పర సంబంధ సాధనాలు [యంత్రాలూ, డబ్బూ] అస్తిత్వంలోకి వచ్చే ఒక [క్లిష్ట] దశకూడ వస్తుంది. ఇక దీనికి సంబంధించి సమాజంలోని సానుకూలతల్ని వేటినీ ఆనందించ లేని, కాని సమాజపు బరువుబాధలన్నింటినీ భరించవల్సి వచ్చే ఒక వర్గం, సమాజంనుండి బహిష్కృతులై, యితర అన్ని వర్గాలతోనూ అత్యంత నిర్ణాయక శత్రుత్వం (వైరం) లోనికి బలవంతంగా నెట్టబడే ఒక వర్గం ఆవిర్భావం ఆవశ్యకమౌతుంది. సమాజసభ్యులందరిలో అత్యధిక సంఖ్యాకుల్ని (మెజారిటీని) కలిగి వుండే ఒక వర్గం, దేనినుండైతే ఒక మౌలిక విప్లవ ఆవశ్యకతను గురించి చైతన్యం, అంటే కమ్యూనిస్టు చైతన్యం ప్రసరిస్తుందో అలాంటి వర్గ ఆవిర్భావం ఆహ్వానింపబడుతుంది. అయితే, ఈ [మౌలిక విప్లవ ఆవశ్యకతా] కమ్యూనిస్టు చైతన్యం ఇతర వర్గాలలోకూడ, ఈ [అధోకార్మిక] వర్గం పరిస్థితిగురించి లోతైన యోచన [ధ్యానం] వల్ల, తలెత్తవచ్చనుకోండి. - జర్మన్‌ భావజాలం (1845-46), కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 179.
వర్గాలమధ్య వైరాల పునాదిపై నెలకొన్న ప్రతి సమాజంలోనూ పీడిత (అణిచివేయబడ్డ) వర్గం ఒక కీలక షరాస్థితి అంశంగా వుంటుంది. అందువల్ల ఆ పీడిత వర్గం విమోచన అంటే ఒక నూతన సమాజం సృష్టి అనే అంతరార్థం అవశ్యంగా వస్తుంది. పీడిత వర్గం తన్నుతాను విముక్తి చేసుకోవాలంటే ఆవరకే సముపార్జించుకోబడ్డ ఉత్పాదక శక్తులు, అప్పటికి ఉనికిలోవున్న సాంఘిక సంబంధాలు ఒకదాని సరసన మరొకటి [అనుగుణంగా] మనలేని పరిస్థితి ఆవశ్యకమౌతుంది. అన్ని ఉత్పత్తి పరికరాల్లోకీ విప్లవకర వర్గమే స్వయంగా అత్యంత మహత్తర ఉత్పాదక శక్తి [వంతం] గా వుంటుంది. విప్లవకర మూలకాంశాలు ఒక వర్గంగా సంఘటితం అయ్యాయంటే [లేక అలా కావాలంటే] అప్పటికే పాత సమాజం వక్షంలో అంకురించ గల ఉత్పాదక శక్తులన్నీ మనివుండివుంటాయని ఊహించవచ్చు [లేక అలా మనివుంటేనే అది సాధ్యం అనే అర్థంకూడ రావచ్చు].
మరి దీనర్థం పాత సమాజపు పతనం తర్వాత ఒక కొత్త రాజకీయాధికారం తీసుకొచ్చే ఒక కొత్త వర్గాధిపత్యం వస్తుందనా? [కానే] కాదు.
కార్మిక వర్గ విమోచనకు [వలసిన] షరాస్థితి ప్రతి వర్గమూ రద్దు కావాల్సిన [లేక రద్దు చేయబడాల్సిన] స్థితే. ఎలాగైతే [అంతకు పూర్వం] అన్ని యిస్తువగణాలూ (ఎస్టేట్లు), అన్ని అంతస్తులూ (ఆర్డర్లు) రద్దు కావడమనేది బూర్జువా అంతస్తుకు సంబంధించిన మూడవ యిస్తువగణం (థర్డ్‌ ఎస్టేట్‌) యొక్క విమోచనకు వలసిన షరాస్థితిగా వుండిందో, ఇదీ అలాగే.
కార్మిక వర్గం, తన అభివృద్ధి క్రమంలో, పాత పౌర సమాజంస్థానే వర్గాలు, వాటి మధ్యలి వైరాలు లేని ఒక సంఘాన్ని తెచ్చిపెడుతుంది; అప్పుడు రాజకీయాధికారం అని సముచితంగా పిలవబడేదేదైతే వుంటుందో అదికూడ మరెంతమాత్రం ఉనికిలో వుండదు – ఎందుకంటే, ఖచ్చితంగా చెబితే రాజకీయాధికారం అంటే పౌర సమాజంలోని వైరాలకు ఒక అధికారిక వ్యక్తీకరణే గదా.
ఈ మధ్యలో అధోకార్మిక వర్గానికీ, బూర్జువావర్గానికీ మధ్య వుండే వైరం వర్గానికి వ్యతిరేకంగా వర్గం జరిపే పోరాటంగా [అంటే వర్గం అనేదాన్నే రూపుమాపేందుకు వర్గ పోరాటంగా] సాగుతుంది; ఈ పోరాటం ఒక సంపూర్ణ విప్లవంలో దాని అత్యున్నత దశకు [శిఖరాగ్రానికి] చేరుకుంటుంది. అయినా నిజానికి వర్గాల నడుమ విరోధం ప్రాతిపదికన నెలకొన్న ఒక సమాజం చివరకు ఒక పాశవిక వైరుధ్యంలో, కాయానికి వ్యతిరేకంగా కాయం సమర్పించే అదురుదెబ్బగా, తన అంతిమ పరాకాష్టాపరిష్కారం (dénouement) పొందడానికి పయనించడంలో ఆశ్చర్యమేమున్నది?
సాంఘిక వుద్యమం అంటే రాజకీయ వుద్యమం వుండనిది అని అనకు. ఏకకాలంలో సాంఘికంకూడ అయివుండని రాజకీయ వుద్యమం అనేదే ఏదీ వుండదు [అని తెలుసుకో]. [లేదా ప్రతి రాజకీయ వుద్యమమూ అదే సమయంలో సాంఘిక వుద్యమంకూడ అయి వుంటుందని తెలుసుకో.]
వర్గాలూ, వర్గ వైరాలూ మరెంతమాత్రం వుండనటువంటి స్థితిగతుల్లోమాత్రమే [అలాంటి పరిస్థితుల వ్యవస్థలోమాత్రమే] సాంఘిక క్రమపరిణామాలు, రాజకీయ విప్లవాలుగా వుండడం మానుతాయి (social evolutions will cease to be political revolutions). అంతదాకా, సమాజపు ప్రతి సాధారణ పునర్వ్యవస్థీకరణకు పూర్వ సంధ్యలోనూ, సమాజవిజ్ఞానశాస్త్రపు తుదిపలుకు యిదే కాగలదు:
Le combat ou la mort; la lutte sanguinaire ou le néant.C’est ainsi que la question est invinciblement posée.
యుద్ధమో, మరణమో; రక్తదాహ పోరాటమో, అంతిమ శాంతమో; ఇలా వుంటుంది అజేయ పోరాట [యోధుల?] సమస్యంతా!
[ఒక్క మాటలో ' విజయమో, వీరస్వర్గమో! ' అనొచ్చా? – అను.]
- తత్వశాస్త్ర దారిద్ర్యం (1847), పుటలు 214 నుండీ.
ఇంతవరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే.
స్వతంత్రుడూ, బానిసా; కులీనుడూ (patrician), అలగాజనుడూ (plebeian); ప్రభువూ, అర్ధ బానిసా; వృత్తిసంఘ యజమానీ (guild-master), వృత్తిశ్రామికుడూ (journeyman); ఒక్కమాటలో చెబితే, పీడకులూ, పీడితులూ ఎల్లప్పుడూ పరస్పర వైరుధ్యాలతో ఒక్కో సారి ప్రచ్ఛన్నంగానూ, ఒక్కో సారి బాహాటంగానూ మొత్తంమీద ఎడతెగని పోరాటం కొనసాగించారు. చివరకి ఈ పోరాటం ప్రతి సారీ యావత్‌ సమాజపు విప్లవాత్మక పునర్వ్యవస్థీకరణకుగానీ, లేదా సంఘర్షించే వర్గాల ఉమ్మడి వినాశానికిగానీ దారితీసింది.
తొలి చారిత్రక యుగాల్లో మనకు దాదాపు ప్రతి చోటా సమాజం వివిధ శ్రేణుల్లో సంక్లిష్టంగా వ్యవస్థీకృతమై వుండడం, సాంఘిక హోదాల్లో బహుళ తరగతులుండడం గోచరిస్తుంది. పురాతన రోమ్‌లో మనకు కులీనులూ, వీరయోధులూ (Knights), అలగాజనులూ, బానిసలూ కనిపిస్తారు; మధ్యయుగాల్లో మనకు ఫ్యూడల్‌ ప్రభువులూ, ప్రభుదాసులూ (లేక పాళెగాళ్లు - vassals), వృత్తిసంఘ యజమానులూ, వృత్తిశ్రామికులూ, అప్రెంటిసులూ (పనినేర్చుకొనే వాళ్లు, ఉమేజువారు), అర్ధబానిసలూ అగుపిస్తారు. దాదాపు ఈ తరగతులన్నిటిలోనూ మనకు మళ్లీ కింది తరగతులు కనిపిస్తాయి.
ఫ్యూడల్‌ సమాజ శిథిలాలనుండి అంకురించిన ఆధునిక బూర్జువా సమాజం వర్గ వైరాలను రూపుమాప లేదు. పాతవాటి స్థానే కొత్త వర్గాలనూ, కొత్త దోపిడీ, అణచివేతల పరిస్థితుల్నీ, కొత్త పోరాట రూపాలనూ ప్రవేశపెట్టడమే అది చేసిన పని.
అయితే బూర్జువా యుగమైన మన యుగానికి ఈ ఒక విశిష్ట లక్షణం వుంది: అది వర్గ వైరాలను సులభతరం గావించింది. రెండు మహా శత్రు శిబిరాలుగా, నేరుగా ఒకదాన్నొకటి ఎదుర్కొనే రెండు మహా వర్గాలుగా – బూర్జువా వర్గం, అధోకార్మిక వర్గాలుగా సమాజం యావత్తూ అంతకంతకూ అధికంగా చీలిపోతున్నది.
- కమ్యూనిస్టు ప్రణాళిక (1848), కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 222.

కార్మికులు ఒక వర్గంగా, తద్వారా ఒక రాజకీయ పక్షంగా రూపొందే వ్యవస్థీకరణను తిరిగి కార్మికులమధ్యే చెలరేగుతూండే పోటీయే సదా తలకిందులు గావించివేస్తూంటుంది. అయినా ఈ కార్మికుల నిర్మాణం ఎల్లప్పుడూ మరింత సుదృఢంగా, శక్తివంతంగా, బలవత్తరంగా మళ్లీ మళ్లీ తలయెత్తుతూంటుంది. బూర్జువా వర్గంలోనే వుండే చీలికల్ని ఉపయోగించుకొని అది [కార్మికుల వ్యవస్థీకరణ] కార్మికుల నిర్దిష్ట ప్రయోజనాలకు శాసనపరమైన గుర్తింపు లభించేలా వత్తిడి తెస్తుంది. పది గంటల బిల్లు ఇంగ్లండులో ఆమోదించబడింది ఈ విధంగానే.
మొత్తంమీద చూస్తే (Altogether) పాత సమాజంలోని వర్గాల మధ్యని ఘర్షణలు అధోకార్మిక వర్గ వికాసాన్ని అనేక విధాలుగా పెంపొందిస్తాయి. మొదట ప్రభుస్వామ్యంతోనూ, ఆనక పరిశ్రమల అభివృద్ధికి విరుద్ధమైన ప్రయోజనాలు గల ఆ యా బూర్జువా వర్గ తరగతులతోనూ, అన్నివేళలా విదేశీ బూర్జువా వర్గాలతోనూ బూర్జువా వర్గం నిరంతరం యుద్ధం చేస్తూనే వుంటుంది. ఈ యుద్ధాలన్నింటిలోనూకూడ అది అధోకార్మిక వర్గానికి వినతి చేసుకోవాల్సిన, దాని సహాయాన్ని అర్థించవల్సిన స్థితికి నెట్ట బడుతుంది. ఈ విధంగా కార్మిక వర్గాన్ని రాజకీయ రంగస్థలంపైకి లాగుకురావాల్సిన అనివార్య అవసరం దానికి కలుగుతుంది. కనుక స్వయానా బూర్జువా వర్గమే అధోకార్మిక వర్గానికి తన సొంత రాజకీయ పరిజ్ఞానం, సాధారణ విద్యలకు సంబంధించిన అంశాలను సరఫరా చేస్తూంటుంది; అంటే, మరోలా చెబితే, స్వయంగా తనతో (అంటే బూర్జువా వర్గంతో) పోరాడేందుకు వలసిన ఆయుధాలను అది అధోకార్మిక వర్గానికి తానుగానే అందిస్తుంది.
ఇంకా, పరిశ్రమల పురోగమనంతో పాలక వర్గాలకు చెందిన కొన్ని తరగతులు మొత్తంగానే అధోకార్మిక వర్గ స్థాయికి కుంగిపోతాయనీ, లేక కనీసం ఆ తరగతుల అస్తిత్వ పరిస్థితులకే ముప్పు వాటిల్లుతుందనీ మనం ఈ వరకే గమనించాము. మరి ఈ తరగతులుకూడ జ్ఞానబోధ, ప్రగతి-అభ్యుదయాలకు సంబంధించిన తాజా అంశాలను అధోకార్మిక వర్గానికి సరఫరా చేస్తాయి.
చివరగా, వర్గ పోరాటం ఒక నిర్ణయాత్మక దశకు చేరుకున్నప్పుడు, పాలక వర్గంలోనూ, యథార్థానికి పాత సమాజమంతటిలోనూ సాగే విచ్ఛిత్తి క్రమం ఎంతగా ప్రస్ఫుటమైన, ఎంతగా హింసాపూరితమైన రూపం దాలుస్తుందంటే, పాలక వర్గంలో ఒక చిన్న భాగం తన వర్గంతో పూర్తి తెగతెంపులు చేసుకొని విప్లవకర వర్గంతో – అంటే భవిష్యత్తును తన గుప్పిట్లో యిరికించుకుని వుండే వర్గంతో చేతులు కలుపుతుంది. కనుక అంతకు క్రితం ప్రభువర్గంలో ఒక భాగం ఎలాగైతే బూర్జువా వర్గం వైపుకు వెళ్లిపోయిందో, సరిగ్గ అలాగే యిప్పుడు బూర్జువా వర్గంలో ఒక భాగం అధోకార్మిక వర్గం [వైపుకు మళ్లి దాని శ్రేణుల్లో చేరి] పోతుంది. ప్రత్యేకించి, చారిత్రక వుద్యమాన్ని మొత్తంగానూ, సైద్ధాంతికంగానూ అవగాహన చేసుకొనే స్థాయికి ఎదిగిన బూర్జువా సిద్ధాంతవేత్తల్లో ఒక భాగం అధోకార్మిక వర్గం వైపుకు వెళ్లిపోతుంది. [బూర్జువా వర్గానికి ఎదురుబొదురుగా నిల్చుని వున్న వర్గాలన్నిటిలోకీ ఒక్క అధోకార్మిక వర్గంమట్టుకే నిజంగా విప్లవకరమైన వర్గం. ఇతర వర్గాలన్నీ ఆధునిక పరిశ్రమ పురోగమనంతో క్షీణించి, క్షీణించి తుదకు అంతరించి (అదృశ్యమై) పోతాయి. కాగా అధోకార్మికవర్గం (మాత్రం) ఆధునిక పరిశ్రమయొక్క ప్రత్యేకమైన, ప్రధానమైన ఉత్పత్తిఫలంగా (నిలిచి) వుంటుంది.] - కమ్యూనిస్టు ప్రణాళిక, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 228 నుండీ.

వర్గం

వర్గం - 1

వర్గం
వ్యాఖ్యానం
చరిత్రనుగురించిన మార్క్స్ దృక్పథంలో వర్గాలకు అపార ప్రాధాన్యం వున్నదనేది స్పష్టమే. "ఇంతదాకా వుంటూవచ్చిన సమాజాల చరిత్ర [అంతా] వర్గ పోరాటాల చరిత్రే," అనే పదగుంభనంతో ప్రారంభమౌతుంది [మార్క్స్‌ రాసిన] కమ్యూనిస్టు ప్రణాళిక. మార్క్స్‌ ప్రకారం వర్గాలు సమాజంలోని ప్రాథమిక సాంఘిక బృందాలు, వాటి (ఆ ప్రాథమిక సాంఘిక బృందాల) మధ్య ఘర్షణ ద్వారానే సమాజం, దాని ఆర్థిక ఉపకట్టడంలోని మార్పులకు అనుగుణంగా, వికసిస్తూ వచ్చిందని. ఏదైనా ఒక వర్గం దాని సొంత ప్రయోజనాల్ని మొత్తం సమాజపు ప్రయోజనాలతో మమేకంగా గుర్తించగలిగినప్పుడు విప్లవాలు సంభవిస్తూ వచ్చాయని యిదివరలో (గతంలో) మార్క్స్‌ భావించాడు. జర్మన్‌ భావజాలం లో మార్క్స్‌ యిలా అంటాడు: "ఇదివరకటి పాలకవర్గం స్థానే [అధికారంలోకి] వచ్చే ప్రతి కొత్త వర్గమూ, కేవలం తన లక్ష్యాలను సాధించడానికి గాను, తన సొంత ప్రయోజనాన్ని సమాజసభ్యులందరి ఉమ్మడి ప్రయోజనంగా చిత్రించి చూపాల్సి వస్తుంది… కనుక, విప్లవం తెచ్చే వర్గం మొదటి నుండీకూడ … ఒక వర్గంలా కాక మొత్తం సమాజపు ప్రతినిధిలా అగుపిస్తూంటుంది."[1] మరి ఈ 'గుర్తింపులు' (మమేకతాప్రదర్శనలు - identifications) గతంలో అతి స్వల్పకాలాలపాటే మనివుంటూండి నట్లు రుజువయిందికూడ; కాని [ఇప్పుడు] రానున్న విప్లవంలో మట్టుకు అధోకార్మిక వర్గం – వర్గవ్యవస్థ మరింత సులభసామాన్యం కావడం వల్లా, అలాగే కేవలం దాని సంఖ్యాబాహుళ్యంవల్లకూడ – మొత్తం సమాజపు ప్రయోజనాలకూ ప్రాతినిధ్యం వహించగలిగే స్థితిలో నిజంగా వుంది. అందుచేత ఈ సారి వచ్చే విప్లవం, కాలక్రమాన ఒక వర్గరహిత సమాజాన్ని ఆవిష్కరిస్తుంది. రాజ్యం, పరాయీకరణలలాగే వర్గంకూడ ఒక తాత్కాలిక పరిణామం (అస్తిత్వం) గా వుంటుంది; పెట్టుబడిదారీ సమాజంలో అది దాని పూర్ణ విస్తృతిలో [చిత్రించబడి] వుంటుంది.
మార్క్స్‌కు సంబంధించి వర్గంగురించిన భావనకు ఎంత ప్రాముఖ్యం వుందో గమనిస్తే, మరి ఆ భావనగురించి ఆయన ఒక క్రమబద్ధ విశ్లేషణ ఏమీ చేయలేదంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కనీసం యిలాంటి విశ్లేషణకు ఆయన పూనుకొన్నదైనా ఒకే ఒక చోట – పెట్టుబడి గ్రంథం 3 వ సంపుటం చివరన మాత్రమే – అదీ అసంపూర్ణంగానే; ఆయన మరణంతో అది అర్ధంతరంగా ఆగి పోయిందికూడ.[2] 'ఎన్ని వర్గాలు వున్నాయి?' అనే ప్రశ్నతో [అక్కడి] ఆ రచనాభాగాన్ని మొదలు పెడతాడు మార్క్స్‌. మళ్ళీ తానే పెట్టుబడిదారీ సమాజంలో మూడు పెద్ద వర్గాలు – వేతన శ్రామికులు, పెట్టుబడిదారులు, భూయజమానులు – వున్నారని జవాబిస్తాడు. అయితే వెంటనే దానికి సవరణగా, పెట్టుబడిదారీ సమాజం అత్యంత వికసితరూపంలోవున్న ఇంగ్లండులో, "ఈ వర్గాల పొరవిభజన అంత శుద్ధ రూపంలో ఏమీ కనిపించదు. ఇక్కడ సైతం మధ్యతరగతులు, నడిమిబృందాల పొరలు ప్రతి చోటా ఈ హద్దు నిర్దేశాన్ని చెరిపివేస్తూంటాయి (అయితే ఇలాంటి చెరిపివేత పట్టణాల్లోనే హెచ్చుగా వుంటుంది; గ్రామీణప్రాంతాల్లో యిది చాల – పోల్చలేనంత – తక్కువగానే వుంటుంది), " అని చేర్చిచెబుతాడుకూడ. అయితే, పెట్టుబడిదారీ సమాజ వికాసంతో రెండంటే రెండే వర్గాలు – బూర్జువా వర్గం, అధోకార్మికవర్గాలు సృష్టి అవుతూండడంతో పరిస్థితి వేవేగంగా సులభతరం అవుతున్నది. 'మధ్య తరగతులు, నడిమి బృందాల' పొరలు పిప్పిగావించబడి పారవేయబడడమే కాదు, భూయజమానులుసైతం యిదేవిధమైన క్రమానికి గురవుతారు. కాలక్రమాన కార్మికులందరూ వేతన-శ్రామికులుగా రూపొందుతారు; పెట్టుబడిదారులమధ్య పోటీమూలంగా కొంతమంది పెట్టుబడు దారుల సిరిసంపదలు పెరిగిపోగా, యితర పెట్టుబడిదారులు [దెబ్బ తిని] అధోకార్మికవర్గ శ్రేణులకు బలవంతంగా నెట్టివేయబడుతారు.

ఆ పై మార్క్స్‌ ఇంకో (రెండో) ప్రశ్న వేస్తాడు [లేక 'వేసుకుంటాడు' అనడం మెరుగేమో] : పైన ప్రస్తావించిన మూడు బృందాలనూ మూడు మహా సాంఘిక వర్గాలుగా రూపొందించే దేమిటి? దానికి మళ్లీ తానే – "మొదటి చూపుకైతే, వాటి ఆదాయాల గుర్తింపు, ఆ ఆదాయాల వనరులు [వాటిని మహా సాంఘిక వర్గాలుగా రూపొందించేది] అని చెప్పవచ్చు. మూడు మహా సాంఘిక బృందాలు వున్నాయి – వాటి సభ్యులు అంటే వాటిని రూపొందించే వ్యక్తులు [వరుస క్రమంలో] తమ వేతన-శ్రమనూ, తమ పెట్టుబడినీ, తమ భూఆస్తినీ వెచ్చించి [అందుమూలంగా వచ్చే] జీతాలు [వేతనాలు], లాభం, నేల కిరాయి [ground rent-కౌలుమొత్తం]లద్వారా జీవితాలు గడుపుతూ వుంటారనీ చెప్పవచ్చు" – అంటూ జవాబిస్తాడు. ఆ తర్వాత మార్క్స్‌ తానే యింకో ఆక్షేపణ చేస్తాడు – మరి ఈ ప్రమాణం ప్రకారమైతే, యితరులుకూడ, ఉదాహరణకు డాక్టర్లు, ప్రభుత్వోద్యోగులు వగైరా వేర్వేరు [ప్రత్యేక] వర్గాలవుతారే అని ప్రశ్నిస్తాడు. కాని అక్కడికి ఆ రాతప్రతి తెగిపోయివుండడం వల్ల ఈ అభ్యంతరానికి తన జవాబేమిటో మనకు బోధపడదు. అయితే పెట్టుబడిలో మార్క్స్‌ యిలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తన యితర రచనల్లో వర్గం గురించి ఆయన చేసిన అంత హెచ్చుగా క్రమబద్ధంకాని ప్రకటనలు మనకు దోహద పడుతాయి. [ఉదాహరణకు అంతకు ఎంతోకాలం పూర్వమే రాసిన] కమ్యూనిస్టు ప్రణాళిక లో మార్క్స్‌ రెండు వర్గాల నమూనాను వాడుతాడు: " సమాజం మొత్తమూ మరింత మరింతగా రెండు గొప్ప శత్రు శిబిరాలుగా, ఒకదానికొకటి నేరుగా ఎదురునిలిచే రెండు మహా వర్గాలుగా, బూర్జువా వర్గం - కార్మిక వర్గాలుగా చీలిపోతూంది,"[3] అంటాడు. బూర్జువా వర్గం అంటే ఉత్పత్తి సాధనాల యజమానులు, వేతన శ్రమ నియామకులూననీ, పోతే తమ సొంత ఉత్పత్తి సాధనాలంటూ ఏమీ లేని, తమ వేతన శ్రమను అమ్ముకుని బతికే వాళ్లు అధోకార్మిక వర్గమనీ [మార్క్స్‌] నిర్వచిస్తాడు. ఈ విధంగా వ్యాప్తిలోవున్న ఉత్పత్తి విధానంలో ఒక వ్యక్తికి వుండే స్థితే అతడు ఏదైనా వర్గానికి చెందేందుకు అర్హతాప్రమాణంగా చూడబడింది.
అధోకార్మిక వర్గపు దరిద్రీకరణ (immiserisation of the proletariat) గురించిన మార్క్స్‌ భావన వెనుకవుండేదికూడ ఈ రెండు-వర్గాల నమూనాయే నని మనం గమనించగలం. [అయితే మనమిక్కడ గమనించాల్సిందేమంటే,] అధోకార్మిక వర్గం ఏదో పరమరూఢ అర్థంలో [నిరపేక్ష రూపంలో] దరిద్రీకరణకు లోనవుతుందని మార్క్స్‌ ఎప్పుడూ అనలేదు.[4] అసలు ఇలాంటి ఆలోచనే, మానవావసరాలు అన్నీ సమాజ మధ్యవర్తిత్వంద్వారానే సాగిపోతాయని ఆయనకున్న నిశ్చితాభిప్రాయానికి బొత్తిగా నప్పేది కాదు. ఆయన వాదనంతా ఉత్పత్తి సాధనాల యజమానులకూ, అవి లేనివారికీ (కార్మికులకూ) నడుమ వుండే వనరుల అంతరం మరింత [మరింత] గా విస్తృతం అవుతుందని మాత్రమే. మార్క్స్‌ తన వేతన శ్రమ - పెట్టుబడి లో ఇంటికీ, రాజభవంతికీ నడుమ తేడాగురించి ఒక పిట్టకథ చెబుతూ ఈ విషయాన్ని తేటతెల్లం గావిస్తాడు:
ఇల్లు చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు. దాని చుట్టుపక్కలి ఇళ్లన్నీ అంతే చిన్నగా వుండేంతవరకూ అది ఒక నివాసగృహానికి చెందిన అన్ని సామాజిక డిమాండ్లనూ సంతృప్తి పరుస్తూంటుంది. అయితే ఆ చిన్న ఇంటిపక్కన ఒక రాజప్రాసాదం ఆవిర్భవించ నివ్వండి, అది [వెంటనే] చిన్న ఇల్లుగా వుండేబదులు ఒక గుడిసెగా కుంచించుకుపోయినట్లనిపిస్తుంది. ఇప్పుడు తన (చిన్న ఇంటి) యజమానికి చేయడానికంటూ డిమాండ్లు ఏమీ లేవని లేక చాల స్వల్పమైన డిమాండ్లు మాత్రమే వున్నాయని ఆ చిన్న ఇల్లు చూపిస్తుంది. నాగరికతా (వికాస) క్రమంలో ఆ చిన్న ఇల్లు ఎంత ఎత్తుగా పైకి ఎదిగినా మరి దాని పక్కనున్న రాజప్రాసాదం అంతే ఉధృతితో లేక మరింత విస్తృతంగా పెరిగిపోతే గనుక ఆ చిన్న ఇంటి నివాసి మరింత మరింతగా అసౌకర్యవంతంగా, అసంతృప్తిగా, తన ఇంటి నాలుగు గోడలనడుమ అంతకంతకూ ఎక్కువగా బిగుసుకు పోయినట్లుగా అనుభూతి చెందుతాడు.[5]
అయితే మార్క్స్‌ ఈ ' వర్గం' అనే పదాన్ని ఉపయోగించేది కేవలం ఒక్క ఈ రెండు వర్గాల నమూనా సందర్భంలోనే కాదు. ఇతర ఆర్థిక బృందాలకు, ప్రత్యేకించి పెటీబూర్జువా, రైతాంగ వర్గాలకు సంబంధించి కూడ ఆయన ఈ పదాన్ని వాడుతాడు. కమ్యూనిస్టు ప్రణాళిక లోని సుబ్బరమైన విభజనను ఈ రెండు బృందాలూ వర్తింప జేయకుండా అడ్డుకునేట్లగుపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు బృందాలూ తాము ఎంతమంది కార్మికుల్ని నియమిస్తాయి, లేక తాము ఎంత భూమికి యాజమాన్యం వహిస్తాయి అనేదాన్ని బట్టి ఇటు బూర్జువా వర్గంలోకో లేక అటు అధోకార్మిక వర్గంతోనో విలీనమై పోతాయనేది స్పష్టమేకాబట్టి. అంతేగాక, యంత్రాల ఇతోధిక వినియోగంతో బాటుగా సేవారంగ పరిశ్రమలు బహుళాభివృద్ధి చెందడంతో ఒక కొత్త మధ్య తరగతి ఆవిర్భవించగలదని మార్క్స్‌ ముందుచూపుతో చెప్తాడు కూడ. మార్క్స్‌ ఇంకా " ఒకవైపున కార్మికునికీ, మరోవైపున పెట్టుబడిదారు, భూస్వాము (భూయజమాను) లకూ నడుమ సంఖ్యాపరంగా నిరంతరం పెరిగిపోతూండే మధ్యతరగతి వర్గాలను" విస్మరిస్తున్నాడంటూ రికార్డోను విమర్శిస్తాడుకూడ.[6]
ఇంకా మరింత మధ్యంతరంగా వుండే యితర బృందాలూ [కొన్ని] వున్నాయి: ఉదాహరణకు వ్యవసాయ కూలీలనే తీసుకొంటే వాళ్లు రైతులకూ, అధోకార్మికులకూ మధ్య సగం-దారిలో వున్నట్లు కనిపిస్తారు. అధోకార్మిక వర్గంగురించిన మార్క్స్‌ సాధారణ స్వభావ చిత్రణ ప్రకారం అది (ఆ పదం) కేవలం పారిశ్రామిక కార్మికులకే వర్తించినా, కొన్నిసార్లు ఆయన అధోకార్మికవర్గం పెట్టుబడిదారీ సమాజంలో అపార మెజారిటీ ప్రజల్ని కలిగివుంటుంది, కనుక వ్యవసాయ కూలీల్నిసైతం అందులో చేర్చాల్సివుంటుందనికూడ అంటాడు. 1875లో బకూనిన్‌పై చేసిన ఒక వ్యాఖ్యక్రమంలో మార్క్స్‌, "పెట్టుబడిదారీ కౌలుదారు వచ్చి రైతుల్ని వెళ్లగొట్టే (బేదఖల్‌ చేసే), అందువల్ల నిజంగా భూమి దున్నే వ్యక్తికూడ పట్టణ కార్మికుడికిలాగే ఒక వేతన శ్రామికునిగా, అంతే అధోకార్మికునిగా మారిపోయే, ఆ విధంగా అతడితోబాటు అవే [అధోకార్మికవర్గ] ప్రయోజనాలు పాలు పుచ్చుకునే"[7] పరిస్థితి తలయెత్తే అవకాశం (సంభావ్యత) గురించి ప్రస్తావిస్తాడుకూడ. అదే వ్యాఖ్యక్రమంలో, భూయజమాని అయిన రైతుకూడ కొన్నిసార్లు, తనకు తెలియకుండానే, అధోకార్మిక వర్గానికి చెందే పరిస్థితులు వుంటాయనీ, అలాంటి రైతుయొక్క భూమిపై వుండే తనఖా (తాకట్టు) భారం, అతడు దానికి నిజమైన యజమాని కాడు, మరెవరికోసమో పని చేస్తున్నాడని స్పష్టం చేస్తుందనీ అంటాడు మార్క్స్‌. మరలాంటప్పుడు – రైతులు అధోకార్మికులుగా, భూయజమానులు పెట్టుబడిదారులుగా పరిగణించబడేటప్పుడు – మనకు మళ్లీ ఒక రెండు వర్గాల నమూనా ప్రత్యక్షమౌతుంది. అయినప్పటికీ [అదలావున్నా] రైతులు రాజకీయంగా ఒక అభివృద్ధి నిరోధక వర్గమనే భావిస్తాడు; కనుక వారిని పట్టణ అధోకార్మిక వర్గంతోబాటు జట్టుకలపడానికి సుముఖత చూపడు మార్క్స్. [ఎందుకంటే] పశ్చిమ యూరపులో [అప్పటికి] అత్యంత తాజా రైతు వుద్యమాలు ఫ్యూడల్‌ [భూస్వామ్య] లేక రాచరిక మొగ్గుధోరణులతో నిండివుండినాయి [గనుక].
పోతే, మార్క్స్‌కు వర్గీకరించడానికి కష్టంగా తోచిన రెండో మధ్యంతర బృందం – తానుసైతం దేనికి చెందివున్నాడో ఆ బృందం, మేధావి (లేక బుద్ధిజీవి) వర్గం. ఆయన తరచూ వాళ్లనుగురించి బూర్జువా వర్గపు 'భావజాలపర (లేక సైద్ధాంతిక) ప్రతినిధులు, మాటకర్తలు (spokesmen)' అని ప్రస్తావిస్తూండేవాడు. అలాగే, "తామొక వర్గమనే భ్రమను సర్వసమగ్రీకరించడమే తమ జీవికకు ప్రధానవనరు గావించుకునే" బృందం వీరని ఎత్తిపొడుస్తాడుకూడ.[8] ఇంకా, కమ్యూనిస్టు ప్రణాళిక లోనైతే ఈ మేధావులు బూర్జువా వర్గపు 'కూలి మనుషులు (వేతన శ్రామికులు)' గా, కాని అధోకార్మికులు వేతనశ్రామికులైన అర్థంలోకాక అందుకు స్పష్టంగా భిన్నమైన అర్థంలో అలా వుంటారని అంటాడు మార్క్స్‌. అయితే అదే సమయంలో తమ వర్గ నేపథ్యాలు ఏమైనా, కొంతమంది మేధావులైతే సమాజానికి సంబంధించిన కనీసం కొన్ని విషయాలకు సంబంధించైనా (లేక కోణాలగురించైనా) వస్తుగత మదింపుకు (objective assessment – ఒక విధమైన నిష్పాక్షిక భౌతిక అంచనాకు) రాగలిగారనికూడ గుర్తించకపోలేదాయన. ప్రత్యేకించి, రికార్డోలాంటి ప్రామాణిక (లేక సాంప్రదాయిక - classical) అర్థశాస్త్రజ్ఞులు లేదా బ్రిటిషు ఫాక్టరీ ఇన్‌స్పెక్టర్లలాంటివాళ్లు యిలాంటి భౌతికపరిశీలనా దృక్పథం కలిగివుండినారని పేర్కొంటాడు కూడ.
మేధావులు (బుద్ధిజీవులు) ' భావజాలపర వర్గాలు' అంటూ మార్క్స్‌ అతి తరచూ ప్రస్తావించడం గమనిస్తే, ఆయన కొన్ని సార్లు ఆ పదాన్ని ఏదైనా ఒక బృందానికి ఉత్పత్తి విధానంలో వుండే స్థితితో నిమిత్తం లేకుండా వాడాడని స్పష్టమౌతుంది. ఉదాహరణకు, 'చిన్న వర్తకవ్యాపారులు, దుకాణదారులు, చేతివృత్తిదారులు, రైతుల' తో కూడుకున్న ఒక ' దిగువ మధ్యతరగతి వర్గం' గురించికూడ మార్క్స్‌ [ఒక చోట] ప్రస్తావించివున్నాడు.[9] అలాగే బ్రిటన్‌లోని 'పాలక వర్గాల' నుగురించి కూడ మాట్లాడడమేగాక, విత్త పెట్టుబడి దారులు, పారిశ్రామిక పెట్టుబడిదారులు "రెండు స్పష్టంగా వేరైన వర్గాలు" అని చెప్పేంతదాకాకూడ వెళ్తాడు మార్క్స్‌. ఇక సాంఘిక కొలబద్ద మరో కొసన అలగా కార్మిక వర్గం అని మార్క్స్‌ పేర్కొన్న వర్గం వుంది. మార్క్స్‌ తన ఫ్రాన్స్‌లో వర్గ పోరాటాలు లో, "అన్ని రకాల దొంగలు, నేరస్తులను కొత్తగాచేర్చుకొనే (భర్తీ చేసుకొనే – రిక్రూటు చేసుకొనే) వనరుగా వుండేవాళ్లు, సమాజం పారేసే [ఎంగిలి] తునకలు తిని బతికే, ఒక నిశ్చితమైన వృత్తి అంటూ లేనివాళ్లు, తిరుగుబోతులు, కుదురుగా ఒక ఇల్లూ సంసారమంటూ లేనివాళ్లు"[10] ఈ అలగా కార్మికవర్గమని వర్ణించి చెబుతాడు. వేరే మాటల్లో (మరో విధంగా) చెబితే, ఈ అలగాకార్మిక వర్గం సమాజంనుండి తప్పుకుతిరిగే వాళ్లు (dropouts of society), సమాజాభివృద్ధిలో ప్రయోజనం, ఆసక్తి అంటూ లేనివాళ్లు, కనుక నిర్వర్తించడానికి చారిత్రక పాత్ర ఏదీ లేని వాళ్లన్న మాట. వాళ్లు తమ సేవలు బూర్జువావర్గానికి అమ్ముకొనడానికి సుముఖంగా వుంటారుగనుక అప్పుడప్పుడూ వాళ్లు అభివృద్ధినిరోధకులుగా అయివుండవచ్చుకూడ.
ఈ విధంగా వర్గానికి మార్క్స్‌ యిచ్చే నిర్వచనం, ఆయన ఆలోచనల వికాసక్రమంతోబాటేగాక ఒకే [ఆలోచనాస్థాయి] కాలంలోకూడ ఎంతో హెచ్చుగా మారిపోతూండడం గమనిస్తాము. తన కాలపు వాడుకకు అనుగుణంగా మార్క్స్‌ ఈ [వర్గం అనే] పదాన్ని తరచూ ఒక ముఠా లేక బృందం అనే అర్థంలోకూడ ఉపయోగించాడు.
అయినప్పటికీ రెండు సాధారణ అంశాలు ఎత్తిచూపవచ్చు: మొదటగా, సమాజాన్ని పెట్టిబడిదారులు, అధోకార్మికవర్గం, భూయజమానులు అనే [వర్గాలుగా] త్రిపక్షీయ విభజన గావించడం మనకు మార్క్స్‌ [రచనల్లో] అతి సాధారణంగా కనిపిస్తుంది. అయితే తాను ఏదో ఒక స్థావర [static – నిశ్చల] సమాజాన్ని విశ్లేషిస్తున్నట్లు మార్క్స్‌ ఎన్నడూ భావించుకోడు; నిజానికి ఆయన కొన్నిసార్లు ' వర్గాలు' అంటూ ప్రస్తావించి చెప్పిన అనేక బృందాలు వేవేగంగా అంతరించి (అదృశ్యమై) పోతూండినాయికూడ. [ఉదాహరణకు] పెటీ బూర్జూవాలు, రైతాంగం ఈ విధమైన స్థితిలో వుండినాయి. అలాగే మార్క్స్‌ ప్రకారమైతే, భూయాజమాన్య వర్గంకూడ విచ్ఛిన్నమై అంతిమంగా యిటు పెట్టుబడిదారీ వర్గంలోనో లేక అటు అధోకార్మికవర్గంలోనో [వికసిత పెట్టుబడిదారీ సమాజంలో వుండే ఈ రెండే రెండు వర్గాల్లో దేనిలో ఒకదానిలో] కలిసిపోకతప్పదు.
రెండవదేమంటే, వర్గంగురించిన తన నిర్వచనంలో మార్క్స్‌ ఒక గతిశీల, స్వీయమానసిక [లేక కర్తృపర? - subjective] మూలాంశాన్ని కూడ చొప్పించివున్నాడు. తానొక వర్గమనే స్వీయ చైతన్యం కలిగివున్నప్పుడే ఏదైనా వర్గం ఉనికిలో వుంటుంది అంటాడు; అంటే దీని అంతరార్థం ఆ బృందం వేరొక సాంఘిక బృందంతో సామాన్య (బృందసభ్యులందరి ఉమ్మడి) వైరం కలిగి వుండాల్సి వస్తుందన్నమాట. తన సొంత ప్రయోజనాలు యితర వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా వున్నట్లే ఏదైనా వర్గం ఎప్పుడూ ఆలోచిస్తూంటుంది; అలాంటి [ప్రత్యేక (విరుద్ధ)] ప్రయోజనాల [సాధన] కోసం పోరాడడానికి దాన్ని [ఆ వర్గాన్ని] సంఘటితంగావించాల్సి వుంటుందికూడ. కనుక, మార్క్స్‌ కొన్నిసార్లు, పెట్టుబడిదారులైనా ఒక వర్గంగా ఏర్పడివున్నారా లేరా అని తటపటాయిస్తూండినాడు కూడ. మార్క్స్‌ తన జర్మన్‌ భావజాలం లో వాళ్లను [పెట్టుబడిదారులను] గురించి మాట్లాడుతూ, " ఈ ప్రత్యేక (వేరు వేరుగా వుండే) (పెట్టుబడిదారీ) వ్యక్తులంతా మరొక వర్గంతో తామొక ఉమ్మడి పోరాటం (యుద్ధం) చేయాల్సివచ్చేంత మేరకు ఒక వర్గంగా ఏర్పడివుంటారు [అని చెప్పవచ్చు]; అలా లేనప్పుడు వాళ్లు ఒకరితో మరొకరు పోటీదారులుగా పరస్పర శత్రు (వైర) స్థితిలో వుంటారు,"[11] అని అంటాడు. మరి అధోకార్మిక వర్గానికీ యిదే వర్తిస్తుంది. తన తత్వశాస్త్ర దారిద్ర్యం లో మార్క్స్‌ ఊహాస్వర్గ (లేక ఊహాజనిత) సోషలిజంగురించి చెబుతూ, 'తానొక వర్గంగా ఏర్పడేందుకు అధో కార్మిక వర్గం ఇంకా తగినంతగా అభివృద్ధి చెందిలేనట్టి' కాలానికి చెందిన విలక్షణత [ఆదర్శ భావన] అదనీ, "పర్యవసానంగా … అప్పటికి అధోకార్మిక వర్గానికీ, బూర్జువా వర్గానికీ మధ్య పోరాటానికే యింకా ఒక రాజకీయ స్వభావమంటూ వుండదు," అనీ వివరిస్తాడు. [ఇంకాకూడ,] అదే రచనలో అధోకార్మికవర్గంగురించి, "ఈ జనం యిప్పటికే పెట్టుబడికి విరుద్ధమైన ఒక వర్గంగావున్నా, యింకా తమకై తాము [దానికై అదిగా] ఒక వర్గంగా ఏర్పడి [అయితే] లేరు,"[12] అని చెబుతాడు. పోతే, కమ్యూనిస్టు ప్రణాళిక లోనైతే, " ఒక వర్గంగా, పర్యవసానంగా ఒక రాజకీయ పక్షంగా, అధోకార్మికుల ఈ సంఘటన (నిర్మాణం), అసలుకు కార్మికులనడుమే చెలరేగే పోటీ చేత నిరంతరం (సదా) తల్లక్రిందులు చేయబడుతూ వస్తూంది,"[13] అని కూడ అంటాడు మార్క్స్‌. ఇంకా, 1866 అంత ఆలస్యంగా (లేటుగా) కూడ మార్క్స్‌, అంతర్జాతీయ సంస్థ (ఇంటర్నేషనల్‌) "కార్మికుల్ని ఒక వర్గంగా సంఘటిత పరచడానికి (నిర్మాణం గావించడానికి) [సాధనమైన] ఒక నిర్మాణం [ఆర్గనైజేషన్‌],"[14] అని పేర్కొంటాడు. మార్క్స్‌ తన లూయీ బోనపార్టీ యొక్క పద్దెనిమిదవ బ్రుమైర్‌ గ్రంథంలో ఫ్రెంచి రైతాంగాన్ని వర్ణించేటప్పుడు ఈ అంశాన్ని అత్యంత స్పష్టంగా వివరించిచెబుతాడు [యిలా]:
"తమ జీవితవిధానం, తమ ప్రయోజనాలు, తమ సంస్కృతుల్ని యితర వర్గాలకు సంబంధించినవాటినుండి [అంటే వాటి జీవిత విధానం, ప్రయోజనాలు, సంస్కృతులనుండి] వేర్పాటుగావించే ఆర్థిక మనుగడ పరిస్థితుల్లో లక్షలాది కుటుంబాలు బతికేంత మేరకు అవి ఒక వర్గంగా ఏర్పడి వుంటాయి [అనవచ్చు]. అయితే ఆ చిన్న కమతాల రైతులమధ్య కేవలం ఒక స్థానిక సంబంధంమట్టుకే వుండి, వాళ్ల ప్రయోజనాల మధ్యనుండే సామాన్యత్వం (identity of their interests) వాళ్లమధ్య ఒక సముదాయాని ఏర్పాటు చేయ [లే] కుండా, ఒక జాతీయ బంధాన్ని సృష్టించ [లే] కుండా, ఒక రాజకీయ నిర్మాణాన్ని దేన్నీ ఏర్పాటుచేయ [లే] కుండా వుండేంత మేరకు వాళ్లు ఒక వర్గంగా ఏర్పడి వుండరు. పర్యవసానంగా వాళ్లు తమ సొంత పేరిట తమ వర్గ ప్రయోజనాన్ని అమలుచేయలేని అశక్తులై వుంటారు …"[15]
ఈ సందర్భంగా [ఇందుకు సంబంధించి] మనం గమనించ వలిసిందేమంటే మార్క్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో కార్మికులకు పితృభూమి [లేక మాతృభూమి] అంటూ ఏదీ లేదని ఉద్ఘాటించినప్పటికీ మళ్లీ అందులోనే ఆయన 'జాతీయ వర్గం' అనే భావనను కూడ ఉపయోగిస్తాడు. ఇంకాకూడ, అదీ కమ్యూనిస్టు ప్రణాళిక లోనే, "అధోకార్మిక వర్గం అన్నింటికంటే మొదటగా రాజకీయ ఔన్నత్యం (political supremacy) సంపాదించుకోవాలి కాబట్టి, జాతికే నాయకత్వ వర్గంగా ఎదగాల్సి వుంటుందికాబట్టి, తన్ను తాను జాతిగా ఏర్పరుచుకోవాల్సి వుంటుందికాబట్టి, అది ఆ మేరకు స్వయంగా జాతీయమైనదిగా (జాతీయవర్గంగా) వుంటుంది," అనికూడ అంటాడు.[16]
ఈ విధంగా ' వర్గం' అనే పదాన్ని ప్రయోగించడానికి మార్క్స్‌ అనేక ప్రమాణాలు వాడాడని, అవి (ఆ ప్రమాణాలు) అన్నీ అన్ని సమయాల్లో అన్వయించలేదనీ గమనిస్తాము. వ్యాప్తిలోవున్న ఉత్పత్తివిధానంతో ఏదైనా బృందానికి వుండే సంబంధం, తానొక వర్గమనే స్వీయచైతన్యం కలిగి వుండడంతోబాటు దానికి అనుబంధమైన రాజకీయ నిర్మాణంకూడ ఆ బృందం కలిగివుండడం వాటిల్లో రెండు ముఖ్యమైన ప్రమాణాలు అని తెలుసుకొంటాము.
ఆధునిక సమాజంలో వర్గాల ఉనికిని లేక వర్గపోరాటపు వాస్తవికతను తాను కనుగొన్నానని చెప్పుకొని ఖ్యాతిబడయడానికి మార్క్స్‌ నిర్ద్వంద్వంగా నిరాకరించాడు. బూ్ర్జువా చరిత్రకారులు, అర్థశాస్త్రవేత్తలు ఆ పని ఎప్పుడో చేసివున్నారు. అయితే ఈ వర్గాల ఉనికి ఉత్పత్తి వికాస క్రమంలో కొన్ని ప్రత్యేక చారిత్రక దశలకు లంకె పడివుంటుందనీ, ఈ వర్గ పోరాటం [అనివార్యంగా] కార్మికవర్గ నియంతృత్వానికి, [తద్వారా] ఒక వర్గరహిత సమాజానికీ దారి తీస్తుందనీ[17] చూపించగలడమే తన భావనల్లో వినూత్నమైన అంశమని మార్క్స్‌ భావిస్తాడు [భావించి చెబుతాడు].
[1] ఎంపిక చేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 169.
[2] పోల్చి చూడు: ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్ రచనలు, పు. 506.
[3] ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 222.
[4] ఈ విషయమై మామూలుగా ఉల్లేఖించబడే పెట్టుబడి గ్రంథంలోని రచనాభాగంలో మాత్రం, అందుకు సంబంధించిన మరింత విస్తృత సందర్భాన్ని బట్టి స్పష్టమయేటట్లు, కేవలం అంతకంతకూ అధికమయ్యే నిరుద్యోగ ప్రజారాశిగురించి మాత్రమే ప్రస్తావించబడుతుంది.
[5] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 259.
[6] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. …
[7] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 561.
[8] జర్మన్‌ భావజాలం, పు. 61.
[9] కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 229.
[10] కార్ల్‌ మార్క్స్‌, ఫ్రాన్స్‌లో వర్గపోరాటాలు, మార్క్స్‌-ఏంగెల్స్‌ల ఎంపిక చేయబడ్డ రచనలు, సం. 1, పు. 155.
[11] జర్మన్‌ భావజాలం, పు. 48 నుండీ.
[12] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 212, 214.
[13] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 228.
[14] కుగెల్‌మన్‌కు మార్క్స్‌ లేఖ, మార్క్స్‌ ఏంగెల్స్‌ల రచనలు, సం. 31, పు. 529.
[15] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 317 నుండీ.
[16] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 235.
[17] పోల్చి చూడు: కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 341.