Wednesday, July 2, 2008

వర్గం -2

వర్గం - 2
మూలపాఠాలు (TEXTS)

ఒక సమూల విప్లవం గురించిగానీ, లేక సార్వత్రిక మానవ విమోచనగురించిగానీ జర్మనీ ఊహాస్వర్గ స్వప్నం ఏదీ కనలేదు; ఆ ఊహాస్వప్నమంతా ఒక పాక్షిక, శుద్ధ రాజకీయ విప్లవంగురించి మాత్రమే. ఇలాంటి విప్లవం [పాత] కట్టడాన్ని సమూలంగా ధ్వంసం చేసివేయదు; ఆ పాతకట్టడపు ఆధారస్తంభాలను అలాగే నిలిపి వుంచుతుంది. ఇలాంటి పాక్షిక, శుద్ధ రాజకీయ విప్లవానికి ప్రాతిపదిక ఏమిటి? పౌర సమాజంలో ఒక భాగం దాన్నది విముక్తి గావించుకుని, ఒక సార్వత్రిక ఆధిపత్యం సాధిస్తుందని [అలా సాధించడానికి గాను?], ఏదైనా ఒక ప్రత్యేక వర్గం దాని ప్రత్యేక పరిస్థితినుండి సమాజపు సాధారణ విమోచనను సాధించ పూనుకుంటుంది. ఈ వర్గం యావత్‌ సమాజాన్నీ విముక్తి [స్వతంత్రం] గావిస్తుంది గాని, అది [యిలా విముక్తి చే్యడం] ఆ సమాజం మొత్తమూ ఈ వర్గం వున్న పరిస్థితిలోనే వున్నదనీ, యింకా అది [కొన్ని లాభాల్ని,] ఉదాహరణకు, డబ్బూ, విద్యా కలిగి వుంటుంది [వుండగలదు] లేక వాటిని తేలిగ్గా సముపార్జించుకో గలదనే ముందుఊహ (presupposition) పై ఆధారపడి మాత్రమే.
పౌర సమాజంలో ఏ వర్గమైనాగానీ ఈ [విమోచక] పాత్రను దానిలో అదిగానూ, యింకా సాధారణ ప్రజానీకంలోనూ ఒక సముత్సాహిత సమయాన్ని లేక ఉద్రేక స్థితిని [a moment of enthusiasm] రెచ్చగొట్టకుండా నైతే నిర్వర్తించలేదు. ఆ వర్గం యావత్‌ సమాజంతో సోదరభావంతో మెలగుతూ, అది స్వయంగా ఆ సమాజంలో కరిగిపోయే [మహత్తర] ఘడియ అది. ఆ వర్గం [ఆ సమయంలో] తన్ను తాను సమాజంతో మమేకంగావించుకొంటుంది; అలాగే సమాజమంతాకూడ ఆ వర్గం తన సాధారణ ప్రతినిధి అని అనుభూతి చెందడమేగాక ఆ వర్గాన్ని అలా గుర్తిస్తుందికూడ. ఆ వర్గం అప్పుడు సమాజపు నిజమైన సాంఘిక అధిపతి [పెద్ద] గా, సమాజపు గుండె [హృదయం] గా వుంటుంది; కనుక ఆ వర్గపు హక్కులు, స్వామ్యాధికారాలు [rights and claims] సమాజం మొత్తపు హక్కులు, స్వామ్యాధికారాలుగా వుంటాయి. ఏదైనా ప్రత్యేక వర్గం తన సాధారణ ఔన్నత్యం [general supremacy] న్యాయసమ్మతమైందని నిరూపించుకోవాలంటే అది సమాజపు సాధారణ హక్కుల పేరిటమాత్రమే సాధ్యంకాగలదు. విమోచనకర్తగా ఈ స్థితిని సంపాదించుకొనడానికి, తద్వారా తన సొంత క్షేత్ర [వర్గ మరియు సన్నిహిత బృందాల] ప్రయోజనాలకోసమని సమాజపు సకల క్షేత్రాల్నీ [తనకనుకూలంగా] వినియోగించుకోవాలంటే, కేవలం విప్లవ శక్త్యుత్సాహాలూ, బౌద్ధిక [మేధో] ఆత్మ విశ్వాసం వున్నంత మాత్రంలో సరిపోదు. ప్రజా విప్లవమూ, పౌరసమాజపు ఏదైనా ఒక ప్రత్యేక వర్గపు విమోచనా రెండూ ఏకకాలంలో సంభవించాలంటే, మొత్తం సమాజపు ప్రతినిధిగా ఒక వర్గం నిలవగలగాలంటే, అందుకుగాను యావత్‌ సమాజపు లోటుపాట్లన్నీ ఇంకో మరే వర్గంలోనైనా కేంద్రీకరించబడి వుండాల్సివస్తుంది; ఆ మరో వర్గం సార్వత్రిక అపనిందకు గురై సమాజపు అన్ని పరిమితుల [నైతిక ఆంక్షల] కు లోనై [ఏవగించుకోబడుతూ] వుండాల్సివుంటుంది.. ఒక ప్రత్యేక సాంఘిక క్షేత్రం మొత్తం సమాజపు కుఖ్యాత నేరభరిత క్షేత్రంగా పరిగణించబడాల్సి వుంటుంది; అలాంటప్పుడే, ఆ క్షేత్రపు విమోచన ఒక సార్వత్రిక స్వీయవిమోచనగా గోచరించగలదు. అంటే, ఏదైనా ఒక వర్గం సర్వశ్రేష్టమైన విమోచక వర్గంగా గోచరించాలంటే, ఏదైనా యింకో వర్గం, అందుకు తలకిందులుగా, దోపిడీ, పీడనల కంతటికీ ఆలవాలమైన వర్గంగా అగుపించాల్సి వుంటుంది. ఫ్రెంచి కులీన ప్రభువర్గం, మతగురు వర్గాల సార్వత్రిక రుణాత్మక [వ్యతిరేక ప్రభావపు] ప్రాధాన్యం, వాటికి అత్యంత దగ్గరగావుంటూనే వాటికి విరుద్ధంగా నిలిచిన మరో వర్గపు – అంటే, బూర్జువా వర్గపు – సార్వత్రిక ధనాత్మక (నిశ్చయాత్మక) ప్రాముఖ్యతను నిర్ణయించింది [అని గమనించాలి]. - హెగెల్‌యొక్క హక్కుసంబంధ తత్వచింతనకు పరిచయం (1844), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 71.
కనుక ఒక జర్మన్‌ విమోచనకు నిజమైన అవకాశం (సాధ్యత) ఎక్కడ వుంది?
మా జవాబు: సమూలమార్పువాద సంకెళ్ల (radical chains – తీవ్ర వాద బంధాలు?) తో కూడుకున్న ఒక వర్గం ఏర్పాటులో [అనేదే మా జవాబు] – ఆ వర్గం పౌర సమాజంలోనే వుంటుంది కాని పౌర సమాజానికి చెందివుండే వర్గం అయివుండదు; అదొక సాంఘిక బృందమే గాని నిజానికి అది సకల సాంఘిక బృందాల విచ్ఛిత్తి పరిణామం; తన సార్వత్రిక బరువుబాధల మూలంగా ఒక సార్వత్రిక స్వభావాన్ని సంతరించుకొనివున్న ఒక క్షేత్రానికి చెందివుంటుందది; అది ఏదో ఒక ప్రత్యేక అన్యాయానికి గురయివుంటుందన్నట్లుగాక, సాధారణంగా సమస్త అన్యాయానికీ గురయ్యే కర్మవస్తువుగా వుంటుంది గాబట్టి అది ఏదో ఒక ప్రత్యేక హక్కు కోసమే ఆరాటం చేస్తుందన్నట్లుండదు. ఈ వర్గం మరెంతమాత్రమూ ఒక చారిత్రక హోదా [అంతస్తు - status] కోసంకాక, కేవలం ఒక మానవీయ హోదా కోసమే కృషి చేస్తుంది [గొంతెత్తుతుంది]. జర్మన్‌ రాజకీయ రాజ్యతంత్ర పర్యవసానాలకు ఏకపక్షీయ ప్రతిఘటనగామాత్రమేనైతే అది వుండదు; ఆ రాజ్యతంత్రపు ముందుఊహలన్నింటికీ పూర్తి వ్యతిరేకతతో వుంటుంది. అంతిమంగా, తన్ను తాను సమాజంలోని యితర అన్ని క్షేత్రాలనుండీ విముక్తి చేసుకోకుండా, తద్వారా స్వయంగా [అసలుకు] ఈ యితర క్షేత్రాలన్నింటినీ విముక్తం గావించకుండా తన్ను తాను సైతం విమోచనగావించుకోలేని క్షేత్రం అది. ఒక్క మాటలో, అది మానవజాతికే సంపూర్ణ విమోచన. మొత్తం సమాజం ఒక ప్రత్యేక వర్గంగా విచ్ఛిన్నమవడమే అధోకార్మిక వర్గ ఆవిర్భావం. - హెగెల్‌యొక్క హక్కుసంబంధ తత్వచింతనపై ఒక విమర్శ (1844), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 72 నుండీ.
ప్రతి యుగంలోనూ పాలక వర్గం భావనలే పాలక భావనలుగా కూడ వుంటాయి, అంటే సమాజపు భౌతిక (పాదార్థిక) శక్తిని పాలించే వర్గమే, అదే సమయంలో, దాని (సమాజపు) మేధో (బౌద్ధిక) శక్తినికూడ పాలిస్తూంటుంది. పాదార్థిక (భౌతిక) ఉత్పత్తి సాధనాలు దేని అందుబాటులో వుంటాయో ఆ వర్గం అదే సమయంలో మానసిక ఉత్పత్తి సాధనాలపైకూడ అదుపాజ్ఞలు కలిగివుంటుంది; అందువల్ల, సాధారణంగా చెబితే, మానసికోత్పత్తి సాధనాలు లేని వాళ్ల భావనలు ఆ వర్గానికి అధీనమై వుంటాయి. పాలక భావనలంటే ఆధిపత్యంలోవుండే పాదార్థిక (భౌతిక) సంబంధాల భావాత్మక వ్యక్తీకరణ తప్ప మరేమీ కావు; అంటే భావనలుగా చిక్కించుకోబడే ఆధిపత్యంలోని భౌతిక సంబంధాలు అవన్నమాట. కనుక, అవి ఒక వర్గాన్ని పాలక వర్గంగా రూపొందించే సంబంధాల భావనాపర వ్యక్తీకరణలై వుంటాయి; అందుచేత అవి ఆ వర్గపు ఆధిపత్యానికి సంబంధించిన భావనలు అని చెప్పవచ్చు. పాలక వర్గాన్ని ఏర్పరిచే వ్యక్తులు మిగతా యితర విషయాలతోబాటు చైతన్యంకూడ కలిగివుంటారు; కనుక వాళ్లు ఆలోచిస్తుంటారు. అందుచేత, వాళ్లు ఒక వర్గంగా పరిపాలిస్తూ, ఒక యుగపు విస్తృతినీ, పరిథినీ నిర్ణయిస్తూండేంతమేరకు, వాళ్లు ఆ పనిని ఆ మొత్తం వరసవ్యాప్తిలో నిర్వర్తిస్తూంటారని, కనుక యితర అంశాలకు తోడుగా చింతకులుగా- భావ స్రష్టలుగా- కూడ పాలిస్తూంటారని, తమ యుగపు భావనల ఉత్పత్తి-పంపిణీల్ని క్రమబద్ధం చేస్తుంటారని, అందువల్ల వాళ్ల భావనలు ఆ యుగపు పాలక భావనలై వుంటాయనేది స్వయంస్పష్టంగానే వుంది. - జర్మన్‌ భావజాలం (1845-46), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 176.
మధ్య యుగాల్లో ప్రతి పట్టణంలోని పౌరులూ తమ [ధన మాన] ప్రాణ రక్షణకుగాను భూస్వామ్యకులీన ప్రభువర్గానికి వ్యతిరేకంగా ఐక్యం కావలిసి వచ్చేది. వర్తకవ్యాపారాల విస్తరణ, సమాచార సంబంధాల ఏర్పాటులతో వేర్వేరు [గా వుండిన] పట్టణాలు [తమ లాగే] ఒకే శత్రువుతో అవే పోరాటప్రయోజనాలు ఉద్ఘాటించి వున్న యితర పట్టణాలగురించి తెలుసుకోవడానికి దారి తీసింది [వీలు పడింది]. అనేక స్థానిక బర్గర్ల (పురవాసుల) సంఘాల [కార్పొరేషన్‌ల] నుండి ఒక బర్గర్ల వర్గం [బూర్జువా వర్గం] ఆవిర్భవించింది – కాని, అది చాల మెల్లమెల్లగా మాత్రమే. సమాజంలో అప్పట్లో ఉనికిలో వుండిన సంబంధాలు, వాటిచే నిర్ణయింపబడే ఉత్పత్తి విధానానికి ఈ బర్గర్లు విరుద్ధంగా వుండడంచేత, విడి విడి బర్గర్ల జీవన పరిస్థితులు [క్రమక్రమంగా] వాళ్లందరికీ ఉమ్మడిగావుంటూనే, అదే సమయంలో ప్రతి వ్యష్టి బర్గరుకూ స్వతంత్రంగావుండే [సామాన్య] పరిస్థితులుగా రూపొందాయి. ఆ [సామాన్య బర్గర్ల వర్గ] పరిస్థితుల్ని, తమంత తామే ఫ్యూడల్‌ బంధనాలనుండి తెగతెంపులు చేసుకుని స్వతంత్రమైన మేరకు స్వయంగా బర్గర్లే సృష్టించుకొన్నారు; అయితే, అప్పట్లో ఉనికిలోవున్న ఫ్యూడల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా వుండే వారి శత్రుత్వం వారి అస్తిత్వాన్ని నిర్దేశించినంత మేరకు ఆ పరిస్థితులే వాళ్లను [బర్గర్లను] సృష్టించాయని చెప్పుకోవాలి. విడి విడి పట్టణాలు సంఘాలు-సమాఖ్యలుగా ఏర్పడ్డం మొదలైన కొద్దీ, ఈ ఉమ్మడి [సామాన్య] పరిస్థితులు వర్గ పరిస్థితులుగా రూపొందాయి. ఒకే విధమైన పరిస్థితులు, ఒకే విధమైన వైరుధ్యం, ఒకే విధమైన ప్రయోజనాలు ప్రతిచోటా అనివార్యంగా [అవశ్యంగా] మొత్తంమీద ఒకేలా వుండే ఆచారవ్యవహారాలను ఆహ్వానించాయి. అసలుకు బూర్జువా వర్గమే, తన యిలాంటి పరిస్థితుల్లో, అతి క్రమక్రమేపీగా మాత్రమే, అభివృద్ధి చెందుతుంది; [మొదట్లోనైతే] శ్రమ విభజన ప్రకారం నానా ముఠాలుగా చీలిపోతూంటుంది; అంతిమంగా మనుగడలోవున్న [తనకు తటస్థించే] సకల ఆస్తిపర వర్గాలనూ, తనకు కనిపించిన ఆస్తులన్నీ పారిశ్రామిక లేక వాణిజ్య పెట్టుబడిగా పరివర్తన చెందే మోతాదులో, తనలోకి పీల్చివేసుకుంటుంది; [అదే సమయంలో అంతకుపూర్వపు ఆస్తిలేని వాళ్లలో మెజారిటీని, అలాగే యిదివరకటి ఆస్తిపర వర్గాలో కొంత భాగాన్ని ఒక కొత్త వర్గంగా – అధోకార్మిక వర్గంగా రూపొందిస్తుంది ఈ బూర్జువా వర్గం]. ఇంకో వర్గంతో ఉమ్మడి పోరాటం (యుద్ధం) చేయవల్సివచ్చేంతమేరకే విడి విడిగావుండే వ్యక్తులు ఒక వర్గంగా ఏర్పడివుంటారు; అలా లేనప్పుడు వాళ్లు పోటీదారులుగా పరస్పరం శత్రుస్థితిలో వుంటారు. కాగా, మరోవైపున, ఈ వర్గం దానివంతుకు విడి వ్యక్తులకు అతీతంగా, వ్యతిరేకంగాసైతం, ఒక స్వతంత్ర అస్తిత్వాన్ని సంతరించుకొంటుంది. అందుమూలంగా ఈ విడి వ్యక్తులు తమ అస్తిత్వ పరిస్థితులు పూర్వభాగ్యనిర్ణీతమైనట్లు కనుగొంటారు. కనుక తమ జీవనస్థితీ, తమ వ్యక్తిగత వికాసమూ రెండూ వాళ్ల [తమ] వర్గంచే తమకు ప్రదానం చేయబడినట్లు కనుగొంటారు; తాము ఆ [తమ] వర్గంలో సంలీనం గావించబడుతారు. విడి వ్యక్తులు శ్రమ విభజనకు అధీనమౌతూండే పరిణామంలాంటిదే యిదికూడ. కనుక యిదికూడ ప్రైవేటు ఆస్తి రద్దుచేత, [పర్యవసానంగా సంభవించే] స్వయంగా శ్రమ రద్దు చేత మాత్రమే తొలగింపబడగలదు. పోతే యిలా వ్యక్తులు ఒక వర్గంలో సంలీనం చేయబడడం అనేది వాళ్లు నానా రకాల భావనలు, వగైరాకు అధీనం అయేట్లు ఎలా చేస్తుందో మనం యిప్పటికే అనేక సార్లు సూచించివున్నాము. - జర్మన్‌ భావజాలం (1845-46), పు. 69 నుండీ.
ఉత్పాదక శక్తుల అభివృద్ధిక్రమంలో అప్పటికి ఉనికిలోవుండే సంబంధాలలో కేవలం చెరుపును మాత్రమే కలగజేసే, మరెంత మాత్రం ఉత్పాదకంకాక కేవలం విధ్వంసకంగామట్టుకే వుండే ఉత్పాదక శక్తులు, పరస్పర సంబంధ సాధనాలు [యంత్రాలూ, డబ్బూ] అస్తిత్వంలోకి వచ్చే ఒక [క్లిష్ట] దశకూడ వస్తుంది. ఇక దీనికి సంబంధించి సమాజంలోని సానుకూలతల్ని వేటినీ ఆనందించ లేని, కాని సమాజపు బరువుబాధలన్నింటినీ భరించవల్సి వచ్చే ఒక వర్గం, సమాజంనుండి బహిష్కృతులై, యితర అన్ని వర్గాలతోనూ అత్యంత నిర్ణాయక శత్రుత్వం (వైరం) లోనికి బలవంతంగా నెట్టబడే ఒక వర్గం ఆవిర్భావం ఆవశ్యకమౌతుంది. సమాజసభ్యులందరిలో అత్యధిక సంఖ్యాకుల్ని (మెజారిటీని) కలిగి వుండే ఒక వర్గం, దేనినుండైతే ఒక మౌలిక విప్లవ ఆవశ్యకతను గురించి చైతన్యం, అంటే కమ్యూనిస్టు చైతన్యం ప్రసరిస్తుందో అలాంటి వర్గ ఆవిర్భావం ఆహ్వానింపబడుతుంది. అయితే, ఈ [మౌలిక విప్లవ ఆవశ్యకతా] కమ్యూనిస్టు చైతన్యం ఇతర వర్గాలలోకూడ, ఈ [అధోకార్మిక] వర్గం పరిస్థితిగురించి లోతైన యోచన [ధ్యానం] వల్ల, తలెత్తవచ్చనుకోండి. - జర్మన్‌ భావజాలం (1845-46), కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 179.
వర్గాలమధ్య వైరాల పునాదిపై నెలకొన్న ప్రతి సమాజంలోనూ పీడిత (అణిచివేయబడ్డ) వర్గం ఒక కీలక షరాస్థితి అంశంగా వుంటుంది. అందువల్ల ఆ పీడిత వర్గం విమోచన అంటే ఒక నూతన సమాజం సృష్టి అనే అంతరార్థం అవశ్యంగా వస్తుంది. పీడిత వర్గం తన్నుతాను విముక్తి చేసుకోవాలంటే ఆవరకే సముపార్జించుకోబడ్డ ఉత్పాదక శక్తులు, అప్పటికి ఉనికిలోవున్న సాంఘిక సంబంధాలు ఒకదాని సరసన మరొకటి [అనుగుణంగా] మనలేని పరిస్థితి ఆవశ్యకమౌతుంది. అన్ని ఉత్పత్తి పరికరాల్లోకీ విప్లవకర వర్గమే స్వయంగా అత్యంత మహత్తర ఉత్పాదక శక్తి [వంతం] గా వుంటుంది. విప్లవకర మూలకాంశాలు ఒక వర్గంగా సంఘటితం అయ్యాయంటే [లేక అలా కావాలంటే] అప్పటికే పాత సమాజం వక్షంలో అంకురించ గల ఉత్పాదక శక్తులన్నీ మనివుండివుంటాయని ఊహించవచ్చు [లేక అలా మనివుంటేనే అది సాధ్యం అనే అర్థంకూడ రావచ్చు].
మరి దీనర్థం పాత సమాజపు పతనం తర్వాత ఒక కొత్త రాజకీయాధికారం తీసుకొచ్చే ఒక కొత్త వర్గాధిపత్యం వస్తుందనా? [కానే] కాదు.
కార్మిక వర్గ విమోచనకు [వలసిన] షరాస్థితి ప్రతి వర్గమూ రద్దు కావాల్సిన [లేక రద్దు చేయబడాల్సిన] స్థితే. ఎలాగైతే [అంతకు పూర్వం] అన్ని యిస్తువగణాలూ (ఎస్టేట్లు), అన్ని అంతస్తులూ (ఆర్డర్లు) రద్దు కావడమనేది బూర్జువా అంతస్తుకు సంబంధించిన మూడవ యిస్తువగణం (థర్డ్‌ ఎస్టేట్‌) యొక్క విమోచనకు వలసిన షరాస్థితిగా వుండిందో, ఇదీ అలాగే.
కార్మిక వర్గం, తన అభివృద్ధి క్రమంలో, పాత పౌర సమాజంస్థానే వర్గాలు, వాటి మధ్యలి వైరాలు లేని ఒక సంఘాన్ని తెచ్చిపెడుతుంది; అప్పుడు రాజకీయాధికారం అని సముచితంగా పిలవబడేదేదైతే వుంటుందో అదికూడ మరెంతమాత్రం ఉనికిలో వుండదు – ఎందుకంటే, ఖచ్చితంగా చెబితే రాజకీయాధికారం అంటే పౌర సమాజంలోని వైరాలకు ఒక అధికారిక వ్యక్తీకరణే గదా.
ఈ మధ్యలో అధోకార్మిక వర్గానికీ, బూర్జువావర్గానికీ మధ్య వుండే వైరం వర్గానికి వ్యతిరేకంగా వర్గం జరిపే పోరాటంగా [అంటే వర్గం అనేదాన్నే రూపుమాపేందుకు వర్గ పోరాటంగా] సాగుతుంది; ఈ పోరాటం ఒక సంపూర్ణ విప్లవంలో దాని అత్యున్నత దశకు [శిఖరాగ్రానికి] చేరుకుంటుంది. అయినా నిజానికి వర్గాల నడుమ విరోధం ప్రాతిపదికన నెలకొన్న ఒక సమాజం చివరకు ఒక పాశవిక వైరుధ్యంలో, కాయానికి వ్యతిరేకంగా కాయం సమర్పించే అదురుదెబ్బగా, తన అంతిమ పరాకాష్టాపరిష్కారం (dénouement) పొందడానికి పయనించడంలో ఆశ్చర్యమేమున్నది?
సాంఘిక వుద్యమం అంటే రాజకీయ వుద్యమం వుండనిది అని అనకు. ఏకకాలంలో సాంఘికంకూడ అయివుండని రాజకీయ వుద్యమం అనేదే ఏదీ వుండదు [అని తెలుసుకో]. [లేదా ప్రతి రాజకీయ వుద్యమమూ అదే సమయంలో సాంఘిక వుద్యమంకూడ అయి వుంటుందని తెలుసుకో.]
వర్గాలూ, వర్గ వైరాలూ మరెంతమాత్రం వుండనటువంటి స్థితిగతుల్లోమాత్రమే [అలాంటి పరిస్థితుల వ్యవస్థలోమాత్రమే] సాంఘిక క్రమపరిణామాలు, రాజకీయ విప్లవాలుగా వుండడం మానుతాయి (social evolutions will cease to be political revolutions). అంతదాకా, సమాజపు ప్రతి సాధారణ పునర్వ్యవస్థీకరణకు పూర్వ సంధ్యలోనూ, సమాజవిజ్ఞానశాస్త్రపు తుదిపలుకు యిదే కాగలదు:
Le combat ou la mort; la lutte sanguinaire ou le néant.C’est ainsi que la question est invinciblement posée.
యుద్ధమో, మరణమో; రక్తదాహ పోరాటమో, అంతిమ శాంతమో; ఇలా వుంటుంది అజేయ పోరాట [యోధుల?] సమస్యంతా!
[ఒక్క మాటలో ' విజయమో, వీరస్వర్గమో! ' అనొచ్చా? – అను.]
- తత్వశాస్త్ర దారిద్ర్యం (1847), పుటలు 214 నుండీ.
ఇంతవరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే.
స్వతంత్రుడూ, బానిసా; కులీనుడూ (patrician), అలగాజనుడూ (plebeian); ప్రభువూ, అర్ధ బానిసా; వృత్తిసంఘ యజమానీ (guild-master), వృత్తిశ్రామికుడూ (journeyman); ఒక్కమాటలో చెబితే, పీడకులూ, పీడితులూ ఎల్లప్పుడూ పరస్పర వైరుధ్యాలతో ఒక్కో సారి ప్రచ్ఛన్నంగానూ, ఒక్కో సారి బాహాటంగానూ మొత్తంమీద ఎడతెగని పోరాటం కొనసాగించారు. చివరకి ఈ పోరాటం ప్రతి సారీ యావత్‌ సమాజపు విప్లవాత్మక పునర్వ్యవస్థీకరణకుగానీ, లేదా సంఘర్షించే వర్గాల ఉమ్మడి వినాశానికిగానీ దారితీసింది.
తొలి చారిత్రక యుగాల్లో మనకు దాదాపు ప్రతి చోటా సమాజం వివిధ శ్రేణుల్లో సంక్లిష్టంగా వ్యవస్థీకృతమై వుండడం, సాంఘిక హోదాల్లో బహుళ తరగతులుండడం గోచరిస్తుంది. పురాతన రోమ్‌లో మనకు కులీనులూ, వీరయోధులూ (Knights), అలగాజనులూ, బానిసలూ కనిపిస్తారు; మధ్యయుగాల్లో మనకు ఫ్యూడల్‌ ప్రభువులూ, ప్రభుదాసులూ (లేక పాళెగాళ్లు - vassals), వృత్తిసంఘ యజమానులూ, వృత్తిశ్రామికులూ, అప్రెంటిసులూ (పనినేర్చుకొనే వాళ్లు, ఉమేజువారు), అర్ధబానిసలూ అగుపిస్తారు. దాదాపు ఈ తరగతులన్నిటిలోనూ మనకు మళ్లీ కింది తరగతులు కనిపిస్తాయి.
ఫ్యూడల్‌ సమాజ శిథిలాలనుండి అంకురించిన ఆధునిక బూర్జువా సమాజం వర్గ వైరాలను రూపుమాప లేదు. పాతవాటి స్థానే కొత్త వర్గాలనూ, కొత్త దోపిడీ, అణచివేతల పరిస్థితుల్నీ, కొత్త పోరాట రూపాలనూ ప్రవేశపెట్టడమే అది చేసిన పని.
అయితే బూర్జువా యుగమైన మన యుగానికి ఈ ఒక విశిష్ట లక్షణం వుంది: అది వర్గ వైరాలను సులభతరం గావించింది. రెండు మహా శత్రు శిబిరాలుగా, నేరుగా ఒకదాన్నొకటి ఎదుర్కొనే రెండు మహా వర్గాలుగా – బూర్జువా వర్గం, అధోకార్మిక వర్గాలుగా సమాజం యావత్తూ అంతకంతకూ అధికంగా చీలిపోతున్నది.
- కమ్యూనిస్టు ప్రణాళిక (1848), కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 222.

కార్మికులు ఒక వర్గంగా, తద్వారా ఒక రాజకీయ పక్షంగా రూపొందే వ్యవస్థీకరణను తిరిగి కార్మికులమధ్యే చెలరేగుతూండే పోటీయే సదా తలకిందులు గావించివేస్తూంటుంది. అయినా ఈ కార్మికుల నిర్మాణం ఎల్లప్పుడూ మరింత సుదృఢంగా, శక్తివంతంగా, బలవత్తరంగా మళ్లీ మళ్లీ తలయెత్తుతూంటుంది. బూర్జువా వర్గంలోనే వుండే చీలికల్ని ఉపయోగించుకొని అది [కార్మికుల వ్యవస్థీకరణ] కార్మికుల నిర్దిష్ట ప్రయోజనాలకు శాసనపరమైన గుర్తింపు లభించేలా వత్తిడి తెస్తుంది. పది గంటల బిల్లు ఇంగ్లండులో ఆమోదించబడింది ఈ విధంగానే.
మొత్తంమీద చూస్తే (Altogether) పాత సమాజంలోని వర్గాల మధ్యని ఘర్షణలు అధోకార్మిక వర్గ వికాసాన్ని అనేక విధాలుగా పెంపొందిస్తాయి. మొదట ప్రభుస్వామ్యంతోనూ, ఆనక పరిశ్రమల అభివృద్ధికి విరుద్ధమైన ప్రయోజనాలు గల ఆ యా బూర్జువా వర్గ తరగతులతోనూ, అన్నివేళలా విదేశీ బూర్జువా వర్గాలతోనూ బూర్జువా వర్గం నిరంతరం యుద్ధం చేస్తూనే వుంటుంది. ఈ యుద్ధాలన్నింటిలోనూకూడ అది అధోకార్మిక వర్గానికి వినతి చేసుకోవాల్సిన, దాని సహాయాన్ని అర్థించవల్సిన స్థితికి నెట్ట బడుతుంది. ఈ విధంగా కార్మిక వర్గాన్ని రాజకీయ రంగస్థలంపైకి లాగుకురావాల్సిన అనివార్య అవసరం దానికి కలుగుతుంది. కనుక స్వయానా బూర్జువా వర్గమే అధోకార్మిక వర్గానికి తన సొంత రాజకీయ పరిజ్ఞానం, సాధారణ విద్యలకు సంబంధించిన అంశాలను సరఫరా చేస్తూంటుంది; అంటే, మరోలా చెబితే, స్వయంగా తనతో (అంటే బూర్జువా వర్గంతో) పోరాడేందుకు వలసిన ఆయుధాలను అది అధోకార్మిక వర్గానికి తానుగానే అందిస్తుంది.
ఇంకా, పరిశ్రమల పురోగమనంతో పాలక వర్గాలకు చెందిన కొన్ని తరగతులు మొత్తంగానే అధోకార్మిక వర్గ స్థాయికి కుంగిపోతాయనీ, లేక కనీసం ఆ తరగతుల అస్తిత్వ పరిస్థితులకే ముప్పు వాటిల్లుతుందనీ మనం ఈ వరకే గమనించాము. మరి ఈ తరగతులుకూడ జ్ఞానబోధ, ప్రగతి-అభ్యుదయాలకు సంబంధించిన తాజా అంశాలను అధోకార్మిక వర్గానికి సరఫరా చేస్తాయి.
చివరగా, వర్గ పోరాటం ఒక నిర్ణయాత్మక దశకు చేరుకున్నప్పుడు, పాలక వర్గంలోనూ, యథార్థానికి పాత సమాజమంతటిలోనూ సాగే విచ్ఛిత్తి క్రమం ఎంతగా ప్రస్ఫుటమైన, ఎంతగా హింసాపూరితమైన రూపం దాలుస్తుందంటే, పాలక వర్గంలో ఒక చిన్న భాగం తన వర్గంతో పూర్తి తెగతెంపులు చేసుకొని విప్లవకర వర్గంతో – అంటే భవిష్యత్తును తన గుప్పిట్లో యిరికించుకుని వుండే వర్గంతో చేతులు కలుపుతుంది. కనుక అంతకు క్రితం ప్రభువర్గంలో ఒక భాగం ఎలాగైతే బూర్జువా వర్గం వైపుకు వెళ్లిపోయిందో, సరిగ్గ అలాగే యిప్పుడు బూర్జువా వర్గంలో ఒక భాగం అధోకార్మిక వర్గం [వైపుకు మళ్లి దాని శ్రేణుల్లో చేరి] పోతుంది. ప్రత్యేకించి, చారిత్రక వుద్యమాన్ని మొత్తంగానూ, సైద్ధాంతికంగానూ అవగాహన చేసుకొనే స్థాయికి ఎదిగిన బూర్జువా సిద్ధాంతవేత్తల్లో ఒక భాగం అధోకార్మిక వర్గం వైపుకు వెళ్లిపోతుంది. [బూర్జువా వర్గానికి ఎదురుబొదురుగా నిల్చుని వున్న వర్గాలన్నిటిలోకీ ఒక్క అధోకార్మిక వర్గంమట్టుకే నిజంగా విప్లవకరమైన వర్గం. ఇతర వర్గాలన్నీ ఆధునిక పరిశ్రమ పురోగమనంతో క్షీణించి, క్షీణించి తుదకు అంతరించి (అదృశ్యమై) పోతాయి. కాగా అధోకార్మికవర్గం (మాత్రం) ఆధునిక పరిశ్రమయొక్క ప్రత్యేకమైన, ప్రధానమైన ఉత్పత్తిఫలంగా (నిలిచి) వుంటుంది.] - కమ్యూనిస్టు ప్రణాళిక, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 228 నుండీ.

No comments: