Wednesday, July 2, 2008

వర్గం

వర్గం - 1

వర్గం
వ్యాఖ్యానం
చరిత్రనుగురించిన మార్క్స్ దృక్పథంలో వర్గాలకు అపార ప్రాధాన్యం వున్నదనేది స్పష్టమే. "ఇంతదాకా వుంటూవచ్చిన సమాజాల చరిత్ర [అంతా] వర్గ పోరాటాల చరిత్రే," అనే పదగుంభనంతో ప్రారంభమౌతుంది [మార్క్స్‌ రాసిన] కమ్యూనిస్టు ప్రణాళిక. మార్క్స్‌ ప్రకారం వర్గాలు సమాజంలోని ప్రాథమిక సాంఘిక బృందాలు, వాటి (ఆ ప్రాథమిక సాంఘిక బృందాల) మధ్య ఘర్షణ ద్వారానే సమాజం, దాని ఆర్థిక ఉపకట్టడంలోని మార్పులకు అనుగుణంగా, వికసిస్తూ వచ్చిందని. ఏదైనా ఒక వర్గం దాని సొంత ప్రయోజనాల్ని మొత్తం సమాజపు ప్రయోజనాలతో మమేకంగా గుర్తించగలిగినప్పుడు విప్లవాలు సంభవిస్తూ వచ్చాయని యిదివరలో (గతంలో) మార్క్స్‌ భావించాడు. జర్మన్‌ భావజాలం లో మార్క్స్‌ యిలా అంటాడు: "ఇదివరకటి పాలకవర్గం స్థానే [అధికారంలోకి] వచ్చే ప్రతి కొత్త వర్గమూ, కేవలం తన లక్ష్యాలను సాధించడానికి గాను, తన సొంత ప్రయోజనాన్ని సమాజసభ్యులందరి ఉమ్మడి ప్రయోజనంగా చిత్రించి చూపాల్సి వస్తుంది… కనుక, విప్లవం తెచ్చే వర్గం మొదటి నుండీకూడ … ఒక వర్గంలా కాక మొత్తం సమాజపు ప్రతినిధిలా అగుపిస్తూంటుంది."[1] మరి ఈ 'గుర్తింపులు' (మమేకతాప్రదర్శనలు - identifications) గతంలో అతి స్వల్పకాలాలపాటే మనివుంటూండి నట్లు రుజువయిందికూడ; కాని [ఇప్పుడు] రానున్న విప్లవంలో మట్టుకు అధోకార్మిక వర్గం – వర్గవ్యవస్థ మరింత సులభసామాన్యం కావడం వల్లా, అలాగే కేవలం దాని సంఖ్యాబాహుళ్యంవల్లకూడ – మొత్తం సమాజపు ప్రయోజనాలకూ ప్రాతినిధ్యం వహించగలిగే స్థితిలో నిజంగా వుంది. అందుచేత ఈ సారి వచ్చే విప్లవం, కాలక్రమాన ఒక వర్గరహిత సమాజాన్ని ఆవిష్కరిస్తుంది. రాజ్యం, పరాయీకరణలలాగే వర్గంకూడ ఒక తాత్కాలిక పరిణామం (అస్తిత్వం) గా వుంటుంది; పెట్టుబడిదారీ సమాజంలో అది దాని పూర్ణ విస్తృతిలో [చిత్రించబడి] వుంటుంది.
మార్క్స్‌కు సంబంధించి వర్గంగురించిన భావనకు ఎంత ప్రాముఖ్యం వుందో గమనిస్తే, మరి ఆ భావనగురించి ఆయన ఒక క్రమబద్ధ విశ్లేషణ ఏమీ చేయలేదంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కనీసం యిలాంటి విశ్లేషణకు ఆయన పూనుకొన్నదైనా ఒకే ఒక చోట – పెట్టుబడి గ్రంథం 3 వ సంపుటం చివరన మాత్రమే – అదీ అసంపూర్ణంగానే; ఆయన మరణంతో అది అర్ధంతరంగా ఆగి పోయిందికూడ.[2] 'ఎన్ని వర్గాలు వున్నాయి?' అనే ప్రశ్నతో [అక్కడి] ఆ రచనాభాగాన్ని మొదలు పెడతాడు మార్క్స్‌. మళ్ళీ తానే పెట్టుబడిదారీ సమాజంలో మూడు పెద్ద వర్గాలు – వేతన శ్రామికులు, పెట్టుబడిదారులు, భూయజమానులు – వున్నారని జవాబిస్తాడు. అయితే వెంటనే దానికి సవరణగా, పెట్టుబడిదారీ సమాజం అత్యంత వికసితరూపంలోవున్న ఇంగ్లండులో, "ఈ వర్గాల పొరవిభజన అంత శుద్ధ రూపంలో ఏమీ కనిపించదు. ఇక్కడ సైతం మధ్యతరగతులు, నడిమిబృందాల పొరలు ప్రతి చోటా ఈ హద్దు నిర్దేశాన్ని చెరిపివేస్తూంటాయి (అయితే ఇలాంటి చెరిపివేత పట్టణాల్లోనే హెచ్చుగా వుంటుంది; గ్రామీణప్రాంతాల్లో యిది చాల – పోల్చలేనంత – తక్కువగానే వుంటుంది), " అని చేర్చిచెబుతాడుకూడ. అయితే, పెట్టుబడిదారీ సమాజ వికాసంతో రెండంటే రెండే వర్గాలు – బూర్జువా వర్గం, అధోకార్మికవర్గాలు సృష్టి అవుతూండడంతో పరిస్థితి వేవేగంగా సులభతరం అవుతున్నది. 'మధ్య తరగతులు, నడిమి బృందాల' పొరలు పిప్పిగావించబడి పారవేయబడడమే కాదు, భూయజమానులుసైతం యిదేవిధమైన క్రమానికి గురవుతారు. కాలక్రమాన కార్మికులందరూ వేతన-శ్రామికులుగా రూపొందుతారు; పెట్టుబడిదారులమధ్య పోటీమూలంగా కొంతమంది పెట్టుబడు దారుల సిరిసంపదలు పెరిగిపోగా, యితర పెట్టుబడిదారులు [దెబ్బ తిని] అధోకార్మికవర్గ శ్రేణులకు బలవంతంగా నెట్టివేయబడుతారు.

ఆ పై మార్క్స్‌ ఇంకో (రెండో) ప్రశ్న వేస్తాడు [లేక 'వేసుకుంటాడు' అనడం మెరుగేమో] : పైన ప్రస్తావించిన మూడు బృందాలనూ మూడు మహా సాంఘిక వర్గాలుగా రూపొందించే దేమిటి? దానికి మళ్లీ తానే – "మొదటి చూపుకైతే, వాటి ఆదాయాల గుర్తింపు, ఆ ఆదాయాల వనరులు [వాటిని మహా సాంఘిక వర్గాలుగా రూపొందించేది] అని చెప్పవచ్చు. మూడు మహా సాంఘిక బృందాలు వున్నాయి – వాటి సభ్యులు అంటే వాటిని రూపొందించే వ్యక్తులు [వరుస క్రమంలో] తమ వేతన-శ్రమనూ, తమ పెట్టుబడినీ, తమ భూఆస్తినీ వెచ్చించి [అందుమూలంగా వచ్చే] జీతాలు [వేతనాలు], లాభం, నేల కిరాయి [ground rent-కౌలుమొత్తం]లద్వారా జీవితాలు గడుపుతూ వుంటారనీ చెప్పవచ్చు" – అంటూ జవాబిస్తాడు. ఆ తర్వాత మార్క్స్‌ తానే యింకో ఆక్షేపణ చేస్తాడు – మరి ఈ ప్రమాణం ప్రకారమైతే, యితరులుకూడ, ఉదాహరణకు డాక్టర్లు, ప్రభుత్వోద్యోగులు వగైరా వేర్వేరు [ప్రత్యేక] వర్గాలవుతారే అని ప్రశ్నిస్తాడు. కాని అక్కడికి ఆ రాతప్రతి తెగిపోయివుండడం వల్ల ఈ అభ్యంతరానికి తన జవాబేమిటో మనకు బోధపడదు. అయితే పెట్టుబడిలో మార్క్స్‌ యిలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తన యితర రచనల్లో వర్గం గురించి ఆయన చేసిన అంత హెచ్చుగా క్రమబద్ధంకాని ప్రకటనలు మనకు దోహద పడుతాయి. [ఉదాహరణకు అంతకు ఎంతోకాలం పూర్వమే రాసిన] కమ్యూనిస్టు ప్రణాళిక లో మార్క్స్‌ రెండు వర్గాల నమూనాను వాడుతాడు: " సమాజం మొత్తమూ మరింత మరింతగా రెండు గొప్ప శత్రు శిబిరాలుగా, ఒకదానికొకటి నేరుగా ఎదురునిలిచే రెండు మహా వర్గాలుగా, బూర్జువా వర్గం - కార్మిక వర్గాలుగా చీలిపోతూంది,"[3] అంటాడు. బూర్జువా వర్గం అంటే ఉత్పత్తి సాధనాల యజమానులు, వేతన శ్రమ నియామకులూననీ, పోతే తమ సొంత ఉత్పత్తి సాధనాలంటూ ఏమీ లేని, తమ వేతన శ్రమను అమ్ముకుని బతికే వాళ్లు అధోకార్మిక వర్గమనీ [మార్క్స్‌] నిర్వచిస్తాడు. ఈ విధంగా వ్యాప్తిలోవున్న ఉత్పత్తి విధానంలో ఒక వ్యక్తికి వుండే స్థితే అతడు ఏదైనా వర్గానికి చెందేందుకు అర్హతాప్రమాణంగా చూడబడింది.
అధోకార్మిక వర్గపు దరిద్రీకరణ (immiserisation of the proletariat) గురించిన మార్క్స్‌ భావన వెనుకవుండేదికూడ ఈ రెండు-వర్గాల నమూనాయే నని మనం గమనించగలం. [అయితే మనమిక్కడ గమనించాల్సిందేమంటే,] అధోకార్మిక వర్గం ఏదో పరమరూఢ అర్థంలో [నిరపేక్ష రూపంలో] దరిద్రీకరణకు లోనవుతుందని మార్క్స్‌ ఎప్పుడూ అనలేదు.[4] అసలు ఇలాంటి ఆలోచనే, మానవావసరాలు అన్నీ సమాజ మధ్యవర్తిత్వంద్వారానే సాగిపోతాయని ఆయనకున్న నిశ్చితాభిప్రాయానికి బొత్తిగా నప్పేది కాదు. ఆయన వాదనంతా ఉత్పత్తి సాధనాల యజమానులకూ, అవి లేనివారికీ (కార్మికులకూ) నడుమ వుండే వనరుల అంతరం మరింత [మరింత] గా విస్తృతం అవుతుందని మాత్రమే. మార్క్స్‌ తన వేతన శ్రమ - పెట్టుబడి లో ఇంటికీ, రాజభవంతికీ నడుమ తేడాగురించి ఒక పిట్టకథ చెబుతూ ఈ విషయాన్ని తేటతెల్లం గావిస్తాడు:
ఇల్లు చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు. దాని చుట్టుపక్కలి ఇళ్లన్నీ అంతే చిన్నగా వుండేంతవరకూ అది ఒక నివాసగృహానికి చెందిన అన్ని సామాజిక డిమాండ్లనూ సంతృప్తి పరుస్తూంటుంది. అయితే ఆ చిన్న ఇంటిపక్కన ఒక రాజప్రాసాదం ఆవిర్భవించ నివ్వండి, అది [వెంటనే] చిన్న ఇల్లుగా వుండేబదులు ఒక గుడిసెగా కుంచించుకుపోయినట్లనిపిస్తుంది. ఇప్పుడు తన (చిన్న ఇంటి) యజమానికి చేయడానికంటూ డిమాండ్లు ఏమీ లేవని లేక చాల స్వల్పమైన డిమాండ్లు మాత్రమే వున్నాయని ఆ చిన్న ఇల్లు చూపిస్తుంది. నాగరికతా (వికాస) క్రమంలో ఆ చిన్న ఇల్లు ఎంత ఎత్తుగా పైకి ఎదిగినా మరి దాని పక్కనున్న రాజప్రాసాదం అంతే ఉధృతితో లేక మరింత విస్తృతంగా పెరిగిపోతే గనుక ఆ చిన్న ఇంటి నివాసి మరింత మరింతగా అసౌకర్యవంతంగా, అసంతృప్తిగా, తన ఇంటి నాలుగు గోడలనడుమ అంతకంతకూ ఎక్కువగా బిగుసుకు పోయినట్లుగా అనుభూతి చెందుతాడు.[5]
అయితే మార్క్స్‌ ఈ ' వర్గం' అనే పదాన్ని ఉపయోగించేది కేవలం ఒక్క ఈ రెండు వర్గాల నమూనా సందర్భంలోనే కాదు. ఇతర ఆర్థిక బృందాలకు, ప్రత్యేకించి పెటీబూర్జువా, రైతాంగ వర్గాలకు సంబంధించి కూడ ఆయన ఈ పదాన్ని వాడుతాడు. కమ్యూనిస్టు ప్రణాళిక లోని సుబ్బరమైన విభజనను ఈ రెండు బృందాలూ వర్తింప జేయకుండా అడ్డుకునేట్లగుపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు బృందాలూ తాము ఎంతమంది కార్మికుల్ని నియమిస్తాయి, లేక తాము ఎంత భూమికి యాజమాన్యం వహిస్తాయి అనేదాన్ని బట్టి ఇటు బూర్జువా వర్గంలోకో లేక అటు అధోకార్మిక వర్గంతోనో విలీనమై పోతాయనేది స్పష్టమేకాబట్టి. అంతేగాక, యంత్రాల ఇతోధిక వినియోగంతో బాటుగా సేవారంగ పరిశ్రమలు బహుళాభివృద్ధి చెందడంతో ఒక కొత్త మధ్య తరగతి ఆవిర్భవించగలదని మార్క్స్‌ ముందుచూపుతో చెప్తాడు కూడ. మార్క్స్‌ ఇంకా " ఒకవైపున కార్మికునికీ, మరోవైపున పెట్టుబడిదారు, భూస్వాము (భూయజమాను) లకూ నడుమ సంఖ్యాపరంగా నిరంతరం పెరిగిపోతూండే మధ్యతరగతి వర్గాలను" విస్మరిస్తున్నాడంటూ రికార్డోను విమర్శిస్తాడుకూడ.[6]
ఇంకా మరింత మధ్యంతరంగా వుండే యితర బృందాలూ [కొన్ని] వున్నాయి: ఉదాహరణకు వ్యవసాయ కూలీలనే తీసుకొంటే వాళ్లు రైతులకూ, అధోకార్మికులకూ మధ్య సగం-దారిలో వున్నట్లు కనిపిస్తారు. అధోకార్మిక వర్గంగురించిన మార్క్స్‌ సాధారణ స్వభావ చిత్రణ ప్రకారం అది (ఆ పదం) కేవలం పారిశ్రామిక కార్మికులకే వర్తించినా, కొన్నిసార్లు ఆయన అధోకార్మికవర్గం పెట్టుబడిదారీ సమాజంలో అపార మెజారిటీ ప్రజల్ని కలిగివుంటుంది, కనుక వ్యవసాయ కూలీల్నిసైతం అందులో చేర్చాల్సివుంటుందనికూడ అంటాడు. 1875లో బకూనిన్‌పై చేసిన ఒక వ్యాఖ్యక్రమంలో మార్క్స్‌, "పెట్టుబడిదారీ కౌలుదారు వచ్చి రైతుల్ని వెళ్లగొట్టే (బేదఖల్‌ చేసే), అందువల్ల నిజంగా భూమి దున్నే వ్యక్తికూడ పట్టణ కార్మికుడికిలాగే ఒక వేతన శ్రామికునిగా, అంతే అధోకార్మికునిగా మారిపోయే, ఆ విధంగా అతడితోబాటు అవే [అధోకార్మికవర్గ] ప్రయోజనాలు పాలు పుచ్చుకునే"[7] పరిస్థితి తలయెత్తే అవకాశం (సంభావ్యత) గురించి ప్రస్తావిస్తాడుకూడ. అదే వ్యాఖ్యక్రమంలో, భూయజమాని అయిన రైతుకూడ కొన్నిసార్లు, తనకు తెలియకుండానే, అధోకార్మిక వర్గానికి చెందే పరిస్థితులు వుంటాయనీ, అలాంటి రైతుయొక్క భూమిపై వుండే తనఖా (తాకట్టు) భారం, అతడు దానికి నిజమైన యజమాని కాడు, మరెవరికోసమో పని చేస్తున్నాడని స్పష్టం చేస్తుందనీ అంటాడు మార్క్స్‌. మరలాంటప్పుడు – రైతులు అధోకార్మికులుగా, భూయజమానులు పెట్టుబడిదారులుగా పరిగణించబడేటప్పుడు – మనకు మళ్లీ ఒక రెండు వర్గాల నమూనా ప్రత్యక్షమౌతుంది. అయినప్పటికీ [అదలావున్నా] రైతులు రాజకీయంగా ఒక అభివృద్ధి నిరోధక వర్గమనే భావిస్తాడు; కనుక వారిని పట్టణ అధోకార్మిక వర్గంతోబాటు జట్టుకలపడానికి సుముఖత చూపడు మార్క్స్. [ఎందుకంటే] పశ్చిమ యూరపులో [అప్పటికి] అత్యంత తాజా రైతు వుద్యమాలు ఫ్యూడల్‌ [భూస్వామ్య] లేక రాచరిక మొగ్గుధోరణులతో నిండివుండినాయి [గనుక].
పోతే, మార్క్స్‌కు వర్గీకరించడానికి కష్టంగా తోచిన రెండో మధ్యంతర బృందం – తానుసైతం దేనికి చెందివున్నాడో ఆ బృందం, మేధావి (లేక బుద్ధిజీవి) వర్గం. ఆయన తరచూ వాళ్లనుగురించి బూర్జువా వర్గపు 'భావజాలపర (లేక సైద్ధాంతిక) ప్రతినిధులు, మాటకర్తలు (spokesmen)' అని ప్రస్తావిస్తూండేవాడు. అలాగే, "తామొక వర్గమనే భ్రమను సర్వసమగ్రీకరించడమే తమ జీవికకు ప్రధానవనరు గావించుకునే" బృందం వీరని ఎత్తిపొడుస్తాడుకూడ.[8] ఇంకా, కమ్యూనిస్టు ప్రణాళిక లోనైతే ఈ మేధావులు బూర్జువా వర్గపు 'కూలి మనుషులు (వేతన శ్రామికులు)' గా, కాని అధోకార్మికులు వేతనశ్రామికులైన అర్థంలోకాక అందుకు స్పష్టంగా భిన్నమైన అర్థంలో అలా వుంటారని అంటాడు మార్క్స్‌. అయితే అదే సమయంలో తమ వర్గ నేపథ్యాలు ఏమైనా, కొంతమంది మేధావులైతే సమాజానికి సంబంధించిన కనీసం కొన్ని విషయాలకు సంబంధించైనా (లేక కోణాలగురించైనా) వస్తుగత మదింపుకు (objective assessment – ఒక విధమైన నిష్పాక్షిక భౌతిక అంచనాకు) రాగలిగారనికూడ గుర్తించకపోలేదాయన. ప్రత్యేకించి, రికార్డోలాంటి ప్రామాణిక (లేక సాంప్రదాయిక - classical) అర్థశాస్త్రజ్ఞులు లేదా బ్రిటిషు ఫాక్టరీ ఇన్‌స్పెక్టర్లలాంటివాళ్లు యిలాంటి భౌతికపరిశీలనా దృక్పథం కలిగివుండినారని పేర్కొంటాడు కూడ.
మేధావులు (బుద్ధిజీవులు) ' భావజాలపర వర్గాలు' అంటూ మార్క్స్‌ అతి తరచూ ప్రస్తావించడం గమనిస్తే, ఆయన కొన్ని సార్లు ఆ పదాన్ని ఏదైనా ఒక బృందానికి ఉత్పత్తి విధానంలో వుండే స్థితితో నిమిత్తం లేకుండా వాడాడని స్పష్టమౌతుంది. ఉదాహరణకు, 'చిన్న వర్తకవ్యాపారులు, దుకాణదారులు, చేతివృత్తిదారులు, రైతుల' తో కూడుకున్న ఒక ' దిగువ మధ్యతరగతి వర్గం' గురించికూడ మార్క్స్‌ [ఒక చోట] ప్రస్తావించివున్నాడు.[9] అలాగే బ్రిటన్‌లోని 'పాలక వర్గాల' నుగురించి కూడ మాట్లాడడమేగాక, విత్త పెట్టుబడి దారులు, పారిశ్రామిక పెట్టుబడిదారులు "రెండు స్పష్టంగా వేరైన వర్గాలు" అని చెప్పేంతదాకాకూడ వెళ్తాడు మార్క్స్‌. ఇక సాంఘిక కొలబద్ద మరో కొసన అలగా కార్మిక వర్గం అని మార్క్స్‌ పేర్కొన్న వర్గం వుంది. మార్క్స్‌ తన ఫ్రాన్స్‌లో వర్గ పోరాటాలు లో, "అన్ని రకాల దొంగలు, నేరస్తులను కొత్తగాచేర్చుకొనే (భర్తీ చేసుకొనే – రిక్రూటు చేసుకొనే) వనరుగా వుండేవాళ్లు, సమాజం పారేసే [ఎంగిలి] తునకలు తిని బతికే, ఒక నిశ్చితమైన వృత్తి అంటూ లేనివాళ్లు, తిరుగుబోతులు, కుదురుగా ఒక ఇల్లూ సంసారమంటూ లేనివాళ్లు"[10] ఈ అలగా కార్మికవర్గమని వర్ణించి చెబుతాడు. వేరే మాటల్లో (మరో విధంగా) చెబితే, ఈ అలగాకార్మిక వర్గం సమాజంనుండి తప్పుకుతిరిగే వాళ్లు (dropouts of society), సమాజాభివృద్ధిలో ప్రయోజనం, ఆసక్తి అంటూ లేనివాళ్లు, కనుక నిర్వర్తించడానికి చారిత్రక పాత్ర ఏదీ లేని వాళ్లన్న మాట. వాళ్లు తమ సేవలు బూర్జువావర్గానికి అమ్ముకొనడానికి సుముఖంగా వుంటారుగనుక అప్పుడప్పుడూ వాళ్లు అభివృద్ధినిరోధకులుగా అయివుండవచ్చుకూడ.
ఈ విధంగా వర్గానికి మార్క్స్‌ యిచ్చే నిర్వచనం, ఆయన ఆలోచనల వికాసక్రమంతోబాటేగాక ఒకే [ఆలోచనాస్థాయి] కాలంలోకూడ ఎంతో హెచ్చుగా మారిపోతూండడం గమనిస్తాము. తన కాలపు వాడుకకు అనుగుణంగా మార్క్స్‌ ఈ [వర్గం అనే] పదాన్ని తరచూ ఒక ముఠా లేక బృందం అనే అర్థంలోకూడ ఉపయోగించాడు.
అయినప్పటికీ రెండు సాధారణ అంశాలు ఎత్తిచూపవచ్చు: మొదటగా, సమాజాన్ని పెట్టిబడిదారులు, అధోకార్మికవర్గం, భూయజమానులు అనే [వర్గాలుగా] త్రిపక్షీయ విభజన గావించడం మనకు మార్క్స్‌ [రచనల్లో] అతి సాధారణంగా కనిపిస్తుంది. అయితే తాను ఏదో ఒక స్థావర [static – నిశ్చల] సమాజాన్ని విశ్లేషిస్తున్నట్లు మార్క్స్‌ ఎన్నడూ భావించుకోడు; నిజానికి ఆయన కొన్నిసార్లు ' వర్గాలు' అంటూ ప్రస్తావించి చెప్పిన అనేక బృందాలు వేవేగంగా అంతరించి (అదృశ్యమై) పోతూండినాయికూడ. [ఉదాహరణకు] పెటీ బూర్జూవాలు, రైతాంగం ఈ విధమైన స్థితిలో వుండినాయి. అలాగే మార్క్స్‌ ప్రకారమైతే, భూయాజమాన్య వర్గంకూడ విచ్ఛిన్నమై అంతిమంగా యిటు పెట్టుబడిదారీ వర్గంలోనో లేక అటు అధోకార్మికవర్గంలోనో [వికసిత పెట్టుబడిదారీ సమాజంలో వుండే ఈ రెండే రెండు వర్గాల్లో దేనిలో ఒకదానిలో] కలిసిపోకతప్పదు.
రెండవదేమంటే, వర్గంగురించిన తన నిర్వచనంలో మార్క్స్‌ ఒక గతిశీల, స్వీయమానసిక [లేక కర్తృపర? - subjective] మూలాంశాన్ని కూడ చొప్పించివున్నాడు. తానొక వర్గమనే స్వీయ చైతన్యం కలిగివున్నప్పుడే ఏదైనా వర్గం ఉనికిలో వుంటుంది అంటాడు; అంటే దీని అంతరార్థం ఆ బృందం వేరొక సాంఘిక బృందంతో సామాన్య (బృందసభ్యులందరి ఉమ్మడి) వైరం కలిగి వుండాల్సి వస్తుందన్నమాట. తన సొంత ప్రయోజనాలు యితర వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా వున్నట్లే ఏదైనా వర్గం ఎప్పుడూ ఆలోచిస్తూంటుంది; అలాంటి [ప్రత్యేక (విరుద్ధ)] ప్రయోజనాల [సాధన] కోసం పోరాడడానికి దాన్ని [ఆ వర్గాన్ని] సంఘటితంగావించాల్సి వుంటుందికూడ. కనుక, మార్క్స్‌ కొన్నిసార్లు, పెట్టుబడిదారులైనా ఒక వర్గంగా ఏర్పడివున్నారా లేరా అని తటపటాయిస్తూండినాడు కూడ. మార్క్స్‌ తన జర్మన్‌ భావజాలం లో వాళ్లను [పెట్టుబడిదారులను] గురించి మాట్లాడుతూ, " ఈ ప్రత్యేక (వేరు వేరుగా వుండే) (పెట్టుబడిదారీ) వ్యక్తులంతా మరొక వర్గంతో తామొక ఉమ్మడి పోరాటం (యుద్ధం) చేయాల్సివచ్చేంత మేరకు ఒక వర్గంగా ఏర్పడివుంటారు [అని చెప్పవచ్చు]; అలా లేనప్పుడు వాళ్లు ఒకరితో మరొకరు పోటీదారులుగా పరస్పర శత్రు (వైర) స్థితిలో వుంటారు,"[11] అని అంటాడు. మరి అధోకార్మిక వర్గానికీ యిదే వర్తిస్తుంది. తన తత్వశాస్త్ర దారిద్ర్యం లో మార్క్స్‌ ఊహాస్వర్గ (లేక ఊహాజనిత) సోషలిజంగురించి చెబుతూ, 'తానొక వర్గంగా ఏర్పడేందుకు అధో కార్మిక వర్గం ఇంకా తగినంతగా అభివృద్ధి చెందిలేనట్టి' కాలానికి చెందిన విలక్షణత [ఆదర్శ భావన] అదనీ, "పర్యవసానంగా … అప్పటికి అధోకార్మిక వర్గానికీ, బూర్జువా వర్గానికీ మధ్య పోరాటానికే యింకా ఒక రాజకీయ స్వభావమంటూ వుండదు," అనీ వివరిస్తాడు. [ఇంకాకూడ,] అదే రచనలో అధోకార్మికవర్గంగురించి, "ఈ జనం యిప్పటికే పెట్టుబడికి విరుద్ధమైన ఒక వర్గంగావున్నా, యింకా తమకై తాము [దానికై అదిగా] ఒక వర్గంగా ఏర్పడి [అయితే] లేరు,"[12] అని చెబుతాడు. పోతే, కమ్యూనిస్టు ప్రణాళిక లోనైతే, " ఒక వర్గంగా, పర్యవసానంగా ఒక రాజకీయ పక్షంగా, అధోకార్మికుల ఈ సంఘటన (నిర్మాణం), అసలుకు కార్మికులనడుమే చెలరేగే పోటీ చేత నిరంతరం (సదా) తల్లక్రిందులు చేయబడుతూ వస్తూంది,"[13] అని కూడ అంటాడు మార్క్స్‌. ఇంకా, 1866 అంత ఆలస్యంగా (లేటుగా) కూడ మార్క్స్‌, అంతర్జాతీయ సంస్థ (ఇంటర్నేషనల్‌) "కార్మికుల్ని ఒక వర్గంగా సంఘటిత పరచడానికి (నిర్మాణం గావించడానికి) [సాధనమైన] ఒక నిర్మాణం [ఆర్గనైజేషన్‌],"[14] అని పేర్కొంటాడు. మార్క్స్‌ తన లూయీ బోనపార్టీ యొక్క పద్దెనిమిదవ బ్రుమైర్‌ గ్రంథంలో ఫ్రెంచి రైతాంగాన్ని వర్ణించేటప్పుడు ఈ అంశాన్ని అత్యంత స్పష్టంగా వివరించిచెబుతాడు [యిలా]:
"తమ జీవితవిధానం, తమ ప్రయోజనాలు, తమ సంస్కృతుల్ని యితర వర్గాలకు సంబంధించినవాటినుండి [అంటే వాటి జీవిత విధానం, ప్రయోజనాలు, సంస్కృతులనుండి] వేర్పాటుగావించే ఆర్థిక మనుగడ పరిస్థితుల్లో లక్షలాది కుటుంబాలు బతికేంత మేరకు అవి ఒక వర్గంగా ఏర్పడి వుంటాయి [అనవచ్చు]. అయితే ఆ చిన్న కమతాల రైతులమధ్య కేవలం ఒక స్థానిక సంబంధంమట్టుకే వుండి, వాళ్ల ప్రయోజనాల మధ్యనుండే సామాన్యత్వం (identity of their interests) వాళ్లమధ్య ఒక సముదాయాని ఏర్పాటు చేయ [లే] కుండా, ఒక జాతీయ బంధాన్ని సృష్టించ [లే] కుండా, ఒక రాజకీయ నిర్మాణాన్ని దేన్నీ ఏర్పాటుచేయ [లే] కుండా వుండేంత మేరకు వాళ్లు ఒక వర్గంగా ఏర్పడి వుండరు. పర్యవసానంగా వాళ్లు తమ సొంత పేరిట తమ వర్గ ప్రయోజనాన్ని అమలుచేయలేని అశక్తులై వుంటారు …"[15]
ఈ సందర్భంగా [ఇందుకు సంబంధించి] మనం గమనించ వలిసిందేమంటే మార్క్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో కార్మికులకు పితృభూమి [లేక మాతృభూమి] అంటూ ఏదీ లేదని ఉద్ఘాటించినప్పటికీ మళ్లీ అందులోనే ఆయన 'జాతీయ వర్గం' అనే భావనను కూడ ఉపయోగిస్తాడు. ఇంకాకూడ, అదీ కమ్యూనిస్టు ప్రణాళిక లోనే, "అధోకార్మిక వర్గం అన్నింటికంటే మొదటగా రాజకీయ ఔన్నత్యం (political supremacy) సంపాదించుకోవాలి కాబట్టి, జాతికే నాయకత్వ వర్గంగా ఎదగాల్సి వుంటుందికాబట్టి, తన్ను తాను జాతిగా ఏర్పరుచుకోవాల్సి వుంటుందికాబట్టి, అది ఆ మేరకు స్వయంగా జాతీయమైనదిగా (జాతీయవర్గంగా) వుంటుంది," అనికూడ అంటాడు.[16]
ఈ విధంగా ' వర్గం' అనే పదాన్ని ప్రయోగించడానికి మార్క్స్‌ అనేక ప్రమాణాలు వాడాడని, అవి (ఆ ప్రమాణాలు) అన్నీ అన్ని సమయాల్లో అన్వయించలేదనీ గమనిస్తాము. వ్యాప్తిలోవున్న ఉత్పత్తివిధానంతో ఏదైనా బృందానికి వుండే సంబంధం, తానొక వర్గమనే స్వీయచైతన్యం కలిగి వుండడంతోబాటు దానికి అనుబంధమైన రాజకీయ నిర్మాణంకూడ ఆ బృందం కలిగివుండడం వాటిల్లో రెండు ముఖ్యమైన ప్రమాణాలు అని తెలుసుకొంటాము.
ఆధునిక సమాజంలో వర్గాల ఉనికిని లేక వర్గపోరాటపు వాస్తవికతను తాను కనుగొన్నానని చెప్పుకొని ఖ్యాతిబడయడానికి మార్క్స్‌ నిర్ద్వంద్వంగా నిరాకరించాడు. బూ్ర్జువా చరిత్రకారులు, అర్థశాస్త్రవేత్తలు ఆ పని ఎప్పుడో చేసివున్నారు. అయితే ఈ వర్గాల ఉనికి ఉత్పత్తి వికాస క్రమంలో కొన్ని ప్రత్యేక చారిత్రక దశలకు లంకె పడివుంటుందనీ, ఈ వర్గ పోరాటం [అనివార్యంగా] కార్మికవర్గ నియంతృత్వానికి, [తద్వారా] ఒక వర్గరహిత సమాజానికీ దారి తీస్తుందనీ[17] చూపించగలడమే తన భావనల్లో వినూత్నమైన అంశమని మార్క్స్‌ భావిస్తాడు [భావించి చెబుతాడు].
[1] ఎంపిక చేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 169.
[2] పోల్చి చూడు: ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్ రచనలు, పు. 506.
[3] ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 222.
[4] ఈ విషయమై మామూలుగా ఉల్లేఖించబడే పెట్టుబడి గ్రంథంలోని రచనాభాగంలో మాత్రం, అందుకు సంబంధించిన మరింత విస్తృత సందర్భాన్ని బట్టి స్పష్టమయేటట్లు, కేవలం అంతకంతకూ అధికమయ్యే నిరుద్యోగ ప్రజారాశిగురించి మాత్రమే ప్రస్తావించబడుతుంది.
[5] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 259.
[6] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. …
[7] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 561.
[8] జర్మన్‌ భావజాలం, పు. 61.
[9] కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 229.
[10] కార్ల్‌ మార్క్స్‌, ఫ్రాన్స్‌లో వర్గపోరాటాలు, మార్క్స్‌-ఏంగెల్స్‌ల ఎంపిక చేయబడ్డ రచనలు, సం. 1, పు. 155.
[11] జర్మన్‌ భావజాలం, పు. 48 నుండీ.
[12] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 212, 214.
[13] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 228.
[14] కుగెల్‌మన్‌కు మార్క్స్‌ లేఖ, మార్క్స్‌ ఏంగెల్స్‌ల రచనలు, సం. 31, పు. 529.
[15] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 317 నుండీ.
[16] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 235.
[17] పోల్చి చూడు: కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 341.

No comments: