Wednesday, September 23, 2009

శ్రమ - కార్ల్‌ మార్క్స్‌ (3) - మూలపాఠాలు కొనసాగింపు

మూలపాఠాలు contd...

నిజమైన పోడిమి (మితవ్యయం - economy) – పొదుపు మొత్తం (savings) – పని వ్యవధి (పనిచేసే కాలం) ను పొదుపు చేసు కొనడంలో వుంటుంది (ఉత్పత్తి ఖర్చుల్ని కనిష్టమొత్తంలో వుండేట్లు చేసుకొనడం, అలా కనిష్టమొత్తానికి తగ్గించడం అన్నమాట); అయితే ఈ పొదుపు మరేదో కాదు – ఉత్పాదకతా వికాసమే [ఉత్పాదకత అభివృద్ధికి అభిన్నమైందే]. కనుక, పోడిమి చేయడం [economizing – పొదుపుసేత] అంటే అర్థం ఏదో సుఖసంతోషాల్ని వదులుకోవడం అన్నట్లు కాదు, [అధికార] శక్తినీ, ఉత్పాదకతా సామర్థ్యాన్నీ పెంచుకోవడం, అంటే అందువల్ల [జీవితం] ఆనందించడానికి వలసిన క్షమతనూ [సామర్థ్యాన్నీ] , సాధనాలనూ రెంటినీ కలగజేసుకొనడం అని గ్రహించాలి. అనుభవానందానికి తగ్గ సామర్థ్యం అనేది అసలలా అనుభవానందం పొందడానికే అవసరమైన ఒక షరా అంశం; కాబట్టి అందుకు ప్రాథమిక సాధనంగా వుంటుంది. మరి ఈ సామర్థ్యమేమో ఒక ప్రతిభాయుక్తుల వికాసంగా, కనుక ఉత్పాదక శక్తియొక్క అభివృద్ధిగా వుంటుంది. శ్రమ కాలాన్ని పొదుపు చేయడమంటే [వ్యక్తియొక్క] స్వేచ్ఛాసమయాన్ని, అంటే వ్యక్తి సంపూర్ణ వికాసానికి వలసిన సమయాన్ని పెంపు చేయడమే – యిది మళ్లీ శ్రమ ఉత్పాదక శక్తిపై [దాన్ని హెచ్చించే] ఒక మహా ఉత్పాదక శక్తిగా పని చేస్తుంది. తక్షణ ఉత్పాదక క్రమం దృక్కోణంనుండి దాన్ని స్థిర పెట్టుబడి ఉత్పత్తిగా ఎంచవచ్చు; ఈ స్థిర పెట్టుబడి స్వయంగా [ఉత్పత్తి చేసే] మనిషే నని గమనించాలి. ఇంకా తక్షణ శ్రమ కాలం స్వేచ్ఛా సమయంతో అనిర్దిష్ట వైరుధ్యంలోనే [కొట్టుమిట్టాడుతూ] – బూర్జువా ఆర్థికవిధానం లోలాగా – వుండిపోలేదనేదీ స్వయం స్పష్టమే. లేదా ఫొరియర్ కోరుకునే విధంగా పని అనేది ఒక ఆటలా కాజాలదు; అయితే, ఏదో పంపిణీని గాక అసలు ఉత్పత్తివిధానాన్నే మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే అంతిమ గమ్యం కావాలని ఉద్ఘాటించడమే ఫొరియర్యొక్క గొప్ప శ్రేష్టత. స్వేచ్ఛా సమయమంటే అందులో విశ్రాంతి సమయం, అలాగే మరింత ఉన్నతస్థాయి కార్యకలాపాలకు [స్వయంగా] కేటాయించుకొనే సమయం రెండూ చేరివుంటాయి. అలాంటి స్వేచ్ఛాసమయం సహజంగానే దాన్ని [ఆ స్వేచ్ఛాసమయాన్ని] ఆనందించి వినియోగించుకునే ఎవరినైనా ఒక విభిన్న వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది; మరి [ఆనక] ప్రత్యక్ష ఉత్పత్తి క్రమంలోకి ప్రవేశించేది ఈ విభిన్న వ్యక్తే. అలా విభిన్న వ్యక్తిగా [ఇంకా] రూపొందుతూ వుండే మనిషి ఈ [ప్రత్యక్ష ఉత్పత్తి] క్రమంలో ఒక క్రమశిక్షణను సంతరించుకొంటాడు. కాగా, అప్పటికే ఒక విభిన్న వ్యక్తిగా రూపొందిన మనిషికి యిది [ప్రత్యక్ష ఉత్పత్తి క్రమంలో పాల్గొనడం] ఒక వ్యవహారాచరణగా, ప్రయోగాత్మక శాస్త్ర విజ్ఞానంగా, భౌతికంగా సృజనాత్మకమైన, ఆత్మ-లక్ష్య గతమైన జ్ఞానంగా వుంటుంది; [తద్వారా] అతడు తన సొంత బుర్రలో సంఘం మొత్తపు సంచిత వివేకాన్ని కలిగివుండగల్గుతాడు. శ్రమకుకూడ ఒక స్వేచ్ఛా సంచారం, వ్యవహారిక అన్వయం కావల్సివుండడం దృష్ట్యా, ఆ మేరకు రెంటికీ [అంటే విభిన్న వ్యక్తికీ, శ్రమకూ రెంటికీ] యిందులో [తక్షణ ఉత్పత్తి క్రమంలో] పని అనుభవం [వ్యాయామం] – వ్యవసాయంలోలాగా – లభిస్తుందికూడ. - గ్రుండ్రిస్సే (1857-8), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 383 నుండీ.
స్వేచ్ఛా శ్రమ లేక వేతన శ్రమ అనేవి బానిసవిధానం రద్దు అయిన తర్వాత మాత్రమే తలయెత్తాయి. మరి వాటితో మొదలు పెట్టుకుంటే మొత్తం సజీవ శ్రమకంతటికీ విరుద్ధమైన ఒక శత్రు శక్తిగా, పరాయి ఆస్తిగా మాత్రమే యంత్రాలు వికసించగలవని, అంటే ఒక పెట్టుబడిగానైతే అవి కార్మికుడ్ని ఎదిరిస్తూ వుండకతప్పదనేది [స్పష్టమే; ఈ విషయం] గ్రహించడానికి ఏదో ప్రత్యేక విచక్షణా జ్ఞానం ఏమీ అక్కర లేదు. కాని [అదే సమయంలో] ఒక సారి అవి, ఉదాహరణకు, సహవాస కార్మికుల (associated workers) [ఉమ్మడి] ఆస్తిగా రూపొందితే, అప్పుడవి సాంఘిక ఉత్పత్తి ఏజెంట్లుగా వుండక మానవు అని గ్రహించడమూ అంతగానూ సులభమే. అయితే, మొదటి సందర్భంలో వాటి [యంత్రాల] పంపిణీ సాధనాలు [అంటే అవి కార్మికులకు చెందివుండవనే వాస్తవం] స్వయంగా వేతన శ్రమ ఆధారంగా నెలకొన్న ఉత్పత్తి సాధనాలకు ఒక షరాస్థితిగా వుంటాయి. కాగా, రెండో సందర్భంలోనైతే, మార్పుచేయబడిన పంపిణీ సాధనాలు చారిత్రక క్రమంనుండి ఆవిర్భవించే ఒక కొత్త, పరివర్తిత ఉత్పత్తి ప్రాతిపదికనుండి ఉత్పన్నమవుతాయి. - గ్రుండ్రిస్సే (1857-8), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 385 నుండీ.
తమ సొంత శ్రమయొక్క సాంఘిక రూపాలు లేదా తమ సొంత సాంఘిక శ్రమయొక్క రూపాలు [అవేవైనాగానీ] వ్యష్టి శ్రామికులకు పూర్తిగా స్వతంత్రంగా ఏర్పడిన సంబంధాలు [అని గుర్తెరగాలి]. శ్రామికులు – పెట్టుబడికింద కలిపేసుకోబడ్డ విధమైన శ్రామికులు – ఈ సాంఘిక నిర్మాణాల్లో మూలకాంశాలై వుంటారు గానీ ఈ సాంఘిక నిర్మాణాలైతే వారికి చెందినవిగా వుండవు. కనుక అవి [సాంఘిక నిర్మాణాలు] శ్రామికులకు పెట్టుబడియొక్క రూపాలుగానే ఎదురు పడుతాయి; తమ వ్యక్తిగత శ్రమశక్తికి స్పష్టంగా భిన్నమై వుండే, పెట్టుబడినుండి తలెత్తుతూ, దానిలోనే కూర్చబడివుండే పెట్టుబడి సంబంధిత సమ్మేళనాలుగా [గోచరిస్తూ] తటస్థ పడుతాయి. ఇంకా, ఒక వైపున తమ సొంత శ్రమ శక్తే ఒక స్వతంత్ర శక్తిగా వుండలేనంత బలహీనంగా, అంటే, మరోలా చెబితే, పెట్టుబడిదారీ సంబంధాలకు బాహ్యంగా మనలేనంత శక్తిహీనంగా వాటిచే [ఈ సాంఘిక నిర్మాణాలచే] మార్పుగావించబడుతూ, ఉత్పత్తి చేయడానికి దానికుండే స్వతంత్ర సామర్థ్యం నాశనంగావించబడుతూ వుండేకొద్దీ, ఇదంతా [అంటే, సాంఘిక నిర్మాణాలు పెట్టుబడిరూపాలుగా శ్రామికులకు ఎదురుపడే పరిణామం] మరింత మరింత వాస్తవిక రూపం ధరిస్తూంటుంది. ఇక మరో వైపున యంత్రాలు అభివృద్ధిచేయబడడంతో శ్రమపరిస్థితులు సాంకేతికంగాకూడ శ్రమపై ఆధిపత్యం చెలాయిస్తూన్నట్లు, అదే సమయంలో అవి శ్రమ స్థానంలో తామే ప్రవేశించి [శ్రమకు బదిలీగా వచ్చి], దాన్ని అణచివేస్తూ, అది [శ్రమ] దాని స్వతంత్ర రూపాల్లో మనడాన్ని యిక పూర్తిగా అనవసరంగావిస్తూ వున్నట్లు అగు పడుతుంది. - అదనపు విలువ సిద్ధాంతాలు (1862), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 394.
కానీ మరి ఆస్తిసంబంధిత రాజకీయార్థశాస్త్రంపై శ్రమసంబంధిత రాజకీయార్థ శాస్ర్రం మరింత మహావిజయం సాధించేదొకటి ఇంకా వుండింది. అంటే మనం సహకారోద్యమంగురించి, ప్రత్యేకించి కొన్ని ధీర 'హస్తాలు' [కొంతమంది ధైర్యవంతులు] ఇతరుల సహాయంలేకున్నా తమంత తాముగా నెలకొల్పిన సహకార కర్మాగారాల (ఫాక్టరీల) గురించి మాట్లాడుతున్నామన్న మాట. ఈ మహత్తర సాంఘిక ప్రయోగాల విలువగురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. ఒక కూలీల [వేతన శ్రామికుల] వర్గమనేదాన్ని పనికి నియమించే ఒక యజమానుల వర్గం అనేది ఏదీ లేకుండానే ఆధునిక విజ్ఞానశాస్త్ర ఉత్తరువుల ప్రకారం పెద్దయెత్తున ఉత్పత్తి సాగించవచ్చని; ఫలితాలు సాధించడానికిగాను అసలుకు శ్రమచేసే మనిషిపైనే ఆధిపత్యం వహించే, అతడినుండి బలవంతంగా పిండుకునే సాధనాలుగా శ్రమ సాధనాలపై గుత్తాధిపత్యం చెలాయించాల్సిన అవసరం ఏమీ లేదని; బానిస శ్రమలాగా, అర్ధబానిస శ్రమలాగా కూలిశ్రమకూడ ఒక అనిత్యమైన, నిమ్నస్థాయి (inferior) [శ్రమ] రూపంమాత్రమేనని, ఇష్టపడే చేతులతో, సంసిద్ధమైన మనస్సుతో, ఉల్లాసహృదయంతో పనిచేసే సహవాసపు శ్రమ (associated labour) ముందు అది (కూలిశ్రమ) [వెలవెలబోతూ] అదృశ్యంకాకతప్పదనీ [అలా అంతరించడమే దాని భవితవ్యమనీ] వాళ్లు మాటలకుబదులు చేతలద్వారా నిరూపించి చూపారు. ఇంగ్లండులో సహకార వ్యవస్థకు రాబర్ట్ ఓవెన్ విత్తనాలు వేసాడు; ఇక ఐరోపాఖండంలో చేసిచూడబడ్డ కార్మికుల [సహకార] ప్రయోగాలు నిజానికి 1948 లో, ఏవో కల్పితమైనవిగాక దృఢంగా ప్రకటితమైనవైన సిద్ధాంతాలకు వ్యవహారాచరణలోని మొలకలని గ్రహించాలి. – ఆవిష్కరణోపన్యాసం (1864), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 536.
సరే, [కొంత మార్పుకోసం,] మనమిప్పుడొక స్వతంత్ర వ్యక్తుల సంఘ సముదాయం, ఉమ్మడి ఉత్పత్తి సాధనాలతో పనిచేస్తూ, ఆ పనిలో సమాజంలోని విభిన్న వ్యక్తులందరి శ్రమశక్తుల్ని చైతన్య యుతంగా సంఘసముదాయపు సమ్మిళిత శ్రమశక్తిగా ప్రయోగిస్తూ వుంటే ఎలా కళ్లకు కట్టగలదో ఊహించి చూద్దాం. రాబిన్సన్ [క్రూసో] యొక్క స్వభావలక్షణాలన్నీ యిక్కడకూడ పునరుక్తమౌతాయి గాని అవన్నీ ఏవో వైయక్తికమైనవై కాక సామాజికమైనవై వుంటాయి. అతడు [విచిత్రద్వీపంలోని ఒంటరివ్యక్తి రాబిన్సన్] ఉత్పత్తి చేసిన ప్రతిదీ కూడ పూర్తిగా అతడి సొంత వ్యక్తిగత శ్రమ ఫలితమే; కనుక స్వయంగా అతడి ఉపయోగానికే పనికివచ్చే వస్తువు. కాగా మన సంఘసముదాయపు ఉత్పత్తి మొత్తం ఒక సాంఘిక ఉత్పత్తిగా వుంటుంది. అందులో ఒక భాగం తాజా ఉత్పత్తి సాధనాలుగా పని చేసేది; అది సామాజికంగానే మిగిలి వుంటుంది. కాని మిగతా [ఇంకొక] భాగాన్ని సంఘసభ్యులు తమ బతుకుగడుపు సాధనాలుగా వాడుకొంటుంటారు [వినిమయం గావిస్తుంటారు]. పర్యవసానంగా ఈ భాగాన్ని వాళ్లనడుమ పంపిణీ చేయడం ఆవశ్యకమౌతుంది. ఈ పంపిణీ విధానం సంఘసముదాయపు ఉత్పాదక నిర్మాణాన్నిబట్టి, ఉత్పత్తిదారులు సాధించిన చారిత్రక వికాసపు మోతాదునుబట్టి మారుతూంటుంది. మరి కేవలం వర్తకపు సరుకుల ఉత్పత్తితో సమాంతరత చూచేందుకోసమని మాత్రమే మనమొకటి అనుకుందాం: బతుకుగడుపు సాధనాల్లో ప్రతి వ్యక్తిగత ఉత్పత్తిదారు వాటా [యిక్కడ సాముదాయిక ఉత్పత్తిలో సైతం] అతడు చేసిన శ్రమ కాలాన్ని బట్టే నిశ్చయించబడుతుందని అనుకుందాం. అటువంటి సందర్భంలో శ్రమ కాలం ఒక ద్వంద్వ పాత్ర వహిస్తుంది. ఒక నిశ్చితమైన సాంఘిక ప్రణాళికద్వారా దాన్ని వాటాలువేయడం సంఘసముదాయానికి వుండే వివిధ అవసరాలకూ, వాటినిమిత్తం చేయబడాల్సిన విభిన్న రకాల పనులకూ మధ్య ఒక సజావైన అనుపాతాన్ని నిలిపి సాగిస్తుంది. మరో వైపున అది ఉమ్మడి శ్రమలో ప్రతి వ్యక్తి చేసిన శ్రమ వాటాకూ, మొత్తం ఉత్పత్తిలోంచి వైయక్తిక వినిమయంకోసం ఉద్దేశించబడ్డ భాగంలో ఆ వ్యక్తి వాటాకూ కొలతగా పని చేస్తుంది. వైయక్తిక ఉత్పత్తి దారుల సామాజిక సంబంధాలు – వారి శ్రమలకూ, అలాగే వాటి ఉత్పత్తులకూ రెంటికీ వర్తించే సంబంధాలు – ఈ సందర్భంలో అతి సులభసామాన్యంగా, పూర్తిగా అర్థంచేసుకోబడగలిగేవిగా వుంటాయి; మరి కేవలం ఉత్పత్తి విషయంలోనే కాక పంపిణీ విషయంలో సైతం అవి అలాగే [సులభసామాన్యంగా, గ్రహణశక్యంగా] వుంటాయి. – పెట్టుబడి, సంపుటి 1 (1867), కార్ల్ మార్క్స్ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 440 నుండీ.
మొదటగా, శ్రమ అనేది మనిషీ, ప్రకృతీ రెండూ పాల్గొనే, మనిషి తన సొంత సంకల్పంతో తనకూ, ప్రకృతికీ నడుమనుండే భౌతిక ప్రతిచర్యల్ని మొదలుపెట్టి, వాటిని క్రమబద్ధీకరిస్తూ, అదుపుచేస్తూ వుండే ఒకానొక క్రమం. ప్రకృతి స్వీయశక్తుల్లో తానూ ఒకడైనా, అతడు తన్ను ప్రకృతికి ఎదురు నిలుపుకుంటాడు; ప్రకృతియొక్క ఉత్పత్తుల్ని తన కోర్కెలూ, అవసరాలకు తగ్గ రూపంలో భుక్తం చేసు కొనేందుకుగాను అతడు తన చేతులూ, కాళ్లూ, తన తలకాయా, అసలుకు తన శరీరపు సహజ శక్తులూ సర్వమూ ఒడ్డి ప్రకృతిని ఎదిరిస్తాడు. ఈ విధంగా బాహ్య ప్రపంచంపై చర్యగావిస్తూ, దాన్ని మార్చడంద్వారా అతడు తన సొంత స్వభావాన్నిసైతం అదే సమయంలో మార్చివేసుకొంటాడు. తనలో నిద్రాణమైవున్న [అంతస్థ] శక్తుల్ని అభివృద్ధి చేసుకొని, తన శాసనానికి విధేయంగా అవి పని చేసేట్లు వాటిని బలవంతపెడతాడు. మనకు కేవలం మనిషిలోని జంతువును మాత్రమే గుర్తుచేసే ఆ ఆదిమ సహజానుభూత (instinctive) శ్రమ రూపాల్నిగురించి మనమిప్పుడు వ్యవహరించడం లేదు. మానవ శ్రమ యింకా దాని ప్రథమ సహజానుభూత దశలోనే వుండే స్థితినుండి మనిషి తన శ్రమశక్తిని ఒక వర్తకపు సరుకుగా విపణి (మార్కెట్) కి తీసుకువచ్చే స్థితికి వచ్చే కాలావధి నిరవధికమై (ఇదమిత్తంగా ఇంత అని కొలవలేనంత – అగణ్యమై, అపారమై) వుంటుంది. అంటే ముందుగా తనను పూర్తిగా మానవీయమైందిగా ముద్రించుకునే రూపంలో శ్రమ వుండి వుంటుందని [అలా వుండి వుండాలని] మనం ముందుగా ఊహించుకుంటామన్నమాట. సాలెపురుగు నేతగాడి పనిని పోలే క్రియాకలాపాలు నిర్వహిస్తుంది; ఒక తేనెటీగ అయితే గొప్ప వాస్తు నిపుణులుకూడ సిగ్గుపడేంత చక్కగా తన గూళ్లు [పట్టులు] కట్టుకుంటుంది. కాని అత్యంత నాసిరకం వాస్తువేత్తకూ, అత్యుత్తమ తేనెటీగకూ మధ్య కొట్ట వచ్చినట్లు కనిపించే తేడా ఏమంటే, వాస్తువేత్త [ఏదో యాంత్రికంగా లేక సహజానుభూతంగా కాక] కట్టడాన్ని వాస్తవంగా నిర్మించేందుకు ముందు, దాన్ని మొదటగా తన కల్పనలో కట్టుకుంటాడు. ప్రతి శ్రమ క్రమం చివరలో మనకు లభించేది అతడి [శ్రామికుడి] కల్పనలో మొదట్లోనే వున్న ఫలితమేనని మనం గ్రహించగలం. తానే వస్తు పదార్థాలపై పని చేస్తున్నాడో వాటి రూపంలో మార్పును తీసుకు రావడమేకాక, తన పనిచేసే తీరుతెన్నులకు (modus operandi) ఒక సూత్రన్యాయం సమర్పించే విధంగా తన సొంత ఉద్దేశ్యాన్ని (లక్ష్యాన్ని) కూడ సాధిస్తాడు ఆ శ్రామికుడు. ఈ పనితీరుతెన్నుల సూత్రన్యాయానికి అతడు తన సంకల్పాన్ని అధీనం చేసుకోవాల్సి వుంటుందికూడ. మరి ఈ అధీనత (subordination) ఏదో క్షణికమైనది గానైతే వుండదు. శరీరావయవాల్ని ఆడించడమేకాక [అంటే వాటిచే శ్రమ చేయించడమే కాక] ఆ క్రియాకలాపమంతటిలోనూ శ్రామికుడి [పనివ్యక్తియొక్క] సంకల్పం స్థిరంగా అతడి ఉద్దేశ్యానికి అనుగుణంగానే వుండాల్సి వచ్చేట్లు ఆ [పని] క్రమం డిమాండు చేస్తుందికూడ. దీనర్థం సన్నిహిత శ్రద్ధాసక్తులు వహించవలిసి వుంటుందని అన్న మాట. పనిస్వభావంపట్ల, ఆ పని చేయబడే విధానంపట్ల ఆకర్షణ అతడికి ఎంత తక్కువగా వుంటే, కనుక ఆ పనివల్ల తన శారీరక, మానసిక శక్తియుక్తులకు తగు పాత్ర లభిస్తుందనే తృప్తి, ఆనందం అతడికి ఎంత తక్కువగా కలుగుతుంటే, అతడి శ్రద్ధాసక్తులు అంతగా ఎక్కువ సన్నిహితంగా వుండక తప్పనిసరై వుంటుందికూడ.
మరి ఈ శ్రమక్రమం యొక్క ప్రాథమిక కారణాంశాలు ఏమిటంటే, అవి – 1) మనిషియొక్క వ్యక్తిగత కార్యకలాపం, అంటే స్వయంగా [శ్రామికుడు చేసే] పనే; 2) ఆ పని విషయం; ఇంకా 3) దాని పరికరాలు [ఉపకరణాలు - instruments].
అక్షతస్థితిలోని నేల (ఆర్థిక పరిభాషలోనైతే నీళ్లుకూడ దీనిలో చేరివుంటుంది) మనిషికి ఆవశ్యక వస్తువుల్ని లేక బతుకుగడుపు సాధనాల్ని సిద్ధాన్నంలా సరఫరా చేస్తూంటుంది. అలాంటి అక్షత నేల [virgin land] మనిషికి స్వతంత్రంగా మనివుంటుంది; అది మానవశ్రమకు ఒక సార్వత్రిక లక్ష్యపదార్థమై వుంటుంది. శ్రమ వేటిని కేవలం వాటి పరిసరాలతో తక్షణసంబంధంనుండి వేరుగావించడం మాత్రమే చేస్తుందో అవన్నీ ప్రకృతి అయత్నపూర్వకంగా సమర్పించే శ్రమ లక్ష్యపదార్థాలని గ్రహించాలి. వాటి మూలకమైన నీటిలోనుంచి మనం పట్టుకునే చేపలు, అలాగే అక్షతారణ్యాల్లోంచి చెట్లు కొట్టి మనం పోగుచేసుకునే కలప, గనులనుండి మనం వెలికి తీసే ఖనిజాలు మొదలైనవన్నీ యిలాంటివే. కాని, అలాకాక శ్రమ లక్ష్య పదార్థంగనుక పూర్వశ్రమ ద్వారా వడబోయబడి వస్తే, అప్పుడు మనం దాన్ని ముడి సరుకు (లేదా ముడిపదార్థం – raw material) అంటాము. ఉదాహరణకు అప్పటికే వెలికి తీయబడి, కడగబడడానికి (క్షాళన ప్రక్రియకు) సిద్ధంగా వున్న ఖనిజం ఈ కోవకే వస్తుంది [అంటే ముడిసరుకుగా లెక్కకు వస్తుంది]. ముడి సరుకులన్నీ కూడ శ్రమ లక్ష్యపదార్థాలే గానీ ప్రతి శ్రమ లక్ష్యపదార్థమూ ఐతే ముడిసరుకు కాబోదని మనం గ్రహించాలి. శ్రమచే అది ఎంతోకొంత మార్పుకు/ సవరణకు గురవుతేనే, అది అలా [అంటే ముడి సరుకుగా] రూపొంద గల్గుతుంది.
శ్రమ పరికరం అంటే శ్రామికుడు తనకూ, తన శ్రమలక్ష్య పదార్థానికీ మధ్య పెట్టుకునివుండే, అతడి కార్యకలాపానికి ఒక వాహకంగా ఉపయోగిస్తూండే ఒకానొక వస్తువు లేదా వస్తుమిశ్రమం. అతడు కొన్ని పదార్థాల యాంత్రిక, భౌతిక, రసాయనిక ధర్మాలను ఉపయోగించి యితరేతర పదార్థాలను తన ఉద్దేశ్యాలకు అధీనం గావించుకుంటాడన్న మాట. మనిషి కేవలం తన కాళ్లు చేతుల సాయంతోనే ఏరుకోగల పండ్లవంటి సుసిద్ధంగా వుండే బతుకు గడుపు సాధనాల్ని పక్కకు పెడితే, శ్రామికుడు స్వయంగా కలిగి వుండే మొట్టమొదటి వస్తువు శ్రమలక్ష్యపదార్థం కాదు, శ్రమ పరికరమేనని మనం గమనించాలి. ఈ విధంగా ప్రకృతికూడ [శ్రమచేసే] మనిషి కార్యకలాపానికి [తోడ్పడే] ఒక అవయవంగా, బైబుల్ [లో ఏమి చెప్పివున్నా దాని] తో నిమిత్తంలేకుండా అతడు తన స్వీయస్థాయి [హోదా] ని పెంచుకునే విధంగా తన సొంత శరీరపు అవయవాలకు చేర్చుకొనే ఒక అదనపు అవయవంగా రూపొందుతుంది. అంటే మనిషికి ఒక ఆద్య ఆహారనిల్వగదిలా వున్నట్లే ఈ భూమి అతడికి ఒక ప్రాథమిక [ఆద్య] పనిముట్లగదిగా కూడ అవుతుందన్నమాట. ఉదాహరణకు, అది [భూమి] అతడికి విసరడానికీ, నూరడానికీ, అదమడానికీ, కోయడానికీ, ఇలా ఇలా [అనేక అవసరాలకుగాను] వలసిన రాళ్లు సరఫరా చేస్తుంది. స్వయంగా భూమిసైతం ఒక శ్రమ పరికరమే; అయితే అది ఎప్పుడైనా ఆ విధంగా [అంటే శ్రమ పరికరంగా] వ్యవసాయంలో ఉపయోగించ బడితే అప్పటికే అనేక యితర పరికరాల శ్రేణి మొత్తమూ, అలాగే తులనాత్మకంగా శ్రమయొక్క ఉన్నతాభివృద్ధీ, మనివుండి వుంటాయనే అంతరార్థం సూచితమౌతుంది. శ్రమ అతి తక్కువ అభివృద్ధి అయినా చాలు – దానికి [వెంటనే] ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పరికరాలు అవసరం పడుతాయి. కనుకనే మనకు అత్యంత పురాతన గుహల్లోసైతం రాతి ఉపకరణాలు, ఆయుధాలు కనిపిస్తాయి. మానవ చరిత్రయొక్క అత్యంత తొలి కాలావధిలో మచ్చికచేయబడ్డ [పెంపుడు] జంతువులు, అంటే నిశ్చిత ఉద్దేశ్యాలకు గాను పెంపకం చేయబడ్డ, ఆనక శ్రమసాధనాల ద్వారా మార్పులు-చేర్పులకు గురైన జంతువులు, ప్రత్యేకంగా మలచబడ్డ రాళ్లు, కలప ముక్కలు, ఎముకలు, గుల్లలు-గవ్వలతో బాటు, శ్రమ పరికరాలుగా ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయి. శ్రమ పరికరాల తయారీ, ఉపయోగాలు కొన్ని రకాల జంతువుల్లోసైతం బీజ రూపంలో వుండొచ్చు నిజమేగానీ, మానవ శ్రమ క్రమానికి మాత్రమే అది ఒక ప్రత్యేక స్వభావధర్మంగా వుంటుంది. అందుకే, మనిషి పనిముట్లు చేసే ఒక జంతువు అని చెప్పి నిర్వచిస్తాడు ఫ్రాంక్లిన్. ఎప్పుడో అంతరించిపోయిన (extinct – విలుప్త) జంతుజాతుల అస్తిత్వ నిర్ణయానికి శిలాజ అస్థికలు ఎంత ముఖ్యావసరమో, అలాగే సమాజపు విలుప్త ఆర్థిక నిర్మాణాల పరిశోధనకోసం గతకాలాలనాటి శ్రమ పరికరాల అవశేషాలకూ అంతే ప్రాముఖ్యత వుంటుంది. చేయ బడ్డ వస్తువులుకావు గాని అవెలా, ఏ పరికరాలచే చేయబడ్డాయనే సంగతులే మనకు విభిన్న ఆర్థిక శకాలను వేరుచేసి చూడగల విచక్షణాశక్తిని ప్రసాదిస్తాయి. – పెట్టుబడి, సంపుటి 1 (1967); ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 455 నుండీ.

ఇంకా చదవడానికి …

1. సి. ఆర్థర్, శ్రమ గతితర్కం: మార్క్స్ - హెగెల్తో ఆయన సంబంధం, ఆక్స్ఫర్డ్, 1986.
2. ఎస్. అవినేరీ, కార్ల్ మార్క్స్ సామాజిక, రాజకీయ చింతన, కేంబ్రిడ్జి, 1968.
3. ఆర్. బీమిష్, మార్క్స్ – పద్ధతి, శ్రమవిభజన, ఇల్లినాయిస్, 1992.
4. డి. బ్రేబ్రూక్, మార్క్స్యొక్క పరాయీకరణ సిద్ధాంతంలో రోగపరీక్ష- చికిత్స, సోషల్ రిసర్చ్, శరత్కాలం, 1958.
5. జె. ఎల్స్టర్, పనిలో, రాజకీయాల్లో స్వీయ-గుర్తింపు: మంచి జీవితం గురించిన మార్క్సిస్టు భావన, సోషల్ ఫిలాసఫీ అండ్ పాలిసీ, సం. 3 (వసంతం, 1986).
6. జె. మెఫామ్, డి. హెచ్. రుబెన్ (సం.), మార్క్సిస్టు తత్వజ్ఞానంలో సమస్యలు, సంపుటం 1 : గతితర్కం – పద్ధతి, బ్రైటన్, 1979.
7. జె. మిల్లర్, చరిత్ర – మానవుని మనుగడ: మార్క్స్నుండి మెర్లో పాంటీ దాకా, బర్కిలీ, 1979, అధ్యా. 3.
8. బి. ఓల్మన్, పరాయీకరణ: పెట్టుబడిదారీ సమాజంలోని మనిషిపై మార్క్స్ విమర్శ, కేంబ్రిడ్జి, 1971.
9. ఎల్. సీవ్, మార్క్సిస్టు సిద్ధాంతంలో మనిషి, హాసక్స్, 1978, భాగం 2 చివర.
10. ఐ. వాల్లిమన్, ఎడబాటు: మానవ స్వభావంగురించి మార్క్స్ భావన – శ్రమ విభజన, వెస్ట్పోర్ట్, 1981.

* * * * *

(అయిపోయింది)

1 comment:

కెక్యూబ్ వర్మ said...

మంచి విజ్నాణదాయకమైన అంశాలను పరిచయం చేస్తున్నారు. ధన్యవాదాలు.