Saturday, August 7, 2010

Karl Marx, DIALECTIC, 'గతితర్కం', Part 1

గతితర్కం

వ్యాఖ్యానం

ప్రాచీన గ్రీకులైన జీనో, సోక్రటీస్, తదితరులకు సంబంధించి, ఏదైనా ఒక సమస్యనుగురించి ప్రశ్న-జవాబుల రూపంలో చర్చిస్తూ, యిలాంటి చర్చద్వారా ఒక సమతౌల్య దృక్పథాన్ని వికసింపజేసు కొనే కళను గతితర్కం అని పేర్కొనేవారు. అలాగే సాంప్రదాయిక క్రైస్తవ మతశాస్త్రంకూడ అభావం (నేతి నేతి అనడం - negation) ద్వారా అనేక రూపాల్లో గతితార్కిక అభివృద్ధికిసంబంధించిన భావనను వ్యక్తపరచడం జరిగింది.[1] ఈ రెండు దృక్పథాలూకూడ (ప్రశ్న-జవాబుల చర్చ, ఒక సమతౌల్యదృక్పథ వికాసం) చరిత్రగురించిన హెగెల్యొక్క దృక్పథంలో కేంద్ర ప్రాధాన్యతా అంశాలైనాయి; వాటివంతుకు అవి [హెగెల్ గతితర్కభావనలు] మార్క్స్యొక్క గతితర్క భావనల్ని ప్రగాఢంగా ప్రభావితం చేసాయి. ఫ్రెంచి విప్లవం గురించి మాట్లాడుతూ హెగెల్, "మనిషి మనుగడకు కేంద్రం అతడి తలకాయ [బుర్ర] లో, అంటే హేతుబుద్ధిలో, వుంటుంది; దాని ప్రేరణలోనే అతడు వాస్తవికతా ప్రపంచాన్ని నిర్మిస్తాడు," అని చెప్పివున్నాడు; మరి అదే విశ్వాసంతో [తన గతితార్కిక చింతనను] మొదలుపెట్టుకుని ముందుకు సాగిపోతాడు. ఘటనా పరిణామ శాస్త్రం [లేక పరిణామాధ్యయన విజ్ఞానం - Phenomenology] అనే తన అత్యంత మహత్తర రచనలో హెగెల్ తత్వచింతనలోనికి చారిత్రక గమనాన్ని పున: ప్రవేశపెడుతూ, మానవ మనస్సు అఖండ [లేదా పరమరూఢ - absolute] జ్ఞానాన్ని సాధించుకోగలదని ఉద్ఘాటిస్తూ, మనస్సు లేక లోసత్తువ [ఆత్మ లేక ఉసురు - spirit] వికాసాన్ని జాడతీస్తాడు. ఆయన [హెగెల్] మానవ చైతన్య వికాసాన్ని ఇప్పుడు, ఇక్కడే వున్న [తత్కాల స్థలావస్థల్లోని] పరిణామాల తక్షణ గ్రహణంనుండి, ఆత్మచైతన్యపు అంటే ప్రపంచాన్ని విశ్లేషించి, తదనుగుణంగా తన చర్యల్ని రూపొందించుకోవడానికి అనుమతించే అవగాహనయొక్క దశదాకా విశ్లేషిస్తాడు. దాని తర్వాత వచ్చేది స్వయంగా హేతువు [లేక హేతుబుద్ధి - reason] యొక్కఅంటే యథార్థాన్ని అవగాహన చేసుకొనడం యొక్కదశ వస్తుంది. ఆ తర్వాత ఆత్మ [ఉసురు - Spirit], మతం, కళల ద్వారా, ఒక అఖండ జ్ఞానాన్ని సంతరించుకొన్నది; ఇక [ఆత్మోన్నత] స్థాయిలో మనిషి ప్రపంచమంతా తన సొంత హేతుబుద్ధియొక్క వివిధ దశలు మాత్రమేనని గుర్తిస్తాడు. హెగెల్ ఈ స్థితుల్ని [లేక దశల్ని], అవి మానవ మస్తిష్కపు సృష్టులే అయినప్పటికీ, వాటిని మానవ మస్తిష్కానికి స్వతంత్రమైనవి, అంతకంటే ఉన్నతమూ, శ్రేష్టమూ అయినవి అని భావించబడినంత మేరకు, 'పరాయీకరణలు' గా వుంటాయని అంటాడు. అదే సమయంలో అఖండ జ్ఞానం ఒక రకమైన మానవ ఆత్మ స్మృతిచర్వణం [recapitulation of spirit – ఆత్మ లేక ఉసురు తన వెనుకటి జ్ఞాపకాల్ని నెమరువేసుకొనడం] లాంటిదై వుంటుంది ఎందుకంటే దానికిచెందిన వివిధ దశల్లో ప్రతి మలిదశా అంతకు ముందటి దశను అధిగమించినప్పటికీ, పూర్వ దశలోని మూలకాంశాలను కోల్పోకుండా అట్టిపెట్టుకునివుంటుంది గనుక. మరిలా అణచివేత, సంరక్షణలు రెంటినీ పొందుపర్చుకున్న గమనాన్ని హెగెల్‌ [జర్మన్‌భాషలో] ఆఫ్‌బెంగ్‌ అనే ఒక ద్వంద్వార్థంగల పదంతో పేర్కొన్నాడు. అంతేగాక, హెగెల్‌ 'రుణాత్మకతయొక్క అధికారశక్తి' (power of the negative) నిగురించికూడ మాట్లాడుతాడుఆయన ఆలోచనేమిటంటే వర్తమాన విషయ వ్యవహారాల స్థితిగతులకూ, అవి [కాలక్రమంలో] పరివర్తన చెందే పరిణామాలకూ మధ్య సదా ఒక ఉద్రిక్తత (tension) నెలకొనివుంటుంది, ఎందుకంటే వర్తమాన విషయవ్యవహార స్థితియైనా రుణీకరించబడే [అభావీకరించబడే – being negated], మరో ఏదైనా విషయవ్యవహారంగా మార్పుచెందే క్రమంలోవుంటుంది గనుక. మరి క్రమమే గతితర్కం అనేది హెగెల్‌ ఉద్దేశించి చెప్పే అర్థం.

"దాని [గతితర్కపు] సాధారణ పనిసేత రూపాన్ని ఒక సమగ్రమైన, చైతన్యయుతమైన పద్ధతి [లేక సరళి] లో సమర్పించిన" ప్రథమ గతితార్కిక చింతకుడు హెగెలేనని మార్క్స్ ఆ తర్వాతి కాలంలో పేర్కొనివున్నాడు.[2] హెగెల్యొక్క భావవాద గతితర్కాన్ని [సరిగా తిప్పి] దాని కాళ్లపై నిలబెట్టాలని మార్క్స్ ఉద్దేశించాడు [నిజమే] గాని దాన్ని ఆయన ఆ తర్వాత ఏంగెల్స్ మొదలు పెట్టిన సాంప్రదాయ ప్రకారం ఒకానొక గతితార్కిక భౌతిక వాదాన్ని[3] ప్రతిపాదించడంద్వారానైతే అలా చేయలేదనే విషయం స్పష్టంగా గ్రహించడం ఎంతైనా ముఖ్యం. ఏంగెల్స్కు సంబంధించి చెబితే ఇలాంటి భౌతికవాద గతితర్కం ప్రాథమికమైన (ప్రాధాన్యంగల్గిన) దనీ; అభావంయొక్క అభావం (negation of negation), విరుద్ధాంశాల పరస్పర చొరబాటు-పరస్పరాధారితత్వం, పరిమాణం [పరిమాణాత్మక మార్పులు] గుణం [గుణాత్మక మార్పులు] గా పరివర్తన చెందడం అనే సూత్రాలతో దీన్ని సంక్షేపంగా వివరించ వచ్చనీ ఏంగెల్స్ భావించాడు. ఆ మాటకు, హెగెల్కూడ అలాగే భావించివున్నాడు. మార్క్స్ [సైతం] కొన్ని నిశ్చిత సాంఘిక పరిస్థితుల్లో ద్రవ్యం [డబ్బు] లో సంభవించే పరిమాణాత్మక పెరుగుదల దాన్ని పూర్తిగా గుణాత్మకంగా పెట్టుబడిగా మార్చగలదనీ, యిది పరిమాణం గుణంగా పరివర్తన చెందగలదు [అలా చెందుతుంది] అనే హెగెల్ సూత్రానికి ఒక నిదర్శనంగా నిలుస్తుందనే వాస్తవాన్ని ఉల్లేఖించడానికి ఎంతో సుముఖంగా వుండినాడు [ఇచ్చగించాడు].[4] పెట్టుబడి మొదటి సంపుటం చివరన ఆయన (మార్క్స్) - పెట్టుబడిదారీ ఉత్పత్తివిధాన ఫలితమైన పెట్టుబడిదారీ భుజింపు విధానం (mode of appropriation) పెట్టుబడిదారీ ప్రైవేటు (స్వీయ) ఆస్తిని సృష్టిస్తుంది. యజమాని (సొంత) శ్రమపై ఆధారపడి వున్నటువంటి వ్యక్తిగత ప్రైవేటు (స్వీయ) ఆస్తియొక్క మొదటి అభావీకరణ (first negation) యిది. అయితే, ఈ పెట్టుబడిదారీ ఉత్పత్తి ఒక ప్రకృతి సూత్రంలా అనివార్యత (inexorability) తో - దాని సొంత అభావాన్నే కంటుంది (ప్రసవిస్తుంది - begets). అదే అభావంయొక్క అభావం (negation of negation),[5] అని రాసాడు. కాని, హెగెల్కు సంబంధించి, ఈ ప్రకృతి గతితర్కం అంతరాత్మ (లేక లోసత్తువ, లేక పరమ భావన - Spirit) యొక్క సార్వత్రిక మధ్యవర్తిత్వానికి అధీనమై వుంటుంది. కాగా, మార్క్స్కు సంబంధించైతే, ప్రకృతిగురించిన ఈ గ్రహణ (లేక అవలోకన - perception) ఒక చారిత్రక, గతితార్కిక సిద్ధాచరణ (praxis) కూ, మనిషికీ, ప్రకృతికీ నడుమ వుండే గతితర్కానికీ అధీనమై వుంటుంది.

హెగెల్ చరిత్రను ఒక గతితార్కిక వికాస క్రమంగా అర్థం చేసుకొన్నాడనేది నిశ్చయమే. అయితే, హెగెల్కు సంబంధించి శ్రమ అనేది సదా బౌద్ధికమైనదైతే, మార్క్స్కు సంబంధించి అది భౌతికమైనది మనుషుల భౌతిక అవసరాల్ని సంతృప్తిపర్చడానికి ఉద్దేశించబడినది. మార్క్స్కు సంబంధించి, మనిషికీ, ప్రకృతికీ నడుమ గతితార్కిక పరస్పర మార్పిడి (dialectical interchange) ఒక ప్రత్యేక ఉత్పత్తి విధానంద్వారా నిర్వర్తించబడుతుంది; మరి ఆ ప్రత్యేక ఉత్పత్తి విధానమే నూతన అవసరాల్నీ, వాటిని సంతృప్తి పరిచే సాధనాల్నీ సృష్టించివుంది ఆఖరుకు, మానవ ప్రకృతి (నైజం) స్వయంగా సాంఘిక మార్పుయొక్క గతితర్కానికి అధీనం చేయ బడుతుంది. ఇది దానివంతుకు కొత్త అవసరాలతో, పర్యవసానంగా అధికతరంగావించబడ్డ ఉత్పాదక శక్తులతో, కూడుకున్న ఒక కొత్త సాంఘిక వ్యవస్థీకరణ (నిర్మాణం - organization) ను సృష్టిస్తుంది. ఈ విధంగా, మానవులు తామున్న పరిస్థితులకు జడాత్మక [ఉత్పత్తి] ఫలాలుగాగానీ, లేదా తమ పరిస్థితుల్ని తమ ఇష్టప్రకారం మలుచుకొనే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఉన్నవారైగానీ వుండరు. "మనుషులు తమ సొంత చరిత్రను [తామే] నిర్మించుకుంటారు [నిజమే] గానీ, దాన్ని వాళ్లు సరిగ్గా తమకు ఎలా ఇష్టమైతే అలాగేనైతే నిర్మించుకో(లే)రు. తాము స్వయంగా ఎంపిక చేసుకొన్న పరిస్థితుల్లో దాన్ని నిర్మించుకో(లే)రు. కాకపోగా తమకు ప్రత్యక్షంగా [నేరుగా] ఎదురుపడ్డ, నిశ్చితంగా యివ్వబడ్డ, గతకాలంనుండి అంది వచ్చిన పరిస్థితుల్లోనే దాన్ని [చరిత్రను] నిర్మించుకొంటారు."[6]

మార్క్సియన్ గతితర్కపు సాధారణ చట్రం అసలుకు [1844నాటి] ఆర్థిక, తాత్విక రాతప్రతులు లోనే నెలకొల్పబడింది [అని చెప్పవచ్చు]. అందులో 'హెగెలియన్ గతితర్కంపై సాధారణ విమర్శ' అనే ఒక సుదీర్ఘ వ్యాసాన్ని మార్క్స్ అందుకే [అంటే, గతితర్క సాధారణచట్రం కొరకే] వినియోగించాడు. అందులో మార్క్స్, హెగెల్ రాసిన 'ఘటనా పరిణామ శాస్త్రం (Phenomenology) ' మహత్తు (గొప్పతనం) అంతా "రుణాత్మకతా గతితర్కం దాని చోదక, సృజనాత్మక సూత్రం" గా వుండడంలోనే వుందని ప్రకటిస్తాడు. [7] శ్రమ అనేది మనిషియొక్క ఆత్మధ్రువీకరణ సాధనమని హెగెల్‌ నిజంగానే భావించాడు. కాని విషయమై మార్క్స్ "ఆయన [హెగెల్‌] శ్రమయొక్క ధనాత్మక పక్షాన్నిమట్టుకే చూస్తాడుగాని దాని రుణాత్మక పక్షాన్ని గమనించడు. ఒక బాహ్యీకరణ (క్రమం) లోపల మనిషి తనలోతాను (himself) గా, అంటే బాహ్యీకృత మానవునిగా, అవడానికి సాధనం శ్రమనే. అయితే, హెగెల్కు తెలిసిన, ఆయన గుర్తించే, ఏకైక శ్రమ ఒక అనిర్దిష్ట, బౌద్ధిక శ్రమ మాత్రమే,"[8] నని విమర్శనాత్మకంగా [విడమర్చి] చెబుతాడు. హెగెల్కు సంబంధించి ఒకానొక అఖండ భావన [ఉసురు, లోసత్తువ లేక ఆత్మ - spirit] బాహ్య ప్రపంచం గుండా వీక్షిస్తూ వచ్చి, [చివరకు] దాన్ని [బాహ్య ప్రపంచాన్ని] అధిగమించి పోవడంలోనే గతితర్కం (యిమిడి) వుండగా, మార్క్స్ విషయానికొస్తే అది (గతితర్కం) మనిషికీ, ప్రకృతికీ నడుమ ఒక సుయుక్త (appropriate) సంబంధాన్ని నెలకొల్పే సమస్యకు సంబంధించింది మాత్రమే; ఈ రెండూ (మనిషీ, ప్రకృతీ) గతితర్కపు రెండు సమాన, యథార్థ ధ్రువాలుగా ఆయన [మార్క్స్] భావించి వీక్షిస్తాడు.

దీనితర్వాత ఆయన జీవితకాలమంతా, సుయుక్త సంబంధం అంటే కమ్యూనిజం విధంగా సాధించబడగలదు అనే విషయమే ఆయన [మార్క్స్‌] యొక్క అధ్యయనాలకు పరమార్థం (సలు లక్ష్యం) అయిపోయింది. పోతే, ఒక సృజనాత్మక రుణాత్మకత (creative negative) గా గతితర్కానికి అర్థం వున్నదనే భావన [ఇటు] ఆర్థిక, తాత్విక రాతప్రతులు కూ, [అటు] పెట్టుబడి కీ లంకె వేస్తుంది. పెట్టుబడి మొదటి సంపుటంలో ఆదిమ పోగుబడి (primitive accumulation) గురించీ, ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానాల పుట్టుకలను గురించీ చేసిన అధ్యయనం మార్క్స్యొక్క గతితార్కిక పద్ధతికి ఒక ఉత్కృష్టమైన (శ్రేష్టమైన - excellent) ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎందుకంటే, మార్క్సే స్వయంగా 1872 లో రాసినట్లు, గతితర్కం

"అస్తిత్వంలో వున్న వ్యవహారాల స్థితిని అవగాహన చేసుకొని, దాన్ని ధ్రువీకరించుతూ గుర్తిస్తున్నప్పుడు, అదే సమయంలో ఆ స్థితియొక్క అభావాన్ని (రుణీకరణ - negation ను), దాని అనివార్య విచ్ఛిత్తినికూడ గుర్తిస్తుంది. అది [గతితర్కం] ప్రతి చారిత్రకంగా వికసించిన సాంఘిక రూపాన్నీ [వ్యవస్థనూ లేక విధానాన్నీ] ఒక ద్రవాత్మక గమనంగా పరిగణిస్తుంది. అందుచేత దాని [ఆ సాంఘిక రూపపు] క్షణభంగుర అస్తిత్వాన్నెలా గుర్తిస్తుందో, అలాగే [అంతకు తీసిపోనివిధంగా] దాని అనిత్యస్వభావాన్ని [transient nature – అంటే పరివర్తనాశీల స్వభావం అనే అర్థంకూడ వస్తుంది] కూడ పరిగణిస్తుంది. ఎందుకంటే అది [గతితర్కం] దేన్నైనా తన [నెత్తిన] రుద్దడానికి దేన్నీ అనుమతించదు గనుక. "[9]

కాని యిక్కడ ఒక సున్నితమైన మెలిక [మెరుగుదల] కూడ వుంది. 1844 నాటి మార్క్స్ అయితే, ఆలోచన [లేదా చింతన] లోని అనిర్దిష్టత అనేది వాస్తవ ప్రపంచాన్ని గ్రహించజాలనిదిగా, లేదా కనీసం ఏదో ఏకపక్ష పద్ధతిలోమాత్రమే గ్రహించేదిగా, వుంటుంది కాబట్టి, అది [అనిర్దిష్ట చింతన] ఎలాగైనా తప్పించుకోబడాల్సిన ఒక అంశం [something to be avoided] గా భావించబడింది. కాని
గ్రండ్రిస్సే రాసే సమయానికి వచ్చేసరికి, అసలు వాస్తవ ప్రపంచాన్ని అవగాహన చేసుకోవాలంటే అంటే దాని పైపై రూపాల్లో నుండి దాని అంతరాంతరాల్లోకి చొచ్చుకు వెళ్లి దాని సారాంశాన్ని గ్రహించడానికి విలువ, శ్రమ వగైరా అనిర్దిష్ట భావనల్ని ఉపయోగించాల్సివస్తుందనీ, అలా ఉపయోగించినప్పుడే రాజకీయార్థ శాస్త్రం నిజంగా శాస్త్రీయం కాగలదనే దృఢ నిశ్చయానికి వచ్చేసాడు మార్క్స్. ఎందుకంటే మార్క్స్ రాసినట్లు, " పైకి అగుపించే రూపం, విషయాల [లేక పరిణామాల] సారాంశం రెండూ ప్రత్యక్షంగా ఏకీభవిస్తే [సూటిగా ఒక్కటైతే directly coincided] యిక విజ్ఞానశాస్త్రం అవసరం ఏముంటుంది? అలాంటప్పుడు సకల విజ్ఞానశాస్త్రాలూ అనావశ్యకమే అవుతాయిగదా? "[10] హెగెల్యొక్క ఘటనాపరిణామ శాస్త్రం (Phenomenology) పై కంటే ఆయన [హెగెల్] రాసిన తర్కం (Logic) పైనే మార్క్స్ తన ఆసక్తిని మళ్లీ కొత్తగా పెంచుకోవడం [పునర్నవీకరించుకోవడం], ఈ సారాంశానికీ, గోచరరూపాలకూ నడుమ అంతరానికి [లేక విచక్షణకు] పాక్షికంగానైనా అంకురార్పణ చేసిందని చెప్పవచ్చు. కాని తన గ్రండ్రిస్సే లోనూ, పెట్టుబడి లోనూ మార్క్స్ తన విషయసమర్పణ గతితార్కికంగా వుండాలనే పట్టింపు కనబర్చినా, [ఆయనకుసంబంధించి] ఈ గతితర్కం అనేది కేవలం ఏదో ఒక [అనేక భావనల్లో ఒక] భావనగామాత్రమేనైతే వుండివుండలేదు.[11] అసలుకు చరిత్ర గమనమే గతితార్కికమైనది గనుక ఈ గమనాన్ని గురించిన స్వయంచైతన్యయుత సిద్ధాంతంకూడ స్వయంగా గతితార్కికమైనదై వుండాలనేది మార్క్స్ అభిప్రాయం. 'శాస్త్రీయ గతితార్కిక రహస్యం' అంటూ మార్క్స్ ప్రస్తావించింది ఆర్థిక కోవగతుల్ని [economic categories ని]" భౌతిక ఉత్పత్తి అభివృద్ధి క్రమంలో ఒక ప్రత్యేక దశకు అనుగుణమైవుండే చారిత్రక ఉత్పత్తి సంబంధాలకు సైద్ధాంతిక వ్యక్తీకరణలు" గా చూచి వ్యవహరించాలనే విషయాన్నే.[12] ఈ గతితర్కం శాస్త్రీయమైనది ఎందుకంటే, ఒకానొక అనిర్దిష్టీకరణ క్రమంద్వారా అది విపణి (మార్కెట్) సంబంధాల పైకగుపించే రూపాలను దాటివెళ్లి, ఉత్పత్తి సంబంధాల 'సారాంశం' అనే పరిభాషద్వారా అంటే, మార్క్స్‌ దృష్టిలో గతితర్కపు ప్రాథమిక రూపమైన మనిషికీ, ప్రకృతికీ నడుమ పాదార్థిక పరస్పర పరివర్తన అనే పరిభాష ద్వారా సంబంధాలను వివరించ జూస్తుంది కనుక.

* * *


[1] ఎల్‌. కోల్‌కోవ్స్కీ, మార్క్సిజపు ప్రధాన స్రవంతులు (Main currents of Marxism), ఆక్స్‌ఫర్డ్‌, 1978, సంపుటం 1 లోని ఆరంభ అధ్యాయాలు చూడండి.

[2] ఎంపిక చేసిన కార్ల్ మార్క్స్ రచనలు, పు. 420.

[3] (గతితార్కిక భౌతికవాదం అనే) పదబంధాన్ని మార్క్స్‌, ఏంగెల్స్‌లు ఎప్పుడూ ఉపయోగించలేదు. దీన్ని 1830లలో జోసెఫ్‌ డీట్‌జెన్‌ మొదటగా ఉపయోగించాడు; ఆనక లెనిన్‌ గురువైన ప్లెఖనోవ్‌ దీన్ని ప్రజాదరణలోనికి తెచ్చాడు.

[4] పోల్చి చూడు, కార్ల్ మార్క్స్, పెట్టుబడి, (మాస్కో, 1954), పు. 309.

[5] మార్క్స్, ఏంగెల్స్ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 487.

[6] మార్క్స్, ఏంగెల్స్ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 300.

[7] మార్క్స్‌, ఏంగెల్స్‌ల ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 300..

[8] పై ఉల్లేఖనే.

[9] కార్ల్ మార్క్స్యొక్క ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 420.

[10] కార్ల్ మార్క్స్, పెట్టుబడి (మాస్కో, 1971), సంపుటం 3, పు. 817.

[11] ఈ విషయంపై ఇందుకు విరుద్ధమైన అభిప్రాయానికిగాను దిగువ [ఇంకా చదవాలంటే శీర్షికకింద] ఉల్లేఖించబడిన ఎల్. కాలెట్టీయొక్క వ్యాసాన్ని చూడండి.

[12] మార్క్స్, ఏంగెల్స్ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 154.



No comments: