Saturday, August 7, 2010

Karl Marx, DIALECTIC, 'గతితర్కం', Part 3

సెయింట్ పీటర్స్బర్గ్కుచెందిన ఐరోపీయ వార్తాహరుడు [యూరపియన్ మెసెంజర్], పెట్టుబడి లో [నేను] అవలంబించిన పద్ధతిగురించి పూర్తిగా వ్యవహరించే ఒక రచనలో, నా విచారణా పద్ధతి కఠోర వాస్తవికంగా వున్నదిగాని నా సమర్పణా పద్ధతే, దురదృష్టవశాత్తూ, జర్మన్ గతితార్కికంగా వున్నదని వాపోతాడు. ఆయన ఇలా రాస్తాడు: " మొదటి చూపుకు, విషయసమర్పణకు చెందిన బాహ్యరూపాన్నిబట్టి (ఆ ప్రాతిపదికపై) తీర్పుచెప్పాల్సివస్తే, మార్క్స్ భావవాద తాత్వికులందరిలోకీ అత్యంత భావవాది [idealist – ఆదర్శవాది అని మరో అర్థం?] అదీ సదా జర్మన్లోనే, అంటే ఆ పదానికున్న చెడు అర్థంలోనే. కాని నిజానిజాల విషయానికి వస్తే మాత్రం ఆర్థిక విమర్శనాకృషిలో ఆయన తనకు పూర్వపు విమర్శకులందరికంటేకూడ అనంతంగా అధికతర వాస్తవికతా వాదిగా వుంటాడు; [కనుక, రీత్యా చూస్తే] ఆయన్ను భావవాది [లేక ఆదర్శవాది - idealist] అని ఏ విధంగానూ చెప్పలేము. " మరి రచయితకు జవాబు చెప్పాలంటే ఆయన సొంత విమర్శనుండే కొన్ని రచనాభాగాలు ఎత్తిచూపడంకంటే మెరుగైన మార్గం మరొకటి లేదు; పైగా రష్యన్‌ మూలం లభ్యశక్యం కాక [చింతిస్తూండే] నా కొందరు పాఠకులకు అది [అలా ఉల్లేఖించి చూపడం] ఆసక్తికరంగానూ వుండవచ్చు. నా పద్ధతియొక్క భౌతికవాద ప్రాతిపదికగురించి నేను యిదివరలో నా రచన - 'రాజకీయార్థ శాస్త్ర విమర్శ' లో చర్చించి వున్నాను; దాని ముందుమాట లోంచి ఒక ఉల్లేఖన యిచ్చిన తర్వాత రచయిత ఇంకా యిలా అంటాడు: మార్క్స్‌కు బాగా ముఖ్యమైన ఒక విషయమేమంటే, తాను వేటి పరిశోధనలో నిమగ్నమైవున్నాడో పరిణామాలకు సంబంధించిన సూత్రాన్ని కనుగొనడం. పరిణామాలకు ఒక నిశ్చిత చారిత్రక కాలంలో ఒక నిశ్చిత రూపం, పరస్పర సంబంధాలు వున్నంత మేరకు పరిణామాల్ని అనుశాసించే (govern) సూత్రం ఆయనకు అతిముఖ్యమైన అంశం కావడమొక్కటే కాదు. వాటి పరివర్తన [మార్పు] కూ, వాటి అభివృద్ధికీ, అంటే ఒక రూపాన్నుండి మరొక రూపానికి, ఒక సంబంధాల శ్రేణినుండి మరొక సంబంధాల శ్రేణికి వాటి పరివర్తనకుచెందిన సూత్రాన్ని కనుగొనడంకూడ ఆయనకు మరింత ముఖ్యమైన విషయం. ఒక సారి సూత్రాన్ని కనుగొంటే, ఆనక ఆయన అది [ సూత్రం] సాంఘిక జీవితంలో తన్ను తాను ఎలా అభివ్యక్తం చేసుకుంటుందో ఫలితాలు, ప్రభావాలనుగురించి సవివరంగా దర్యాప్తు చేస్తాడు. పర్యవసానంగా మార్క్స్‌ కష్టపడేదంతా ఒక్క విషయంగురించే: కచ్చితమైన శాస్త్రీయ పరిశోధనద్వారా సాంఘిక పరిస్థితులకు సంబంధించి నిశ్చితమైన వ్యవస్థలు పరంపరగా [ఒకదానితర్వాత మరొకటిగా] పుట్టుకువచ్చే ఆవశ్యకతను చూపించడం; ఇంకా సాధ్యమైనంత నిష్పాక్షికంగా తనకు ప్రాథమిక ఆరంభ అంశాలుగా పనిచేసే వాస్తవాలను వ్యవస్థాపించడం [పదిలంగా నిరూపించడం] గురించిన్నూ మరి యిందుకుగాను ఆయనగనుక ఒకే సమయంలో ప్రస్తుతమున్న విషయవ్యవహారాల వ్యవస్థ ఆవశ్యకతనూ, [ప్రస్తుతపు] మొదటి వ్యవస్థ అనివార్యంగా దేనిలోకి పరివర్తన చెందాల్సివస్తుందో ఆ మరొక వ్యవస్థయొక్క ఆవశ్యకతనూ రెంటినీ నిరూపిస్తే అదే ఎంతో చాలు[తుంది]. మరిదంతా మనుషులు నమ్మినా, నమ్మకున్నా, ఈ విషయంగురించి వాళ్లకు ఎరుక వున్నా, లేకున్నా సంభవించే పరివర్తన సుమండీ. సాంఘిక గమనాన్ని ఒక ప్రకృతిచరిత్ర క్రమంగా చూచి వ్యవహరిస్తాడు మార్క్స్; అది మానవ సంకల్పానికీ, చైతన్యానికీ, మేధస్సుకూ స్వతంత్రంగా వుండేవేగాక, అంతకంటే, తద్విరుద్ధంగా, ఆ సంకల్పాన్నీ, చైతన్యాన్నీ, మేధస్సునూ నిశ్చయించే సూత్రాలు ఆ సాంఘిక గమనాన్ని అనుశాసిస్తాయని చెబుతాడాయన. మరి నాగరికతా చరిత్రలో [మానవ] చైతన్యం [చైతన్యయుత మూలకాంశం] యింత అధీన [ద్వితీయప్రాధాన్యతాయుతగౌణమైన - subordinate] పాత్రను పోషించేట్లయితే, ఇక [అలాంటప్పుడు] నాగరికతనే విషయవస్తువుగా పరిశీలించే ఏ విమర్శనాత్మక విచారణైనాగానీ చైతన్యపు ఏ రూపాన్నయినా, లేదా చైతన్యపు ఏ ఫలితాన్నయినా తనకు [అంటే విచారణకు] ప్రాతిపదికగా వుంచుకొన జాలదు - [మరి దేన్నయినా ప్రాతిపదిక చేసివుంచుకోవచ్చేమోగానీ] - అనేది స్వయంస్పష్టమే గదా. అంటే, భావం [లేక చింతన] కాదు, కేవలం భౌతిక పరిణామంమాత్రమే దానికి [అంటే విమర్శనాత్మక విచారణకు] ప్రారంభాంశంగా ఉపయోగపడగలదు అని చెప్పడమన్న మాట. ఒక వాస్తవాన్ని, ఏవో భావాలతోగాక, మరొక వాస్తవంతో ఎదురుచేసి పోల్చడానికే యిలాంటి విచారణ తన్నుతాను పరిమితం చేసుకుంటుంది. విచారణకు ప్రధానంగా కావల్సిన విషయం [పోల్చబడేటటువంటి] రెండు వాస్తవాలనూ సాధ్యమైనంత కచ్చితంగా [సరిగ్గా - accurate గా] పరిశోధించడం, రెండు వాస్తవాలూ, వాటి పరస్పర సంబంధంలో, ఒక పరిణామ క్రమంయొక్క భిన్న ఘటనలుగా నిజంగా రూపొందివున్నాయా [అని ఖరారు చేసుకొనడమే]; అయితే అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఇలాంటి పరిణామపు వివిధ దశలు తమను వేటిలో ప్రదర్శించుకొంటాయో ఆ పరంపరల్ని, వరుస ఘటనలు, క్రమానుగత శ్రేణుల్ని కఠోరంగా [కచ్చితంగా] విశ్లేషించడమే. అయితే [ఇక్కడ] ఆర్థిక జీవితపు సాధారణ సూత్రాలన్నీ, వాటిని అన్వయిస్తున్నది వర్తమానానికా, భూతానికా [గతానికా] అనేదానితో నిమిత్తంలేకుండా ఒకేలా వుంటాయని [కొందరు] అనవచ్చు. కాని మార్క్స్ ఈ వాదాన్ని సూటిగా నిరాకరిస్తాడు. ఆయన ప్రకారం, ఇలాంటి [సర్వకాల సర్వావస్థలకు వర్తించే] అనిర్దిష్ట సూత్రాలేవీ [ఉనికిలో] వుండవు. కాకపోగా, ఆయన అభిప్రాయంలో ప్రతి చారిత్రక కాలానికీ దాని సొంత అనిర్దిష్ట సూత్రాలుంటాయిసమాజం ఒక నిశ్చిత అభివృద్ధి కాలపు పరిథిలో అడుగుపెట్టి, ఒక నిశ్చిత దశనుండి మరొక దశకు సాగిపోతూన్న వెంటనే అది [సమాజం] ఇతర సూత్రాలకుకూడ కట్టుబడడం మొదలవుతుంది. ఒక్క మాటలో [చెబితే], జీవశాస్త్రానికిచెందిన ఇతర శాఖల్లోని పరిణామ చరిత్రను పోలిన ఘటనాక్రమాన్ని ఆర్థిక జీవనం మనకు సమర్పిస్తుంది. పాతకాలపు ఆర్థికవేత్తలు ఆర్థిక సూత్రాలను భౌతిక శాస్త్ర, రసాయన శాస్త్ర సూత్రాలతో సమంగా పోల్చిచూసి తప్పే చేసారు; ఆర్థిక సూత్రాల స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. పరిణామాలను మరింత సమగ్రంగా విశ్లేషించినప్పుడు సాంఘిక ఆంగికవ్యవస్థలు (organisms) తమలో తాము మౌలికంగా మొక్కలూ, జంతువులూ తమలోతాము ఎంత ప్రాథమికంగా భిన్నిస్తాయో అంత మౌలికంగా విభేదిస్తాయని విశదమవుతుంది. అంతే కాదు, ఈ ఆంగికవ్యవస్థలు మొత్తంగా వేర్వేరు నిర్మాణాల్లో వుండడంవల్ల, వాటి వేర్వేరు అంగాల్లో మార్పులవల్లనూ, ఆ అంగాలు ఏ పరిస్థితుల్లో పనిచేయాల్సివస్తుందో ఆ విభిన్న పరిస్థితుల మూలంగానూ, తదితర కారణాలన్నింటి పర్యవసానంగా ఒకే పరిణామం అనేక భిన్నసూత్రాలకింద సంభవించడంకూడ జరుగుతూంటుంది. ఉదాహరణకు, జనాభా సూత్రాన్నేగనుక తీసుకుంటే, అది సర్వ కాల, సర్వ స్థల, సర్వావస్థల్లోనూ ఒకేలా వుంటుందనే విషయాన్ని మార్క్స్ ఒప్పుకోడు. కాగా, తద్విరుద్ధంగా, ప్రతి అభివృద్ధి దశకూ దాని సొంత జనాభా సూత్రం వుంటుందని ఉద్ఘాటిస్తాడుకూడఉత్పాదక శక్తియొక్క అభివృద్ధి మోతాదు మారుతూండేకొద్దీ, సాంఘిక పరిస్థితులూ, వాటిని అనుశాసించే సూత్రాలూకూడ మారుతూంటాయి. మరి [ఇక్కడ] పెట్టుబడి పాలనలో నెలకొల్పబడ్డ ఆర్థిక వ్యవస్థను ఈ దృక్కోణంనుండి చూస్తూ, వివరిస్తూ పోయే కర్తవ్యాన్ని తనపై వేసుకున్నప్పుడు మార్క్స్, ఆర్థికజీవనాన్ని గురించిన ప్రతి ఖచ్చితమైన పరిశోధనకూ వుండాల్సిన లక్ష్యాన్నే [ఉద్దేశ్యాన్నే] ఒక ఖచ్చితమైన శాస్త్రీయ పద్ధతిలో ప్రతిపాదిస్తున్నా డంతమాత్రమే. ఒక నిశ్చిత సాంఘిక ఆంగికవ్యవస్థ (social organism) యొక్క పుట్టుక, ఉనికి, అభివృద్ధి, అంతాలనూ, దానిస్థానే మరొక, అంతంటే ఉన్నతమైన, ఆంగికవ్యవస్థ తెచ్చిపెట్టబడడాన్నీ [లేక, రావడాన్నీ] క్రమబద్ధం చేసే ప్రత్యేక సూత్రాలను వెల్లడించ [గల్గ] డంలోనే ఇలాంటి విచారణయొక్క శాస్త్రీయ విలువ యిమిడివుంటుంది. నిజానికి మార్క్స్ పుస్తకానికున్న విలువ యిదే. "

మరి ఇదే వాస్తవంగా నా [అంటే మార్క్స్యొక్క] పద్ధతి అని తాను భావిస్తున్నదాన్ని యింత స్పష్టంగానూ, ఇక ఆ పద్ధతిని నేను అన్వయించిన తీరుగురించైతే యింత ఔదార్యంతోనూ, ఈ రచయిత చిత్రీకరిస్తున్నప్పుడు, ఇక గతితార్కిక పద్ధతిని కాకుంటే మరి దేన్ని అతడు చిత్రీకరిస్తున్నట్లబ్బా?!

పోతే, సమర్పణా పద్ధతి [method of presentation], రూపంలో, విచారణా పద్ధతి [method of inquiry] కి భిన్నంగా వుండాల్సిందే [వుండక తప్పదు] మరి. ఈ రెండవది [విచారణా పద్ధతి] విషయ సమాచారాన్ని వివరంగా సేకరించి (appropriate), దాని విభిన్న అభివృద్ధి రూపాల్ని విశ్లేషించి, వాటి నడుమనుండే అంతరంగ సంబంధం (inner connection) యొక్క జాడ తీయాల్సివుంటుంది. ఈ పని అంతా చేయబడ్డ తర్వాతే వాస్తవ గమనాన్ని [పరివర్తనను] తగినంతగా వర్ణించడం వీలవుతుంది. ఈ పనిని గనుక విజయవంతంగా నిర్వర్తిస్తే, విషయవస్తువు జీవనాన్ని ఒక అద్దంలోలాగా యథార్థంగా ప్రతిబింబించగలిగితే, అప్పుడు మన ఎదుట అంతకుముందే నెలకొల్పబడ్డ ఒక కట్టడం [ఒక పూర్వనిర్ణీత నిర్మాణం - apriori construction] నిలిచివుందా అన్నట్లగుపించవచ్చు.

నా గతితార్కిక పద్ధతి హెగెలియన్ [గతితార్కిక] పద్ధతికి భిన్నమైందే కాక దానికి నేరుగా [లేక, సూటిగా] విరుద్ధమైందికూడ. హెగెల్కు సంబంధించి మానవ మస్తిష్కపు జీవితక్రమం, అంటే ఆలోచనా క్రమం దీన్నే 'భావన' అనే పేరిట ఆయన ఒక స్వతంత్ర వస్తువుగా మార్చివేస్తాడుకూడవాస్తవ ప్రపంచంయొక్క యథార్థ దైవం [సృష్టికర్త - demiurgos] గా వుంటుంది; పోతే, వాస్తవ ప్రపంచం ఈ భావనయొక్క బాహ్య, ఘటనాత్మక రూపంగా వుంటుందంత మాత్రమే.* కాగా, నాకు సంబంధించైతే, తద్విరుద్ధంగా, అసలుకు భావన [లేక ఆదర్శకల్పన - ideal] అనేది మానవమస్తిష్కంచే ప్రతిబింబించబడి, ఆలోచనారూపాలుగా మార్చబడే భౌతిక ప్రపంచం తప్ప మరేమీ కాదు.

హెగెలియన్‌ గతితర్కపు నిగూఢ [భ్రమాత్మక - mystifying] పక్షాన్ని నేను ముప్పై ఏళ్ల క్రితమే, అప్పట్లో అది [హెగెలియన్‌ గతితర్కం] ఫ్యాషన్‌గావున్న తరుణంలోనే, విమర్శించివున్నాను. అయితే నేను పెట్టుబడి [దాస్‌ కాపిటల్‌], మొదటి సంపుటంగురించి కృషి చేసేటప్పటికి [పరిస్థితి మారిపోయింది]. ఈ రోజుల్లో సంస్కృతీపూర్ణ జర్మనీ [cultured Germany] గురించి గొంతు చించుకుని మాట్లాడుతున్నారే, అసూయాగ్రస్త, దురహంకార పూరిత, అంతంతమాత్రపు పాతకాల మేధావులు (epigoni) అంతా అప్పట్లో హెగెల్‌ విషయంలో [చాల విచారకరంగా], లెస్సింగ్‌ కాలంలో ధీరుడైన మోసెజ్‌ మెండెల్‌సాన్‌ గనుక స్పినోజా విషయంలో ఎలా వ్యవహరించాడో సరిగ్గా అలాగే అంటే ఆయన 'ఒక చచ్చిన కుక్క' అన్నట్లుగావ్యవహరించసాగారు. కనుక [నేనందుకు మండిపడి, అందుకు ప్రతిచర్యగా] నేను మహాబలి చింతకుని శిష్యుడ్నని బాహాటంగా, ప్రమాణపూర్వకంగా చెప్పుకోసాగాను. అంతేగాక, అక్కడక్కడా, [పెట్టుబడిలోని] విలువ సిద్ధాంతాన్నిగురించిన అధ్యాయంలో, ఆయనకే [హెగెల్‌కే] విశిష్టమై చెందిన విచిత్రపోకడల భావవ్యక్తీకరణ పద్ధతులతో కొంత ' ప్రేమాయణం' ఆడానుకూడ. హెగెల్‌ చేతుల్లో గతితర్కం ఒక నిగూఢతా ప్రక్రియకు [మాయాజాలానికి - mystification కు] గురై బాధపడే్ మాట నిజమేగానీ, అంతమాత్రాన అది [గతితర్కం] పనిచేసే సాధారణ రూపాన్ని ఒక సర్వసమగ్ర, చైతన్యయుత పద్ధతిలో సమర్పించిన ప్రప్రథముడు ఆయనే నన్న ఖ్యాతి హెగెల్‌కు దక్కకుండా [ మాయాజాల చర్య వైనం] అడ్డుకొనలేదు. హెగెల్‌కుసంబంధించి అది [గతితర్కం] దాని తలమోపున నిలిచివుంది. అయితే, దాని నిగూఢాత్మక చిప్ప (shell) లో ఒక సహేతుక సారాన్ని [గుజ్జును - kernel] కనుగొనాలంటే మీరు [తలకిందుగా వున్న] దాన్ని తిప్పి మళ్ళీ సరిగ్గా నిలబెట్టాల్సివుంటుంది మరి!

దాని నిగూఢీకృత (mystified) రూపంలోని గతితర్కం [నేడు] జర్మనీలో ఒక ఫ్యాషనై పోయింది; ఎందుకంటే, అస్తిత్వంలోవున్న పరిణామాల స్థితిని అది రూపుమార్చి, కీర్తిస్తున్నట్లగుపించడం వల్లే. [అయితే,] దాని సహేతుక రూపంలోని అది [గతితర్కం] బూర్జువా శ్రేణులకూ, వారి పిడివాద సిద్ధాంతి ఆచార్యులకూ, ఒక అపనింద (scandal) గా, చెడ్డపేరు (abomination) గా వుంటుంది; ఎందుకంటే, అస్తిత్వంలోవున్న పరిణామాల స్థితిని అర్థం చేసుకుని, దాన్ని ధ్రువీకరణాత్మకంగా గుర్తిస్తున్నప్పుడు ఈ గతితర్కం అదే సమయంలో ఆ స్థితియొక్క రుణీకరణ (అభావం - negation) నూ, దాని అనివార్య విచ్ఛిత్తినీకూడ చేర్చి చూస్తుందిగనుక; ఎందుకంటే, అది [గతితర్కం] ప్రతి చారిత్రకంగా అభివృద్ధిచెందిన సాంఘిక రూపమూ ఒక ద్రవాత్మక (fluid) చలనంలోవున్నట్లు భావించడం మూలంగా, దాని [వికసిత సాంఘిక రూపపు] క్షణభంగుర అస్తిత్వాన్నే గాక దాని పరివర్తనాస్వభావాన్నికూడ పరిగణనలోనికి తీసుకుంటుంది గనుక; ఎందుకంటే, అది తనపై రుద్దడానికి [పీఠంవేసుకుని కూర్చొనడానికి] దేన్నీ అనుమతించదు గనుక, దాని సారాంశంలో అది [గతితర్కం] విమర్శనాత్మకం, విప్లవాత్మకం అయినది గనుక!

ఏ పెట్టుబడిదారీ విధానపు నిర్ణీతకాల [సంక్షోభ] వలయంలోంచి ఆధునిక పరిశ్రమ సాగిపోతూంటుందో, ఆ నిర్ణీతకాల వలయంలోనే పెట్టుబడిదారీ సమాజ గమనంలో సహజంగా యిమిడివున్న అంతర్గత వైరుధ్యాలు వ్యవహారాచరణాత్మక బూర్జువా వర్గపు మనస్సుల్లో అతి స్పష్టంగా ముద్రించుకుపోతాయి. మరి ఈ నిర్ణీత కాల [సంక్షోభ] వలయంలో అత్యుచ్చ [శిఖర] దశ సార్వత్రిక సంక్షోభమే అయివుంటుంది. [సార్వత్రిక] సంక్షోభం మరోసారి ఆసన్నమవుతూంది అయితే ఇప్పుడది దాని ప్రాథమిక దశలోనే వున్నదనుకోండి. మరి దాని కార్యావరణపు విశ్వవ్యాప్తి [సార్వత్రికత], దాని కార్యోధృతి తీవ్రతలతో [ముంచుకు వస్తూన్న] అది [సార్వత్రిక సంక్షోభం] ఈ నూతన, పవిత్ర ప్రష్యో-జర్మన్ సామ్రాజ్యంలో పుట్టకొక్కుల్లా మొలుచుకువచ్చిన అయోగ్య నడమంత్రపు అధిమేధావుల బుర్రల్లోసైతం గతితర్కాన్ని [బలంగా] దరువేయడం ఖాయం పెట్టుబడి, సంపుటం 1, కార్ల్ మార్క్స్ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 418 నుండీ.

* * * * *

ఇంకా చదవాలంటే

1. సి. ఆర్థర్, శ్రమయొక్క గతితర్కం: మార్క్స్, హెగెల్తో మార్క్స్కున్న సంబంధం [Dialectics of Labour: Marx and His Relation to Hegel], ఆక్స్ఫర్డ్, 1987.

2. ఎల్. కోలెట్టీ, 'మార్క్సిజం - గతితర్కం' [Marxism and the Dialectics], న్యూ లెఫ్ట్ రివ్యూ [New Left Review], సం. 93 (1975).

3. ఎల్. కోల్కోవ్స్కీ, 'మార్క్సిజం ప్రధాన స్రవంతులు' [Main currents of Marxism], ఆక్స్ఫర్డ్, 1978, సం. 1, అధ్యాయాలు 1, 13.

4. జె. మెఫామ్, డి. హెచ్. రుబెన్ (సం.), ' మార్క్సిస్టు తత్వచింతనలో సమస్యలు ' [Issues in Marxist Philosophy], సంపుటి 1: గతితర్కం-పద్ధతి [Dialectic and Method], బ్రైటన్, 1979.

5. ఆర్. నార్మన్, ఎస్. సేయర్స్ – 'హెగెల్, మార్క్స్, గతితర్కం: ఒక చర్చ' [Hegel, Marx and Dialectic: A Debate], హాసక్స్, 1979.

6. బి. ఓల్మన్, ' పరాయీకరణ: పెట్టుబడిదారీ సమాజంలో మనిషినిగురించిన మార్క్స్ భావన' [Alienation: Marx’s Conception of Man in Capitalist Society], కేంబ్రిడ్జ్, 1971, భాగం 1.

7. బి. ఓల్మన్, గతితార్కిక పరిశోధనలు [Dialectical Investigations], న్యూయార్క్, 1993.

8. . రత్తాంసీ, మార్క్స్ - శ్రమ విభజన [Marx and the Division of Labour], లండన్, 1982.

9. . ష్మిడ్ట్, మార్క్స్లో ప్రకృతిగురించిన భావన [The Concept of Nature in Marx], లండన్, 1971, భాగాలు 1, 3 D.

10. జె. సీజెల్, మార్క్స్ ఖర్మ: జీవితపు ఒక రూపం [Marx’s Fate: The shape of a Life], ప్రిన్స్టన్, 1978, అధ్యాయాలు 10, 11.

11. ఎల్. వైల్డ్, మార్క్స్ - వైరుధ్యం [Marx and Contradiction], అవెబరీ, 1989.

12. ఎల్. వైల్డ్, తర్కం: గతితర్కం - వైరుధ్యం [Logic: Dialectic and Contradiction],కేంబ్రిడ్జ్ కంపానియన్ టు మార్క్స్ లో, సం. టి. కార్వర్ (కేంబ్రిడ్జ్, 1991).

* * * * ** మన శంకరాద్వైతంలోని 'బ్రహ్మ పదార్థం' లా; 'జగం మిథ్య, బ్రహ్మ సత్యం' అన్నట్లు! అసలుకు ఈ హెగెల్ మహాశయుడు మన శంకరుని అద్వైతంనుండి ఇలాంటి మూలభావనలు గుట్టుచప్పుడుగా కాపీ కొట్టేయడమేగాక, ఆనక తత్సంబంధిత అపరాధ భావనను అణచివేసుకునే క్రమంలో అసలుకు హిందూతత్వచింతనలో అంత ఉన్నతమైన భావనలు, పద్ధతులు లేవనే అల్పబుద్ధిపూర్వక ఎదురుదాడికి దిగాడని నా బలమైన అనుమానం అను.

No comments: