మూలపాఠాలు
"కనుక హెగెల్యొక్క ఘటనాపరిణామ శాస్త్రం (Phenomenology) యొక్క, దాని అంతిమ ఉత్పత్తిఫలం – ఒక సృజనాత్మక, చోదక సూత్రంగా రుణాత్మకతా గతితర్కం (dialectics of negativity) – యొక్క గొప్పతనమేమంటే, ఒక వైపు [చూస్తే] హెగెల్, మనిషి యొక్క స్వయంసృష్టిని [లేక ఆత్మసృష్టిని] ఒక (వికాస) క్రమం గానూ, [కర్మలక్ష్య] పదార్థీకరణ (objectification) ను ఆ [కర్మలక్ష్య] పదార్థాన్నే కోల్పోవడంగానూ, ఒక బాహ్యీకరణ (externalization) గానూ, ఇంకా ఆ బాహ్యీకరణనే అధిగమించడంగానూ చూస్తాడని [పరిగణిస్తాడని] తెలుస్తుంది. అంటే దీనర్థం, ఆయన శ్రమయొక్క నిజ స్వభావాన్ని పట్టుకొంటాడని [గ్రహిస్తాడని], కర్మలక్షిత మానవుడు (objective man), నిజమైన – ఎందుకంటే యథార్థమైన కాబట్టి – మానవుడు అతడి స్వీయశ్రమయొక్క ఉత్పత్తిఫలంగా [వుంటాడని హెగెల్] అర్థం చేసుకొంటాడని తెలుస్తుంది. మనిషి తనతో తాను ఒక జీవజాతి ప్రాణిగా ఒక వాస్తవిక, క్రియాశీల సంబంధం ఏర్పరుచుకోవడం, లేదా మనిషి తన్ను తాను ఒక నిజమైన జీవజాతి ప్రాణిగా, అంటే ఒక మానవ ప్రాణి (human being) గా అభివ్యక్తీకరించుకోవడం అనేది అతడు తన జీవజాతి శక్తులన్నింటినీ సృష్టించడానికి [అంటే ఉత్పత్తికి] వాడినప్పుడుమాత్రమే [ఇది మళ్లీ మనిషియొక్క [ఇతర మనుషులతో] సహకారంద్వారానూ, చరిత్రఫలం గానూ మాత్రమే సాధ్యపడుతుంది], కర్మలక్షిత వస్తువులుగా వాటితో [అంటే జీవజాతిశక్తులతో] తాను సంబంధం పెట్టుకొన్నప్పుడు మాత్రమే, సాధ్యపడుతుంది – మరి యిది మొదట్లో పరాయీకరణ రూపంలో మట్టుకే అలా చేయబడగలదు." – 1844 రాతప్రతులు, ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 101.
“తార్కిక కోవగతుల (logical categories) లో మనకు గనుక సకల వస్తువుల సారపదార్థం [లేక సారాంశం - substance] లభిస్తే, అప్పుడు మనం తార్కిక గమనపు ఫార్ములాలో సకల వస్తువుల్నీ వివరించడమేగాక, వస్తువుల చలనాన్నికూడ అంతరార్థకంగా సూచించే ఒక అఖండ [లేదా పరమరూఢ - absolute] పద్ధతిని కను గొన్నట్లు ఊహించవచ్చు.
మరి ఈ అఖండ పద్ధతినిగురించే హెగెల్ ఇలా చెబుతాడు: ' ఈ పద్ధతి ఒక అఖండ, విశిష్ట, సర్వోన్నత, అనంత శక్తి; దీన్ని ఏ వస్తువూ (లేక శక్తి) ప్రతిఘటించజాలదు [అంటే ఈ శక్తి అప్రతిహతమైనది]. తన్ను తాను మళ్లీ కనుగొనడం, ప్రతి వస్తువు [లేక పరిణామం] లోనూ తన్నుతాను గుర్తించుకొనడం హేతుబుద్ధి [reason] యొక్క ధోరణి అయివుంటుంది ' [తర్కం, సం. III]. వస్తువులన్నీ [లేదా పరిణామాలన్నీ] ఒక తార్కిక కోవగతిగా కుదించబడి, ప్రతి చలనమూ [లేదా గమనమూ], ప్రతి ఉత్పత్తి చర్యా ఒక పద్ధతిగా కుదించబడి వున్నప్పుడు, మరి దానికి సహజ అనుసారంగా వస్తువుల [పరిణామాల] యొక్క, వాటి గమనాలయొక్క – ఉత్పత్తి ఫలాల యొక్క, ఉత్పత్తులయొక్క ప్రతి వెరసిమొత్తమూ ఒకానొక అనువర్తిత [లేక ప్రయోగిత - applied] అధిభౌతిక రూపానికి కుదించ బడవచ్చని చెప్పవచ్చు. [అందుకే] మతం, న్యాయశాస్త్రం వగైరాలు సంబంధించి హెగెల్ ఏదైతే చేసాడో, అదే యిప్పుడు మన ప్రౌఢన్ మహాశయుడు రాజకీయార్థ శాస్త్రానికి సంబంధించి చేయ జూస్తున్నాడు [లేదా అన్వయించజూస్తున్నాడు].
అయితే, ఈ అఖండ [లేక పరమరూఢ] పద్ధతి ఏమిటి? చలనం [లేక గమనం] యొక్క అనిర్దిష్టతే అది [అంటే ఒక అనిర్దిష్ట పరిస్థితిలోని చలనం అన్నమాట]. మరి అనిర్దిష్ట పరిస్థితిలోని చలనం [గమనం] అంటే ఏమిటి? చలనానికిసంబంధించిన శుద్ధ తార్కిక ఫార్ములా (సూత్రం) లేదా శుద్ధ హేతువు [pure reason – శుద్ధ హేతుబుద్ధి] యొక్క చలనమే అది. మరి ఈ శుద్ధ హేతువు చలనం దేనిలో [అంటే దేనితోకూడి] వుంటుంది? తన్నుతాను ముందుతెచ్చి పెట్టుకొనడం (posting itself), తన్నుతాను ఎదిరించుకొనడం (opposing itself), తన్నుతాను కూర్పుచేసుకొనడా (composing itself) లలో – తన్ను తాను ఒక వాదం, ప్రతివాదం, సిద్ధవాదాలు [thesis, antithesis and synthesis] గా రూపొందించుకొనడంలో; లేదా, ఇంకా మళ్లీ, తన్నుతాను ధ్రువీకరించుకొనడంలో, రహించు కొనడంలో [రుణీకరించుకొనడంలో - negating], ఆ అభావాన్ని అభావీకరించుకొనడా [negating its negation] లలో [ఈ శుద్ధ హేతువు చలనం యిమిడివుంటుంది].
మరి హేతువు [హేతుబుద్ధి - reason] తన్నుతాను ఎలా ధ్రువీకరించుకొనగల్గుతుంది? తన్ను తాను ఒక నిశ్చిత కోవగతిగా ఎలా తెచ్చిపెట్టుకోగల్గుతుంది? ఇదంతా అదెలా నిర్వహించుకోగల్గు తుందనేది స్వయంగా ఆ హేతుబుద్ధియొక్క, దాన్ని సమర్థించే చింతకులయొక్క వ్యవహారమే.
కాని ఒక్కసారి గనుక అది [హేతువు] తన్ను తాను ఒక వాదం (thesis) గా ముందుకు తెచ్చిపెట్టుకోగలిగితే, ఆనక ఈ వాదం, ఈ ఆలోచన, తనకు తాను ఎదురుతెచ్చిపెట్టుకోబడినప్పుడు, రెండు పరస్పర విరుద్ధ ఆలోచనలుగా – ఒకటి ధనాత్మకం, మరొకటి రుణాత్మకంగా, ఒకటి ఔను అంటే మరొకటి కాదు అనేదిగా –తన్నుతాను చీల్చివేసుకుంటుంది. ఇదే ప్రతివాదం (antithesis) – ఈ ప్రతివాదంలో పొందుపడివుండే ఈ రెండు వైరపూరిత మూలకాంశాల నడుమ పోరాటమే గతితార్కిక గమనాన్ని (చలనాన్ని) సృష్టిస్తుంది. ఔను కాదవడం, కాదు ఔనవడం, ఔననేది ఔను-కాదు రెండూ అవడం, కాదు అనేది కాదు-ఔను రెండూ కావడం, ఈ విరుద్ధాంశాలు ఒకదాన్ని మరొకటి సమతులనం గావించుకొనడం, తటస్థపర్చుకొనడం, స్తంభింపజేసుకొనడం జరుగుతాయి. మరి ఈ రెండు వైరుధ్యపూరిత విరుద్ధ ఆలోచనల మేళనం, ఈ రెండింటియొక్క సమ్మిళిత సిద్ధవాదం (synthesis) గా వుండే ఒక కొత్త ఆలోచనను ఏర్పరుస్తుంది. ఈ [కొత్త] ఆలోచనకూడ మళ్లీ మరోసారి రెండు వైరుధ్యపూరిత ఆలోచనలుగా విడిపోవడం, అవి తిరిగి సమ్మిళితమై ఒక కొత్త సిద్ధవాదంగా రూపొందడం జరుగుతుంది. ఈ ప్రయాస అంతటినుండీ ఒక ఆలోచనల బృందమే పుట్టుకొస్తుంది. ఈ ఆలోచనల బృందంకూడ ఒక సులభసామాన్య కోవగతికుండే గతితార్కిక గమనాన్నే అనుసరిస్తుంది; దానికి విరుద్ధంగా మరో ఆలోచనల బృందం ప్రతివాదంగా తలయెత్తుతుంది. మరి ఈ రెండు విరుద్ధ ఆలోచనల బృందాలనుండి, వాటి సమ్మేళనం వల్ల సిద్ధవాదం (synthesis) గా, ఒక కొత్త ఆలోచనల బృందం జనిస్తుంది. ఈ విధంగా, సులభసామాన్య కోవగతుల గతితార్కిక గమనంనుండి ఒక ఆలోచనల బృందం ఎలా ఉత్పన్నమవుతుందో, సరిగ్గా అలాగే ఈ ఆలోచనాబృందాల గతితార్కిక గమనంనుండి ఒక శ్రేణి, అలాగే ఈ శ్రేణుల గతితార్కిక గమనంనుండి యావత్తు వ్యవస్థే పుట్టుకొస్తాయి.
ఈ [గతితార్కిక] పద్ధతినే రాజకీయార్థ శాస్త్రపు కోవగతులకు (categories) కూడ అన్వయిస్తే, అప్పుడు మీకు రాజకీయార్థ శాస్త్రపు తర్కం, అధిభౌతిక విజ్ఞానం లభిస్తాయి - లేక, మరో విధంగా చెబితే, ప్రతి ఒక్కరికీ తెలిసిన ఆర్థిక కోవగతులే, అంతగా తెలియని భాషలోకి అనువదింపబడి [యిమడ్చబడి], అందువల్ల ఒక శుద్ధ హేతువు మేధస్సునుండి కొత్తగా మొగ్గవీడి [వికసించి - blossomed forth] వస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ కోవగతులు స్వయంగా ఆ గతితార్కిక గమన కార్యాచరణవల్లే ఒకదాన్నుండి మరొకటి పుట్టుకొచ్చినట్లు, ఒకదానితో మరొకటి లంకెవేయబడి, పరస్పరం పెనవేయబడినట్లు కనిపిస్తాయి.
మరి ఈ అధిభౌతికవాద విజ్ఞానాన్నంతటినీ, దాని నానా కోవగతులు, బృందాలు, శ్రేణులు, వ్యవస్థల సారువ (ఒక రకపు చట్రం - scaffolding)తోసహా, చూచి పాఠకులు బెంబేలెత్తి పోకూడదు సుమండీ. కాని మన ప్రౌఢన్ మహాశయుడుమాత్రం ఈ వైరుధ్యాల వ్యవస్థ ఎత్తుల్ని ఎక్కడానికి ఎంతగానో శ్రమించినా, [ఇంతదాకా] సులభసామాన్యమైన వాదం, ప్రతివాదాలనే రెండు అంచెలకు మించి పైకి ఎక్కలేక పోయాడు. మరి వాటిని [ఆ రెండంచెలను] సైతం ఆయన రెండుసార్లుమాత్రమే ఎక్కగలిగాడు; అందులోనూ ఒక సారి [జారి] వెనక్కు పడిపో్యాడుకూడ.
ఇప్పటిదాకా మనం హెగెల్‌యొక్క గతితర్కాన్ని వివరించే పని మాత్రమే చేసాము; ఈ తర్వాత మనం దీన్ని [హెగెలియన్ గతితర్కాన్ని] నీచాతినీచ స్థాయిలకు కుదించడంలో మన ప్రౌఢన్ మహాశయుడు ఎలా కృతకృత్యుడయ్యాడో గమనిద్దాం. సరే, హెగెల్‌కు సంబంధించినంతవరకు, ఇప్పటిదాకా జరిగిందీ, అలాగే ఇంకా జరుగుతున్నదీ అంతాకూడ కేవలం తన సొంతబుర్రలో సంభవిస్తున్నది మాత్రమే [నని తెలుసుకొన్నాము]. ఈ విధంగా, చరిత్రనుగురించిన తత్వచింతన అనేది తత్వచింతనయొక్క, [ఆ మాటకు] తన [హెగెల్‌యొక్క] సొంత తత్వచింతనయొక్క, చరిత్ర మాత్రమే తప్ప మరేమీ కాదు. ' కాలగమనంలో వరుస ప్రకారం చరిత్ర' అనేదొకటి మరెంతమాత్రం లేదు; ఉన్నదల్లా 'అవగాహనా [అర్థం చేసుకొనే] క్రమంలోని భావనల పరంపర' ఒకటి మాత్రమే. అంటే ఆలోచనా [చింతనా] గమనం [చలనం] ద్వారా తానీ ప్రపంచాన్ని నిర్మిస్తున్నట్లు హెగెల్ భావిస్తాడు; కాగా, నిజానికి ఆయన మనందరి మనస్సుల్లోవుండే ఆలోచనలన్నింటినీ క్రమబద్ధంగా పునర్నిర్మాణం చేస్తున్నాడు, ఒక అఖండ పద్ధతిద్వారా వర్గీకరిస్తున్నాడు, అంత మాత్రమే. – తత్వశాస్త్ర దారిద్ర్యం, కార్ల్ మార్క్స్‌యొక్క ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 200 నుండీ.
ఏదైనా ఒక దేశాన్ని ఒక రాజకీయార్థిక దృక్కోణంనుండి మనం పరిగణించేట్లయితే, మనం మొదటగా దాని జనాభా, అందలి వర్గాల ఉపవిభజన, నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో దాని ఉనికిస్థితి (location) లేక సముద్రందగ్గరి ఉనికిస్థితి, వివిధ ఉత్పత్తిశాఖల్లోని వృత్తులు, ఉపాధులు మొదలైనవాటితో ప్రారంభించి, ఆ తర్వాత ఆ దేశపు ఎగుమతులు-దిగుమతులు, వార్షికోత్పత్తి, వర్తకపు సరుకుల వినిమయధరలు వగైరాలగురించి అధ్యయనం చేస్తాము. అంటే, వాస్తవమైన, నిర్దిష్టమైన అంశాలతో ప్రారంభించడం సరియైన పద్ధతిగా అగుపడుతుంది – ఎందుకంటే అవి దానికి యథార్థమైన ముందుషరా అవసరాలు (actual prerequisites) గనుక. రాజకీయార్థ శాస్త్రానికి సంబంధించైతే మొదటగా జనాభానుండి ప్రారంభించడం [సబబుగా వుంటుందనీ] – ఎందుకంటే, అది (జనాభా) సమాజపు యావత్ ఉత్పాదక కార్యకలాపానికీ ప్రాతిపదిక గానూ, కర్తగానూ [నిర్మాతగానూ] వుంటుందిగనుక – [అనిపిస్తుంది]. కాని, మరింత సన్నిహితంగా పరిశీలిస్తే, యిది తప్పని తేలుతుంది. ఎందుకంటే జనాభాలో పొందుపడివుండే వివిధ వర్గాలనుగనుక మనం పరిగణనలోనికి తీసుకోకుండా వదిలేస్తే, అప్పుడిక జనాభా అనేది కేవలం ఒక అనిర్దిష్టీకరణగామాత్రమే [వుండిపోతుంది]. తిరిగి, ఈ వర్గాలనేవికూడ, అవి ఏ మూలకాంశాల – అంటే, వేతనశ్రమ, పెట్టుబడి వగైరా అంశాల – ప్రాతిపదికన ఏర్పడివున్నాయో మనం తెలుసుకుంటే తప్ప, వట్టి పదజాలమే [వట్టి మాటలే] అవుతాయి. మరి ఈ మూలకాంశాలు వాటివంతుకు అంతరార్థకంగా మారకం, శ్రమ విభజన, ధరలు మొదలైనవాటిని సూచిస్తాయి.
కనుక జనాభాతో మొదలుపెట్టుకొని పోతే మనం మొత్తం (వాస్తవికత) యొక్క అల్లకల్లోల (chaotic) భావనతో ఆరంభించి, ఆనక మరింత సన్నిహిత విశ్లేషణద్వారా మెల్ల మెల్లగా మరింత సులభసామాన్య భావనలకు వస్తామన్న మాట; ఈ విధంగా ఒక ఊహా నిర్దిష్ట పరిణామాలనుండి [క్రమక్రమేపీ] మరింత మరింత తక్కువ అనిర్దిష్టతలగుండా, చివరకు మనం అత్యంత సులభ సామాన్య నిశ్చయాలకు వచ్చేదాకా, సాగిపోతామన్నమాట. ఇలా ఒక సారి [ప్రయాణం చివరకంటా] సాధించబడితే, ఆనక మన తిరుగుప్రయాణం మొదలుపెట్టి, అంతిమంగా మళ్లీ జనాభావద్దకు వెనక్కు వచ్చేదాకా, సాగిపోవచ్చు. అయితే [ఈ పయనంలో] ఈ సారి మనం ఒక సజాతీయమొత్తంగురించిన అల్లకల్లోల భావనవద్దకుగాక అనేక నిశ్చయీకరణలు, సంబంధాలతోకూడుకున్న ఒక సుసంపన్న వెరసిమొత్తానికి చేరుకుంటామన్నమాట. గతంలో రాజకీయార్థ శాస్త్రం తన [పయనం] ఆరంభంలో ఈ [పైనపేర్కొనబడినట్టి] మొదటి పద్ధతిని అవలంబించివుండింది. ఉదాహరణకు, 17 వ శతాబ్దపు ఆర్థికవేత్తలు ఎప్పుడూకూడ ఒక సజీవ వెరసిమొత్తంతో – జనాభా, జాతి, ఒక రాజ్యం, అనేక రాజ్యాలలు వగైరాలతో – మొదలుపెట్టుకుని ముందుకు సాగిపోయారు; కాని, చివరకు అన్ని సందర్భాల్లోనూ తమ విశ్లేషణ పద్ధతులద్వారా శ్రమ విభజన, డబ్బు [ద్రవ్యం], విలువ మొదలైన కొన్ని ప్రధానమైన అనిర్దిష్ట సాధారణ సూత్రాలకు చేరుకున్నారు. మరిలా అనిర్దిష్ట హేతువాదనద్వారా ఈ వేర్వేరు మూలకాంశాలు అన్నీ ఇంచుమించు స్థిరంగా వ్యవస్థాపితమైన వెనువెంటనే, శ్రమ, శ్రమ విభజన, గిరాకీ, మారకపు విలువ మొదలైన సులభసామాన్య భావనలతో ప్రారంభమై సాగుతూ రాజ్యం, అంతర్జాతీయ మారకం, ప్రపంచ విపణి మొదలైన [గహనమైన] భావనలతో ముగిసే రాజకీయార్థ శాస్త్ర వ్యవస్థలు తలయెత్తాయి. మరి ఈ రెండవదే శాస్త్రీయంగా సరైన పద్ధతి అనేది సుస్పష్టమే. అది [రెండవ పద్ధతి] అనేక నిశ్చయీకరణల సమ్మేళనంగా – అంటే వైవిధ్యతాపూర్ణ మూలకాంశాల ఐక్యతగా – వుంటుంది గనుకనే [ఈ రెండవ పద్ధతిలో] నిర్దిష్టాంశం అనేది నిర్దిష్టంగా వుంటుంది. కనుక అది [నిర్దిష్టాంశం] మన ఆలోచనలో ఒక సిద్ధవాదం (synthesis) గా – ఒక ఫలితంగా అగుపిస్తుంది. కాని, నిజానికి అది యథార్థమైన ఆరంభ స్థానమైనా, అందుచేత పరిశీలన [గమనిక - observation], భావనలకుకూడ ఆరంభస్థానమైనా, అదలా ఆరంభ బిందువుగానైతే అగుపించదు. మరి ముందటి [మొదటి] పద్ధతిద్వారా మొత్తం భావన యావత్తూ ఒక అనిర్దిష్ట నిర్వచనానికి సాగిపోతుంది; కాగా తర్వాతి [రెండవ] పద్ధతిద్వారానైతే అనిర్దిష్ట నిర్వచనాలు, ఒక హేతువాదనాక్రమంలో, ఒకానొక నిర్దిష్ట విషయం [పరిణామం] పున: సృష్టికి దారితీస్తాయి. కనుక, అనిర్దిష్టతనుండి నిర్దిష్టతకు సాగిపోయే పద్ధతి నిర్దిష్టత గట్టిగా పట్టుకోబడి [గ్రహించబడి], మన మనస్సుల్లో నిర్దిష్టంగా పున: సృష్టి గావించబడే ఒక ఆలోచనావిధంమాత్రమే కాగా, హెగెల్ మాత్రం అసలుకు వాస్తవమనేదే [యథార్థమైనది - real] ఒక స్వయం-సమన్వయీకృత, స్వయం-విలీనీకృత, తనంతతానే అయత్న పూర్వకంగా పనిచేసే ఆలోచనయొక్క ఫలితమని యోచించే తప్పు చేసాడు. కాని, అది [అనిర్దిష్టతనుండి నిర్దిష్టతకు సాగిపోయే పద్ధతి] తాను స్వయంగా నిర్దిష్టతను సృష్టించే క్రమంమట్టుకు ఏ విధంగానూ కాదు. అత్యంత సులభసామాన్య కోవగతి (category) అయినా – ఉదాహరణకు, మారకపు విలువనే తీసుకున్నా – దానికిగాను ఒక జనాభా ఉనికి – కొన్ని నిశ్చిత పరిస్థితుల్లో ఉత్పత్తిలో నిమగ్నమైన జనాభా ఉనికి – అంతరార్థకంగా [ఆవశ్యకమై] వుంటుంది; అలాగే ఒక నిశ్చిత రకపు కుటుంబం, లేక తెగ, లేక రాజ్యం మొదలైనవాటి ఉనికి అంతరార్థకంగా [ఆవశ్యకమై] వుంటుంది. కనుక ఆవరకే [అప్పటికే] నిశ్చితమైన ఒక నిర్దిష్ట, సజీవ వెరసి రాశియొక్క ఒక అనిర్దిష్ట ఏకపక్ష సంబంధంగా తప్పితే, దానికి [అంటే, మారకపు విలువకు – ఆ మాటకు ఏ కోవగతికైనా] మరే యితర అస్తిత్వమూ వుండజాలదు.
అయితే, ఒక కోవగతిగా మారకపు విలువకు ఒక అత్యంత ప్రాచీన (antediluvian) అస్తిత్వం వున్నది. కనుక, అవగాహనాకరణ ఆలోచన అనేదే మనిషిలో అత్యంత వాస్తవికమైనదని, అవగాహనాకృతమైనప్పుడే ప్రపంచం వాస్తవికంగా వుంటుందని ఎంచే చైతన్యం – తాత్విక చైతన్యం ఇలాంటి స్వభావంగలదే – ఈ కోవగతుల గమనాన్నే యథార్థ ఉత్పత్తి చర్యగా [దురదృష్టవశాత్తూ ఈ యథార్థ ఉత్పత్తిచర్యకు చోదకశక్తి బయటినుండిమాత్రమే లభిస్తుంది], దాని ఫలితమే ఈ ప్రపంచంగా పొరపడుతుంది [తప్పుగా భావిస్తుంది]. ఇది నిజం. అయితే యిక్కడ మనకు మరొక చర్వితచర్వణం (tautology) కనిపిస్తుంది. నిర్దిష్ట వెరసిరాశి ఒక ఆలోచనా వెరసిరాశిగా, మన ఆలోచనకు ఒక నిర్దిష్ట లక్ష్యవిషయం (subject) గా వున్నంతమేరకు, నిజానికి అది ఆలోచనయొక్క, అవగాహనాకరణయొక్క సృష్టి మాత్రమే అయివుంటుంది; కాని అది ఏదో ఒక గమనిక [పరిశీలన - observation] కూ, కల్పన [imagination] కూ బాహ్యంగా పనిచేస్తూండే స్వయంసృజిత [స్వయంభు:] భావనయొక్క సృష్టి అనే అర్థంలోకాక, గమనిక, కల్పనల కార్యకరణత్వపు ఫలితంగామాత్రమే వుంటుంది. మన బుర్రల్లో ఒక ఆలోచనా వెరసిరాశిగా కనిపించే ఆ సంపూర్ణత [whole - మొత్తం] ప్రపంచాన్ని తనకు తెరిచివున్న ఏకైక విధంగా – కళాత్మక, మతపర, లేక వ్యవహారాచరణాత్మక మనస్సు ఉపయోగించే పద్ధతికి భిన్నమైన విధంగా – పరిగ్రహించే [grasp] ఒక ఆలోచనాత్మక (చింతనాపర) మస్తిష్కపు ఉత్పత్తి అయి వుంటుంది. అలా పరిగ్రహించబడిన [అంటే, అవగాహన చేసుకోబడిన - grasped] తర్వాతకూడ ఆ నిర్దిష్ట లక్ష్యవిషయం [concrete subject] తన స్వతంత్ర అస్తిత్వాన్ని [అంతకుపూర్వంలాగే] మనిషి బుర్రకు వెలుపల, అంటే ఆ బుర్ర దాన్ని కేవలం ఊహాత్మకంగా, సిద్ధాంతపరంగా యోచించేంత మేరకు దానికి వెలుపల, కొనసాగిస్తూంటుంది. కనుక రాజకీయార్థ శాస్త్రంలో సైద్ధాంతిక పద్ధతిని నియోగించేటప్పుడు [అవలంబించేటప్పుడు] మనం దాని లక్ష్యవిషయాన్ని [subject] – అంటే, సమాజాన్ని – మనకు ప్రారంభస్థానమైన ముందు ఊహ [premise] గా నిరంతరం మనస్సులో పెట్టుకుని సాగాల్సివుంటుంది.
No comments:
Post a Comment