Saturday, January 8, 2011

'భావి కమ్యూనిస్టు సమాజం' గురించి మార్క్స్‌, మెక్‌లెలాన్‌ ఇంగ్లీషు రచనకు ఇంగువ మల్లికార్జున శర్మ అనువాదం [Marx on 'Future Communist Society' by McLelan, tr: IM Sharma (Part 1)

భావి కమ్యూనిస్టు సమాజం

వ్యాఖ్యానం

మొట్టమొదటే ఒక విషయాన్ని నొక్కిచెప్పడం ముఖ్యం: మార్క్స్ ఒక ' ప్రవక్త ' ఏమీ కాడు; తాను దర్శించిన కమ్యూనిస్టు సమాజపు రూపురేఖలెలా వుంటాయనేదాన్ని గురించి ఆయన బహుతక్కువ చెప్పాడు. ఇది ఆశ్చర్యకరమైన అంశమేమీ కాదు: తన గురువైన హెగెల్లాగే మార్క్స్కూడ భవిష్యత్తు గురించి జోస్యంచెప్పడంపట్ల ఎంతో [అయిష్టపూర్వక] జాగ్రత్తతో వుండేవాడు; [కనుక] తరచూ మరింత 'ఊహాజనితంగా' వుండే సోషలిస్టుల్ని వాళ్ల ఆదర్శవాద జోస్యాలకుగాను తీవ్రంగా విమర్శిస్తూండే [ఏకిపారేసే] వాడు.[1] ఎందుకంటే అన్ని భావనలూ సమకాలీన సాంఘిక వాస్తవికత ఉత్పత్తిఫలమే అయితే, ఇక అప్పుడు ఈ భావనల్ని సవివరంగా సుదూర భవిష్యత్తులోనికి రువ్విచూపడం [project] తప్పనిసరిగా ఒక [ఆదర్శ] భావవాదానికే అనుభవపూర్వక ఉల్లేఖనలేవీ లేనందువల్ల పూర్తిగా ఊహాత్మకమైన భావాలకే దారితీస్తుంది మరి. [ఈ విషయంలో] హెగెల్ చేసిన "ఒక వ్యక్తి తన కాలానికి అతీతంగా ముందుకు [సుదూరభవిష్యత్తుకు] ఎగిరిదూక గలడని ఊహించడం ఎంత వెర్రో, ఏ తత్వచింతనైనా దాని సమ కాలీన ప్రపంచం ఆవలకు [లంఘించి] పోగలదని అనుకోవడమూ అంతే వెర్రి [silly] గా వుంటుంది"[2] అనే వ్యాఖ్యను మార్క్స్ పూర్తిగా అంగీకరించి వుండేవాడే.

అయినప్పటికీ, మార్క్స్ [దర్శించిన భావి సమాజ] చిత్రపు స్థూలమైన రూపురేఖలు స్పష్టంగానే కనిపిస్తాయి. ఇందుకు సంబంధించి మన మనస్సుకు సాధారణంగా తట్టే ఒక పదజాలం 'రాజ్యం వడలిరాలిపోవడం' (withering away of the State - వెలిసిపోవడం) అనేది. నిజానికి ఇది ఏంగెల్స్ వాడిన పదగుంభనం. మార్క్స్కంటే ఎక్కువగా ఏంగెల్సే ప్రకృతి విజ్ఞానశాస్త్రాలకూ, సామాజిక విజ్ఞానశాస్త్రాలకూ నడుమ సామ్యాలు [సమాంతరతలు - parallels] వెలికి తీయడానికి [చూపించడానికి] మరింత సిద్ధంగా వుండినాడు [అని మనం తెలుసుకోవాలి]. మార్క్స్‌మట్టుకు ఎక్కువగా రాజ్యంయొక్క ' అధిగమనం ' (transcendence – తాత్విక, హెగెల్‌వాద అధిశృతులుగల ఒక పదం) లేక 'రద్దు'నుగురించి మాట్లాడేవాడని గమనించాలి.[3] ఈ విషయంపై మార్క్స్ చేసిన చర్చల [న్నింటిని పరిశీలించే] సందర్భంలో, ఆయన రచనలు చేసిన కాలంలో రాజ్యం ఇప్పటికంటే బహుతక్కువ పనులే నిర్వర్తించేదని గుర్తుంచుకోవడం ముఖ్యం: అప్పట్లో రాజ్యం అందించే సాంఘిక సేవలనేవి దాదాపు ఏవీ వుండేవికావు; పరిశ్రమలన్నీ ప్రైవేటు [వ్యక్తుల] హస్తాల్లో వుండేవి; ప్రభుత్వ నిర్వహణలో విద్యాబోధన అనేది అప్పుడప్పుడే మొదలవుతూండింది; కనుక 'వాడి రాలిపోవడానికి' అంటూ వుండింది ఆనుపాతికంగా [చాల] తక్కువే. ఈ విషయంలో మార్క్స్ అభిప్రాయాలపై సెయింట్ సైమన్ ప్రభావం వుండిందనేది నిస్సందేహమే; [మార్క్స్కంటే] ఎంతో పూర్వమే ఆయన 'ప్రజలను పరిపాలించడంనుండి వస్తువులు-విషయాల నిర్వహణకు' [government of people to the administration of things] పరివర్తన జరగాలని [భావి సమాజంలో అలా జరుగుతుందని] ప్రకటించి వున్నాడు.[4] ఈ పరివర్తనగురించి ఈ ఒక ముఖ్య రచనాభాగం మనకు కమ్యూనిస్టు ప్రణాళికలో కనిపిస్తుంది:

"అభివృద్ధిక్రమంలో, వర్గ విభేదాలు అదృశ్యమైపోయినప్పుడు, ఉత్పత్తి యావత్తూ మొత్తం జాతియొక్క సువిశాల సంఘం చేతుల్లో కేంద్రీకృతమైనప్పుడు, ప్రజా అధికారశక్తి దాని రాజకీయ స్వభావాన్ని కోల్పోతుంది. సముచితంగా రాజకీయాధికారం అని పిలవబడేది కేవలం మరొక వర్గాన్ని అణచివేయడానికిగాను ఒక వర్గానికి వుండే సంఘటిత అధికారం మాత్రమే [నని గ్రహించాలి]."[5]

ప్రజా అధికారశక్తియొక్క 'రాజకీయ' లక్షణాల శుద్ధీకరణ అనే దానిలో అంతరార్థకంగా సూచించబడే ఒక అంశం దాని [ప్రజా అధికారశక్తియొక్క] 'నిరంకుశాధికారపూరిత' [bureaucratic] అంశం రద్దని గమనించాలి. మరి ఈ ఇతివృత్తం [నిరంకుశాధికారపూరిత మూలకాంశం రద్దు] మూలంకూడ అనుత్పాదక పాలకుల వర్గానికి వ్యతిరేకంగా సెయింట్‌ సైమన్‌ నిరంతరం సాగించిన వాగ్వివాదాల్లోనే వుందని చెప్పవచ్చు. తానొక రాజకీయ పాత్రికేయునిగా వుండిన తొట్టతొలి కాలాలనుండీకూడ మార్క్స్‌ నిరంకుశాధికారవర్గపు సమస్యతో సతమతమవుతూ [లేక పట్లు పడుతూ] వచ్చాడని గ్రహించాలి. నిరంకుశాధికార వర్గం అనేది రాజ్యానికీ, పౌర సమాజానికీ నడుమ ఒక మధ్యవర్తి అంశం అనే హెగెలియన్‌ దృక్పథాన్ని మార్క్స్‌ తన 1843 రాతప్రతిలో బలంగా విమర్శించాడు.[6] అంతేగాక [నిరంకుశాధికార వర్గ సంబంధిత] సమస్యకు పరిష్కారం పారిస్‌ కమ్యూన్‌లో కనీసం సంక్షేపంగా యోచించబడిందనికూడ అభిప్రాయపడ్డాడు. అయితే భావి కమ్యూనిస్టు సమాజంలోసైతం ప్రజాఅధికారశక్తి యింకా వుండనే వుంటుందనే మాట నిజమే గానీ, "వర్గ పాలన అనేది అదృశ్యమై పోయిన తర్వాత ప్రస్తుతం ఆ పదానికుండే అర్థంలోని రాజ్యం అనేది ఏదీ అప్పుడుండదు."[7]

ఈ విధంగా మార్క్స్కు సంబంధించినంతవరకూ వర్గ విభేదాల ప్రాతిపదికన నెలకొన్న రాజ్యం రద్దు అంటే అందులో ఒక బాధ్యతారహితమైన కార్యాధికార, న్యాయాధికార వర్గాల [executive and judiciary] చే నిరంకుశాధికార వర్గానికి ఏ హాని కలగకుండా సునిశ్చితంగావించబడి వుండే స్వతంత్ర రాజ్య యంత్రాంగం యావత్తూ రద్దుగావడం యిమిడివున్నట్లే. మార్క్స్కు సంబంధించి [పారిస్] కమ్యూన్ అర్థం ఏమిటంటే "ఎటుజూచినా [విచ్చలవిడిగా] కనిపించే స్థాయీ సైన్యం, పోలీసు వ్యవస్థ, నిరంకుశాధికార వర్గం, మతగురువుల వర్గం, న్యాయవ్యవస్థ మొదలైన అంగాలతో కూడుకున్న కేంద్రీకృత రాజ్యాధికారాన్ని" నాశనం చేయడమే.[8] అనంతరకాల సమాజాన్ని వర్ణించడానికిగాను మార్క్స్ 'సహవాస సంఘం' (association) అనే మాట రెండు సార్లు వాడుతాడు ఒక సారి కమ్యూస్టు ప్రణాళిక లో, పాత బూర్జువా సమాజం స్థానంలో "ప్రతి వ్యక్తియొక్క స్వతంత్ర వికాసం సర్వజనుల స్వతంత్ర వికాసానికి నిబంధనాస్థితిగా వుండే ఒక సహవాససంఘం" వస్తుందని చెప్పేటప్పుడు[9]; మరో పర్యాయం తన పవిత్ర కుటుంబం లో "వర్గ విభజనలు లేని, కచ్చితంగా మాట్లాడితే రాజకీయాధికారం అనేదికూడ ఏదీ వుండని ఒక సహవాససంఘాన్ని" కార్మికవర్గం ఏర్పాటు చేస్తుందనేటప్పుడు.[10]

కమ్యూనిస్టు ప్రణాళిక లోనూ, బకూనిన్యొక్క రాజ్యవాదం-అరాచకవాదంపై మార్క్స్ విమర్శలోనూ [ఆయన చిత్రీకరణప్రకారం] కార్మికవర్గ నియంతృత్వపు రాజకీయ కట్టడం చాల కేంద్రీకృతమైనదిగా వుండేట్లు మనకు అగుపిస్తుంది. పోతే, 1850 మార్చినాటి తన కమ్యూనిస్టు లీగు నుద్దేశించిన ప్రసంగం లోకూడ కమ్యూనిస్టులు "ఒకే ఒక, అవిభజనాశక్యమైన జర్మన్ రిపబ్లిక్కోసమే గాక అలాంటి రిపబ్లిక్లోపలసైతం రాజ్యాధికారశక్తి చేతుల్లో అత్యంత దృఢనిశ్చయపూరిత అధికారకేంద్రీకరణగురించికూడ కృషి చేయాలి 1793నాటి ఫ్రాన్స్ విషయంలోలాగే నేటి జర్మనీలోకూడ సిసలైన (నిజమైన) విప్లవ పార్టీ కర్తవ్యం అత్యంత కచ్చితమైన కేంద్రీకరణే"[11] నని మార్క్స్ ఉద్బోధిస్తాడు. అయితే, ఇది విప్లవానికి తక్షణపూర్వపు పరిస్థితికే వర్తిస్తుందనుకోండి; కాని, మార్క్స్ తన పారిస్ రాతప్రతులు లోనూ, గోథా కార్యక్రమంపై విమర్శ లోనూ ప్రస్తావించిన అసంపూర్ణ కమ్యూనిజపు దశఅంటే కార్మికవర్గ నియంతృత్వం కోసం కార్యక్రమంగా సూచించేటటుంటి చర్యలను నిర్వర్తించజూచినా దానికి సైతం పెద్దయెత్తున కేంద్రీకరణ ఆవశ్యక మవుతుందనేది సుస్పష్టమే. మరి అసలుకు రాజ్యం అదృశ్యం కావడం [రూపుమాసిపోవడం] అయితే "సహకార సంపదకు సంబంధించిన స్రవంతులన్నీ మరింత సమృద్ధిగా ప్రవహించే"[12] నాటికి, 'రాజకీయ' అధికారం చెలాయింపు మరెంతమాత్రం ఆర్థిక వత్తిళ్లపై ఆధారపడి వుండని కాలానికి వాయిదా వేయబడింది (నిలిపివుంచబడింది). అయితే [మార్క్స్ రాసిన] ఫ్రాన్స్లో అంతర్యుద్ధం లో ఇందుకు కొద్దిగా భిన్నమైన చిత్రీకరణ సమర్పించబడింది; అందులో [పారిస్] కమ్యూన్ మరింత వికేంద్రీకృత ప్రభుత్వాన్ని ఆవిష్కరించిందని ప్రశంసించడం జరిగింది. అయితే ఇక్కడ మార్క్స్ తాను స్వయంగా ఆ కమ్యూన్ తీసుకున్న చర్యలతో ఎంతవరకు అంగీకరించాడు, కాకపోతే తాను దాని సంక్షేప మరణవార్త [చావు కబురు - obituary] రాస్తున్నప్పుడు ఈ విమర్శ అంతా ఎందుకులే అని [మొహమాటంతో] ఎంతవరకు [కొన్ని లేక చాల అంశాల్ని విమర్శించకుండా] వెనుతగ్గాడు అనేదిమాత్రం ఎప్పటికీ ప్రశ్నార్థకమే ననుకోండి.

కనుక ఇప్పుడు తలయెత్తే ప్రశ్న: 'సహవాససంఘం' లో ప్రజాఅధికారశక్తి నిర్వర్తించాల్సివచ్చే విధి ఏమిటి? అనేదే. తన ఫ్రాన్స్లో అంతర్యుద్ధం లో మార్క్స్ కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించడానికి గాను "కొన్ని, అయితే ముఖ్యమైన విధులు"[13] మిగల్చబడి వుంటాయి అన్న మాట నిజమే. కాని ఈ విధులు కచ్చితంగా ఏమై వుంటాయి అనే విషయంమాత్రం మార్క్స్ ఎప్పుడూ స్పష్టం గావించలేదు; ఎందుకంటే, ఆయన "ఏ సామాజిక విధులు నేడు రాజ్యం నిర్వర్తిస్తూన్న విధుల్ని పోలిన ఏ విధులు కమ్యూనిస్టు సమాజంలో [కేంద్ర ప్రభుత్వంవంతుకు] మిగిలివుంటాయి" అనే అంశం గురించి "శాస్త్రీయంగా యోచించి మాత్రమే సమాధానం చెప్పగలం"[14] అనే అభిప్రాయంలోవుండినాడు గనుక. కమ్యూనిస్టు ప్రభుత్వాలకు బలగాలు ఆవశ్యకం వుండవని [ఆయన భావన అయినట్లు] తోస్తుంది బాహ్య బలగాలైతే నిశ్చయంగా వుండవు, ఎందుకంటే విప్లవం అనేది అంతర్జాతీయం కాకుంటే అసలేమీ కాదు [అంటే విప్లవమేకాదు] గనుక. అంతే కాదు, రాజ్యంలోపల సైతం [బలగాలు] అవసరం వుండవు [అనేది మార్క్స్ అభిప్రాయమన్నట్లు తోస్తుంది] ఎందుకంటే, శిక్ష అనేది "దోషి [నేరస్తుడు] తనపై తాను విధించుకునే తీర్పు" [గా వుంటుంది అని ఒక చోట మార్క్స్ అని వున్నాడు గనుక].

ఏమైనా ఈ సమస్యలన్నీ, పెళ్లి-కుటుంబం, డబ్బు రద్దు,[15] అవసరానికి అనుగుణంగా సాంఘిక ఉత్పత్తుల పంపిణీ మొదలైన అంశాలపై మార్క్స్ అభిప్రాయాల్లాగే, అంతిమంగా భావి కమ్యూనిస్టు సమాజంలో ఎలాంటి మానవ స్వభావం నెలకొనివుంటుందనే విషయమై ఆయనకుండే భావనలపైనే ఆధారపడి వుంటాయి. ఎందుకంటే, ఇప్పుడు మనుషుల్లో వ్యక్తమౌతూండే సమాజ వ్యతిరేక ధోరణుల్లో అనేకం అంతిమంగా రూపుమాపబడగలిగే పక్షంలో, అప్పుడు సహజంగానే నేడు మనం తటాలున ఊహించుకోగల దేని [ఏ సమాజరూపం] కంటేకూడ ఆ భావి కమ్యూనిస్టు సమాజపు అంగనిర్మాణం చాల భిన్నంగా వుండే ఆస్కారం వుంటుందిగదా. కనుక, మానవ వాంఛలు-చొరవలు సాంఘిక పరిస్థితులచే ఏ మేరకు సవరించబడగలవు [లేక మార్చబడగలవు] అని మార్క్స్ అభిప్రాయపడుతున్నాడు [అనే ప్రశ్న వస్తుంది]. ఈ ప్రశ్నపై చర్చకు తన జర్మన్ భావజాలం (German Ideology) లో మార్క్స్ గణనీయంగా స్థలం కేటాయించుతాడు. అక్కడ మార్క్స్ "సకల పరిస్థితుల్లోనూ మనివుండే, కాకుంటే విభిన్న సాంఘిక స్థితిగతుల్లో వాటి రూపమూ, దిశా మాత్రమే మారుతూండే" నిశ్చల [లేక స్థిర] వాంఛలకూ, కాగా "ఏదో ఒక ప్రత్యేక సమాజరూపంలో, ప్రత్యేక ఉత్పత్తి, మారకాల పరిస్థితుల్లో మాత్రమే జనించే" సాపేక్ష వాంఛలకూ మధ్య తేడా చూపుతాడు. కమ్యూనిస్టు సమాజంలో మొదటివి [అంటే స్థిర వాంఛలు] కేవలం మార్చబడుతాయి; అవి మామూలుగా వృద్ధిచెందడానికి తగిన అవకాశాలుకూడ యివ్వ బడుతాయి; కాగా తర్వాతివి [అంటే సాపేక్ష వాంఛలు], వాటి మనుగడకు ఆవశ్యకమైన పరిస్థితుల్నే లేకుండా చేయడంద్వారా, నాశనంగావించబడుతాయి. మార్క్స్‌ ఇంకా యిలా అంటాడు: "కమ్యూనిస్టు వ్యవస్థీకరణలో వాంఛలు కేవలం మార్చ బడుతాయి, మరే వాంఛలు పూర్తిగా హననం చేయబడుతాయి అనేది ఒక వ్యావహారిక విధంగానేయథార్థ, వ్యావహారిక కోర్కెల్ని [వాంఛల్ని] మార్చడంద్వారానిర్ణయించబడగలవు గాని అంతకు పూర్వపు చారిత్రక పరిస్థితులతో చారిత్రక పోలికసేతద్వారానైతే కాదు." స్థిర వాంఛలకు ఉదాహరణగా ఆయన అనేక కోరికల్ని [తినాలనే కోరిక వాటిలో ఒకటి] ఉటంకిస్తూ, ఇంకా యిలా అంటాడు: “లేదా, వాంఛలు, అవసరాల స్థిరత్వం రద్దు చేయబడాలనేమీ కమ్యూనిస్టులు కోరుకోరువాళ్లు కేవలం సకల వాంఛలయొక్క సాధారణ [మామూలు] సంతృప్తినిఅంటే కేవలం ఆ వాంఛలే స్వయంగా పరిమితం చేసేంత సంతృప్తినిసాధ్యంచేసే విధంగా ఉత్పత్తి, మారకాలను ఆర్గనైజ్‌ చేయాలనిమాత్రమే ఉద్దేశిస్తారు.[16] మనిషియొక్క సాంఘిక స్వభావంలో ఆ మార్పులూ, వాళ్ల కోర్కెల [వాంఛల] క్రమబద్ధీకరణా, తన పూర్వ రచనల్లో తాను ప్రస్తావించి వున్న మానవసారాన్ని మనిషి తిరిగి తెచ్చుకోవడం [పున: ప్రాప్తం గావించుకోవడం] ద్వారా సాధ్యపడగలదని మార్క్స్ అభిప్రాయ పడుతాడు. ఈ సారం అనేది ఒక సాముదాయిక సృజనాత్మకత. మనిషి తన స్వయం-సృష్టిక్రమాన్నీ, ప్రకృతితో తన సంబంధాన్నీ అదుపాజ్ఞల్లో వుంచుకొంటాడనే భావనఇదంతా పని గురించి మార్క్స్కుండే భావనలో ఒక భాగం. భావి కమ్యూనిస్టు సమాజంలో ప్రతి ఒక్కరూ కార్మికులే అవుతారు. "శ్రమ విమోచనగావించ బడడంతో ప్రతి మనిషీ ఒక పని [చేసే] మనిషి [కార్మికుడు] అవుతాడు; ఉత్పాదక శ్రమ ఒక వర్గధర్మంగా వుండడం మానేస్తుంది."[17] దీని [ఈ భావనయొక్క] సాధారణ ఆమోదం మానవ జాతికుండే శాశ్వత సమస్య యుద్ధం యొక్క పరిష్కారానికి దారి తీయగలదని మార్క్స్యోచించాడనే వాస్తవాన్నిబట్టి మార్క్స్కు సంబంధించి ఈ భావనకున్న మౌలిక ప్రాధాన్యాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఫ్రాన్స్లో అంతర్యుద్ధం లో ఆయన "దాని సహజ పరిపాలకుడు ప్రతిచోటా ఒకరే శ్రమనే అయివుండడం వల్ల దాని అంతర్జాతీయ సూత్రం [నియమ నిబంధన] ఒకటిగానే శాంతిగా మాత్రమే వుండగల"[18] సమాజాన్నిగురించి మాట్లాడి వుండడం గమనార్హం.

"భవిష్యత్తులోని వంటదుకాణాలకోసం వంటకాలచిట్కాలు రాయడానికి"[19] మార్క్స్ తిరస్కరించివున్నప్పటికీ కమ్యూనిస్టు సమాజపు ఆర్థికవ్యవస్థీకరణగురించి ఆయన చేసిన రేఖాచిత్రణ మాత్రం స్పష్టంగానే వుంది. పారిశ్రామిక రిజర్వు సైన్యాన్నివాడడం [పనికి నియమించడం], అత్యధిక సంఖ్యాక వ్యక్తుల్లో అంతర్నిహితమై వుండే వైవిధ్యపూరిత ప్రతిభాయుక్తుల్ని ఉపయోగించుకోగల్గడాల వల్ల కమ్యూనిస్టు సమాజం బాగా సంపన్నం కాగల్గుతుంది [అవుతుంది]. ఉత్పత్తి సాముదాయికమైనదిగా మరెంతమాత్రం డబ్బు మాధ్యమంతో నడిచేదిగా కాకుండా వుంటుంది; కాగా దాని వాసిని [నాణ్యత లేక గుణాన్ని] బట్టి [ఆ ఉత్పత్తికి] విలువ కట్ట బడుతుంది. సమయం వాడకంకూడ ప్రతి వ్యక్తీ గరిష్ట మోతాదులో స్వేచ్ఛాసమయాన్ని ఆనందిస్తూ తానొక 'విశ్వజనీన వ్యక్తి' గా రూపొందడానికి అనువుగా ప్రణాళికాబద్ధం చేయబడుతుంది. తనకుపూర్వం వుండిన ఊహాజనిత సోషలిస్టుల్లాకాకుండా మార్క్స్ ఈ సమాజాన్ని చారిత్రక వికాసక్రమపు ఆవశ్యక ఉత్పత్తిఫలంగా వీక్షించాడు. ఈ గమనంలో యంత్రాలను ప్రవేశపెట్టడం, స్వయం-చలిత యంత్రీకరణలు [introduction of machinery and automation] అనేక విధాలుగా కీలక కారణాంశాలై వున్నాయి [, వుంటాయి] అని చెప్పే రచనాభాగాలు మనకు గ్రండ్రిస్సేలో అనేకం కనిపిస్తాయి కూడ.

* * * * *[1] కమ్యూనిస్టు ప్రణాళిక లోని [ఇందుకు సంబంధించిన] భాగం చూడండి: ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 243.

[2] జి. హెగెల్‌, వర్క్‌, బెర్లిన్‌, 1832, సం. VIII, 18.

[3] ఎస్‌. అవెనెరీ రాసిన కార్ల్‌ మార్క్స్‌యొక్క సాంఘిక, రాజకీయ చింతన, కేంబ్రిడ్జ్‌, 1968, లో హెగెలియన్‌ కోణాల్ని బాగా ఎత్తిచూపడం జరిగింది. దీనిపై విమర్శకు రాజకీయ అధ్యయనాలు (Political Studies) (1970) లో ఎమ్‌. ఎవాన్స్‌ వ్యాసం చూడండి.

[4] పోల్చి చూడు: ఎఫ్. మాన్యుయెల్, హెన్రీ సెయింట్ సైమన్యొక్క నవలోకం, కేంబ్రిడ్జ్, 1956.

[5] ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 237 నుండీ.

[6] పోల్చి చూడు: ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 30 నుండీ.

[7] ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 363.

[8] ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 539.

[9] ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 238.

[10] పవిత్ర కుటుంబం, పు. 57..

[11] ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 284.

[12] ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 569.

[13] ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 542.

[14] ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 565.

[15] చూడు: ప్రత్యేకించి, పెట్టుబడి, సం. II లోని చివరి ప్రకరణం.

[16] జర్మన్ భావజాలం, పు. 282 నుండీ; అనువాదం నా [అంటే మెక్లెలాన్యొక్క] సొంతం.

[17] ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 544.

[18] ఎంపికచేయబడ్డ మార్క్స్, ఏంగెల్స్ రచనలు, I, 490.

[19] పెట్టుబడి, I, 17.

No comments: