Saturday, January 8, 2011

'భావి కమ్యూనిస్టు సమాజం' గురించి మార్క్స్‌, మెక్‌లెలాన్‌ ఇంగ్లీషు రచనకు ఇంగువ మల్లికార్జున శర్మ అనువాదం [Marx on 'Future Communist Society' by McLelan, translated by I.M. Sharma [Part 2]

మూలపాఠాలు [Texts]

కమ్యూనిజం [సంఘస్వామ్యం] అంటే ప్రైవేటు [వ్యక్తిగత] ఆస్తి యొక్క, అందుచేత మానవుని స్వయం-పరాయీకరణయొక్క నిశ్చయాత్మక రద్దు; కనుక అది మనిషిచే, మనిషికొరకు జరిగే మానవ సారాంశపు వాస్తవ పున: భుక్తీకరణగా వుంటుంది. ఇది స్వయంగా మనిషికోసం ఒక సాంఘిక మానవుడిగా, అంటే జాత-మానవుడి [human being] గా మనిషికోసం పూర్వకాలపు అభివృద్ధిక్రమాల్లో గడించబడ్డ సకల సంపదల్నీ సంరక్షిస్తూవుండే మానవుని చైతన్యయుత, సంపూర్ణ పునరాగమనం [return] గా వుండే కమ్యూనిజం. పూర్ణీకృత సహజతత్వంగావుండే మానవతా వాదంగానూ, పూర్ణీకృత మానవతావాదంగావుండే సహజతత్వం గానూ ఈ కమ్యూనిజం వుంటుంది. మనిషికీ ప్రకృతికీ నడుమ వైరానికీ, మనిషికీ మనిషికీ మధ్య వైరానికీ ఒక సిసలైన పరిష్కారం అది. అస్తిత్వానికీ [మనుగడకూ], [జీవన] సారాంశానికీ నడుమ; కర్మపదార్థీకరణకూ [objectification], స్వయం-ధ్రువీకరణకూ మధ్య; స్వాతంత్ర్యానికీ, ఆవశ్యకతకూ నడుమ; వ్యక్తికీ, జన్మజాతికీ మధ్య జరిగే పోరాటాలకు అది సరియైన [నిజమైన - true] పరిష్కారమై వుంటుంది. చరిత్ర పొడుపుకథ [లేక విడికథ, లేక చిక్కుప్రశ్న - riddle of history] కు అది [సరియైన] పరిష్కారంగా వుంటుంది; అలాంటి పరిష్కారం తానేనని తెలిసిన [పరిష్కృత] సమాజం అది. 1844 రాతప్రతులు, ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 89.

దేవుని అధిగమనంగా నాస్తికత్వం సైద్ధాంతిక మానవతా వాదపు ఆవిర్భావమై వుంటుంది. ఇక ప్రైవేటు ఆస్తి అధిగమనంగా కమ్యూనిజం నిజమైన మానవ జీవితమే మనిషి ఆస్తిగా వుంటుందనే దానికి సూచన; అదే వ్యవహారాత్మక మానవతా వాదపు ఆవిర్భావమై వుంటుంది. మరో విధంగా చెబితే, మానవతా వాదం తనతో తానే మాధ్యమంగా మతాన్ని అధిగమించి సాగడమే నాస్తికత్వంకాగా, అదే మానవతావాదం తనతో తానే మాధ్యమంగా ప్రైవేటు ఆస్తిని అధిగమించి సాగడమే కమ్యూనిజం అయి వుంటుంది. - 1844 రాతప్రతులు, ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 108.

ప్రైవేటు ఆస్తియొక్క అభావంగా [రుణీకరణ - negation] వుండే కమ్యూనిజం మాధ్యమంగా మరెంతమాత్రం సాగని మనిషియొక్క ధ్రువాత్మక వాస్తవికతగా యథార్థ జీవితం ఎలా వుంటుందో, సరిగ్గా అలాగే సోషలిజం అనేది మరెంతమాత్రం మతంయొక్క అభావం మాధ్యమంగా సాగని మనిషియొక్క నిశ్చయాత్మక స్వయం-చైతన్యంగా వుంటుంది. కమ్యూనిజం నిశ్చయాత్మకత (positive) ను అభావంయొక్క అభావం (negation of negation) రూపంలో సూచిస్తుంది; ఈ విధంగా అది [కమ్యూనిజం] మానవ విమోచనా, పునరావాసక్రమంలోని ఒక దశగా మానవ వికాసపు ఈ తరుణం [juncture]లో యథార్థమూ, ఆవశ్యకమూ రెండూ అయిన ఒక దశగా వుంటుంది. కమ్యూనిజం తక్షణ భవిష్యత్తుయొక్క ఆవశ్యక రూపం, గతిశీల సూత్రం; [అంతే గాని] కమ్యూనిజం [దానంతటదే] మానవ వికాసపు లక్ష్యం కాదు; మానవ సమాజపు రూపంకాదు. - 1844 రాతప్రతులు, ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 95 నుండీ.

కమ్యూనిస్టు సమాజంలో ఎవరికీ ఏదో ఒక ప్రత్యేక కార్యకలాప రంగంమాత్రమే నన్నట్లు వుండదు; ప్రతి ఒక్కరూ తాను కోరుకున్న ఏ శాఖలోనైనా నిష్ణాతుడయ్యే వీలుంటుంది. కారణం సమాజమే ఉత్పత్తిని క్రమబద్ధం చేయడం. అందువల్ల నాకు ఈ రోజు ఒక పని అయితే రేపు మరొక పనిగా చేసుకునే అవకాశం వుంటుంది. అలాగే నేను ఎప్పుడేగానీ ఒక వేటగానిగానో, జాలరిగానో, పసులకాపరిగానో లేక విమర్శకునిగానో కావల్సిన అక్కర లేకుండానే, పొద్దున్నే వేటకు పోయి, మధ్యాహ్నం చేపలు పట్టడానికి వెళ్లి, సాయంత్రం పశుపాలన చేసి, ఆనక రాత్రి భోజనంతర్వాత [రచనల లేక సాహిత్య] విమర్శ చేసుకునే అవకాశం [కమ్యూనిస్టు సమాజంలో నాకు] వుంటుంది. కాగా, [ఇప్పుడున్న] ఈ సాంఘిక కార్యకలాప స్థిరీకరణ [అంటే ఒకరు వేటగానిగానో, జాలరిగానో, యిలా అలా ఫిక్సయి (స్థిరపడి) పోవడం], స్వయంగా మనం ఉత్పత్తిచేసేవే జమకూడి గట్టిపడి [సుదృఢీకృతమై] మనపైనే [పెత్తనం చెలాయించే] ఒక భౌతిక శక్తిగా రూపొందడం, ఇంకా అవి [అంటే మన ఉత్పత్తులే మనపై భౌతిక శక్తిగా] అదుపు తప్పి పెరిగిపోతూ, మన ఆశల్ని అణచివేస్తూ, మన అంచనాలనే తల్లకిందులు చేసివేస్తూ [మనపై పెత్తనం చెలాయిస్తూ] వుండడం అనేది ఇంతదాకా చారిత్రకాభివృద్ధి క్రమంలో ఒక ముఖ్య కారణాంశం [నిర్ణాయక అంశం] గా వుంటూవస్తున్నదని గమనించాలి. - జర్మన్ భావజాలం (1845-46), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 169.

మనకు [సంబంధించి] కమ్యూనిజం అనేది [ఏదో మున్ముందు] వ్యవస్థాపించబడాల్సిన విషయవ్యవహారస్థితి (state of affairs) వాస్తవికతే దానికదిగా సర్దుకుపోవాల్సిన ఆశయం కాదు. ఇప్పుడున్న విషయవ్యవహార స్థితిగతుల్ని రద్దుచేసే నిజమైన వుద్యమాన్ని మేము [లేక మనం] కమ్యూనిజం అంటున్నాము. ప్రస్తుతం అస్తిత్వంలోవున్న ముందుఊహలు-పరిస్థితుల నుండే ఈ వుద్యమంయొక్క స్థితిగతులు పరిణమిస్తాయి. - జర్మన్ భావజాలం (1845-46), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 171.

కమ్యూనిస్టు విప్లవం ద్వారా వర్తమాన సమాజ స్థితిగతుల్ని కూలదోయడం, అలాగే ఇప్పుడున్న సమాజస్థితితో అభిన్నంగా వుండే ప్రైవేటు ఆస్తిని రద్దుగావించడాలతో [మన] జర్మన్ సిద్ధాంత వేత్తల్ని ఎంతో గాబరా పెట్టే ఈ [రాజకీయ లేక రాజ్య] అధికారం రూపుమాపివేయబడుతుందనేదీ, ఇక అప్పుడు [మానవ సమాజ] చరిత్ర ప్రపంచ చరిత్రగా పరివర్తనచెందే కొద్దీ ఆ [పరివర్తన] మోతాదులో ప్రతి ఒక్క వ్యక్తియొక్క విమోచనకూడ సాధించ బడుతుందనేదీ [ఈ రెండు అంశాలుకూడ] సరిగ్గా అంతే అనుభవజ్ఞాన పూర్వకంగా [just as empirically] నిరూపితమై వున్నాయి [ఏదైనా] వ్యక్తియొక్క నిజమైన బౌద్ధిక సంపద అంతా అతనికుండే వాస్తవ సంబంధాల సంపదపైనే పూర్తిగా ఆధారపడివుంటుందనేది స్పష్టమే. అప్పుడుమాత్రమే విడి వ్యక్తులు వివిధ స్థానిక, జాతీయ [అడ్డుగోడల] హద్దులనుండి విముక్తి పొందుతారు; యావత్ ప్రపంచపు భౌతిక [పాదార్థిక], బౌద్ధిక ఉత్పత్తితో వ్యవహారాచరణ సంబంధంలోకి తేబడుతారు; ఆ విధంగా ఈ యావత్ భూగోళపు సర్వతోముఖ ఉత్పత్తులన్నింటినీ (మొత్తం మానవ సృష్టు లన్నింటినీ) ఆనందించే సామర్థ్యాన్ని సముపార్జించుకునే స్థితికి తీసుకువెళ్ళబడుతారు. సర్వతోముఖ [పరస్పర] ఆధారం అనేది వ్యక్తిమానవుల ప్రపంచ చరిత్రాత్మక సహకారపు ఈ సహజ రూపం ఈ కమ్యూనిస్టు విప్లవంచే ఈ శక్తులపై మనుషుల పరస్పర చర్యల మూలంగా జనించినా వారికి పూర్తిగా పరాయివైన శక్తుల్లా ఇంతవరకూ వాళ్లందరినీ భయభ్రాంతుల్నిచేస్తూ, పరిపాలిస్తూ వచ్చిన ఈ శక్తులపై వారి [ఈ వ్యక్తులందరి] [సంపూర్ణ] అదుపాజ్ఞలు, చైతన్యయుత యాజమాన్యాధిపత్యాలు [control and conscious mastery] గా పరివర్తనగావించబడుతుంది. - జర్మన్ భావజాలం (1845-46), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 171నుండీ.

శ్రమవ్యవస్థీకరణకర్తలు (ఆర్గనైజర్లు) అని మహాచెప్పబడేవాళ్లు ప్రతి వ్యక్తియొక్క కార్యకలాపం మొత్తాన్నీ వ్యవస్థీకరించ (ఆర్గనైజ్ చేయ) జూస్తారని స్టిర్నర్ ఊహిస్తున్నాడు; కాని సరిగ్గా వాళ్లలోనే [శ్రమ ఆర్గనైజర్లలోనే] నేరుగా [ప్రత్యక్షంగా] ఉత్పాదకమైన శ్రమకూ ఇది వ్యవస్థీకృతం అయివుండాల్సి వుంటుంది అలా ప్రత్యక్షంగా ఉత్పాదకంకాని శ్రమకూ నడుమ తేడా గిరిగీయబడివుంటుంది. అయితే అతడు [స్టిర్నర్] ఊహిస్తున్నట్లుగా వీటిలో రెండో కోవకు చెందిన శ్రమ చేసే వాళ్లు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాఫేల్లా [అంత నైపుణ్యంతో] పని చేయాలన్నట్లేమీ [ఆశా, ఆపేక్షా] వాళ్లకు వుండదు. కాని రాఫేల్లా [అంతటి] అంతస్థప్రతిభాశక్తులు ఎవరిలో వున్నా వారు ఏ అడ్డంకీ లేకుండా పైకిరావాలని [అభివృద్ధి చెందాలని] వారి అభిప్రాయం కొందరు ప్రత్యేక వ్యక్తుల్లోనే కళాత్మక ప్రతిభ పూర్తిగా కేంద్రీకృతమై వుండడం, కాగా [ఆ రంగంలో ప్రవేశం, అభినివేశం, దానితో సంబంధం వున్న] విశాల ప్రజానీకంలోని ఈ ప్రతిభాశక్తులు అణచి వేయబడ వుండడం ఇదంతా శ్రమ విభజన పర్యవసానమే. పోతే, ఏవైనా కొన్ని నిశ్చిత సాంఘిక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అద్భుతమైన చిత్రకారులై వుండవచ్చు; అయినప్పటికీ అప్పుడు కూడ వారిలో ప్రతి ఒక్కరూ మౌలికస్వభావరీత్యా [original] చిత్రకారులు అయివుండే అవకాశం కూడ వుండనే వుంటుంది; కనుక యిక్కడకూడ 'మానవ' శ్రమకూ, 'విశిష్ట' శ్రమకూ మధ్య తేడా అనేది వట్టి చెత్త [అర్థరహిత ప్రలాపన – sheer nonsense] అవుతుంది. స్థానిక లేక జాతీయ సంకుచితత్వం అనేది పూర్తిగా శ్రమ విభజన నుండే తలయెత్తుతుంది; అలాగే ఒక కళాకారుడు ఏదో ఒక నిశ్చిత కళారూపానికే పరిమితమైవుండడంకూడ [శ్రమ విభజన వల్లే]. దాని [నిశ్చిత కళారూపానికి పరిమితంచేసే శ్రమ విభజన] ధర్మమా అనే ఎవరైనా ఒక కళాకారుడు విశేషించి ఒక చిత్రకారుడుగానో, శిల్పిగానో, అలా అలా కుదురుకుని పోవడం జరుగుతుంది. అసలుకు అతడి కళా కార్యకలాపపు [ప్రత్యేక] పేరే అతడి వృత్తిపర వికాసపు సంకుచితత్వాన్నీ, శ్రమ విభజనపై అతడు ఆధారపడి వుండడాన్నీ [అతడి ఆధారితనూ] తగువిధంగా అభివ్యక్తీకరిస్తూ వుంటుంది. ఏదేమైనా, సమాజపు కమ్యూనిస్టు వ్యవస్థీకరణతో [స్థానిక లేక జాతీయ సంకుచితత్వానికి] కళాకారుల ఈ పరాధీనత అదృశ్యమై పోతుంది. కమ్యూనిస్టు సమాజంలో చిత్రకారులంటూ ప్రత్యేకించి ఎవరూ ఇక వుండరు; మహా అయితే ఇతర కార్య కలాపాలతోబాటు చిత్రలేఖనంలోకూడ వ్యస్తమైవుండే జనులు వుంటారంతే. - జర్మన్ భావజాలం (1845-46), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 189.

నిజమే, ఈ చర్యలు [measures] వివిధ దేశాల్లో వివిధ రకాలుగా వుంటాయనుకోండి. ఏదేమైనప్పటికీ, బాగా పురోభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ ఈ కింది చర్యలు బాగా సాధారణంగానే వర్తించగలుగుతాయి:

1. భూమిపై ఆస్తి రద్దు; భూమి కిరాయిలన్నింటినీ ప్రజా ప్రయోజనాలకు వినియోగించడం.

2. భారీ ఎత్తున అంతకంతకూ పెరిగే లేదా అంచెలవారీ ఆదాయపు పన్ను [progressive or graduated income tax] విధింపు.

3. వారసత్వ హక్కులన్నింటినీ రద్దు చేయడం.

4. ప్రవాసులు [దేశంవిడిచి వెళ్లినవారు], తిరుగుబాటుదారులందరి ఆస్తి జప్తు చేసుకొనడం.

5. ప్రభుత్వ పెట్టుబడితో, సంపూర్ణ గుత్తాధిపత్యంతో కూడుకుని వుండే జాతీయ బాంకుద్వారా పరపతి సదుపాయాలన్నీ రాజ్యంచేతుల్లో కేంద్రీకరించడం.

6. రాజ్యం చేతుల్లో రవాణా, సమాచార సంబంధాల సాధనాలను కేంద్రీకృతంగావించడం.

7. రాజ్యం యాజమాన్యంలోని ఫాక్టరీలను, ఉత్పత్తి సాధనాలనూ విస్తరింపజేయడం; బీడు భూములను సాగులోకి తేవడం; ఒక ఉమ్మడి ప్రణాళికద్వారా [పంట] నేల సారాన్ని సర్వత్రా మెరుగుపర్చడం.

8. శ్రమచేయాల్సిన విధి అందరికీ సమానంగా వుంటుంది. పారిశ్రామిక సైన్యాలప్రత్యేకించి వ్యవసాయంకోసం ఏర్పాటు.

9. వ్యవసాయాన్ని తయారీ పరిశ్రమలతో సమ్మేళనం గావించడం; జనాభాను దేశమంతటా మరింత సమధర్మ పద్ధతిలో పంపిణీ చేయడంద్వారా పట్టణవాసానికీ, పల్లెసీమలకూ నడుమ అంతరాన్ని క్రమక్రమంగా రూపు మాపడం.

10. ప్రజా పాఠశాలల్లో పిల్లలందరికీ ఉచిత విద్య అందించడం. ప్రస్తుత రూపంలోని పిల్లల ఫాక్టరీ శ్రమను రద్దు చేయడం. విద్యాబోధనను పారిశ్రామికోత్పత్తితో మిళితం చేయడం, వగైరా, వగైరా.

అభివృద్ధి జరిగే క్రమంలో, వర్గ విభేదాలు అదృశ్యమై పోయినప్పుడు, ఉత్పత్తి అంతా మొత్తం జాతియొక్క అపార సహవాస [సంఘం] చేతుల్లో కేంద్రీకృతమైనప్పుడు, ప్రజా అధికారశక్తి దాని రాజకీయ స్వభావాన్ని కోల్పోతుంది. సక్రమంగా అలా పిలవబడే రాజకీయాధికారం కేవలం మరొక వర్గాన్ని అణచివేసేందుకు ఒక వర్గం ఉపయోగించే సంఘటిత అధికారశక్తి మాత్రమే. మరి బూర్జువా వర్గంతో దాని పోరాటం [contest - సవాలు] క్రమంలో అధోకార్మిక వర్గం, పరిస్థితుల వత్తిడిమూలంగా, తన్ను తాను ఒక వర్గంగా సంఘటితం చేసుకోవల్సివచ్చే పరిస్థితికి నెట్టబడితే, [ఆనక] ఒక విప్లవంద్వారా అది తనను పాలకవర్గంగా రూపొందించుకుంటే, ఆ విధంగా బలప్రయోగంద్వారా పాత ఉత్పత్తి పరిస్థితుల్ని ఊడ్చిపారేస్తే, అప్పుడది ఈ [ఉత్పత్తి] పరిస్థితులతో బాటుగా అసలుకు వర్గ వైరాలు ఉనికిలో వుండడానికీ, సాధారణంగా వర్గాలు అస్తిత్వంలో వుండడానికీ అనువైన పరిస్థితుల్నికూడ ఊడ్చిపారవేసే వుంటుంది. తద్వారా అది ఒక వర్గంగా తనకు సొంతంగా వుండిన శ్రేష్టతను, ఆధిపత్యాన్ని కూడ రద్దుచేసి వుంటుంది.

[దాని] వర్గాలు, వర్గ వైరాలతోకూడుకున్న పాత బూర్జువా సమాజం స్థానే మనకు ఒక సహవాససంఘం లభిస్తుంది. దానిలో సర్వుల స్వేచ్ఛావికాసానికి ప్రతి ఒక్కరి స్వేచ్ఛావికాసం ఒక నిబంధనాస్థితిగా వుంటుంది. కమ్యూనిస్టు ప్రణాళిక (1848), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 237 నుండీ.

సంఘ-సాముదాయిక ఉత్పత్తి [communal production] వుం[టుం]దని ఊహించుకుంటే, ఇక అప్పుడు సమయనిర్ణయం అనేది ముఖ్యసారంగా వుంటుందనేది నిజమే. గోధుమలు, పశు సంపద, వగైరాల ఉత్పత్తికి సమాజానికి ఎంత తక్కువ సమయం అవసరం పడితే ఇతరభౌతిక లేక బౌద్ధికఉత్పత్తి రూపాలకు వెచ్చించడానికి అంత ఎక్కువ సమయం దొరుకుతుంది. ఏకవ్యక్తి విషయంలో ఎలాగో అలాగే సమాజమంతటి విషయంలోనూ దాని అభివృద్ధియొక్క సార్వత్రికత (universality), దాన్ని [ఆ అభివృద్ధిని] ఆనందించడం, దాని [సమాజాభివృద్ధి] కార్యకలాపం [అంతా] సమయాన్ని పొదుపు చేసుకొనడంపై ఆధారపడి వుంటాయి. అంతిమ పరిశీలనలో, సకల అర్థవ్యవహారాల రూపాలూ [all forms of economics] సమయసంబంధిత అర్థవ్యవహారంగా కుదించివేయ బడ గల్గుతాయి [కూడ]. అదే విధంగా, దాని సాధారణ అవసరాలకు సరిపడే ఉత్పత్తిని సాధించడానికిగాను సమాజం తనవద్దనున్న సమయాన్ని అర్థవంతంగా విభజించుకోవాల్సి [వాటాలు వేయాల్సి] వుంటుంది తనకు అవసరమైన జ్ఞానసముపార్జనకుగానీ, లేదా తన కార్యకలాపాలకుసంబంధించి వివిధ అవసరాలకుగానీ తనకు వుండే సమయాన్ని విభజించి [వాటాలు వేసుకుని] వాడుకోవడం ప్రతి వ్యక్తికీ ఎలా ముఖ్యమో ఇదీ అంతే.

కనుక, సంఘ-సాముదాయిక ఉత్పత్తి ప్రాతిపదికన పాటించ బడాల్సిన ప్రథమ ఆర్థిక సూత్రం సమయం పొదుపుసేత [economy of time] వివిధ ఉత్పత్తి శాఖల నడుమ పనిసమయాన్ని పద్ధతి ప్రకారం పంపిణీ చేయడమే అయివుంటుంది; నిజానికి ఈ సూత్రం ప్రాధాన్యం మరింత హెచ్చుగా [మహత్తరంగా] వుంటుందికూడ. కాని ఇదంతాకూడ శ్రమకాలం (labour time) ప్రాతిపదికన మారకపు విలువల్ని (శ్రమనూ, శ్రమజన్యఉత్పత్తులనూ) కొలవడంనుంచి ప్రాథమికంగా భిన్నిస్తూ వుంటుంది. ఒకే కార్యకలాప శాఖలో పాలుపంచుకొనే వ్యక్తుల పనీ, [వారు చేసే] విభిన్న రకాల శ్రమా పరిమాణాత్మకంగానే [రాశిరీత్యానే] కాక గుణాత్మకంగా [వాసిరీత్యా] కూడ భిన్నంగా వుంటాయి. వస్తువుల నడుమ కేవల పరిమాణాత్మక విభేదానికి ముందుషరతు స్థితి ఏమిటి? వాటి గుణం ఒకటే అయివున్న వాస్తవమే. శ్రమ యూనిట్లు సమాన, అభిన్న గుణం కలిగివున్నవైతేనే వాటిని పరిమాణాత్మకంగా [రాసిరీత్యా] కొలవడం వీలవుతుంది. - గ్రండ్రిస్సే (1857-58), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 361 నుండీ.

పెట్టుబడిదారీగా కాక సంఘస్వామ్యబద్ధం [communistic] గా సమాజం వుంటుందని మనం ఊహించుకుంటే, మొట్టమొదటగా డబ్బు-పెట్టుబడి అనేదే అసలుండదు; [కనుక] దాని వల్ల తలయెత్తే లావాదేవీలను కప్పిపుచ్చే [వివిధ] ముసుగులూ [మారువేషాలూ] వుండవు. కనుక అప్పుడు సమస్యంతా, [ఏ పరిశ్రమ లేక పథకానికి ఎంత వెచ్చించాలి? ఉదాహరణకు] వాటికిగాను మొత్తం వార్షికోత్పత్తి నుండి శ్రమనూ, ఉత్పత్తి సాధనాలనూ, జీవనభృతి సాధనాలనూ తీసి వెచ్చించాల్సి వచ్చినా, ఏ ఉత్పత్తి లేక జీవనభృతి సాధనాల్ని గానీ, లేక చిరకాలంపాటు ఒక ఏడాదో అంతకు హెచ్చో కాలం పాటు ఎలాంటి ప్రయోజనకర ఫలితాన్నిగానీ సృష్టించనటువంటి ఆయా పరిశ్రమలు/పథకాలకు ఉదాహరణకు రైల్వేలనుకోండి ఎంత శ్రమనూ, ఉత్పత్తి సాధనాలనూ, జీవనభృతిసాధనాలనూ సమాజానికి నష్టం లేకుండా మదుపుపెట్టగలమో ముందస్తుగానే అంచనావేసి చూసుకోవల్సిన సమాజ ఆవశ్యకత విషయానికి [తెగి] వస్తుంది. కాని, పెట్టుబడిదారీ సమాజంలోనైతేమాత్రం గొప్ప అలజడులు జరిగిన తర్వాతే, పండుగతర్వాత [సంబరం] లా, సంఘ [ప్రయోజన] హేతువు [లేక కారణాంశం] తన్నుతాను దృఢంగా ప్రకటించుకుంటూ వుంటుంది; ఇలాంటి మహా అలజడులు నిరంతరం పున:సంభవమౌతూ [మళ్లీ మళ్లీ జరుగుతూ] వుండవచ్చు [కూడ]. పెట్టుబడి, సం. II (1869), పు. 318 నుండీ.

అనేకుల శ్రమను కొందరి సంపదగా చేసేటటువంటి వర్గ-ఆస్తిని రద్దుచేయ జూచింది [పారిస్] కమ్యూన్. ఆస్తిహర్తల ఆస్తిహరణాన్ని [expropriation of expropriators] అది ఉద్దేశించింది. ఉత్పత్తి సాధనాలను భూమినీ, పెట్టుబడినీ, ఇప్పుడు ముఖ్యంగా శ్రమను దాసోహం చేసుకుని, దోపిడీ చేసే [అన్యుల ప్రయోజనాలకుగాను వినియోగించే] సాధనాలుగావున్నవాటిని కేవల స్వేచ్ఛాయుత, సహవాసపర పరికరాలుగా పరివర్తన గావించి వాటిని నిజమైన వ్యక్తిగత ఆస్తిగా రూపొందించాలని అది [కమ్యూన్] కోరుకుంది. అయితే, ఇది కమ్యూనిజంకదా, 'అసంభవమైన' కమ్యూనిజం!, ఎందుకూ? ప్రస్తుత వ్యవస్థ కొనసాగించడం అసాధ్యమని గ్రహించగల్గినంత మేధస్సు వున్న పాలకవర్గాలకుచెందిన ఆయా వ్యక్తులు మరి ఇలాంటివారు అనేకులున్నారు సహకార ఉత్పత్తిని నోరారా, ఎల్లెడలా ప్రశంసించే ధర్మదూతలయ్యారే! మరి ఈ సహకార ఉత్పత్తి అనేది ఒక బూటకంగా, ఒక ఉచ్చుగా కాకుండా వుండాలంటే, అది పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించాలంటే, సమైక్య సహకార సంఘాలు ఒక సామాన్య [ఉమ్మడి] ప్రణాళికతో జాతీయోత్పత్తిని క్రమబద్ధంచేస్తూవుండాలంటే, ఆ విధంగా జాతీయోత్పత్తిని తమ అదుపాజ్ఞల్లోకి తీసుకునివుండాలంటే, అవి ఆ విధంగా పెట్టుబడిదారీ ఉత్పత్తియొక్క మరణకారకాంశాలైన నిరంతర అరాచకస్థితీ, నిర్ణీతకాలాల్లో పున:సంభవిస్తూండే సంక్షోభాలకు అంతం పలకాలంటే మరి ఓ అయ్యలారా [పెద్దమనుషుల్లారా]! ఇదంతా కమ్యూనిజం కాకుంటే, 'సుసాధ్య' కమ్యూనిజంకాకుంటే, మరేమౌతుందంటారండీ? - ఫ్రాన్సులో అంతర్యుద్ధం (1871), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 544 నుండీ.

"మార్క్స్: మహామూర్ఖత్వం! ఇదంతా ప్రజాస్వామిక వాగాడంబరమూ, రాజకీయ సొల్లువాగుడూనూ! అది అతి చిన్న రష్యన్ కమ్యూన్ [గ్రామ సంఘసముదాయం] లోనేగానీ లేదా ఆర్టెల్ [రష్యన్ సహకార సంఘం] లోనేగానీ రెంటిలోనూ ఎన్నికలనేవి ఒక రాజకీయ రూపంగా వుంటాయి. [అయితే] ఈ ఎన్నిక స్వభావం ఈ వర్ణనపై ఆధారపడివుండదు; కాగా ఓటర్ల [ఎన్నికదారులు? ఎలెక్టర్ల] ఆర్థిక ప్రాతిపదికపైన, వారినడుమగల ఆర్థిక అంతరసంబంధాల [పరస్పర సంబంధాల - interrelations] పైన ఆధారపడి వుంటాయి. ఇక వాటి [కమ్యూన్ లేక ఆర్టెల్] విధులు రాజకీయమైనవై వుండడం మానిపోయిన తక్షణమే, అప్పుడిక (1) ఏ ప్రభుత్వపర విధీ వుండదు; (2) సాధారణ విధుల పంపకం ఒక మామూలు వ్యాపారవ్యవహారమై పోవడంవల్ల ఆధిపత్యం చెలాయింపుకు ఏ అవకాశమూ వుండదు; (3) ఆ ఎన్నికలకు వాటి ప్రస్తుత రాజకీయ స్వభావం ఏమాత్రం వుండదు.

బకూనిన్: మొత్తం ప్రజలంతా కలిసి సార్వత్రిక ఓటింగుద్వారా తమ ప్రతినిధుల్నీ, రాజ్య పాలకుల్నీ ఎన్నుకొనడం మార్క్సిస్టులే గానీ, అలాగే ప్రజాస్వామిక చింతనాబడికి చెందిన వారేగాని చెప్పే చివరి మాట యిదే [అంటే అంతకుమించి చెప్పడానికి వాళ్లదగ్గర ఏమీ లేదు అని అను.]. అవన్నీ అబద్ధాలు; ఆ అబద్ధాలవెనుక పరిపాలక మైనారిటీ [అల్పసంఖ్యాక వర్గం] నక్కి [దెబ్బతీయను పొంచి] వుంటుంది. ఈ మైనారిటీ ప్రజాసంకల్పమని చెప్పబడేదాని వ్యక్తీకరణగా గోచరిస్తుంది కాబట్టి ఈ అబద్ధాలు మరింత ప్రమాదకరమైనవై వుంటాయి.

మార్క్స్: సమిష్టి ఆస్తి [వ్యవస్థ] కింద సహకార సంఘపు [లేక సంఘ సహకారపు] నిజమైన సంకల్పానికి దారి విడవడానికిగాను ఈ ప్రజాసంకల్పం అని చెప్పబడేది అదృశ్యమై పోతుంది.

బకూనిన్: ఫలితం: ఒక విశేషాధికారయుత అల్పసంఖ్యాకవర్గం చే అత్యధిక మెజారిటీ ప్రజలు పాలింపబడడం. అయితే ఈ మైనారిటీ కార్మికులతో కూడుకునివుంటుంది[గదా] అని మార్క్సిస్టులు అంటారు. ఔను, నిజమే, కాని [వాళ్లంతా] మాజీ కార్మికులు ఒక మారు ప్రజల ప్రతినిధులుగా లేక పాలకులుగా అయితే యిక అప్పటినుండీ వాళ్లు కార్మికులుగా వుండడం మానిపోతుంది.

మార్క్స్: [అలా ఏమీ కాదు;] నేడు ఎవరైనా పారిశ్రామికవేత్త మునిసిపాలిటీ సభ్యుడవంగానే ఇక పెట్టుబడిదారుగా వుండడం మానేస్తాడా? ఇదైనా [కార్మికుడు ప్రతినిధిగా అయ్యే విషయంలోనైనా] అంతకు భిన్నమేమీ కాదు.

బకూనిన్: ఇక రాజ్యం [యొక్క ఉన్నతమైన] ఎత్తులపైనుండి వాళ్లు [కార్మికప్రతినిధులుగా ఎన్నికైన వాళ్లూ, పాలకులైన వాళ్లూ] మొత్తం కార్మికుల సామాన్య ప్రపంచాన్నంతటినీ చిన్నచూపు చూడడం మొదలుపెడ్తారు. ఆ సమయంనుండీ వాళ్లు ప్రజలకుగాక తమ సొంతాలకు, ప్రజల్ని పరిపాలించేందుకు తమకున్నాయని చెప్పుకునే హక్కులకు ప్రాతినిధ్యం వహిస్తారు. [నేను చెప్పే] ఈ విషయాన్ని శంకించే వాళ్లకు మానవస్వభావంగురించి బొత్తిగా తెలవదు [అని చెప్పాల్సివుంటుంది].

మార్క్స్: [అయ్యో,] బకూనిన్ మహాశయునికేగనుక తెలిసి వుంటే, [అదీ] ఒక కార్మిక సహకారసంఘపు మేనేజరు [నిర్వాహకుని] హోదాలోవుండి జ్ఞానం కలిగివుంటే, అధికారశక్తి (authority) గురించి తనకున్న పీడకలలన్నింటినీ ఆయన సైతానువద్దకు తరిమేసేవాడు. [అప్పుడు] ఆయన తన్నుతాను యిలా తప్పనిసరిగా ప్రశ్నించుకుని వుండేవాడు: ఆ కార్మిక రాజ్యం [మన బకూనిన్ మహాశయునికి ఇలా పిలవడం నచ్చితేనే సుమండీ] ప్రాతిపదికన కార్యపాలనావిధులు (administrative functions) ఏ రూపం ధరించగలవు? [అని]. - బకూనిన్పై మార్క్స్ (1875), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 563.

మనం ఇక్కడ వ్యవహరించాల్సి వచ్చేది ఒక కమ్యూనిస్టు సమాజంతో దాని సొంత పునాదులనుండి అది అభివృద్ధి చెందిన విధమైన దానితోకాక అప్పుడప్పుడే పెట్టుబడిదారీ సమాజంనుండి పుట్టివస్తున్న [ఆవిర్భవిస్తున్న] టువంటి, అందువల్ల ఆర్థికంగానేగానీ, నైతికంగానూ, బౌద్ధికంగానేగానీ ప్రతి కోణంలోనూ, దేని పొత్తిళ్లనుండి తాను ఆవిర్భవించి వస్తున్నదో ఆ పాత సమాజపు పుట్టుమచ్చలు ముద్రించబడివున్నటువంటి కమ్యూనిస్టు సమాజంతో [మనం వ్యవహరించాల్సి వస్తున్నది]. కనుక, తదనుగుణంగా, వ్యక్తిగత ఉత్పత్తిదారు తాను సమాజానికి ఏమి యిచ్చాడో సరిగ్గా అదే అవసరమైన తీసివేతల పిదపపొందుతాడు. సమాజానికి అతడు ఇచ్చింది తన వ్యక్తిగత శ్రమ మొత్తం. ఉదాహరణకు, ఒక సాంఘిక పనిదినం విడి పని గంటల మొత్తంగా వుంటుంది. వ్యష్టి ఉత్పత్తి దారుని విడి శ్రమ కాలం ఇలాంటి సాంఘిక పని దినానికి అతడు దోహదంచేసిన భాగంగా, అందులో అతడి వాటాగా వుంటుంది. అతడు సమాజాన్నుండి ఈ ఫలానా వ్యక్తి ఇలాంటి, ఇంతటి శ్రమ మొత్తాన్ని (ఉమ్మడి నిధులకోసం కోతపెట్టాల్సిన అతడి శ్రమమొత్తపు భాగాన్ని తీసివేసిన పిదపే ననుకోండి) సమర్పించాడు అనే సర్టిఫికేట్ [certificate – యోగ్యతా లేక నిశ్చయప్రకటనా పత్రం] అతడు సమాజంనుండి పొందుతాడు. ఈ సర్టిఫికేట్తో అతడు సమాజపు వినిమయసాధనాల నిల్వనుండి అంతే [అందులో సూచించబడిన దానికి సమాన] మొత్తపు శ్రమ ఖరీదుచేసే పదార్థాల్ని[వినిమయ సాధనాల్ని] తీసుకుంటాడు. తాను సమాజానికి ఏదైనా ఒక రూపంలో యిచ్చినంతటి శ్రమ మొత్తాన్నే అతడు మరొక రూపంలో తిరిగి పొందుతాడు.

ఇక్కడ, ఇది సమాన విలువల మారకం అయివున్నంతవరకూ, వర్తకపు సరుకుల మారకాన్ని క్రమబద్ధీకరించే సూత్రంవంటి సూత్రమే ప్రచలితమై వుంటుంది. [కాకుంటే] సారాంశం, రూపం మాత్రం మారిపోయి వుంటాయి; ఎందుకంటే, మారిన పరిస్థితుల్లో ఎవరైనాగానీ తమ శ్రమను తప్ప మరి దేన్నీ యివ్వలేరుగనుక; ఇంకా, మరో వైపున, విడి [వ్యక్తిగత] వినిమయ సాధనాలు తప్పితే మరేదీకూడ వ్యక్తుల [సొంత] యాజమాన్యంకిందకు వెళ్లలేవుగనుక. కాని, వ్యక్తిగత ఉత్పత్తిదారుల మధ్య ఈ విడి [వ్యక్తిగత] వినిమయ సాధనాల పంపిణీకి [వస్తేమాత్రం, దానికి] సంబంధించినంతవరకూ సమవిలువగల వర్తకపు సరుకుల మారకంలో ప్రచలితమైవుండే సూత్రమే [యిక్కడకూడ] పరివ్యాప్తమైవుంటుంది ఒక రూపంలోని నిశ్చితమొత్తపు శ్రమ మరో రూపంలోని సమాన మొత్తపు శ్రమతో మారకం చేయబడుతుంది.

అందుచేత, సమాన హక్కు అనేది ఇక్కడ సిద్ధాంత సూత్రమూ, వ్యవహారాచరణా రెండూ మరెంతమాత్రం కుమ్ములాడు కొంటూ వుండకున్నా, వర్తకపు సరుకుల మారకంలోని సమ విలువల మారకం ఇక్కడ సగటున మాత్రమే మనివుంటుందిగాని, వ్యక్తిగత సందర్భాల్లోకాకున్నా ఇంకా సూత్రరీత్యా బూర్జువా హక్కే అయివుంటుంది.

ఈ ముందంజ సంభవించినప్పటికీ, సమాన హక్కు సదా [నిరంతరం] ఒక బూర్జువా పరిమితిచే కళంకితమై వుంటుంది. ఉత్పత్తిదారుల హక్కు వాళ్లు సరఫరా చేసే శ్రమకు అనుపాతికంగా [దామాషాలో] వుంటుంది. ఒక సమాన కొలప్రమాణంతో శ్రమతో కొలవబడుతుందనే వాస్తవంలోనే ఆ సమానత్వం అనేది యిమిడి వుంటుంది.

అయితే, [సాధారణంగా] ఒక మనిషి మరొక మనిషికంటే శారీరకంగానో లేక మానసికంగానో శ్రేష్టుడై వుంటాడు; కనుక ఒకే మొత్తం కాలం [సమయం] లో మరింత మొత్తం శ్రమను సమర్పిస్తుంటాడు లేదా [మరొకరికంటే] మరింత కాలంపాటు శ్రమ చేయగల్గుతుంటాడు; కాగా శ్రమ గనుక ఒక కొలమానంగా పని చేయాలంటే అది దాని కాలావధిచేగానీ లేదా తీవ్రతచేగానీ నిర్వచించబడాల్సి వస్తుంది; లేని పక్షంలో అది కొలతకు ప్రమాణంగా వుండడం మానేస్తుంది [వుండజాలదు]. [కనుక] ఈ సమాన హక్కు [అనేది] [నిజానికి] అసమాన శ్రమకుగాను వున్న ఒక అసమాన హక్కు [అయివుంటుంది]. అది ఎలాంటి వర్గ వ్యత్యాసాల్నీ గుర్తించదు; ఎందుకంటే, ప్రతి ఒక్కరూ ఇతర ప్రతి ఒక్కరిలా కార్మికులుమాత్రమే అయివుంటారుగనుక; కాని అది లోలోనగా [tacitly - అనుక్తంగానే] అసమాన వైయక్తిక ప్రతిభా విశేషాల్నీ[వరాల్నీ], కనుక [అసమాన] ఉత్పాదక సామర్థ్యాల్నీ, సహజసిద్ధ విశేషశక్తులు [విశేషాధికారాలు] గా (natural privileges) గా గుర్తిస్తుంది. అందువల్ల అది [సమాన హక్కు అనేది] ఇతర ఏ హక్కువిషయంలోలాగే, దాని సారాంశంలో, ఒక అసమానతా హక్కు అయివుంటుంది. హక్కు అనేది, దాని నిజస్వభావం రీత్యానే, ఒక సమాన [కొల] ప్రమాణం అన్వయించబడడంలోనే యిమిడివుంటుంది. కాని అసమాన వ్యక్తులను (వాళ్లు అసమానులు కాకుంటే వాళ్లు విభిన్న వ్యక్తులుగా వుండలేరుగదా) ఒక సమాన ప్రమాణంతో కొలవగలగడం వాళ్లని ఒక సమాన దృక్పథంకిందకు తీసుకువచ్చి చూచినంతమేరకు మాత్రమే, వాళ్లను ఒక నిశ్చిత పక్షంనుండి తీసుకుని చూచినప్పుడే ఉదాహరణకు, ప్రస్తుత సందర్భంలో వాళ్లని కార్మికులుగామాత్రమే పరిగణిస్తూ, వాళ్లలో మరే అంశమూ చూడనప్పుడే, మిగతా ప్రతి అంశాన్నీ నిర్లక్ష్యంచేసినప్పుడే వీలవుతుంది. ఇంకా, ఒక కార్మికునికి పెళ్లి అయివుంటే, ఇంకొకరికి అయివుండకపోవచ్చు. ఒకరికి పిల్లలు ఎక్కువవుంటే మరొకరికి తక్కువ వుండొచ్చు, ఇలా ఇలా [తేడాలు వుంటాయి]. కనుక, సమానంగా శ్రమ చేసినా, అందువల్ల సాంఘిక వినిమయనిధినుండి సమాన వాటా పొందినా, నిజానికి ఒకరికి మరొకరికంటే ఎక్కువ లభించడం, ఒకరు మరొకరికంటే సంపన్నులు కావడం, ఇలా ఇలా [జరగడం ఖాయమే]. మరి ఈ లోపాలన్నీ లేకుండా చేసుకోవాలంటే, హక్కు సమానంగా వుండడానికి బదులు అసమానంగా వుండాల్సివుంటుంది.

అయితే, పెట్టుబడిదారీ సమాజంనుండి సుదీర్ఘకాలం పురిటినొప్పులతర్వాత అప్పుడప్పుడే ఆవిర్భవించినట్లుండే కమ్యూనిస్టు సమాజపు తొలి దశలో ఈ లోపాలు అనివార్యమే. హక్కు ఎన్నడైనా సమాజపు ఆర్థిక కట్టడంకంటే, తద్వారా నిబంధితమైన దాని [ఆ సమాజపు] సాంస్కృతిక వికాసంకంటే ఉన్నతంగా వుండజాలదు.

కమ్యూనిస్టు సమాజపు ఉన్నత [తరమైన ఒక] దశలో, శ్రమ విభజనకు మనిషి ఒక బానిసలా అధీనమై వుండడం అంతరించినప్పుడు, అలాగే దానితోబాటు మానసిక శ్రమకూ, శారీరక శ్రమకూ నడుమగల ప్రతిస్పర్థ [antithesis - ప్రతివాదం] అదృశ్యమై పోయినప్పుడు; శ్రమ ఒక జీవితసాధనంగానేకాక, జీవితపు ప్రధానేచ్ఛగాకూడ అయినప్పుడు; వ్యక్తి సర్వతోముఖ వికాసంతో బాటు ఉత్పాదక శక్తులుకూడ [బాగా] పెరిగిపోయినప్పుడు, [అందువల్ల] సహకార సంపద వనరుప్రవాహాలన్నీ మరింత సమృద్ధిగా పొంగిపారుతున్నప్పుడు అప్పుడుమాత్రమే బూర్జువా హక్కుయొక్క ఇరుకు పరిథి [సంకుచిత దిగ్మండలం - narrow horizon] ని పూర్తిగా అధిగమించడం వీలవుతుంది; [ఆనక మాత్రమే] సమాజం తన [జయనాద] పతాకాలపై " ప్రతి ఒక్కరినుండీ వారి శక్తిసామర్థ్యాలనుబట్టీ, ప్రతి ఒక్కరికీ వారి అవసరాలకు అనుగుణంగా! " అని [అనే నినాదాన్ని] అంకితం చేయ [లేక లిఖించ] వీలవుతుంది. గోథా కార్యక్రమంపై విమర్శ (1875), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 568 నుండీ.

* * * * *

ఇంకా చదవాలంటే

1. ఆర్. అడమియాక్, "రాజ్యం 'వడలి రాలిపోవడం': ఒక పునరాలోచన", జర్నల్ ఆఫ్ పాలిటిక్స్ (1970).

2. ఆర్. బెర్కీ, "లోచూపు-దూరదృష్టి: మార్క్స్ ఆలోచనలో కమ్యూనిజం సమస్య" (లండన్, 1983).

3. ఎస్. బ్లూమ్, " రాజ్యంయొక్క 'వడలిరాలిపోవడం' ", జర్నల్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఐడియాస్ (1946).

4. డబ్ల్యూ. బూత్, "చేపలుపట్ట పోయాం: కమ్యూనిజంగురించి మార్క్స్యొక్క భావనలో అర్థాన్ని వెదికితీయడం", పొలిటికల్ థియరీ, సం. 17 (మే 1989).

5. . బుకానన్, మార్క్స్-న్యాయం: ఉదారవాదంపై సమూల మార్పు విమర్శ (టొటోవా, 1982), పు. 169 నుండీ.

6. జి. కోహెన్, 'సొంత యాజమాన్యం, కమ్యూనిజం, సమానత్వం', సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది అరిస్టాటిలియన్ సొసైటీ, సం. 64, (1990).

7. హెచ్. డ్రేపర్, 'మార్క్స్, ఏంగెల్స్ [రచనల] లో రాజ్యం మరణం', సోషలిస్టు రిజిస్టర్, 1970.

8. ఆర్. దునయెవ్స్కయా, స్త్రీవిముక్తి విప్లవంగురించి మార్క్స్ తత్వచింతన, రెండవ ఎడిషన్, ఇల్లినాయిస్, 1991.

9. . ఫెట్షర్, ' మార్క్స్, ఏంగెల్స్, భావి సమాజం', సర్వే (1961).

10. ఎమ్. ఫాస్టర్, 'కమ్యూనిస్టు రాజ్యంపై మార్క్స్: రాజకీయ వాస్తవికతకు పాక్షిక గ్రహణం', కెనడియన్ జర్నల్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ థియరీ, సం. 4 (శీతాకాలం 1980).

11. కె. గ్రాహం, 'సొంత యాజమాన్యం, కమ్యూనిజం, సమానత్వం', సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది అరిస్టాటిలియన్ సొసైటీ, సం. 64, (1990).

12. . హారిస్, 'మార్క్స్ ఆలోచనలో ఊహాస్వర్గ అంశాలు', ఎథిక్స్, జనవరి 1950.

13. డి. మెక్గ్రెగర్, హెగెల్, మార్క్స్[రచన/భావన]లలో కమ్యూనిస్టు ఆశయం (టొరోంటో, 1984).

14. హెచ్. మేయర్, 'బకూనిన్పై మార్క్స్: అలక్ష్యంచేయబడ్డ ఒక పాఠం', కాహియర్స్ డీ ఎల్ల్ సీ (1959).

15. డి. మెక్లెలాన్, 'పరాయీకృతంకాని (ఎడబాటులేని) సమాజం గురించి మార్క్స్ అభిప్రాయం', రివ్యూ ఆఫ్ పాలిటిక్స్, 1969.

16. ఆర్. నోర్డాల్, "మార్క్స్-ఊహాస్వర్గం: 'ఛాందస' దృక్పథంపై ఒక విమర్శ", కెనడియన్ జర్నల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, సం. 20, డిసెంబర్, 1987.

17. బి. ఓల్మన్, 'కమ్యూనిజంగురించి మార్క్స్ [భావి]దర్శనం: ఒక పునర్నిర్మాణం', క్రిటిక్, సం. 8, 1977.

18. పి. వాన్ పరిజ్స్, '[బాగుచేసి] తిరిగి ఉపయోగించబడ్డ మార్క్సిజం, కేంబ్రిడ్జ్, 1993, భాగం 4.

19. జె. సాండర్సన్, మార్క్స్, ఏంగెల్స్ రాజకీయ భావనలను గురించిన ఒక వివరణ, లండన్, 1969, అధ్యాయం 6.

20. . వాకర్, మార్క్స్, ఆయన సిద్ధాంతం, దాని సందర్భం (లండన్, 1978), అధ్యాయాలు 15-16.

21. . యాస్సోర్, 'కమ్యూనిజమూ-ఊహాస్వర్గమూ: మార్క్స్, ఏంగెల్స్, ఫొరియర్లు', స్టడీస్ ఇన్ సోవియట్ థాట్, సం. 26 (అక్టోబర్ 1983).

* * * * *

No comments: