Saturday, January 8, 2011

'పార్టీ' ని గురించి మార్క్స్‌ Marx on "Party" (1) - by McLelan tr: IM Sharma

పార్టీ (పక్షం)

కార్మికవర్గ కార్యాచరణకు ఒక రాజకీయ పక్షం ఆవశ్యకమనే మార్క్స్‌ భావించేవాడు. కానీ వర్గాలపైగానీ లేక రాజ్యంపైగానీ తనకు గల అభిప్రాయాలను ఎలాగైతే క్రమబద్ధంగా ఆయన ఎన్నడూ వివరించ లేదో, సరిగ్గా అలాగే, అంతకంటే, రాజకీయ పార్టీగురించి కూడ క్రమబద్ధంగా ఎన్నడూ వివరించలేదు. మార్క్స్ ఎన్నడూ ఏ పార్టీనీ స్థాపించలేదు; పోతే ఏ పార్టీ నిర్మాణంలోనేగానీ ఏవో కొన్ని సంవత్సరాలకుమించి సభ్యునిగా వుండలేదుకూడ. అతితొలి రోజుల నుండీ కార్మిక వర్గాన్ని సాంఘిక మార్పుకు సాధనం (ఏజెంటు) గా చూస్తూ వచ్చినా, ఆయన తన రాజకీయ కార్యకలాపాన్ని అప్పటికే ఉనికిలోవున్న సంఘాలు-సంస్థలపై ఆధారపడి నడుపుతూ వచ్చాడు; ప్రత్యేకించి తన తర్వాతి సంవత్సరాల్లో [అప్పట్లో తమ] బలం పెంచుకుంటూన్న కార్మిక పార్టీలకు ఎంతో సలహాలు అందిస్తూ వుండినాడు. ఈ విషయమై మార్క్స్ అభిప్రాయాల్ని వివరించడంలో రెండు ఇబ్బందులు వున్నాయి: మొదటిదేమంటే, అసలు ఆధునిక అర్థంలో రాజకీయ పార్టీని గురించిన భావన పుట్టిపెరగడం మార్క్స్ జీవితకాలంలోనే సంభవించడం; రెండవది, మార్క్స్స్వయంగా ఈ [పార్టీ అనే] పదాన్ని ఎంతో భిన్నమైన అర్థాల్లో వాడివుండడం. కమ్యూనిస్టు లీగు (1847-52), మొదటి ఇంటర్నేషనల్ [ప్రథమ అంతర్జాతీయ కార్మిక సంస్థ – 1864-73] కాలాల్లో మార్క్స్ అత్యంత క్రియాశీలంగా వుండినాడు.

1846లో మార్క్స్, ఏంగెల్స్లు ప్రారంభించిన కమ్యూనిస్టు సమాచార ప్రసరణా (కమ్యూనిస్ట్ కరెస్పాండెన్స్) కమిటీలు రాజకీయ పార్టీలేమీ కావు; కాగా ఐరోపాఖండ నగరాల్లోని విప్లవ బృందాలు తమ తమ భావనల్ని మార్పిడిచేసుకునే సాధనాలు (మాధ్యమాలు) గా మాత్రమే వుండినాయి. ప్రౌఢన్కు రాసిన ఒక లేఖలో మార్క్స్ ఆ సంఘం (అంటే కమ్యూనిస్టు కరెస్పాండెన్స్ కమిటీ) గురించి వర్ణిస్తూ దాని లక్ష్యం "జర్మన్ సోషలిస్టులకు, ఫ్రెంచి, ఇంగ్లీషు సోషలిస్టులతో లంకెకలపడం, జర్మనీలో అభివృద్ధి చెందే సోషలిస్టు వుద్యమాల్ని గురించి విదేశీయులకూ, ఫ్రాన్స్, ఇంగ్లండులలో సోషలిజం వికాసం గురించి జర్మన్లకూ సమాచారం అందించడం"[1] అని చెబుతాడు. అయితే, న్యాయస్తుల సమితి (లీగ్ ఆఫ్ ది జస్ట్) నాయకుల ఆహ్వానంపై మార్క్స్, ఒక చిన్న అంతర్జాతీయ కుట్రపూరిత సంఘంగా తనకున్న స్వభావాన్ని ఆ సంస్థ వర్జించాలని పట్టుబట్టినా, దానిలో [చేరనైతే] చేరాడు. ఆనక ఎంతో కాలం పిదప ఆయన ఈ విషయమై యిలా రాసాడుకూడ: "కమ్యూనిస్టుల రహస్య సమితిలో నేనూ, ఏంగెల్సూ మొట్టమొదటిసారిగా చేరినప్పుడు ఆ సంస్థ తన నియమనిబంధనల లోనుండి వ్యక్తి పూజ (లేక అధికారశక్తి పూజ – cult of the authority) ని అనుకూలించే ప్రతి అంశాన్నీ తొలగించితే తప్ప [మేం చేరం అనే] షరాతోనే [అందుకు వాళ్లు ఒప్పుకుంటేనే] చేరాము."[2] 1847 లో న్యాయస్తుల లీగుకు కమ్యూనిస్టు లీగు అని కొత్త పేరు పెట్టడం, దాని అధికారులు [పదవీధారులు – officers or office-bearers] అందరూ సభ్యులచే ఎన్నుకోబడుతూ, వారికి నిరంతరం బాధ్యులైవుండేలా, వార్షిక మహాసభ సర్వసత్తాక అంగంగా వుండేలా [నిర్దేశించే] ఒక కొత్త, సమగ్రంగా ప్రజాస్వామికమైన రాజ్యాంగాన్ని [నియమనిబంధనావళిని] రూపొందించడం జరిగాయి.

కమ్యూనిస్టు పార్టీగురించిన తమ భావనను మార్క్స్, ఏంగెల్స్‌లు దేనిలోనైతే [మొదటగా] రేఖాచిత్రణ గావించారో ఆ కమ్యూనిస్టు ప్రణాళికను రాయమని వాళ్లను ఆదేశించింది ఈ కమ్యూనిస్టు లీగే. తాము అధోకార్మికవర్గానికి (proletariatకు) అగ్రగామి దళమని కమ్యూనిస్టులు చెప్పుకుంటున్నారంటే అది అధో కార్మికవర్గానికి మొత్తంగావుండే ప్రయోజనాలకు వేరుగావుండే మరేవో ప్రయోజనాల ప్రాతిపదిక పైనేగానీ, లేక ఏవైనా తమ సొంత శాఖాపర (sectarian) సూత్రాల ఆధారంగాగానీ అయితే కాదు. "కమ్యూనిస్టులకూ, ఇతర కార్మికవర్గ పార్టీలకూ మధ్య తేడా అంతా యిదే: 1. వివిధ దేశాల అధోకార్మికుల జాతీయ పోరాటాల్లోంచి వాళ్లు [అంటే కమ్యూనిస్టులు] సమస్త జాతీయతకూ స్వతంత్రంగా యావత్ కార్మికవర్గానికీ వుండే ఉమ్మడి ప్రయోజనాలను ఎత్తిచూపిస్తారు; ముందుకు తెస్తుంటారు. 2. బూర్జువావర్గానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం జరిపే పోరాటం పయనించవల్సి వచ్చే వివిధ దశల్లో, వాళ్లు ఎల్లప్పుడూ, ప్రతి చోటా మొత్తం ఉద్యమపు ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు."[3] ఈ విధంగా వాళ్లు కార్మిక వర్గపు "అత్యంత పురోగామి, దృఢనిశ్చయపూరిత తరగతి" గా వుంటారు; ఇంకా, "సైద్ధాంతికంగా వాళ్లు అధోకార్మికోద్యమపు పోరాటగమన మార్గం, పరిస్థితులు, అంతిమ సాధారణ ఫలితాలగురించి మరింత స్పష్టమైన అవగాహన కలిగివుండడంలో అధోకార్మికవర్గపు అపార బాహుళ్యం కంటే మెరుగైన స్థితిలో వుంటారు" కూడ.[4] ఇక తమను ఎదిరించే ప్రతిపక్ష పార్టీలకుసంబంధించి కమ్యూనిస్టులు తమ సభ్యుల్లో తమ వర్గ ప్రయోజనాల ప్రత్యేకతను (exclusiveness) గురించిన చైతన్యం కలిగిస్తూనే, "అస్తిత్వంలోవున్న సాంఘిక, రాజకీయ వ్యవహార వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతి విప్లవోద్యమాన్నీ సమర్థిస్తారు." ఫ్రాన్స్‌లో వాళ్లు సాంఘికప్రజాస్వామ్యవాదుల్ని (సోషల్‌ డెమోక్రాట్లను) సమర్థించారు; స్విట్జర్లండులో సమూలమార్పు వాదులకు (రాడికల్స్‌కు) మద్దతిచ్చారు; జర్మనీలో ఉదార బూర్జువా వర్గాన్ని బలపర్చారు, ఇలా ఇలా (ఉదాహరణలు యివ్వవచ్చు). దాని కార్యక్రమాన్ని [కార్యాచరణ ప్రణాళికను] కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అని చెప్పుకుంటూ వచ్చినా, ఆ లీగు 1848-49 లో ఎప్పుడే గానీ ఒక నిజమైన రాజకీయ పార్టీలా కనీసం ఆ కమ్యూనిస్టు ప్రణాళిక లో మార్క్స్, ఏంగెల్స్లు రాజకీయ పార్టీ అనే పదాన్ని ఏ అర్థంలో వాడారో ఆ అర్థంలోని పార్టీలాగైనా పని చేసివుండలేదు; ఆ మాటకు, ఆ పరిస్థితుల్లో అది అలా పనిచేసి వుండగల్గేదికాదుకూడ మహా అయితే ఓ 300 మంది సభ్యులుమాత్రమే అందులో వుండినారు; పైగా, అది ఎప్పుడూ గోప్యంగా, ఒక అర్ధ-రహస్య పద్ధతిలో పని చేయవల్సి వస్తూండేదికూడ. ఆనక ఇకనుండీ పత్రికలద్వారా (బాహాటంగా) పనిచేయడమే మెరుగని భావించడంవల్ల ఆయన [మార్క్స్] దాన్ని [కమ్యూనిస్టు లీగును] 1848 జూన్లో రద్దు చేసినట్లు అగుపడుతుంది. తదనంతరం 1848 ఏప్రిల్లో మార్క్స్కు మొట్ట మొదటిసారిగా ఒక ప్రత్యేక సంఘటిత కార్మికవర్గ పార్టీ అవసరం, [కార్మికవర్గానికి] అలా ఏర్పాటవగల అంతశ్శక్తీ వున్నాయని తట్టే సరికే బాగా ఆలస్యమై పోయింది; ఎందుకంటే, నైరుతి జర్మనీలో సాయుధ తిరుగుబాటు ఓటమితో జర్మనీలో విప్లవం అంతమైనట్లే (విఫలమైనట్లే) గనుక.

1850లో లండన్‌ కేంద్రంగా [ కమ్యూనిస్టు] లీగును పునర్నిర్మాణం గావించారు. అది మనుగడలోవున్న రెండు సంవత్సరాల కాలంలో దాని కేంద్ర కమిటీనుండి [వివిధ] గ్రూపులకు జారీచేయబడ్డ అనేక ఆదేశాలకు మార్క్సే బాధ్యుడై వుండినాడు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది 1850 మార్చిలో రాయబడ్డ [సంబోధక] ప్రసంగం; దానిలో "స్వతంత్రంగా, రహస్యంగా, [అయినా] బాహాటంగా [లేక సామూహికంగా? public] ఒక కార్మిక పార్టీని నిర్మాణం గావించాలి" అని పిలుపు యివ్వబడింది. ఈ పార్టీ యితర ప్రతిపక్ష పార్టీలకు వేరుగా వుంటుంది; మామూలుగా సాంఘిక, విద్యావిజ్ఞానబోధక స్వభావం కలిగివుండే అప్పటికే అస్తిత్వంలో వున్న కార్మిక సంఘాల (లేక సమితుల - associations) నుండి దాని కేంద్రకం [కేంద్ర సభ్యత్వ బృందం - nucleus] ఏర్పాటు చేయబడుతుంది [అని ఉద్దేశించబడింది]. సుమారు సమయంలోనే మార్క్స్‌ బ్లాంక్వీతో అనతికాలంలో విచ్ఛిన్నమైపోయిన [పురిటిలోనే సంధికొట్టిన - abortive] పొత్తు ఒకటి పెట్టుకునివున్నాడు నిజమేకాని, పార్టీ ఎలా వుండాలనే విషయంలో మార్క్స్‌ భావనకూ, బ్లాంక్వీ భావనకూ ఎంతో తేడా వుండింది. మార్క్స్‌ దృష్టిలో పార్టీ ప్రజాసామూహిక పార్టీగా [party of the masses] వుండడానికి ఉద్దేశించాలి; అంతేగానీ, ఏదో ఒక విప్లవకర పితూరీ (putsch – ఆకస్మిక బలప్రయోగయుత తిరుగుబాటు) ద్వారా అధికారం గడించడానికి ఉపలక్షించేదిగానో లేక బాగా కేంద్రీకృతమైన [highly centralized] నిర్మాణంగానో వుండ రాదు; పైగా, వర్గ చైతన్యం సంతరించుకోవడానికి ఒక సుదీర్ఘ విప్లవ పోరాటం జరపవల్సిన అవసరం వుంటుందనిసైతం ఆయన కార్మికుల్ని హెచ్చరిస్తాడుకూడ. "తమ వర్గ ప్రయోజనా లేమిటో తమ మస్తిష్కాల్లో స్పష్టపరుచుకోవడంద్వారా, సాధ్యమైనంత త్వరలో ఒక స్వతంత్ర పార్టీగా తమ సొంత వైఖరి అవలంబించడం ద్వారా, ఒక్క క్షణమైనా ప్రజాస్వామిక పెటీ బూర్జువా వర్గాల కపట పదజాలం ఆకర్షణలోకి వెళ్లకుండా తమను తాము కట్టడి చేసుకోవడంద్వారా వాళ్లు (కార్మికులు) స్వయంగా తమ అంతిమ విజయానికిగాను అత్యంత తీవ్ర కృషి జరపాల్సి వుంటుంది,"[5] అని ఒక చోట రాసాడు మార్క్స్‌. 1850 వేసవి కాలానికల్లా తక్షణ విప్లవమనేది యిక సాధ్యపడదనే దృఢ నిశ్చయానికి వచ్చేస్తాడు మార్క్స్‌. వివాదంపై లీగు రెండు ముఠాలుగా చీలిపోయిందికూడ. కేంద్రకమిటీలో ఒక అల్పసంఖ్యాక వర్గం [మైనారిటీ] ఇంకాకూడ తక్షణ విప్లవాన్ని ప్రేరేపించి, పోషించేటటువంటి కార్యకలాపాలనే లక్ష్యంగా పెట్టుకోగా, మార్క్స్‌ మాత్రం మీరు విప్లవానికి సంసిద్ధం కావడానికే ముందుగా యాభై ఏళ్లపాటు అంతర్యుద్ధం అనుభవించి, ఆరితేరాల్సివుంటుందని కార్మికులకు చెప్పసాగాడు. తదనంతర కాలంలో మార్క్స్‌ "పార్టీ అనేది ఆధునిక సమాజపు నేలలో సహజంగా పుట్టి పెరిగే నిర్మాణం; దాని చరిత్రలో యిది ఒక ఉపాఖ్యానంమాత్రమే,"[6] నని చెప్పి [కమ్యూనిస్టు] లీగు గురించి ప్రస్తావించేవాడు.

తొలి-1850లనుండి మధ్య-1860లదాకా మార్క్స్‌ పార్టీలోనూ సభ్యుడై వుండలేదు. 1851 ఫిబ్రవరిలో ఆయన ఏంగెల్స్‌కు ఒక లేఖలో యిలా రాసాడు: "మనమిద్దరంనీవూ, నేనూనేడు బాహాటంగా, సాధికారికంగా ఒక ఒంటరితనంలో వున్నాము; యిది నాకు చాల సంతోషంగావుంది [కూడ]. ఇది [ఏకాంతవాసం] పూర్తిగా మన స్థితికీ, మన సూత్రాలకూ అనువుగానూ, అనుగుణంగానే వుంది. పరస్పర రాయితీలు యిచ్చుకోవల్సిన, పై పై రూపాలు ప్రదర్శించుకోవడానికిగాను [భేషజాలకు పోయి] అనేక లోటుపాట్లను భరించవల్సిన, పార్టీలో గాడిదలందరితో [లేక మూర్ఖులందరితో - asses] కూడి, బైటి ప్రజలముందు హాస్యాస్పదంగా అగుపించే విధి నిర్వహించాల్సిన పరిస్థితి [లేక వ్యవస్థ] యిప్పుడు ముగిసి పోయింది."[7] అయితే, మార్క్స్‌ తన 'పార్టీ' అనే ప్రస్తావన తేవడంమాత్రం కొనసాగిస్తూనే వచ్చాడు; అదీ రెండు అర్థాల్లో మొదటిది, 'మన పార్టీని తాజాగా రిక్రూట్‌ చేసుకోవడం' [అంటే కొత్తగా, కొత్త పద్ధతిలో సభ్యుల్ని చేర్చుకోవడం] అనేటప్పుడుగానీ, లేక 'పార్టీ క్రమశిక్షణ గురించి పట్టుదలతో వుండాలి ' అనేటప్పుడుగానీ, ఆయన తన చుట్టూవుండే సన్నిహిత అనుచరుల ఒక చిన్న బృందంగురించి ప్రస్తావిస్తున్నట్లన్నమాట; బృందాన్నే పరిచితులు 'మార్క్స్‌ పార్టీ' అని పిలుస్తుండేవారు. రెండవది, మార్క్స్‌ [పార్టీ అనే] పదాన్ని [ఒకొక్కప్పుడు] ఇంకా విశాలతర అర్థంలో ఉపయోగించడంకూడ కద్దుఉదాహరణకు, ఇంతకుక్రితమే మనం ప్రస్తావించిన ఫ్రైలిగార్త్‌కు తాను రాసిన లేఖలో ఆయన 'ఒక గొప్ప చారిత్రక అర్థంలోని పార్టీ' గురించి మాట్లాడుతున్నప్పుడుగానీ, లేక తదనంతరకాలంలో 'పారిస్‌లోని జూన్‌ సాయుధతిరుగుబాటు పిదప మన పార్టీ సాధించిన అత్యంత అద్భుత కార్యం'[8] పారిస్‌ కమ్యూన్‌ అని పొగిడేటప్పుడుగానీ నన్నమాట.

ఇక ఒక రాజకీయ పార్టీ సభ్యుడుగా మార్క్స్ కార్యకలాపాలు జరిపివుండిన రెండవ కాలావధి మొదటి అంతర్జాతీయ సంస్థ (ఫస్ట్ ఇంటర్నేషనల్) నాటిదని చెప్పవచ్చు. ఇక్కడ మార్క్స్‌ అవలంబించిన విధానాలు కార్మిక వర్గ పార్టీల నిర్మాణంగురించి ఆయనకుండిన అభిప్రాయాలను చక్కగా సూచిస్తాయని చెప్ప వచ్చు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Association of Working Men) మార్క్స్‌చే స్థాపించబడిందేమీ కాదు; దానంతటదిగా అయత్నపూర్వకంగా అంకురించిన సంస్థ అది; విదేశీ శ్రామికులను దిగుమతిచేసుకోవడం (వలస తెచ్చుకోవడం) నుండి ఇంగ్లీషు కార్మిక సంఘాలను (ట్రేడ్‌ యూనియన్లను) కాపాడడమే మొదట్లో దాని ప్రధాన ఉద్దేశ్యం. అది విధంగానూ ఒక కమ్యూనిస్టు పార్టీ కాదు; లేదా మార్క్స్‌ అనుయాయులైనా దానిలో ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి వుండలేదెన్నడూ. అసలుకు సంఘనిర్మాణ స్వేచ్ఛంటూ లేని దేశాల్లోనైనాసరే, అంతర్జాతీయ సంఘంలోపల [ఐతే] రహస్య బృందాల (బృందీకరణల? groupings) ఏర్పాటును మార్క్స్‌ వ్యతిరేకించాడు. " రకం నిర్మాణం [అంటే రహస్య బృందాల నిర్మాణం] అధో కార్మికోద్యమానికి వ్యతిరేకమైంది. ఎందుకంటే, [ఇలాంటి] సంఘాలు కార్మికులకు జ్ఞానబోధ గావించడానికి బదులు వాళ్ల స్వేచ్ఛాస్వాతంత్ర్యాల్ని అడ్డుకొంటూ, తమ మనసుల్ని తప్పదారి పట్టించేటటువంటి అధికార నిరంకుశ, నిగూఢాత్మక సూత్రాలకు వాళ్లను కట్టిపడేస్తుంటాయి,"[9] అని ఆయన ప్రకటించాడుకూడ. ఆ సంస్థయొక్క నియమ నిబంధనలు సాధ్యమైనంత ఎక్కువ విస్తృత పరిథిలో వుండాలనే మార్క్స్ ఉద్దేశించాడు. ఉదాహరణకు, లాసాలే, ఫ్రౌడన్ అనుయాయులకు కూడ అందులో స్థానం కల్పించబడింది. అంతేగాక తాను కుగెల్‌మన్‌కు రాసినట్లు "కార్మికులు వెంటనే ఒప్పుకొని, సంఘటితంగా కార్యాచరణకు తలపడేలా అనుమతించే, వర్గపోరాట అవసరాలకు ప్రత్యక్ష పోషణ, చోదక గతిశక్తుల్ని ప్రసాదించే, ఒక వర్గంగా కార్మికుల వ్యవస్థీకరణకు దోహదపడే" టటువంటి విషయ వ్యవహారాలతోనే అంతర్జాతీయ సంస్థ వ్యవహరిస్తే బాగుంటుందని మార్క్స్‌ కోరుకుంటాడుకూడ.[10] 1871లో పారిస్‌ కమ్యూన్ పరాజయం [యికనుండీ] కార్మికవర్గ పార్టీలకు మరింతగా క్రమశిక్షణ, ఇతోధిక స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు వుండాల్సిన ఆవశ్యకత గురించి తనకు ప్రబల విశ్వాసం కలిగించిన పిదపకూడ మార్క్స్ అంతర్జాతీయ సంస్థలో మరింత కేంద్రీకరణ (centralization) కావాలని వత్తిడి చేయకపోవడం గమనార్హం; 1871నాటి లండన్ సదస్సు (లేక సభ - conference) కార్మికవర్గం ఒక రాజకీయ పార్టీగా ఏర్పడాలి' అని డిమాండు చేసినా అది స్వతంత్ర జాతీయ పార్టీలు [ఏర్పడాలనే విషయంగురించి] ప్రస్తావనమాత్రమేనని గ్రహించాలి. చివరకు [అంతర్జాతీయ సంస్థ] నిర్మాణపు అంతానికి దారితీసిన బకూనిన్‌, ఆయన అనుయాయులతో జగడమైనా నిర్మాణ [వ్యవస్థీకరణ] గురించిన తగువేగానీ, భావజాలంపై కాదని గమనించాలి; సంస్థ నిర్మాణం బాహాటంగా [తెరచినట్లు], ప్రజాస్వామికంగా వుండాలనీ, [సంస్థయొక్క] వార్షిక మహాసభల్లో మెజారిటీ ఓటు ప్రాతిపదికన తీసుకునే నిర్ణయాలే సంస్థను నడిపించాలని [సంస్థకు మార్గదర్శకం కావాలని] మార్క్స్‌ భావిస్తే, [అలా కాదు,] అంతస్తులదొంతరలాంటి నిర్మాణంతోకూడుకున్న ఒక రహస్య సంఘంగా [అంతర్జాతీయ సంస్థ] వుండాలనే వైపు బకూనిన్‌ మొగ్గు చూపాడు. [అయితే] తర్వాతి సంవత్సరాల్లో అంతర్జాతీయ సంస్థ బయట చెలరేగిన [అభివృద్ధి నిరోధక] వ్యతిరేక స్పందనమూలంగానూ, దాని లోపలే విచ్ఛిన్నకర శక్తుల ప్రాబల్యంమూలంగానూ, మరింత సమర్థవంతమైన కేంద్ర [నాయకత్వపు] అదుపాజ్ఞలకోసం పోరాడవల్సిన అవసరం మార్క్స్‌కు వచ్చిందనుకోండి.

జర్మన్ సోషల్ డెమోక్రటిక్ (సాంఘిక ప్రజాస్వామ్య) పార్టీ, దాని పూర్వీకుల (పూర్వసంస్థల - forerunners) పై మార్క్స్ చేసిన వ్యాఖ్యలు ఇలాంటి పట్టింపుల్నే సూచిస్తాయి. మరీ క్రమశిక్షణాత్మకమైన, పిడివాద పార్టీని సృష్టించినందుకు ఆయన లాసాలే అనుచరుల్ని గట్టిగా విమర్శించాడు. కాని, 1875 నాటి (అంతదాకా పరస్పర వ్యతిరేకులైవున్న రెండు జర్మన్ కార్మిక బృందాలను ఐక్యం చేసిన) గోథా కార్యక్రమంపై తనకు ఎన్ని ఆక్షేపణలు (misgivings) వున్నా, జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఒక సిసలైన సోషలిస్టు పార్టీయేనని మార్క్స్ గుర్తిస్తాడు; ఇంకా, దాన్ని 'మన పార్టీ' అని (మక్కువగా) ప్రస్తావిస్తాడుకూడ. ఈ అంశంపై మార్క్స్ చేసిన చివరి ప్రకటనల్లో ఒకటి - [అన్నిరకాల] విదేశీవిలువల అంటుకాలుష్యం నుండి పార్టీని భద్రంగా కాపాడుకోవాలని గట్టిగా కోరడం; ఆ మేరకు మార్క్స్ 1879 లో పార్టీ నాయకులందరికీ ఒక సర్కులర్ పంపివుండడాన్ని గమనిస్తాము.[11]

సంగ్రహంగా, పార్టీని గురించిన మార్క్స్ భావన ఎన్నడేగానీ ఏదో ఒక ఆదర్శ సంస్థగురించినదిగా వుండలేదు; కాగా అది [మార్క్స్ భావన] సదా అప్పటికే ఏ రాజకీయ నిర్మాణం ఉనికిలోవుంటే దానిపై ఆధారపడి వుంటూవచ్చింది. అయితే [అలా వునికిలోవున్న ] పార్టీ పూర్తిగా ప్రజాస్వామికమైన అంతర్గతనిర్మాణం కలిగివుండాలనీ, అది కార్మికులు స్వయంగా తాముగానే సృష్టించుకొన్న స్వతంత్ర నిర్మాణమై వుండాలనీ, కార్మిక వర్గ లక్ష్యాలనుగురించిన సైద్ధాంతిక అవగాహన కలిగివుండడం దాని విశిష్టతై వుండాలనీ, [మామూలుగా నైతే] దాని నిర్మాణం మరే యితర పార్టీలో భాగంగాగానీ, లేదా అలాంటి యితర పార్టీపై ఆధారపడిగానీ వుండరాదనీ ఆయన పట్టుబట్టడాన్ని మనం గమనిస్తాము.

* * * * *


[1] ఫ్రౌడన్కు మార్క్స్ లేఖ, 5 మే 1846, మార్క్స్ ఏంగెల్స్ రచనలు, సం. XXVII, పు. 442.

[2] బ్లాస్కు మార్క్స్ లేఖ, 10 నవంబరు 1877, మార్క్స్, ఏంగెల్స్ ఎంపిక చేసిన రచనలు, పు. 310.

[3] ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్రచనలు, పు. 231.

[4] ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్రచనలు, పు. 231.

[5] ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 285.

[6] ఫ్రైలిగార్త్‌కు మార్క్స్‌ లేఖ, 29 ఫిబ్రవరి 1860, మార్క్స్‌, ఏంగెల్స్‌ల రచనలు, సం. XXX, పు. 490.

[7] ఏంగెల్స్కు మార్క్స్ లేఖ, 11 ఫిబ్రవరి 1851, మార్క్స్, ఏంగెల్స్ రచనలు, సం. XXVII, పు. 184 నుండీ.

[8] కుగెల్మన్కు మార్క్స్ లేఖ, 12 ఏప్రిల్ 1871, మార్క్స్, ఏంగెల్స్ల రచనలు, సం. XXXIII, పు. 206.

[9] 1871 సంవత్సరపు లండన్ సదస్సు [conference] లో ప్రసంగం, మార్క్స్, ఏంగెల్స్ రచనలు, సం. XVII, 655.

[10] కుగెల్‌మన్‌కు మార్క్స్‌ లేఖ, 9 అక్టోబరు 1866, మార్క్స్‌ ఏంగెల్స్‌ల రచనలు, సం. XXXI, పు. 529.

[11] పోల్చిచూడు ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 573 నుండీ..

No comments: