Saturday, January 8, 2011

'పార్టీ' ని గురించి మార్క్స్‌ Marx on "Party" (2) - by McLelan tr: IM Sharma

మూలపాఠాలు

అప్పుడప్పుడూ కార్మికులు విజయవంతులవుతుంటారు కాని అది తాత్కాలికమే. వాళ్ల యుద్ధాల నిజమైన ఫలం తక్షణ ఫలితాల్లో కాక కార్మికుల ఐక్యత సదా విస్తరిస్తూ పోవడంలోనే వుంటుంది [అని గమనించాలి]. ఆధునిక పరిశ్రమ సృష్టించినవివిధ ప్రదేశాల్లోని కార్మికుల నడుమ పరస్పర సంపర్కాలు కలగజేసేమెరుగైన సమాచార, ప్రసార సాధనాలు ఐక్యతకు ఇంకా దోహదపడతాయి. అన్నీ ఒకే స్వభావం కలిగివుండే అనేక స్థానిక పోరాటాలను కేంద్రీకృతం గావించి [వాటిని] వర్గాలమధ్యని ఒకే జాతీయ పోరాటంగా మలిచేందుకు సరిగ్గా యిలాంటి సంపర్కాలే కావల్సివుండెను. అయితే ప్రతి వర్గపోరాటమూ ఒక రాజకీయ పోరాటమే. ఏ ఐక్యత సాధించడానికైతే మధ్యయుగాల నాటి పురవాసులకు [burghers], అప్పటి దరిద్రమైన రహదారుల కారణంగా, శతాబ్దాలు పట్టిందో, అదే ఐక్యతను, నేటి రైలుమార్గాల పుణ్యమా అని, ఆధునిక అధో-కార్మికులు కొన్ని ఏళ్ల కాలంలోనే సాధించగల్గుతున్నారు.

ఒక వర్గంగా అధోకార్మికుల ఈ నిర్మాణం (వ్యవస్థీకరణ - organization), పర్యవసానంగా ఒక రాజకీయ పార్టీగా వారి నిర్మాణం, తిరిగి స్వయానా ఆ కార్మికులమధ్యనే పోటీ మూలంగా నిరంతరం గండాల్లో పడిపోతూంది [తల్లకిందులౌతూంది]. కాని అది [కార్మిక నిర్మాణం] ఎప్పటికప్పుడు మళ్లీ మళ్లీగా మరింత బలంగా, మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా పైకి లేచి వస్తూంది. [ఇంకా అది] బూర్జువాలమధ్యనేగల చీలికల్ని ఉపయోగించుకుంటూ కార్మికుల [ఆ యా] ప్రత్యేక ప్రయోజనాలకు శాసనపరమైన గుర్తింపు లభించేలా [విజయవంతంగా] వత్తిడి తీసుకువస్తూంది. ఇంగ్లండులో పది గంటల [పని దినం] బిల్లు పాసయింది ఈ విధంగానే. కమ్యూనిస్టు ప్రణాళిక (1848), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 226 నుండీ.

ఇతర కార్మిక వర్గ పార్టీలకు వ్యతిరేకమైన ప్రత్యేక [వేరు] పార్టీగా కమ్యూనిస్టులు ఏర్పడరు.

అధోకార్మికవర్గం (proletariat) మొత్తానికిగా వుండే ప్రయోజనాలకు భిన్నంగా, వేరుగా ఏ ప్రయోజనాలూ వారు [కమ్యూనిస్టులు] కలిగి వుండరు.

కార్మికోద్యమాన్ని రూపుదిద్ది, మలచడానికిగాను వాళ్లు తమ సొంత ఒంటెద్దుపోకడ [శాఖాసంకుచిత - sectarian] సూత్రాలేమీ ప్రతిపాదించరు.

కమ్యూనిస్టులు ఇతర కార్మిక వర్గ పార్టీలకు భిన్నంగా [విలక్షణంగా] వుండేదల్లా ఈ కింది అంశాల్లో మాత్రమే:

1. వివిధ దేశాల కార్మికుల జాతీయ పోరాటాల్లో వాళ్లు [కమ్యూనిస్టులు] యావత్ కార్మికవర్గానికీ సమస్త జాతీయతలకూ స్వతంత్రంగా [అంటే ఏ జాతికి చెందినవాళ్లనేదానితో నిమిత్తంలేకుండా మొత్తం కార్మికులందరికీ] వుండే ఉమ్మడి ప్రయోజనాలను ఎత్తిచూపుతూ, వాటిని ముందుపీటీకి తీసుకు వస్తూంటారు.

2. బూర్జువా వర్గంతో కార్మికవర్గం గావించే పోరాటపు వివిధ దశల్లో వాళ్లు [కమ్యూనిస్టులు] ఎల్లవేళలా, ఎల్ల చోట్లా ఉద్యమానికి మొత్తంగా వుండే ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు.

కనుక, కమ్యూనిస్టులు ఒక వైపునేమో, ఆచరణలో, ప్రతి దేశంలోనూ కార్మిక వర్గ పార్టీల్లోని అత్యంత దృఢదీక్షాయుత, పురోగామి పక్షంగా మిగతా అన్ని తరగతులనూ ముందుకు తోసే పక్షంగా - వుంటారు; మరో వైపున, సైద్ధాంతికంగా, వాళ్లు కార్మికోద్యమపు యాత్రామార్గాన్నీ, పరిస్థితుల్నీ, అంతిమ సాధారణ ఫలితాల్నీ స్పష్టంగా అర్థం చేసుకోగలిగే సానుకూలతను, కార్మికవర్గంలోని అత్యధిక భాగంకంటే హెచ్చుగా, మెరుగ్గా కలిగివుంటారు.

కమ్యూనిస్టుల తక్షణ లక్ష్యాలు ఇతర అన్ని కార్మికవర్గ పార్టీలకు వుండేవే: ఒక వర్గంగా [అధో] కార్మిక వర్గాన్ని ఏర్పరచడం, బూర్జువా ఆధిపత్యాన్ని కూలదోయడం; కార్మికవర్గంచే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం. కమ్యూనిస్టు ప్రణాళిక (1848), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 231.

పెటీబూర్జువా ప్రజాస్వామికవాదులతో విప్లవకర కార్మికవర్గ పార్టీ సంబంధం ఇలా వుంటుంది: తాను కూలదోయదల్చుకున్న ముఠా (faction) కు వ్యతిరేకంగా అయినంతమట్టుకు అది [విప్లవ కార్మిక పార్టీ] వాళ్లతో [పె. బూ. ప్రజాస్వామ్యవాదులతో] కలిసికట్టుగా కదం తొక్కుతుంది; [అయితే] వాళ్లు తమ సొంత ప్రయోజనాలకోసం, తమ స్థితిని సుదృఢం చేసుకోవడానికిగాను, చేసే ప్రతి పనినీ అది [వి.కా.పా.] వ్యతిరేకిస్తుంది. – కమ్యూనిస్టు లీగుకు కేంద్ర కమిటీ [తరఫున] ప్రసంగం (1850), ఎంపికచేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 279.

1848-49 విప్లవం వైఫల్యంతరువాత, ఐరోపా ఖండంలోని [అధో] కార్మికవర్గ పార్టీ ఆ అల్ప కాలావధిలోని ప్రత్యేక [అసాధారణ - exceptional] పరిస్థితుల్లో తనకుండిన హక్కులన్నింటినీ పత్రికా స్వాతంత్ర్యం, వాక్, సభా స్వాతంత్ర్యాలు, మొదలైనవాటిని అంటే ఒక పార్టీని నిర్మాణంగావించుకోవడానికి వలసిన చట్టపర సాధనాల్ని కోల్పోయింది. [కాగా] ఉదారవాద బూర్జువా పార్టీ, పెటీబూర్జువా ప్రజాస్వామ్య పార్టీలుమాత్రం, తాము ప్రాతినిధ్యంవహించే వర్గాల సాంఘిక స్థితి దృష్ట్యా, ఎంత అభివృద్ధినిరోధక పాలనవున్నా, ఒక విధంగాకాకుంటే మరోవిధంగా ఏ రూపంలోనైనా [ఆ పాలకులతో] ఒక రాజీ కుదుర్చుకునే అవకాశాన్ని, తాము ఉమ్మడిగా కలిగివున్న ప్రయోజనాల్ని అంతో యింతో ముందుకు తీసుకువెళ్ల గలిగే అవకాశాన్ని కలిగివుండినాయి. కాని కార్మికవర్గ పార్టీకి మాత్రం, 1848 కి ముందెలాగో 1849 తర్వాతకూడ అలాగే, ఒకే ఒక సాధనం తన అధీనంలో వుండింది: [అదే] రహస్య నిర్మాణం. అందుకే, 1849 నుండీ, ఐరోపాఖండంలో ఈ రహస్య [అధో] కార్మిక సంఘాల [సుదీర్ఘ] శ్రేణి [పుట్టడం,] పోలీసులచే కనుగొనబడి పట్టివేయబడడం, న్యాయసమితుల [ట్రిబ్యునళ్ల] చే గర్హించబడడం [condemned - ఒకవిధంగా, శిక్షించబడడమే], జైలు శిక్షలచే [వాటి నిర్మాణం] విచ్ఛిన్నం గావించబడడం, అయితే పరిస్థితుల ప్రభావం వల్ల [ఇలాంటివే రహస్య సంఘాలు] ఎడతెగకుండా మళ్లీ మళ్లీ పుట్టుకు రావడం - తలయెత్తడం సంభవించింది.

అందుచేత, ఈ కమ్యూనిస్టు లీగు ఒక కుట్రదారుల సంఘమేమీ కాదు; కాగా, వాక్ సభా స్వాతంత్ర్యాలు, ప్రచురణ హక్కులు జర్మన్ కార్మికవర్గానికి లేకుండా బాహాటంగా, బలప్రయోగంతో హరించబడి వుండడంవల్ల కార్మికవర్గ పార్టీనిర్మాణాన్ని రహస్యపద్ధతుల్లో సాగించిన రహస్య సంఘం ఇది. మరి ఇలాంటి సంఘం కుట్ర చేసిందంటే, అది యథాతథస్థితికి విరుద్ధంగా ఆవిరి [శక్తీ], విద్యుచ్ఛక్తీ కుట్ర చేసాయన్న చందమేనన్న మాట.

మరిలాంటి రహస్య సంఘం దాని లక్ష్యం ఒక ప్రభుత్వ పక్షాన్ని ఏర్పరచడంకాక భవిష్యత్తుకు చెందిన ఒక ప్రతిపక్షాన్ని ఏర్పరచడమే కావడం గమనార్హం తమ వ్యక్తిత్వాల శూన్యత్వాన్ని కుట్ర అనే నాటకీయమైన ముసుగులో ప్రదర్శించగోరే వ్యక్తుల్ని ఏమంత ప్రలోభపెట్టజాలదనే విషయం స్వయంస్పష్టమే గదా -కలోన్ కమ్యూనిస్టు [న్యాయ] విచారణ (1853), మార్క్స్-ఏంగెల్స్ రచనలు, VIII, 458 ff.

1852 నవంబరులో, నా కోరికపై, లీగు రద్దు చేయబడినతర్వాత, నేను మరెంతమాత్రం రహస్యమైన లేక బాహాటమైన ఏ సంఘానికీ [ఎన్నడైనా] చెందలేదు లేదా [ఇప్పుడైనా] చెంది లేను. ఈ విధంగా పార్టీ, ఈ విధమైన పూర్తి అల్పాయుష్క [క్షణభంగుర - ephemeral] అర్థంలో, నాకు సంబంధించినంతవరకు ఎనిమిది సంవత్సరాలక్రితమే అంతరించి పోయింది...

ఈ లీగు, పారిస్లోని రుతువుల సంఘంలా, ఇంకా ఇతర వంద సంఘాల్లా, పార్టీ చరిత్రలో ఒక ఉపాఖ్యానంమాత్రమే; మరి ఈ పార్టీ ఐతే ఆధునిక సమాజపు నేలలో ప్రతి చోటా దానంతటదిగానే [అయత్నపూర్వకంగా] పుట్టిపెరుగుతూనే వుంటుంది

పార్టీ అనే పదాన్ని నేను ఆ పదానికి చెందిన మహత్తర చారిత్రక అర్థంలోని పార్టీగా అర్థం చేసుకుంటాను. - ఫ్రైలిగ్రాత్కు మార్క్స్ లేఖ (1860), మార్క్స్, ఏంగెల్స్ రచనలు, XXX, పు. 489 నుండీ.

పారిస్లో నా మొదటి నివాసమప్పుడు (stay - మొదటగా కొంతకాలం వుండినప్పుడు) సమితి [అంటే అప్పటి న్యాయస్తుల సమితి - League of the Just] కి చెందిన పారిస్ నాయకులతో వ్యక్తిగత సంపర్కం పెట్టుకున్నాను; అలాగే అత్యధిక ఫ్రెంచి రహస్య సంఘాల నాయకులతోకూడ సంపర్కం పెట్టుకున్నాను కాని వాటిల్లో వేటిలోనూ చేరలేదు. ఆ తర్వాత గిజో నన్ను బ్రస్సెల్స్లో ప్రవాసానికి పంపిస్తే అక్కడ [కొంత కాలం] స్థిరపడ్డాను. అప్పుడక్కడ ఏంగెల్స్, డబ్ల్యూ. వుల్ఫ్, మరి కొంతమందితో కలిసి జర్మన్ కార్మిక జ్ఞానబోధనా సంఘం (జర్మన్ వర్కర్స్ ఎజుకేషనల్ సొసైటీ) ఒకటి స్థాపించాను; అది నేటికీ మని వుందికూడ. అదే సమయంలో, ఆ రోజుల్లో [న్యాయస్తుల] లీగు యొక్క మార్మిక [రహస్య - esoteric] సిద్ధాంతాన్ని ఏర్పరిచిన [దానికి ఆధారమైన] ఆంగ్లో ఫ్రెంచి సోషలిజం, కమ్యూనిజాలూ, జర్మన్ తత్వ చింతనా కలగలిసిన మిశ్రమాన్ని నిర్దాక్షిణ్యంగా విమర్శించే అనేక ముద్రిత (printed) లేక సైక్లోస్టయిల్ [వరుస-నకలు] చేయబడ్డ పుస్తికలను [కరపత్రాలను - pamphlets] పరంపరగా ప్రచురించాముకూడ. ఆ మిశ్రమానికి బదులు బూర్జువా సమాజపు ఆర్థిక కట్టడాన్ని గురించిన ఒక శాస్త్రీయ అవగాహన మాత్రమే ఏకైక ఆమోదయోగ్య సైద్ధాంతిక ప్రాతిపదికగా వ్యవస్థాపించాము. చివరగా మా బహిరంగ ప్రసంగాల్లో, మాకు కావల్సింది ఏదో ఒక ప్రత్యేక ఊహాస్వర్గ వ్యవస్థను సాధించడం కాదనీ, కాగా మన కళ్లముందే జరుగుతూన్న సాంఘిక కల్లోల చారిత్రక క్రమంలో పూర్ణ జ్ఞానంతో జోక్యం చేసుకోవడమే మా ధ్యేయమనీ నొక్కిచెబుతూ వచ్చాము. - హెర్ వోగ్ట్ (1860), మార్క్స్, ఏంగెల్స్ రచనలు, XIV, పు. 439.

బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా దాని పోరాటంలో కార్మిక వర్గాన్ని సంఘటితపరిచేందుకు [ఆర్గనైజ్ చేసేందుకు] ఒక సాధనంగా ట్రేడ్ యూనియన్లను [కార్మిక సంఘాలను] జనింపజేసే సంకీర్ణ సంఘటనలకు మహత్తర ప్రాముఖ్యం వుండడమొక్కటే కాదు [సార్వత్రిక ఓటు హక్కూ, గణతంత్ర వ్యవస్థా (రిపబ్లిక్) వున్నప్పటికీ (నేటికీ) అమెరికన్ కార్మికులు ట్రేడ్ యూనియన్లు లేనిదే ఏమీ చేయలేరనే ఒక్క ఉదాహరణ చాలు ఇంకా ఎన్నో ఉదాహరణలివ్వవచ్చు ఈ ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి], ఇంకా, ప్రష్యాలోనూ, సాధారణంగా జర్మనీ అంతటానూ, ఈ సంకీర్ణ సంఘటనా హక్కు పోలీసుల, నిరంకుశాధికారవర్గపు పాలనను బద్దలు చేస్తుంది, గ్రామసీమల్లో భూస్వామ్య ప్రభువర్గాలు నెలకొల్పే ఫ్యూడల్ శాసనాలు, పాలనల్ని ఛిన్నాభిన్నంగావిస్తుందికూడానూ. ఒక్క మాటలో అది 'అధీనుల' (subjects) విమోచనకోసం వలసిన ఒక చర్య ఇలాంటి చర్యను ప్రగతిశీల పార్టీ అయితే, అంటే ప్రష్యాలోని ఏ బూర్జువా ప్రతిపక్ష పార్టీనేగానీ, అది పిచ్చిదైవుంటే తప్ప, [ఇప్పటి] ప్రష్యన్ ప్రభుత్వం కంటే, అన్నింటికీమించి బిస్మార్క్ ప్రభుత్వంకంటే, ఒక నూరంతలు తేలిగ్గా సమర్పించగలదు! కాగా, మరోవైపున, సహకార సంఘాలకు ప్రష్యన్ ప్రభుత్వం యిచ్చే ఏ సహాయమైనాఆర్థిక దృక్కోణంలో నిష్ఫలమైనదేగాక, అదే సమయంలో [దాస] సంరక్షణా [లేక పోషణా - tutelage] వ్యవస్థను విస్తరింపజేస్తుంది; కార్మిక వర్గంలో ఒక భాగాన్ని అవినీతిపరంగావిస్తుంది; ఈ విధంగా ఉద్యమాన్ని నిర్వీర్యం గావిస్తుంది. ఒక 'నూతన శకం' వచ్చేసిందనీ, దానితో రాజప్రతినిధి యువరాజుగారి దయవల్ల ప్రభుత్వం తన ఒడిలోకే వచ్చిపడిందనీ [ఏవేవో] ఊహించుకొని, వర్తమాన దారుణ పరిస్థితి సంభవించేలా రెచ్చగొట్టి ప్రష్యన్ బూర్జువా పార్టీ పెద్ద తప్పే చేసింది. మరలాగే, బిస్మార్క్ యుగం పుణ్యమా అనో లేదా మరే ఇతర ప్రష్యన్ శకం ధర్మమా అనో రాజుగారి దయవల్ల ఏవో బంగారు పళ్లు [golden apples] వచ్చి తమ నోట్లో పడుతాయని కార్మికవర్గ పార్టీ కూడ [పిచ్చిపిచ్చిగా] ఊహించుకుంటే, అది మరింత పెద్ద తప్పు చేయడమే అవుతుంది. ప్రష్యన్ ప్రభుత్వం ఏవో సోషలిస్టు చర్యలు తీసుకున్నదని లాసల్లే కుండే అసంతోషకర భ్రమలు [అనతికాలంలో] పటాపంచలై [ఘోర] నిరాశ ఆవహిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పరిణామ తర్కం అదే ప్రకటిస్తుంది. అయితే స్వానుభవంద్వారా వాటి నిస్సారత్వం నిరూపితం కాకమునుపే ఇలాంటి పిచ్చి భ్రమల్ని వదులుకోవాలని కార్మికవర్గ పార్టీ ఆత్మగౌరవం డిమాండు చేస్తుంది. కార్మికవర్గ పార్టీ విప్లవకరంగా వుండాలి [వుంటుంది] లేదా [అది] ఎందుకూ పనికి రానిదవుతుంది. ష్వయిట్జర్కు లేఖ (1865), మార్క్స్, ఏంగెల్స్ రచనలు, XXXI, పు. 445 నుండీ.

ఒక గంభీరమైన కార్మికోద్యమపు కార్యక్రమానికి ఆరంభాంశాలు యిలా వుండాలి: సంపూర్ణ రాజకీయ స్వేచ్ఛకోసం ఆందోళన, పని దినం క్రమబద్ధీకరణ, యావత్ సమాజ శ్రేయస్సుకొరకని తాను నిర్వర్తించాల్సివున్న మహత్తర చారిత్రక కర్తవ్యం [నిర్వహణ] లో కార్మిక వర్గం అంతర్జాతీయంగా, క్రమబద్ధంగా సహకరించుకోవడం. - సోషల్ డెమోక్రట్ (1868) కి రాసిన వ్యాసం, మార్క్స్, ఏంగెల్స్ రచనలు, XVI, పు. 316.

అవి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించగోరితే, ట్రేడ్ యూనియన్లు (కార్మిక సంఘాలు) ఎప్పుడైనాగానీ ఏదైనా రాజకీయ సంఘానికి [లేక పార్టీకి] అనుబంధమై వుండరాదు లేదా దాని సంరక్షణ [లేక పోషణ] లో వుండరాదు. అలా చేయడమంటే తమను తామే చావుదెబ్బ కొట్టుకోవడమన్న మాట. ట్రేడ్ యూనియన్లు సోషలిజం పాఠశాలలు. కార్మికులు తమకు తాము జ్ఞానబోధ చేసుకునేదీ, సోషలిస్టులయ్యేదీ ఈ ట్రేడ్ యూనియన్లలోనే ఎందుకంటే వాళ్ల కళ్లెదుటే అనుదినమూ పెట్టుబడితో వాళ్ల పోరాటం [ఈ ట్రేడ్యూనియన్ మాధ్యమంగానే] జరుగుతూంటుందిగనుక. ఏ రాజకీయ పార్టీ అయినా, దాని స్వభావమేమైనా గానీ, ఇంకా మినహాయింపు అనేది లేకుండా [ప్రతి రాజకీయ పార్టీకూడ], ప్రజానీకపు ఉత్సుకతను కొద్దికాలంపాటు మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే, పట్టివుంచుకోగల్గుతుంది; కాగా, మరోవైపు, ఈ యూనియన్లుమాత్రం మరింత నిలకడధోరణిలో ప్రజానీకాన్ని పట్టివుంచుకుంటాయి; అవి మాత్రమే ఒక నిజమైన కార్మికవర్గ పార్టీగా ప్రాతినిధ్యం వహించగల్గుతాయి; ఇంకా పెట్టుబడి అధికార శక్తికి వ్యతిరేకంగా ఒక [దుర్బేధ్యమైన] అడ్డుగోడ [రక్షణశ్రేణి - bulwark] ని పెట్టగలుగుతాయి. అశేష కార్మిక ప్రజానీకం, వాళ్లే పార్టీకి చెందిన వాళ్లయినాగానీ, ఎట్టకేలకు తమ భౌతిక స్థితిగతులు మెరుగు పడాల్సిన అవసరం తప్పక వుందని అవగాహన చేసుకున్నారు. అయితే ఒకసారి గనుక కార్మికుడి భౌతిక పరిస్థితి మెరుగుపడితే, అప్పుడతడు తన పిల్లల చదువుసంధ్యలపట్ల శ్రద్ధ వహించగల్గుతాడు (అంకితభావంతో వుండగల్గుతాడు); అతడి భార్యాపిల్లలు ఫాక్టరీ [లో పని] కి వెళ్లాల్సిన అవసరం [ఇంకెంతమాత్రం] వుండదు; స్వయంగా ఆ కార్మికుడుసైతం తన బుద్ధికి మరింత పదును పెట్టుకోగల్గుతాడు; [చివరకు] తనకు తెలియకుండానే తాను ఒక సోషలిస్టుగా రూపొందుతాడు. జర్మన్ ట్రేడ్యూనియనిస్టుల ఒక ప్రతినిధి వర్గాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం (1869), ఎంపిక చేయబడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 538. [వక్కాణింపు మాది - అను.]

తాను ఏర్పాటుచేయ నిచ్చగించే కొత్త విభాగానికి అతడు [అంటే వెర్లెట్‌] ఏదైనా ఒక తెగతత్వపు [sectarian] పేరు పెట్టడాన్ని అడ్దు కొనాలి [అనుమతించొద్దు]. [మన] అంతర్జాతీయ [కార్మిక] సంఘంలో ఇలాంటి తెగతత్వపు ముద్రల్ని [లేబుళ్లను] మనం వర్జించాలి [లేకుండా చూసుకోవాలి]. కార్మిక వర్గపు సాధారణ లక్ష్యాలూ, ధోరణులూ అది మనివుండే వాస్తవ పరిస్థితులనుండి ఉత్పన్న మవుతాయి. కనుక, [కార్మిక] వుద్యమం వాళ్ల బుర్రల్లో విస్తృతంగా విభిన్నమైన రూపాల్లో, అంతో ఇంతో ఊహాత్మకమైనట్లో, లేదా అంతో ఇంతో వున్న పరిస్థితులకు అనుగుణంగానో ప్రతిబింబితమైనా, లక్ష్యాలు, ధోరణులుమాత్రం కార్మిక వర్గం మొత్తంలోనూ ఉనికిలో వుంటాయి. [అందుచేత] తమ కళ్ల ఎదుటే ఆవిష్కృతమౌతున్న వర్గ పోరాటపు దాగివున్న [గుప్త] అర్థాన్ని అత్యుత్తమంగా అవగాహన చేసుకొనే వాళ్లుఅంటే కమ్యూనిస్టులుఇలా తెగతత్వాన్ని అంగీకరించే లేక ముందుకు తీసుకెళ్లే తప్పు చేయడానికి చివరి వ్యక్తులై వుంటారు [అంటే ససేమిరా అలాంటి తప్పు చేయరని అర్థం]. - పాల్‌, లారా లఫార్గ్‌లకు మార్క్స్‌ లేఖ (1870), మార్క్స్‌, ఏంగెల్స్‌ల రచనలు, XXXII, పు. 671.

పాలక వర్గాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఒక వర్గంగా ముందుపడి, బయటినుండి వత్తిడితో వాళ్లను [పాలకవర్గాలను] బలవంతం చేయడానికి ప్రయత్నించే ప్రతి వుద్యమమూ ఒక రాజకీయ వుద్యమమే అవుతుంది. ఉదాహరణకు, ఏదో ఒక ప్రత్యేక కర్మాగారంలోనో, లేదా ఒక ప్రత్యేక వృత్తిరంగంలోనే గానీ, సమ్మెలు చేస్తూ వ్యష్టి పెట్టుబడిదారులను బలవంతపెట్టి వాళ్లనుండి కురచ పనిదినాలు సాధించ ప్రయత్నిస్తే, అలాంటి ఇతర పనులేవైనా చేస్తే అది ఒక శుద్ధ ఆర్థికవాద వుద్యమంమట్టుకే అవుతుంది. కాగా, మరో వైపున, ఎనిమిది గంటల పనిదినం చట్టం సాధించాలనీ, అలాంటి ఇతర శాసనాలు [లేక లక్ష్యాలు] సాధించాలనీ వత్తిడి తెచ్చే వుద్యమం మాత్రం ఒక రాజకీయ వుద్యమమే అవుతుంది. మరి ఈ విధంగా, కార్మికుల వేర్వేరు ఆర్థిక వుద్యమాలనుండి ప్రతిచోటా ఒక రాజకీయ వుద్యమం, అంటే ఒక వర్గం యొక్క వుద్యమం అన్నమాట, ఒక సాధారణమైన, సాంఘికంగా బలప్రయోగ పూర్వకమైన [వత్తిడి చేసే] రూపంలోనూ, దాని ప్రయోజనాల్ని ఒక సాధారణ రూపంలో అమలుచేయించే ధ్యేయంతోనూ, పుట్టి పెరుగుతూంటుంది. ఈ వుద్యమాలు రావాలంటే [ఆ వర్గపు] వ్యవస్థీకరణ [నిర్మాణం] అంతకు పూర్వమే ఎంతోకొంత మోతాదులో జరిగివుండాలి [నిజమే] గానీ, ఈ వ్యవస్థీకరణను అభివృద్ధి చేయడానికి ఈ వుద్యమాలుకూడ అంతే సమానంగా సాధనా లవుతాయి [అనికూడ తెలియాలి]. బోల్టేకు మార్క్స్ లేఖ (1871), మార్క్స్, ఏంగెల్స్ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 270 నుండీ.

కలిగిమి వర్గాల సమష్టి అధికారశక్తికి వ్యతిరేకంగా తాను చేసే పోరాటంలోఅధోకార్మిక వర్గం (proletariat), కలిగిమి వర్గాలచే ఏర్పాటు చేయబడిన పాత పార్టీలన్నింటికీ విరుద్ధంగా తన్ను తాను ఒక విశిష్టమైన రాజకీయ పార్టీగా ఏర్పరుచుకోవడంద్వారామాత్రమే తానొక వర్గంగా కార్యాచరణకు దిగగలదు.

ఇలా కార్మికవర్గం ఒక రాజకీయ పార్టీగా ఏర్పడడమనేది సాంఘిక విప్లవ విజయానికి, దాని అంతిమ లక్ష్యమైన వర్గాల రద్దును సునిశ్చయంగావించడానికి అనివార్య అవసరమై వుంటుంది.

ఆర్థిక పోరాటంచే ఇప్పటికే సాధించబడ్డ కార్మికవర్గ బలగాల సంకీర్ణ సంఘటన వర్గం చేతిలో దాని దోపిడీదారుల రాజకీయాధికారానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక సాధనంగా ఉపయోగపడాల్సివుంటుంది.

భూమికీ, పెట్టుబడికీ ప్రభువులైన వాళ్లు తమ రాజకీయ విశేషాధికారాల్ని సదా తమ ఆర్థిక గుత్తస్వామ్యాల సంరక్షణకూ, శాశ్వతీకరణకూ ఉపయోగిస్తూండడంవల్ల రాజకీయాధికారాన్ని గెలుచుకోవడం [హస్తగతంచేసుకోవడం] అధోకార్మికవర్గానికి ఒక మహత్తర విధియై వుంటుంది. - లండన్‌ సదస్సు [conference] నిర్ణయం (1871), మార్క్స్‌, ఏంగెల్స్‌ల ఎంపికచేయబడ్డ రచనలు, సం. 1, 388 నుండీ.

బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా అధోకార్మిక వర్గం చేసే పోరాటంలో మొదటి దశ ప్రత్యేకతెగతత్వపు [లేక ఒంటెద్దుపోకడ? sectarian] వుద్యమాలచే ముద్రవేయబడి వుంది. [అధో] కార్మికవర్గం ఒక వర్గంగా కార్యాచరణకు దిగే స్థితిలో లేని యుగంలో ఇలాంటి [ప్రత్యేకతెగతత్వపు] వుద్యమాలు న్యాయసమ్మతమే మరి. వ్యష్టి చింతకులు [individual thinkers – వ్యక్తిగతంగా మేధావులు లేక తాత్వికులు] సామాజిక వైరుధ్యాల [లేక వైరాల - antagonisms] పై విమర్శన గావిస్తూ, ఏవేవో ఊహాకల్పిత పరిష్కారాలు సూచిస్తూ వుండినారు; కాగా, అశేష కార్మికలోకానికి వాటిని ఆమోదించి, ప్రచారం చేసి, కార్యరూపంలో పెట్టడమే పనిగావుండింది మరి. వాటి సహజస్వభావరీత్యానే ఈ ఆదిచింతకులు ఏర్పాటుచేసిన ఈ తెగలు కార్యాచరణవిముఖులుగా [abstentionist – గైరుహాజరీతత్వపు స్వభావంతో] వుండినాయి; నిజమైన ఏ కార్యాచరణకే గానీ, రాజకీయాలకూ, సమ్మెలకూ, సంకీర్ణసంఘటనలకూ, ఒక్క మాటలో ఎలాంటి సమష్టి వుద్యమానికే గానీ, బద్ధవిరోధంతో వుండినాయి జ్యోతిష్యమూ, రసవాదమూ [astrology and alchemy] విజ్ఞాన శాస్త్రానికి శైశవంలా ఎలా వుంటాయో, సరిగ్గా అదే విధంగా యివి [ప్రత్యేకతెగతత్వ వుద్యమాలు] కార్మికోద్యమానికి శైశవంగా వున్నాయని చెప్పవచ్చు. అంతర్జాతీయ సంస్థకు ఒక పునాది వేయబడడం సాధ్యం కావాలంటే, కార్మిక వర్గం ఈ [తొలి] దశనుండి ఆవలకుగా పురోగమించివుండడం ఆవశ్యకమైంది.

విధంగా, విస్మయకర కల్పనాతత్వపు, పరస్పర వైర భావపు తెగల-వ్యవస్థీకరణకు విరుద్ధంగా, వాటి కట్టెదుటే, పెట్టుబడిదారులూ, భూమి యజమానులూ, ఒక రాజ్యంగా వ్యవస్థీకృతమై వున్న వాళ్ల వర్గాధికారానికి వ్యతిరేకంగా తమ ఉమ్మడి పోరాటంలో పెనవేసుకుని వున్న సకల దేశాల అధోకార్మిక వర్గాల యథార్థమైన, సమర శీలమైన నిర్మాణంగా అంతర్జాతీయ [కార్మిక] సంస్థ నిలిచి వుంది.

ఇంకా అంతర్జాతీయ [కార్మిక] సంస్థ నియమ నిబంధనావళి కేవలం సులభ సామాన్యమైన 'కార్మిక సంఘాల' ను మాత్రమే గుర్తిస్తాయి; ఈ కార్మిక సంఘాలన్నీ ఒకే లక్ష్యాన్ని సాధించ యత్నిస్తాయి; అన్నీ ఒకే కార్యక్రమాన్ని ఆమోదిస్తాయి ఆ కార్యక్రమం కార్మికోద్యమపు ప్రధాన లక్షణాల్ని రేఖాచిత్రణ గావించడానికే పరిమితమై వుంటుంది; దాని సైద్ధాంతిక వివరణ మాత్రం వ్యవహారాచరణ సంబంధిత పోరాట ఆవశ్యకతలు సమర్పించే ప్రేరణాశక్తికీ, వివిధ [కార్మిక] విభాగాల్లో సంభవిస్తూండే అభిప్రాయాల మార్పిడీకి వదిలివేయబడుతుంది. [ఈ క్రమంలో] అవి [ఆ కార్మిక సంఘాలు] తమ పత్రికల్లోనూ, తమ మహాసభల్లోనూ ఏమాత్రం తేడాచూపకుండా అన్ని [రకాల] సోషలిస్టు దృఢ విశ్వాసాల్నీ [convictions] అనుమతిస్తూంటాయి. అంతర్జాతీయ సంస్థలో చీలికలు అని ఆరోపించబడేవాటినిగురించి(1872), లా ప్రిమియరె ఇంటర్నేషనల్, [సం.] జె. ఫ్రేమండ్, జెనీవా, 1962, సం. II, పు. 284.

కార్మిక వర్గాల అంతర్జాతీయ కార్యకలాపం అంతర్జాతీయ కార్మిక ప్రజల సంస్థ ఉనికిపై ఏ విధంగానూకూడ ఆధారపడి వుండదు [అని గ్రహించాలి]. [కాగా] ఇది [అంతర్జాతీయ కార్మిక సంస్థ] [కార్మికుల అంతర్జాతీయ] కార్యకలాపానికి ఒక కేంద్ర సంఘాన్ని సృష్టించడానికి జరిగిన ప్రథమ ప్రయత్నంమాత్రమే. అది సమర్పించిన ప్రేరణాశక్తి వల్ల ఆ ప్రయత్నం ఒక చిరస్థాయి విజయాన్ని గడించింది [నిజమే] గానీ, పారిస్ కమ్యూన్ పతనానంతరం అది దాని మొదటి చారిత్రక రూపంలో మరెంతమాత్రం సాధించబడలేనిదిగా అయింది. గోథా కార్యక్రమంపై విమర్శ (1875), మార్క్స్, ఏంగెల్స్ ఎంపికచేయబడ్డ రచనలు, సం. II, పు. 28.

ఇక స్వయంగా మాకు సంబంధించి [చెబితే,] మా సమస్త గతం దృష్ట్యా మాకు ఒకే ఒక మార్గం తెరిచివుంది. దాదాపు నలభై ఏళ్లుగా మేము చరిత్రకు తక్షణ చోదక శక్తి వర్గ పోరాటమని, ప్రత్యేకించి బూర్జువా వర్గానికీ, కార్మికవర్గానికీ నడుమ పోరాటం ఆధునిక సాంఘిక విప్లవపు మహాయంత్రదండం [great lever] అని నొక్కి చెబుతూ వచ్చాము. కనుక ఈ వర్గ పోరాటాన్ని వుద్యమంనుండి తీసివేయాలని కోరుకునేవాళ్లతో్ సహకరించడం మాకు అసాధ్యంగా వుంటుంది. అంతర్జాతీయ [కార్మిక] సంస్థ ఏర్పాటుచేయబడినప్పుడు మేము విస్పష్టంగా ఒక యుద్ధ నినాదాన్ని కార్మిక వర్గాల విమోచనను స్వయంగా కార్మికవర్గాలే [తామే పోరాడి] గెలుచు కోవల్సివుంటుందనే [సూత్రాన్ని] రూపొందించాము. అందుచేత [ఇప్పుడు] కార్మికులు మరీ అవిద్యావంతులై, తమ విముక్తిని తాము సాధించుకోలేని స్థితిలోవున్నారనీ, కనుక మానవ ప్రేమికులైన బడాబూర్జువా, పెటీబూర్జువా వర్గాలు వాళ్లను [కార్మికుల్ని] 'పైనుండిగా' విముక్తంగావించాల్సి వుంటుందనీ అనేవాళ్లతో [కూడ] మేము సహకరించజాలము. - సర్కులర్ లేఖ (1879), ఎంపికచేయ బడ్డ కార్ల్ మార్క్స్ రచనలు, పు. 575.

* * *

ఇంకా చదవడానికి

1. . బలిబార్, 'పార్టీపై మార్క్స్, ఏంగెల్స్లు', మార్క్సిస్ట్ పర్పెస్పెక్టివ్స్, సంపుటి 2 (1979).

2. కె. వాన్‌ బేమె, 'కార్ల్‌ మార్క్స్‌ - పార్టీ సిద్ధాంతం', ప్రభుత్వంప్రతిపక్షం, సం. 20, శీతాకాలం, 1985.

3. జె. బ్రుంతాల్‌, అంతర్జాతీయ [కార్మిక] సంస్థ చరిత్ర, లండన్, 1967, పు. 44 నుండీ, 85 నుండీ.

4. హెచ్‌. కాలిన్స్‌, సి. అబ్రామ్స్కీ, కార్ల్‌ మార్క్స్‌ - బ్రిటిష్‌ శ్రామికోద్యమం, లండన్‌, 1965.

5. ఆర్‌. గరాడీ, కార్ల్‌ మార్క్స్‌: ఆయన చింతనాపరిణామం, లండన్‌, 1967, పు. 190 నుండీ.

6. ఆర్‌. హంట్‌, మార్క్స్‌, ఏంగెల్స్‌ల రాజకీయ అభిప్రాయాలు, పిట్స్‌బర్గ్‌, 1974, సం. 1. అధ్యా. 8.

7. ఎమ్‌. జాన్‌స్టోన్‌, మార్క్స్‌-ఏంగెల్స్‌లు: పార్టీనిగురించిన భావన, సోషలిస్టు రిజిస్టర్‌, 1967.

8. . లోజోవ్స్కీ, మార్క్స్‌- కార్మిక సంఘాలు [ట్రేడ్‌ యూనియన్‌లు], కలకత్తా, 1975.

9. సి. మాగ్రీ, 'పార్టీనిగురించిన మార్క్సిస్టు సిద్ధాంతానికి సంబంధించిన సమస్యలు', న్యూ లెఫ్‌ట్‌ రివ్యూ, సం. 60, 1970.

10. జె. మాలిన్యూక్స్‌, మార్క్సిజం - పార్టీ, లండన్‌, 1978, అధ్యాయం 1.

11. బి. నికొలేవ్‌స్కీ, 'కమ్యూనిస్టు లీగు చరిత్ర దిశగా', అంతర్జాతీయ సాంఘిక చరిత్రా సమీక్ష [ఇంటర్నేషనల్‌ రివ్యూ ఆఫ్‌ సోషల్ హిస్టరీ], 1956.

12. జె. పాస్టెలా, కార్మిక వర్గ పార్టీలు, నిర్మాణాల గురించి మార్క్స్‌, ఏంగెల్స్‌ల భావనలు, టాంపెరె, 1985.

13. బి. వుల్ఫ్‌, మార్క్సిజం: వందేళ్ల సిద్ధాంత జీవితం, లండన్‌, 1967, ప్రత్యేకించి ఇందులోని 11 అధ్యాయం.

* * * * *

No comments: